“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, మే 2022, బుధవారం

సుబ్బారాయుడో ఈ దవాఖాన మంచిదంట..

తత్వాలనేవి నిగూఢరహస్యాలను మామూలు వాడుకభాషలో, గ్రామీణభాషలో  చెబుతున్నప్పటికీ, అవేం చెబుతున్నాయి? అన్న విషయంలో మాత్రం అర్ధం కాకుండా ఉంటాయి. వాటిని అర్ధం చేసుకోవాలంటే ఒక్కొక్క పదాన్నీ చాలా ఆలోచించవలసి ఉంటుంది. పైకి కనిపిస్తున్న అర్ధం అసలుది కాదు.  దానిలోపల అసలైన అర్ధం దాగి ఉంటుంది. అందుకే, 'తినగ తినగ వేము తియ్యనుండు' అన్నట్లు. ధ్యానించగా ధ్యానించగా వీటి అసలు అర్ధం అవగతమౌతుంది. 

మధ్యయుగాలలో ఇటువంటి  తత్వాలను దాదాపు అందరు మహనీయులూ చెప్పారు.

మన పంచవటి తత్వాలు ఇవిగో చదువుకోండి మరి !
-----------------------------------------------
సుబ్బారాయుడో
ఈ దవాఖాన మంచిదంట
డబ్బారాయుడో
ఇక జంపకాన కప్పుకుంట

గోలీలను ఇస్తాడు
గోడకు నిలబెడతాడు
రోగమేందొ చెప్పమంటె
సావగొట్టి పంపుతాడు                 || సుబ్బారాయుడో ||

కల్లుపాక నడిపినోడు
ఒళ్ళు బలిసి పొయ్ నాడు
మత్తులోన మునిగినోడు
మళ్ళొస్తానన్నాడు                || సుబ్బారాయుడో ||

పుస్తకాలు చదివినోదు
పురసత్తును మరిచినాడు
గాలికట్ల తిరిగినోడు
గాడ్దె లెక్క మారినాడు              || సుబ్బారాయుడో ||

కిందపైన కలిపినోడు
కిక్కురుమనకున్నాడు
అన్నీ తెలుసన్నవోడు
అడుసులోకి పొయ్ నాడు        || సుబ్బారాయుడో ||

అడుక్కోండి అన్నవోడు 
అప్పచ్చిగ మారినాడు
అబద్దాలు చెప్పినోడు 
ఆగం చేస్తున్నాడు                    || సుబ్బారాయుడో ||

గుంజుకుంటు పోయినోడు
గింజుకుంటు బతుకుతాడు
తలుపుదీసి పరిచినోడు
తమాసగా గతుకుతాడు            || సుబ్బారాయుడో ||

వాగి వాగి సచ్చినోడు
ఒడ్డుకెక్కి నిలిచినాడు
ముంగిలాగ నవ్వినోడు
ముందుచూడమన్నాడు             || సుబ్బారాయుడో ||

పులుసువండి పెట్టినోడు 
పురిట్లోనె పోయినాడు
చారుగాసి పోసినోడు
చబుత్రాల కెక్కినాడు                || సుబ్బారాయుడో ||

ఆగము జేసేటిదొకడు
రాగము దీసేటిదొకడు
పాకము పట్టేటిదొకడు 
పప్పులు కలిపేటిదొకడు            || సుబ్బారాయుడో ||

తవ్వినోడు నింపుతాడు
కూల్చినోడు కడతాడు
పడినోడే లేస్తాడు
పాదుషాగ వెలుగుతాడు            || సుబ్బారాయుడో ||

ఎగురుతున్న నిన్నుజూసి
ఎగిరిపోతవంటాడు
కుములుతున్న నన్నుజూసి
ఖుషీ చెయ్యమంటాడు            || సుబ్బారాయుడో ||
 
సంతలోన తిరిగినోడు
సట్టుబండ లాంటోడు
ముచ్చులెక్క నిన్నుజూసి
ముచ్చటంగ నవ్వుతాడు        || సుబ్బారాయుడో ||

ఏడిస్తే నవ్వుతాడు
నవ్వితేను కొడతాడు
నవ్వూ ఏడ్పులను కలిపి
నాటకాలు ఆడతాడు                || సుబ్బారాయుడో ||

నిన్నొచ్చానంటాడు
రేపొస్తానంటాడు
నిన్నా రేపుల నడుమ
నేనే పొమ్మంటాడు                    || సుబ్బారాయుడో ||

అన్నిటికీ నవ్వుతాడు
ఆడ్డపంచె కడతాడు
ఆత్రంగా ఎదురొస్తే
అసలే పట్టించుకోడు                 || సుబ్బారాయుడో ||