“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

31, మే 2021, సోమవారం

ఆస్ట్రేలియాలో ఎలుకల బెడద - రాహుకేతువుల ప్రభావం


SA - South Australia; NSW- New South Wales; QL- Queensland;

ఒక దేశాన్ని గాని, కుటుంబాన్ని గాని, మనిషిని గాని ఒకే విధమైన దురదృష్టం వదలకుండా వెంటాడుతున్నదంటే దానికి తప్పకుండా కారణాలుంటాయి.  ఆ కారణాలలో కొన్ని మాత్రమే మనకు కనిపిస్తాయి. కనిపించని కారణాలు ఎన్నో ఉంటాయి. వాటినే 'పూర్వకర్మ' అంటాము. మనిషి జాతకంలో అయితే, ఆ పూర్వకర్మను కనిపెట్టి తొలగించుకునే ఉపాయాలుంటాయి. వాటినే పరిహారక్రియలంటారు. అయితే, వాటిని అందరూ కనుక్కోలేరు, కనుక్కున్నా తీసెయ్యలేరు. తీసెయ్యగలమని డబ్బాలు కొట్టుకునే నేటికాలపు జ్యోతిష్కులు ముందు వారి సమస్యలను వారు పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది. ఆ తరువాత లోకాన్ని ఉద్ధరించే కార్యక్రమంలోకి దిగవచ్చు.

మనిషికున్నట్లే దేశానికీ శాపాలుంటాయి. ఆ దేశం గనుక దౌర్జన్యంగా ఆక్రమించుకోబడినదైతే, ఆ శాపాలు మరీ దారుణంగా ఉంటాయి. వారి పూర్వీకులు చేసిన పాపఖర్మ ఫలితాలను నేటితరంవారు ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది. కుటుంబాలలో అయితే, ఈ పాపఖర్మ, వదిలిపెట్టని రోగాలుగా, తరతరాలకూ సంక్రమిస్తూ వేధించే దురదృష్టాలుగా, అనారోగ్యాలుగా, కష్టనష్టాలుగా, దీర్ఘరోగాలుగా ఉంటుంది. దేశానికైతే, తుఫానులు, ప్రకృతి ప్రమాదాలు, వేలాదిగా లక్షలాదిగా మనుషులను తుడిచిపెట్టే సాంక్రమిక రోగాలు, కరువుకాటకాలు మొదలైన రూపాలలో ఉంటుంది.

అయితే, పూర్వకర్మను జయించడం అంత తేలిక కాదు. 'ఇదిరా బాబూ దారి' అంటూ  చెబితే మనుషులే వినరు, ఇక దేశాలు దేశాధినేతలు వింటారా? జరిగే పని కాదు. అయినా సరే, జ్యోతిషశాస్త్ర పరిశోధకులు ఊరుకోరు కదా. విషయాలను తరచి తరచి చూస్తూనే ఉంటారు. అలాంటిదే ఈ పరిశోధన కూడా.

గత నూట యాభై సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో దాదాపుగా పాతికసార్లు ఈ ఎలుకమందల దాడులు జరిగాయి. కొన్నిసార్లు చాలా ఎక్కువగా జరిగాయి. మిగతావి తక్కువ మోతాదులో జరిగినప్పటికీ అవి కూడా రైతులకు ప్రజలకు చాలా నష్టాన్ని కల్గించినట్టివే. ఆయా సంవత్సరాలను, అప్పటి ముఖ్యమైన  గ్రహస్థితులను పైన పట్టికలో చూడవచ్చు. ఎరుపు రంగులో ఉన్నవి, ఊహించలేనంత నష్టాన్ని కలిగించిన ఎలుకదాడులు. మిగతావి కొంచం చిన్నపాటివి. ఇప్పుడు విశ్లేషణలోకొద్దాం.
  • ముఖ్యంగా, రాహుకేతువులు ఉచ్చనీచలలో ఉన్నప్పుడు, శని, ప్లుటోలు కలసిగాని, దృష్టిలో ఉన్నపుడుగాని ఈ సంఘటనలు ఆస్ట్రేలియా దేశానికి ఎక్కువ నష్టాన్ని కలిగించాయి.
  • వృషభ, మిధున, వృశ్చిక, ధనూరాశులు ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఆ తరువాత సింహరాశి ఎక్కువగా కనిపిస్తున్నది.
ముందుగా, ఊహించనంత నష్టాన్ని కలిగించిన సంవత్సరాలను గమనిద్దాం. అవి - 1917, 1956, 1979, 1993, 2021.

1917 లో రాహుకేతువులు ధనుస్సు - మిధున రాశుల ఇరుసులో నీచస్థితిలో ఉన్నారు. శని కర్కాటకంలో, ప్లూటో మిధునంలో ఆచ్ఛాదనాయోగంలో ఉన్నారు. ప్లుటోతో నీచకేతువు కలిసున్నాడు. కనుక ఈ అతిపెద్ద ప్లేగ్ ఆస్ట్రేలియాలో వచ్చింది.

1956 లో రాహుకేతువులు వృశ్చిక - వృషభ రాశులలో మళ్ళీ నీచస్థితిలో ఉన్నారు. శని వృశ్చికంలో నీచరాహువుతో కలసి భయంకరమైన శపితయోగంలో ఉన్నాడు. ప్లూటో సింహరాశిలో ఉన్నాడు. ఒక్కసారి రాశిచక్రాన్ని చుట్టి రావడానికి ప్లూటో 248 సంవత్సరాలు తీసుకుంటాడు. కనుక 1708 లో ఏం జరిగిందో మనకు తెలియదు. 1956 లో  వచ్చిన ఈ ప్లేగ్ వల్ల ఎలుకల దెబ్బకు పిల్లులకు అంతుతెలియని రోగాలు సోకి పిల్లులు చచ్చిపోయాయి. అంటే, ఎలుకలు పిల్లులను చంపేసినట్లు అయింది. బ్రహ్మంగారు చెప్పినవి ఇలాంటివే కదా మరి !

1979 లో వచ్చిన మరొక ఎలుకల వరద సమయంలో రాహుకేతువులు సింహ - కుంభరాశుల ఇరుసులో ఉన్నారు. ఇక్కడ సింహరాశికి ప్రాముఖ్యత పెరిగింది. ఆస్ట్రేలియా దేశం కూడా సింహం తలకాయలాగే ఉంటుంది గమనించండి. ఈ సమయంలో శని సింహరాశిలోను, ప్లూటో కన్యారాశిలోను ఉంటూ మళ్ళీ ఆచ్ఛాదనాయోగంలో ఉన్నారు.

1993 లో వచ్చిన విపత్తులో రాహుకేతువులు వృశ్చిక - వృషభ రాశుల ఇరుసులో నీచస్థితిలో ఉన్నారు. శని కుంభరాశిలోను, ప్లూటో తులారాశిలోను ఉంటూ పరస్పర కోణదృష్టిలో ఉన్నారు.

ఇక ప్రస్తుతం 2021 లో చూస్తే, రాహుకేతువులు వృషభ - వృశ్చికరాసులలో ఉచ్ఛస్థితిలో ఉండగా, శని ప్లుటోలిద్దరూ మకర రాశిలో కలసి ఉన్నారు. కనుక మళ్ళీ ఇప్పుడు అతిపెద్ద ఎలుకల బెడద ఆస్ట్రేలియాకు వచ్చింది.

చూశారా లింకులు ఎలా ఉన్నాయో?

ఇప్పుడు మిగతా సంవత్సరాలలో ఏఏ గ్రహయోగాలు పనిచేశాయో చూద్దాం.

  • రాహుకేతువుల ఉచ్చస్థితులున్న సంవత్సరాలు : 1871,1872, 1890, 1928, 2021.
  • రాహుకేతువుల నీచస్థితులున్న సంవత్సరాలు : 1880,1917, 1918, 1955, 1956. 1975, 1993.
అంటే, ప్రతి 7 నుంచి 9 ఏళ్ళకొకసారి తీవ్రమైన ఎలుకల బెడద ఆస్ట్రేలియాలో వస్తున్నదని, దానికి కారణం రాహుకేతువుల స్థితులని ఒక  విషయం అర్ధమౌతున్నది.

ఇప్పుడు శని ప్లూటో ల స్థితిని, వీరితో రాహుకేతువుల సంబంధాన్ని గమనిద్దాం.
  • 1871-72: ధనూశని, మేషప్లుటోల కోణదృష్టి. ధనుర్లగ్నంలో శని.
  • 1880: నీచమేషశని, వృషభ ప్లూటోల ఆచ్చాదనాయోగం, ధనుస్సునుండి  నీచరాహు దృష్టితో శపితయోగం. 
  • 1890: సింహశని, ఉచ్చ ధనూకేతువుల మధ్య కోణదృష్టి. ధనుస్సులో కేతువు.
  • 1917 నుంచి 1932 వరకూ ప్లూటో మిధునరాశిలో ఉన్నాడు. ధనుస్సును చూస్తున్నాడు. ఆ పదిహేనేళ్ల కాలంలో ఏడుసార్లు ఎలుకల బెడద తలెత్తింది. ధనుర్లగ్నం దెబ్బతినింది.
  • 1922 లో  శనిరాహువులు కన్యలో ఉంటూ శపితయోగం తలెత్తింది. ఇది ధనుస్సుకు దశమంలో జరిగింది.
  • 1925 లో ఉచ్చతులాశని మిధునప్లుటోలు కోణదృష్టిలో ఉన్నారు. రాహువు కర్కాటకంలో ప్లుటోతో ఆచ్చాదనాయోగంలో ఉన్నాడు. ప్లూటో ధనుస్సును చూస్తున్నాడు.
  • 1928 లో శని కేతువులు వృశ్చికంలో యుతిలో ఉన్నారు. ప్లూటో రాహువులు మిధున వృషభాలలో ఆచ్చాదనాయోగంలో ఉన్నారు. ధనుర్లగ్నానికి ద్వాదశంలో శనికేతువుల యుతి జరిగింది.
  • 1931 లో ధనూశని మిధునప్లుటోలు సమసప్తకదృష్టిలో ఉన్నారు. రాహుకేతువులు మీనకన్యారాశులలో ఉంటూ వీరికి అర్గలదోషాన్ని పట్టించాయి. ధనుస్సులో శని.
  • 1932 లో మకరశని కుంభరాహువుల ఆఛ్చాదనాయోగం, కుంభరాహు, మిధున ప్లుటోల మధ్యన కోణదృష్టి ఉన్నది. ప్లూటో ధనుస్సును చూస్తున్నాడు.
  • 1952 లో కన్యాశని సింహకేతువుల మధ్య ఆచ్చాదనాయోగం ఉన్నది. ధనుస్సుకు దశమంలో శని.
  • 1955 లో తులాశని, నీచమిథునకేతువుల మధ్యన కోణదృష్టి ఉన్నది. సింహప్లూటో, నీచధనూరాహువుల మధ్యన కోణదృష్టి ఉన్నది. ధనుస్సులో నీచరాహువు.
  • 1967 లో మీనశని, మేషరాహువులమధ్య ఆచ్ఛాదనాయోగం ఉన్నది. ధనుస్సుకు చతుర్దకేంద్రంలో శని.
  • 1972 లో వృషభశని, కన్యాప్లూటో, మకరరాహువుల మధ్యన పరస్పర కోణదృష్టి ఉన్నది. ధనుస్సుకు దశమంలో ప్లూటో.
  • 1975 లో మిధునశని, నీచవృషభకేతువుల మధ్యన ఆచ్చాదనాయోగం ఉన్నది. నీచకేతువుకు కన్యాప్లూటో తో కోణదృష్టి. ధనుస్సుకు సప్తమంలో శని, దశమంలో ప్లూటో.
  • 1994 లో కుంభశని, తులారాహువుల మధ్యన కోణదృష్టి ఉన్నది. ధనుర్లగ్నానికి వీరు అర్గలదోషాన్ని పట్టించారు. 
ఈ విధంగా ఆస్ట్రేలియాను సూచిస్తుందని చాలామంది నమ్మే ధనుర్లగ్నం ఆయా సంవత్సరాలలో చెడుయోగాల బారిన పడింది.

ప్రస్తుత ఎలుకలదాడి వల్ల జరిగిన నష్టం 1 బిలియన్ (100 కోట్ల) ఆస్ట్రేలియన్ డాలర్స్ అంటున్నారు. అంటే మన లెక్కలో 5,600 కోట్ల రూపాయలు. గత నూటయాభై ఏళ్లలో జరిగిన నష్టాన్ని లెక్కిస్తే కనీసం లక్ష కోట్లుంటుంది.

ఓరి ఎలకలో ! ఎంత పని చేస్తున్నాయ్ !

బలీయమైన పూర్వపు పాపకర్మను అనుభవింపజేయడంలో శని, ప్లూటో (యమగ్రహం), కాలస్వరూపమైన రాహుకేతువుల పాత్ర సుస్పష్టం. ఆస్ట్రేలియాకు ఎలుకల బెడద పట్టిన ప్రతి ఏడాదీ వీరి పాత్రను యధోచితంగా గమనించవచ్చు. ఈ బాధ ఆస్ట్రేలియాకు ఎలా తప్పుతుందంటారా? ఉపాయం ఉంది. అయితే, మనుషులే  చెప్పింది వినరు, ఇక దేశాలు వింటాయా మీ పిచ్చిగాని !

అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ !

అంతే !