“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, నవంబర్ 2012, గురువారం

వింతదేశంలో ఎన్నో వింతలు

మన దేశాన్ని ఇప్పటివరకూ నాశనం చేసిన,ఇంకా చేస్తున్న,రెండు ప్రధానశక్తులు ఏవంటే- ఒకటి రాజకీయాలు, రెండు సినిమాలు అని చెప్పచ్చు. ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమె కాదు.నిష్పక్షపాతంగా ఆలోచించగలిగిన ఎవరైనా ఇదే అంటారు. ప్రస్తుతం అందరు మేధావులూ ఇదే అంటున్నారు.

నీతిలేని రాజకీయరంగం వల్ల మనదేశం ఎదగవలసినంత ఎదగలేక పోయింది అన్నది సత్యం. ఒకప్పుడు మనలాంటి దేశమైన చైనావైపు ప్రస్తుతం మనం కనీసం కన్నెత్తి చూడలేని స్తితిలో ఉన్నామంటే మొదటి కారణం మన దేశపు నీతిలేని,స్వార్ధపూరిత రాజకీయాలు.వ్యక్తిగత స్వార్ధం కోసం దేశ ప్రయోజనాన్ని అమ్ముకోడానికి ఏమాత్రం వెనుదీయని నాయకులే కారణం. చైనాలో వారికి దేశం ముఖ్యం.మనకో,గ్రూపులు కట్టి ఎవడికి చిక్కినంత వాడు దోచుకోవడం ముఖ్యం.అందుకే మన దేశం ఇలా అఘోరిస్తోంది.

సగటు భారతీయుడు తన గురించే ఆలోచిస్తాడు.పక్కవాడి గురించి కొంచం కూడా ఆలోచించడు.దేశం గురించి అసలే ఆలోచించడు.ఇదికూడా నేను చెబుతున్న మాట కాదు. అంతర్జాతీయసంస్థలు సర్వే చేసి చెబుతున్న నిజం.సగటు భారతీయుడు పచ్చి స్వార్ధపరుడు అనేది నగ్నసత్యం. తన స్వార్ధంకోసం ఏ రూల్ నైనా తుంగలో తొక్కడానికి వెనుదియ్యడు అనేది ఇంకో సత్యం.

కానీ ఒకప్పుడు పరిస్తితి ఇలా ఉండేది కాదు.ప్రాచీన భారతీయుడు ఇలా ఉండేవాడు కాదు.నిలువెల్లా నిఖార్సైన విలువలతో నిండి ఉండేవాడు.మరి నేటి దిగజారుడుతనానికి కారణం ఏమిటి? అంటే రాజకీయాలదే ప్రధానపాత్ర అని చెప్పాలి.రాజకీయ పార్టీలన్నీ కులపార్టీలూ,మతపార్టీలే.మళ్ళీ మనదేశం కులానికీ మతానికీ చెందని సెక్యులర్ దేశం అని చెబుతాం.కానీ ఇక్కడ ఉన్నవి ఆరెండే.చెప్పెదోకటీ చేసేదోకటీ కావడమూ,డబ్బే దైవం కావడమూ,విలువలను తుంగలో తోక్కడమే మన సమాజపు ప్రధాన సమస్యలు.ఈ జాడ్యాలను పెంచి పోషిస్తున్నవి దారితప్పిన రాజకీయాలూ సినిమాలే.

ప్రజాస్వామ్యంలో మౌలిక విలువలను కాపాడవలసిన వ్యవస్థలను అన్నింటినీ రాజకీయ జోక్యం నిర్వీర్యం చెయ్యడమే కాక,తమ స్వార్ధానికి ఉపయోగపడే తొత్తులుగా వాటిని మార్చుకుంది.కనుక సమాజం క్రమేణా భ్రష్టుపట్టింది.నేడు సమాజంలో పోలీస్ వ్యవస్థపైనా,న్యాయవ్యవస్థ పైనా, ఇంకా అనేక మూలస్తంభాల్లాంటి వ్యవస్థలపైన ప్రజలకు నమ్మకం సడలిపోయిందంటే దానికి కారణం నీతితప్పిన రాజకీయవ్యవస్థ యొక్క అనవసర జోక్యం మాత్రమే.

నన్ను సరిగ్గా పనిచేసుకోనివ్వడం లేదు అని ఒక సెన్సార్ బోర్డు సభ్యురాలు ఈ మధ్యన మొత్తుకున్నా, రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని దేవాదాయ శాఖలోని ఒక అసిస్టెంట్ కమీషనర్ స్థాయి అధికారిణి ఈమధ్యనే ఆత్మహత్య చేసుకున్నా,నిజాయితీగా వ్యవహరిస్తున్నందుకు అయ్యేఎస్ ఐపీఎస్ అధికారులు వేధింపులకు గురైనా -- ఇవన్నీ కూడా దేశాన్ని నాశనం చేస్తున్న రాజకీయం యొక్క వివిధ రూపాలే.బడా వ్యాపారవేత్తలతో కుమ్మక్కై రాజకీయులు దేశాన్ని ఎలా సర్వనాశనం చేస్తున్నారో ఈదేశపు సామాన్యుడికి ఈ జన్మకి అర్ధం కాదు.అసలు ఆ స్థాయిలో ఏమేం జరుగుతున్నాయో సగటు పౌరుడు ఊహించను కూడా ఊహించలేడు.

ఇకపోతే సమాజంలో విలువలూ,మంచిభాషా,మంచిప్రవర్తనా దిగజారి పోవడానికి ప్రధానపాత్ర సినిమాలదే.సినిమా అనేది సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తుంది.సమాజానికి చవకలో వినోదాన్ని పంచేవి సినిమాలే.అవి స్లో పాయిజన్ ఎక్కించడం మొదలుపెడితే కొన్నేళ్ళకు తెలీకుండానే సమాజం మొత్తం నాశనం అవుతుంది.ప్రస్తుతం జరుగుతున్నది అదే.ఎంతసేపూ హింసనూ,అశ్లీలభాషనూ,అశ్లీలదృశ్యాలనూ చూపించి,వివాదాస్పద అంశాలను రెచ్చగొట్టి,సొమ్ము చేసుకునే సినిమారంగంవల్ల గత ఇరవై ముప్పైఏళ్లలో సమాజం దారుణంగా దిగజారింది అన్నమాట ఇంకో నగ్నసత్యం.నాసిరకం వినోదాన్ని సమాజానికి ఒక వ్యసనంలా అంటగడుతూ సినిమారంగం అప్రతిహతంగా వర్దిల్లుతున్నది. దానిని సగటుపౌరుడు ఎంజాయ్ చెయ్యడం వెకిలివింత.  

సినిమావాళ్లకు ఒంట్లో శక్తితగ్గి మొహంలో ముసలితనం కన్పించేసరికి అక్కడ రిటైరై, ప్రజల్లో తమకున్న క్రేజ్ ను పెట్టుబడిగా పెట్టి,  రాజకీయాలలోకి రావడం భలేవింత.ప్రపంచంలోని ఏరంగానికైనా ట్రైనింగ్ అవసరం. కానీ రాజకీయానికి ట్రెయినింగ్ అవసరం లేదు.నిన్నటివరకూ అతడు ఎవరైనాసరే పర్లేదు,ఈరోజు నుంచి రాజకీయనాయకుడు కావచ్చు.దేశాన్ని ఎటో తీసుకుపోవచ్చు. పొలిటికల్ సైన్స్ లో ఓనమాలు తెలియని నాయకులకు జనం ఓట్లేసి వాళ్ళను అధికారంలోకి తేవడం అతిపెద్దవింత. సినిమానటులూ రాజకీయులూ వ్యాపారులూ వియ్యం కలుపుకుని ఒకరినొకరు పరస్పరం కాపాడుకుంటూ వారివారి అవినీతి సామ్రాజ్యాలు విస్తరించుకుంటూ సమాజం భ్రష్టు పట్టడానికి స్పీడుగా దోహదం చెయ్యడం ఇంకో అసలైన వింత.

ఇకపోతే ఎడాపెడా సమాజధనాన్ని దోచుకున్న రాజకీయులూ సినిమావాళ్ళూ దొంగవ్యాపారులూ ఆ డబ్బును విదేశాలలో హోటళ్ళకూ ఇతర ప్రాజెక్టులకూ పెట్టుబడి పెడుతూ ఈ దేశపు సంపదను ఇతర దేశాలకు దోచిపెట్టడం తెలివైనవింత.ఇవన్నీ తెలియని సగటు సామాన్యుడు,తన కులపార్టీకి కిమ్మనకుండా  కొమ్ముకాస్తూ ఆ నాయకుడు ఏమి చేసినా గుడ్డిగా సమర్ధించడం బానిసత్వపు వింత. మన కులంవాడైతే చాలు వాడేం చేసినా కరెక్టే అనే భావజాలం నీచమైన వింత. 

ఇదిలా ఉంటే, వీరి ఎదుగుదలకు కారకుడైన సగటుపౌరుడు మాత్రం సీసాకీ, నోటుకీ అమ్ముడుపోతూ విచక్షణ లేకుండా ఓటును అమ్ముకోవడం చాలా చీపైన వింత. అలాగే సినిమాల వల్ల విలువలపరంగా తానెంత నష్టపోతున్నాడో తెలుసుకోలేని సగటు ప్రేక్షకుడు టికెట్టుకొని అదే సినిమా చూస్తూ, తాగుడుకు బానిసై చావుకు చేరువౌతున్న తాగుబోతులాగా,ఆ హీరోల గురించీ,పాటల గురించీ,సినిమా కథల గురించీ,హీరోయిన్ల వెకిలివేషాల గురించీ మాట్లాడుకుంటూ ఇంకాఇంకా హీనమైన ప్రవర్తనకు అలవాటు పడుతూ దిగజారుతూ ఉండటం 'తన గొయ్యి తానే తవ్వుకునే'  తెలివిలేని వింత.

నిరంతర జాగరూకతతో కూడిన,జ్ఞానపూరితమైన,ప్రజాభిప్రాయమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష. మరి అలాంటి జాగరూకత వైపూ, జ్ఞానంవైపూ పోకుండా పాలకులే ప్రజలను అడ్డుకుంటూ,పౌరులను నైతికంగా నిర్వీర్య్లులను చేస్తూ, తమ పబ్బం గడుపుకుంటూ,దేశాన్ని దోచుకుంటూ ఉంటే అలాంటి దేశానికి ఏది దారి?

తాగుడునీ,చవకబారు సినిమాలనూ,వ్యసనాలనూ ప్రోత్సహిస్తూ,వాటిని ఆదాయవనరులలాగా పెంచిపోషిస్తూ,కులమతాలతోనూ,అడుగడుగునా అవినీతితోనూ నిండి,అవకాశవాదమే అసలైన రాజ్యాంగంగా వెలుగుతున్న   దేశానికి ఔన్నత్యం ఎటునుంచి వస్తుందో ఎలా వస్తుందో ఆ దేవునికే తెలియాలి.ఒకవేళ ఆ ఔన్నత్యం అంటూ వస్తేమాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో దానినే అతిపెద్ద వింతగా చెప్పుకోవాలి.