“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

30, మే 2021, ఆదివారం

ఆస్ట్రేలియాలో ఎలుకల వర్షం ఎందుకు?

ఈ విషయాన్ని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారో లేదో నాకు గుర్తులేదు. ఎందుకంటే దానిని నా చిన్నపుడు చదివాను. అందులో ఇదుందో లేదో మీరే చెప్పాలి.

ఆస్ట్రేలియాలో ప్రస్తుతం లక్షలాది ఎలుకలు వీరవిహారం చేస్తున్నాయి. ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. పంటలను, నిలువ చేసిన ధాన్యాన్ని లక్షల ఎలుకలు తినేస్తున్నాయి. అవి ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయి. కొన్ని ఇళ్లలో అయితే, కప్పులనుంచి జలజలా ఎలుకల వర్షం కురుస్తోందట. ట్రాప్ పెడితే తెల్లవారే సరికి 500 ఎలుకలు అందులో పడుతున్నాయట.

ఈ ఎలుకల బెడద ఆస్ట్రేలియాకు కొత్తది కాదు. తెల్లవాళ్లు అక్కడ కాలుపెట్టినప్పుడే వారితో బాటు ఎలుకలు అక్కడ అడుగు పెట్టాయి. అంతేకాదు కలరా, మలేరియా, స్మాల్ పాక్స్, ఫ్లూ మొదలైన రోగాలు కూడా తెల్లవాళ్ళతోనే అక్కడి స్థానికులకు సంక్రమించాయి.

1788 జనవరిలో కెప్టెన్ ఆర్ధర్ ఫిలిప్ తన ఓడతో అక్కడ అడుగుపెట్టాడు. ఆ ఓడలో గుర్రాలు, ఎద్దులు, ఆవులు, కుందేళ్లతో పాటు, ఎలుకలను కూడా తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో వదిలాడు. 'ఆ ద్వీపం మాదే' అని బ్రిటన్ ప్రకటించింది. బ్రిటన్ నుండి నేరస్తులతో, దొంగలతో ఆ దీవిని నింపడం మొదలైంది. యూరోప్ నుంచి వలసజనం తండోపతండాలుగా అక్కడకు పోవడం మొదలైంది. అప్పటికే అక్కడ దాదాపుగా పదిలక్షల మంది స్థానిక ప్రజలున్నారు. వాళ్లలో రకరకాల జాతులున్నాయి, తెగలున్నాయి, భాషలున్నాయి. అయితే వారంతా ఆటవికులు. నల్లవాళ్ళు. అసలు వారంతా అక్కడకెలా వచ్చారు? మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న ఆస్ట్రేలియాలో అప్పటికే పదిలక్షలమంది మనుషులెలా ఉన్నారు?

అరవై డెబ్భై వేల సంవత్సరాల క్రితమే ఇతర దేశాలనుండి మనుషులు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారని రుజువులున్నాయి. అక్కడ దొరికిన సమాధులు, జంతువులు మనుషుల అస్థిపంజరాలు, మిగతా ఆనవాళ్ళు, ఇంకా స్థానికుల జీన్స్ ను పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ సత్యాన్ని రాబట్టారు. వీరిలో ఇండోనేషియా, ఇండియా మొదలైన దేశాల జీన్స్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు సంస్కృత, ప్రాకృత మూలాలతో ఉంటాయి, ఉదాహరణకు కొన్నింటిని చూడండి -  బంగారి, దారన, మాయ, అన్మనారి, బృంద, అల్కవారి, కర్రి, ఐలూక, తారక, గురుమఱ్ఱ, వింద్రదను.

ఈ పేర్లను తెల్లవారు గుర్తుపట్టలేకపోవచ్చు. మనం గుర్తుపట్టలేమా ! ఇవెక్కడివో మనం చెప్పలేమా?

రెండువందల ముప్పై ఏళ్ళక్రితం కేవలం పదిమందితో అక్కడ అడుగుపెట్టిన బ్రిటిష్ సంతతి నేడు మూడుకోట్లకు చేరుకుంది. ఈ రెండువందల సంవత్సరాలలో స్థానికులు పదిలక్షలనుంచి ఎనిమిదిలక్షలకు తగ్గిపోయారు. ఇదెలా జరిగింది?

తెల్లవాళ్లు ఏ దేశంలో అడుగుపెట్టి, ఎక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకున్నా, అది స్థానికులను చంపడం ద్వారానే చేశారు. అమెరికాలో అదే జరిగింది. ఆస్ట్రేలియాలో కూడా అదే జరిగింది. ఇండియాలో కూడా అదే చేశారు. అయితే, పూర్తిగా అదేవిధంగా చెయ్యలేక, కులాలపరంగా, మతాలపరంగా, వేరే రకాల చిచ్చులు పెట్టి, ఇక తప్పనప్పుడు తప్పుకున్నారు.  

ఆస్ట్రేలియాను మొదట్లో న్యూ హాలండ్ అనీ ఆ తరువాత న్యూ సౌత్ వేల్స్ అనీ అనేవారు. అక్కడ స్థానికులను తుపాకీని మందుగుండును ఉపయోగించి విచక్షణా రహితంగా కాల్చి చంపారు తెల్లవాళ్లు. వాళ్లేమో బల్లెం, గొడ్డలి, ఒడిసెల వంటి ఆటవిక ఆయుధాలు వాడేవారు. తెల్లవాడు తుపాకీతో, టెక్నాలజీతో అక్కడ అడుగుపెట్టాడు. అప్పటిదాకా వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమి 'నాది' అన్నాడు. వాళ్ళు సహజంగానే తిరగబడ్డారు. ఆ విధంగా జరిగిన ఘర్షణలతో వేలాదిమంది స్థానికులు చనిపోయారు. లక్షలాది మంది కూడా కావచ్చు. లెక్కల్లేవు. ఎంతోమంది స్థానికులను వారు తినే ఆహారంలో విషం కలిపి చంపేశారు తెల్ల సెటిలర్స్.  లేదా, ఆహారంలో, తిండిగింజలలో విషం కలిపి, స్థానిక ఆటవికులకు అందుబాటులో ఉండేలాగా వదిలిపెట్టేవాళ్ళు. ఆశగా అవి తీసుకుపోయి తిన్న ఆదివాసీలు వేల సంఖ్యలో చనిపోయేవారు. ఇదిగాక, తెల్లవాళ్ళనుంచి అప్పటిదాకా లేని  రోగాలు స్థానికులకు సోకాయి. అవే, కలరా, మలేరియా, మీజిల్స్, స్మాల్ పాక్స్, ఫ్లూ మొదలైన రోగాలు. ఈ రోగాలు యూరోప్ నుండి మిగతా ప్రపంచం మొత్తానికీ పాకాయి. తెల్లవాడు రాకముందు మన దేశంలో కూడా ఈ రోగాలు లేవు. అంతేకాదు. సిఫిలిస్, గనేరియా మొదలైన సుఖరోగాలు కూడా యూరోపియన్లు మిగతా ప్రపంచానికంతా అంటించిన పుణ్యరోగాలే అని చరిత్ర చెబుతోంది.

ఈ విధంగా, తుపాకీతోను, తినే ఆహారంలో విషం కలపడం ద్వారాను, అంటురోగాలు వ్యాప్తి చెయ్యడం ద్వారాను బ్రిటిష్ వారు, స్థానిక ఆస్ట్రేలియా ఆదివాసీలను తుడిచిపెట్టేశారు. అందుకే గత రెండువందల ముప్పై ఏళ్లలో, స్థానిక నల్లజాతి ప్రజల సంఖ్య పదిలక్షలనుంచి ఎనిమిది లక్షలకు పడిపోతే, తెల్లవాళ్ల సంఖ్య పదిమంది నుంచి మూడుకోట్లకు పెరిగింది.

ఇదంతా మీకు నెట్లో దొరుకుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆస్ట్రేలియా చరిత్ర మీద రీసెర్చి చేసి చూడండి. మీకే అర్ధమౌతుంది.

అయితే, నేను చెప్పబోతున్నది ఇది కాదు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని, ప్రజలను గజగజలాడిస్తున్న ఎలుకల వరదకు కారణమేంటో తెలుసా? శాస్త్రవేత్తలు ఏవేవో కారణాలు చెప్పవచ్చు. వారు చెప్పే కారణమేంటంటే - కావలసిన దానికంటే ఆహారధాన్యాలను విపరీతంగా పండించి లక్షల టన్నుల ధాన్యాన్ని, గోధుమలను సైలోలలో నిల్వచెయ్యడమని. కానీ అసలు కారణం ఇది కాదు.

మనుషులకు సైటెక్కువ. అందులోనూ వాళ్లకు షార్ట్ సైట్ మాత్రమే ఉంటుంది. అంటే ఎదురుగా ఉన్నది తప్ప దూరంగా ఉన్నది కనపడదు. అందుకే వాళ్ళ ఖర్మ వాళ్ళను వెంటాడుతూ ఉంటుంది. వినండి !

ఎక్కడో యూరప్ నుంచి వచ్చారు తెల్లవాళ్ళు. డెబ్భై వేల ఏళ్ళనుంచీ ఆస్ట్రేలియాలో బ్రతుకుతున్న స్థానిక నల్లవారిని దారుణంగా జంతువులలాగా వేటాడి చంపారు. ఎలుకలకు మందుపెట్టి చంపినట్టు, తినే తిండిగింజలలో విషం కలిపి అక్కడి గూడెం ప్రజలను వేలాదిగా చంపేశారు. తెల్లవాళ్ళనుంచి ఆ గడ్డకు చేరిన అంటురోగాలు సోకి ఎన్నో ఆదివాసీల గూడాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఆ రోగాలకు మందులు లేక లక్షలాది స్థానికులు దిక్కులేని చావులు చచ్చారు. ఆ ఉసురంతా ఎక్కడికి పోతుంది మరి?

ఆహారంలో విషం కలిపి ఎలుకలను చంపినట్టు ఆదివాసీలను చంపారు గనుకనే, ఇప్పుడు  లక్షలాది ఎలుకలు ఆస్ట్రేలియాలో వీరవిహారం చేస్తున్నాయి. ఇప్పుడే కాదు, ప్రతి నాలుగైదు ఏళ్ళకొకసారి ఈ ఎలుకల బెడద ఆస్ట్రేలియాలో ఉంటూనే ఉన్నది. నెట్లో రీసెర్చ్ చెయ్యండి మీకే తెలుస్తుంది !

ఈ ఎలుకలను చంపడం అక్కడి ప్రభుత్వం వల్ల కాక, ఇండియాలో బ్యాన్ అయిన భయంకర విషం 'బ్రొమడైలన్' 5000 లీటర్లు కావాలని ఇండియాను అడుగుతోంది. చూశారా కర్మ ఫలితం తరతరాలుగా ఎలా వెంటాడుతుందో?

నవీనులు సైన్స్ ను నమ్ముతారు.  కర్మను నమ్మరు. కానీ మన నమ్మకం ప్రకారం ప్రపంచం నడవదు. దాని వెనుక కంటికి కనిపించని కర్మసూత్రాలున్నాయి. వాటి ప్రకారం సృష్టి నడుస్తుంది గాని, మన దుర్మార్గపు మనస్తత్వంతో, అతితెలివితో నడవదు.

'కత్తిని వాడేవాడు కత్తితోనే చస్తాడు' - అంటుంది బైబిల్. మరి క్రీస్తును పూజిస్తామని చెప్పుకునే తెల్లవాళ్లు ఆస్ట్రేలియాలో చేసిందేమిటి? ఇదేనా క్రైస్తవం? ఆస్ట్రేలియా ఆదివాసీలకు తెల్లవాళ్ళు చేసిన అన్యాయమే ఇప్పుడు వాళ్ళని వెంటాడుతోంది. ఒకప్పుడు విషపూరిత ఆహారం పెట్టి ఎలుకల మాదిరిగా  ఆదివాసీలను తెల్లవాళ్లు చంపేశారు. ఇప్పుడు తెల్లవాళ్లు పండిస్తున్న పంటను విషపూరితం చేస్తున్నాయి ఎలుకల మందలు. లక్షలాదిగా వెంటాడుతున్నాయి. పొలాలలో, గోదాముల్లో, షాపులలో, ఇళ్లలో, బెడ్ రూములలో, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ, సీలింగ్ నుంచి వర్షంలా కురుస్తూ, జనాన్ని భయభ్రాంతులను చేస్తున్నాయి. మనుషుల్ని కూడా కరుస్తున్నాయిట. వీటివల్ల మనుషులలో ప్లేగు వ్యాధి వ్యాపిస్తే అప్పుడుంటుంది అసలు సినిమా !
 
ఇది కర్మ ఫలితం కాదా మరి?

దీనిమీద మళ్ళీ ఒక సినిమా తీసి వందల కోట్లు సంపాదిస్తాడు ఇంకో తెల్లోడు. నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే రంగంలోకి దిగి ఉంటుంది. డబ్బులు డబ్బులు డబ్బులు. ఏం జరిగినా దాన్ని చూపించి డబ్బు సంపాదించడమొక్కటే ప్రస్తుతం జనానికి తెలిసిన విద్య. అంతేగాని ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్న పాపఖర్మాన్ని ఎలా తొలగించుకోవాలి అన్నవిషయం మాత్రం ఎవరికీ తెలియదు. చెప్పినా వినేస్థితిలో ఎవరూ లేరు. కోట్లు మూలుగుతున్నవాళ్ళు కరోనాతో రెండురోజుల్లో దిక్కులేకుండా చనిపోతున్నా కూడా ఎవరికీ జ్ఞానోదయం కావడం లేదు.

ఇండియానుంచి కొన్న విషం పెట్టి ఎలుకలను చంపవచ్చునేమోగాని, అవి మళ్ళీ పుట్టకుండా ఆపగలరా? అలా ఆపగలిగే పనైతే గత రెండువందల ఏళ్ళనుంచీ వదలకుండా ఎలుకలెందుకు ఆస్ట్రేలియాను వెంటాడుతున్నాయి? విషం తిని చనిపోయిన లక్షలాది ఎలుకల వల్ల నేల, నీరు, గాలి అన్నీ పాడౌతాయి. విషపూరితాలౌతాయి. అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త రోగం పుట్టుకొస్తుంది. దానికి మళ్ళీ ఇంకేదో అసహజమైన అడ్డదారి తొక్కుతారు. అది ఇంకో ముసలానికి కారణమౌతుంది. ఈ చక్రభ్రమణానికి అంతెక్కడ?    

ఏం ప్రపంచంరా దేవుడా? ఎప్పుడు బాగుపడతారో మనుషులు? ఎప్పుడు కళ్లుతెరిచి జ్ఞానవంతులౌతారో? నీకే ఎరుక !