“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, జులై 2013, సోమవారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు -5

'మీ గురువుగారు అలాంటి మాటలు వ్రాశారని మీరు బాధపడుతున్నారా?' అడిగాను.

'అబ్బే అదేం లేదు.' అన్నాడాయన.

'చూడండి.మీరు ఉన్నది ఉన్నట్లుగా చెబితేనే నేను మీకు ఏదైనా వివరించ గలను.మనసులో ఒకటి అనుకుంటూ బయటకు 'అబ్బే ఏమీ లేదు' అంటే నేను చెప్పేదేమీ ఉండదు.' అన్నాను.

ఆయన కొంచం సేపు నావైపు చూచాడు.

'అవునండి.మా గురువుగారంటే నాకు చాలా ఉన్నతాభిప్రాయం ఉన్నది. అలాంటి వ్యక్తి ఇలాంటి భాష వాడారంటే నమ్మలేకపోతున్నాను.చాలా బాధగా ఉన్నది'అన్నాడు.

నాకు నవ్వొచ్చింది.

'చూడండి సార్.మీకు కొన్ని వాస్తవాలు చెబుతాను.మీకు ఇప్పటివరకూ మీ గురువుగారంటే చాలా ఉన్నతమైన అభిప్రాయం ఉన్నది.నిజమేనా?'

'అవును.'

'మరి నా సంగతి చెప్పనా?ఇప్పటివరకూ మీ గురువుగారంటే నాకూ గౌరవభావం ఉండేది.కాని ఇప్పుడు ఆయన వ్రాసిన ఆ తిట్లు చూచాక ఆ గౌరవం వందరెట్లు పెరిగింది.' అన్నాను.

ఆయన అయోమయంగా చూచాడు.

'అదేంటి' అన్నాడు.

'చెప్తా వినండి.నేను ఆ పుస్తకంలో మీకు చూపించిన విషయాలు చదివిన తర్వాత మీకు ఇప్పటివరకూ ఉన్న మంచిఅభిప్రాయం స్థానే కొంచం తేలికపాటి అభిప్రాయం మొదలైంది.ఈ రెండు అభిప్రాయాల మధ్యన ఘర్షణ వల్ల మీ మనసులో అలజడి అశాంతి కలుగుతున్నాయి.మీ అభిప్రాయాలను కాసేపు పక్కన ఉంచండి.వీటివల్ల మీ స్వాములవారి వ్యక్తిత్వంలో ఏమైనా మార్పు కలిగిందా?' అడిగాను.

'లేదు.' అన్నాడు.

'కనుక విషయం ఏమిటంటే,గౌరవం అయినా,చులకన భావం అయినా అది మీ మనసులోదే గాని దానివల్ల మీ స్వామి యొక్క నిజస్వరూపానికి ఏమీ భంగం వాటిల్లలేదు.ఆయన ఎప్పుడూ ఉన్నట్లే ఇప్పుడూ ఉన్నాడు. అవునా?' అడిగాను.

'అవును'అన్నాడు.

'మీరు ఏర్పరచుకున్న అభిప్రాయం వల్లనే మీకు గౌరవమూ,బాధా కలిగాయి.మీ మనస్సే మిమ్మల్ని సంతోషపెడుతున్నది.లేదా బాధ పెట్టింది. అంతేనా?'

ఆయన కొంచం సేపు ఆలోచించాడు.

'అవును'అన్నాడు మళ్ళీ.

'మీ మనసులో మీరు ఊహించుకున్న స్వాములవారి ఉన్నతమైన రూపం వల్ల మీకు ఇప్పటిదాకా ఆయనంటే గౌరవం కలిగింది.ఇప్పుడు మీరు చదివిన బూతు మాటలవల్ల ఆ రూపం కొంచం చెదిరిపోయింది.కనుక మీకు బాధ కలిగింది.అంతే కదా?'

'నిజమే'

'కనుక మీ మనసులో మీరు ఏర్పరచుకున్న మీ గురువుగారి రూపాన్నే మీరు గౌరవిస్తున్నారు గాని నిజమైన మీ గురువుగారి స్వరూపాన్నీ తత్వాన్నీ కాదు.ఈ రెండూ వేర్వేరు.మీరనుకుంటున్న గురువుగారు వేరు.నిజమైన గురువుగారు వేరు.మీరు పూజిస్తున్నది మీరు చిత్రించుకున్న బొమ్మనే గాని నిజమైన మీ గురువుగారిని కాదు.అంతే కదా?' అడిగాను.

ఆయన కొంచం సంశయంగా 'దాదాపుగా అంతే' అన్నాడు.

'మళ్ళీ ఇందులో 'దాదాపుగా' ఎందుకు? అవునా కాదా?చెప్పండి?'అడిగాను.

'అంతే.' అన్నాడు.

'అంటే మీ మనసులో ఉన్న మీ గురువుగారి ఇమేజి అబద్దమైనది.సత్యమైన మీ గురువుగారి స్వరూపం కాదు.అందుకే అది చివరికి మిమ్మల్ని బాధ పెట్టింది.అసత్యం నుంచి ఆనందం రాదు అనేది అందుకే.తాత్కాలికంగా అది ఆనందాన్ని ఇవ్వవచ్చు.కాని చివరికి అది మిగిల్చేది దుఖమే.మనకు నచ్చకపోయినా సత్యమే ఆనందాన్ని ఇస్తుంది.అసత్యం ఇవ్వదు' అన్నాను.

ఆయనేమీ జవాబు చెప్పలేదు.

'ఇప్పుడు మీరు నమ్మలేని కొన్ని నిజాలు చెబుతాను.వింటారా?' అడిగాను.

'చెప్పండి' అన్నాడు.

'శ్రీరాముడు శ్రీకృష్ణుడు మొదలైన అవతార పురుషులు మాంసం తిన్నారనీ మద్యం తాగేవారనీ మీకు తెలుసా?బుద్ధుడూ జీసస్ కూడా అవి తిన్నారనీ తాగారనీ మీకు తెలుసా?కృష్ణుడు రాత్రిళ్ళు మద్యం తాగి ధ్యానంలో ఉండేవాడని తంత్రగ్రంధాలు చెబుతాయి.ఈ విషయం మీకు తెలుసా?' అడిగాను.

'కొంత తెలుసు.కొంత తెలియదు' అన్నాడు.

'అది తప్పా కాదా?' అడిగాను.

'తప్పు కాకపోవచ్చు.ఆయా కాలానికి ఆయా కులాలకు అది తప్పు కాక పోవచ్చు.'అన్నాడు.

'రామకృష్ణుడు పల్లెటూరి బూతుమాటలను తరచుగా తన మాటల్లో అతి మామూలుగా వాడేవాడు.షిర్డీసాయిబాబా తరచుగా మనం వినలేనంత ఘోరమైన బూతుల్లో జనాన్ని తిట్టేవాడు.అఘోరీ సాధువులు మాట్లాడే బూతులను వింటే వాటిని సహజంగా మాట్లాడే పల్లెప్రజలు కూడా వినలేక చెవులు మూసుకుంటారు.అవి అంత చండాలంగా ఉంటాయి.అవధూతలు అనబడే వారు కూడా ఒక్కోసారి పరమ చండాలమైన భాషను వాడతారని తెలుసా?' అడిగాను.

'ఈ విషయాలు నాకు తెలియవు.' అన్నాడాయన.

'అదే మనతో వచ్చిన తంటా.మనం పూజించే వారిని గూర్చి మనకు నిజాలు తెలియవు.కారణాలు లేకుండా మనం వారిని గురించి కొన్ని నిరాధారమైన  అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం.ఇక జన్మంతా వాటినే పట్టుకుని ఊగులాడుతూ ఉంటాం.వాటిని ఎవరైనా చెదరగోడితే మనం భరించలేం. 'ఆయనిలాగే ఉండాలి' అని మనం అనుకుంటూ ఉంటాం.దీనికంతా కారణం మన ఈగో.మన భావాలకు ఏదైనా తేడా వస్తే బాధపడేది మన ఈగోనే అంతేగాని ఈ గోలవల్ల ఆయా మహా పురుషులకు ఏమీ కాదు.వారి స్తితిలో ఏమీ మార్పు ఉండదు.అసలు మన అభిప్రాయాలకూ ఆయా గురువుల సహజస్తితికీ సంబంధమే ఉండదు.

కనుక నేను చెప్పేదేమంటే మనం పూజిస్తున్నది మన అహాన్నే గాని మనం డప్పు కొట్టుకునే దేవుళ్ళనో గురువులనో కానేకాదు.మనలో ప్రతివాడూ పూజిస్తున్నదీ గౌరవిస్తున్నదీ తన అహంకారాన్నే.నిజానికి మన అడ్రసులు కూడా ఈ మహాపురుషులకు తెలియవు.మనం అనేవారం అసలు ఉన్నామనీ వారి గురించి ఇలా అనుకుంటున్నామనీ కూడా వారికి అనవసరం.వారు ఇలాంటివేవీ పట్టించుకోరు.వారి స్తితుల్లో వారుంటారు.' చెప్పాను.

ఆయన ముఖంలో కొంచం తేట కనపడింది.

'ఇంకా చెప్తాను వినండి.పదాలన్నీ 'అ' నుంచి 'క్ష' వరకూ ఉన్న అక్షరాల కలయికతో ఏర్పడేవే కదా? అది మంచి పదమైనా చెడు పదమైనా, ఆ మంచీ చెడూ అనేవి పదాలలో ఉన్నాయా? లేక మీ మనసులో ఉన్నాయా? అంటే మనసులోనే అని తేలుతుంది.ఒక పదాన్ని వింటే మీ మనసులో ఒక ఊహ ఏర్పడుతుంది.ఆ ఊహ మంచిదనో చెడ్డదనో మీ చిన్నప్పటి నుంచి మీరు విని ఏర్పరచుకున్న ఒక అభిప్రాయం ఉంటుంది.ఆ అభిప్రాయాన్ని అనుసరించి మీ మనసులో ఇష్టమో అయిష్టమో కలుగుతుంది.ఇదిగాకుండా,పదాలలో మంచీ చెడూ అంటూ ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నాయో నాకు కాస్త వివరించండి. అక్షరాలన్నీ అమ్మ మెడలో వేలాడుతున్న అక్షరమాలలో భాగాలే కదా? కాదంటారా?' అడిగాను.

ఆయన నమ్మలేనట్లు చూచాడు.

'మీరు చదివిన పేరాలలో కౌలాచారాన్ని ఆయన విమర్శించారు.అది కూడా నిజమైన కౌలాచారాన్ని కాదు.ఆమధ్య కాలంలో కొందరు దుష్ట బ్రాహ్మణులు వ్రాసి ప్రచారంలోకి తెచ్చిన దుష్ట కౌలాచారాన్ని ఆయన విమర్శించాడు. విమర్సించవలసిన విషయం అంత చండాలమైనది గనుక ఆయన వాడిన భాష కూడా అలాగే ఉన్నది.అంతమాత్రం చేత మీ స్వాములవారి వ్యక్తిత్వానికీ స్థాయికీ ఏమీ భంగం లేదు.ఆ మాటలు మన దృష్టిలో బూతు కావచ్చు.కాని ఆయన దృష్టిలో కాదు.కనుక ఆయన వాడిన ఆ మాటల వల్ల ఆయన మహత్వానికి ఏమీ భంగం రాదు.' అన్నాను.

ఆయన ముఖంలో మళ్ళీ మునుపటి ఊరట కనిపించింది.

'ఆయన మీద నా గౌరవం వంద రెట్లు పెరిగింది అన్నాను కదా? ఎందుకో ఇప్పుడు చెబుతాను.నేను జగద్గురు స్థానంలో ఉన్న శంకరాచార్యున్ని. నేను అలాంటి బూతులు మాట్లాడితే నా శిష్యుల దృష్టిలో నేను చులకన అవుతాను అని ఆయన భావించలేదు.తన మనసులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పడమే ఆయన చేసాడుగాని,ఇతరుల గౌరవం కోసం నటిస్తూ పాకులాడలేదు.అంటే ఆయనలో నిజాయితీ ఉన్నది.తను అనుకున్నది అనుకున్నట్లుగా బయటకు చెప్పాడు.ఆయనలో ధైర్యం ఉన్నది.ఇతరుల మెప్పును ఆశించి నంగిమాటలు మాట్లాడలేదు.తన ఇమేజి కోసం నాటకాలాడలేదు.మామూలు మనుషులకు ఉండే అహంకారం ఆయనలో లేదు.కనుక ఆయనంటే నాకు గౌరవం ఇనుమడించింది.' చెప్పాను.

'అర్ధమైంది శర్మగారు.మీ దృక్కోణం వేరుగా ఉన్నదని నాకర్ధమైంది.ఇప్పుడు నాదొక సందేహం.అడగనా?' అన్నాడు.

'అడగండి' అన్నాను.

'అయితే తాగడం తందనాలాడటం బూతులు మాట్లాడటం జ్ఞానానికి చిహ్నాలా?' అడిగాడాయన.

నవ్వాను.

'కానే కాదు.అవి నేలబారు వ్యవహారానికి దిగజారుడుతనానికి చవకబారు వ్యక్తిత్వానికీ చిహ్నాలే.అవి జ్ఞానానికి చిహ్నాలే అయితే ప్రతి తాగుబోతూ జ్ఞానే అయి ఉండేవాడు.అలా కాదు.జ్ఞాని అయినవాడు అవన్నీ చేసినా కూడా అతని స్థాయి దిగజారదు అని మాత్రమె నేను చెబుతున్నాను.అతని జ్ఞానానికి భంగం రాదు.ఇదే మీరు సరిగ్గా అర్ధం చేసుకోవలసిన పాయింట్. నేను చెబుతున్నది చాలా సున్నితంగా సూక్ష్మంగా అర్ధం చేసుకోవలసిన విషయం.' చెప్పాను.

(మిగతాది తర్వాతి భాగంలో)