“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, మార్చి 2010, సోమవారం

యోగ సాధన


ప్రాచీన భారతదేశంలో, ప్రతిరోజూ యోగసాధన చెయ్యటం చిన్ననాటినుంచి పిల్లలకు నెర్పెవారు. ప్రకృతి సహజమైన ఆహారం తీసుకునేవారు.ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేద ఔషధాలు వాడేవారు.కనుక మనుషులు ఆరొగ్యంగా నిండు నూరేళ్ళు జీవించేవారు. ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకుంటే మనిషి పని సున్నా అన్న సంగతి వారికి బాగా తెలుసు. కనుకనే ఆహార వ్యవహారాలలో చాలా జాగ్రత్తలు పాటించేవారు.

కాని నేడు ఆహారం కలుషితమై పోయింది. ప్రమాదకరమైన జంక్ ఫుడ్ వాడకం ఎక్కువైంది. టీలు కాఫీలు కూల్ డ్రింకులే కాక తాగుడూ మాదకద్రవ్యాల   వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఇక, వ్యవహారంలో చూద్దామా అంటే, శరీరానికి కదలిక లెని స్థితి కలిగింది. మనస్సుకు టెన్షన్ పెరిగింది. సైడ్ ఎపెక్ట్స్ ఇచ్చే సింతటిక్ డ్రగ్స్ వాడకం ప్రబలింది.టీవీ సెల్ ఫోనూ కంప్యూటరూ మనిషి నరాలవ్యవస్థతో ఆడుకుంటున్నాయి. వెరసి ఆహార వ్యవహారాలు రెండూ అదుపు తప్పాయి.

కనుక ప్రతి కుటుంబంలో రోగాలు ఎక్కువైనాయి.పుట్టిన పిల్లలకే గుండెలో చిల్లులు కనబడుతున్నాయి.నాలుగేళ్ళకే సొడాబుడ్డి కళ్ళద్దాలు వస్తున్నాయి.ఆరేళ్ళకే డయాబెటీస్ లక్షణాలు కనిపిస్తున్నాయి.అంటే తల్లితండ్రుల ధాతువులు అంతగా క్షీణించిన స్థితిలో ఉన్నాయన్నమాట.అనేక మందికైతే అసలు సంతానమే కలగటం లేదు.ఈ పరిస్థితికి కారణాలేమిటో తెలుసుకుందామా?

అబ్బాయిలు హైస్కూల్ వయసుకే దురభ్యాసాలకు అలవాటు పడి విలువైన తమ శక్తిని వృధా చెసుకుంటూ కళావిహీనమైన ముఖాలతో దర్శనం ఇస్తున్నారు. కుహనా ఇంగ్లీషు డాక్టర్లు వీరిని పత్రికలలో ప్రోత్సహిస్తూ సమాజపతనానికి యువకుల నిర్వీర్యతకూ కారకులౌతున్నారు. అబ్బాయిలలో కనిపిస్తున్న ఇంకొక ప్రమాదకర ధోరణి కాలేజి వయసులోనే తాగుడుకు అలవాటు పడటం. చాలా కుటుంబాలలో ఇదొక ఫేషన్ అయింది. కొడుకు తాగి వస్తే చూచీ చూడనట్టు ఊరుకుంటున్న తల్లి దండ్రులు నేడు చాలామంది ఉన్నారు. ఎందుకనగా తండ్రి పార్టీలలో తాగుతూ (అది ఏ కారణం వల్లనైనా కావచ్చు) కోడుకుకు ఎలా బుద్ధి చెప్పగలడు?

ఆడపిల్లల పరిస్తితి మరీ ఘోరంగా ఉన్నది. చాలా మందికి నెలసరి సరిగ్గా రాని స్థితి ఉంది. యుక్తవయసు పిల్లల్లో కడుపు నోప్పి, లుకోరియా, ఒవేరియన్ సిస్ట్ లు సర్వ సాధారణం అయ్యాయి.కంటిచూపు మాట ఇక చెప్పే పనిలేదు.ఊబకాయం చాలా ఇళ్ళలో కనిపిస్తున్నది.ఈ అమ్మాయిలు రేపు వివాహం అయిన తరువాత ఎన్ని బాధలు పడతారో, ఎటువంటి ఎలుక పిల్లలకు జన్మ నిస్తారో తలుచుకుంటే బాధగా ఉంటుంది. హైదరాబాద్ లాంటి నగరాలలో కాలేజి ఆడపిల్లలు క్లాసులు ఎగ్గొట్టి బీరు తాగటం నిజమే నని ఈ మధ్యనే నాకు తెలిసింది. వాళ్ళు వేస్తున్న ఇతర వేషాలగురించి నేను వ్రాయదలుచుకోలేదు.

ఆహారదోషాల వల్ల శరీరాలలొ బలం తగ్గటం ఒకఎత్తు అయితే, మన నిత్యజీవిత విధానాలవల్ల కొని తెచ్చుకుంటున్న రోగాలు ఇంకొక ఎత్తు. మితి మీరిన టీవీ, కంప్యూటర్ వాడకాల వల్ల దృష్టిదోషాలు,రోజంతా కదలకుండా కూచొని పనిచెయ్యటం,దుమ్ము ధూళితో కూడిన వాతావరణం కల సిటీలలో తప్పనిసరిగా బతకవలసి రావడం, మానసికంగా టెన్షన్ల వల్ల వచ్చే అనెక రోగాలు ఇంకొన్ని.

ఈ అవస్థలను అధిగమించాలంటే, మంచి ఆహారం వేళకు తీసుకోవటం, దురభ్యాసాలు మానుకొని,సాధ్యమైనంత వరకూ ఇంగ్లీషు మందులు వాడకం ఆపి,ఆయుర్వేద ఔషధాలు కాని, హోమియో ఔషధాలు కాని తీసుకుంటూ, ప్రతిరోజూ కనీసం ఒక గంట సేపు యోగా చేస్తే చాలు. కొన్ని నెలలలో మంచి ఆరోగ్యం మన సొంతం అవటం మనమే చూడవచ్చు.

"సిక్ మాన్ ఆఫ్ ఏషియా" అని పెరు పడిన చైనా ఇప్పుడు ఒలింపిక్స్ లో అమెరికా వంటి అగ్రరాజ్యాలతో దీటుగా పోటీపడి పతకాలు సాధిస్తున్నదంటే ఆదేశంలో వ్యాయామవిద్యకు ఇస్తున్న విలువే కారణం. స్కూళ్ళలో చిన్నప్పటి నుంచి తప్పనిసరిగా కిగాంగ్, వూషూ వంటి అభ్యాసాలు నెర్పించి క్రమం తప్పకుండా చేయించటం వల్లనే చైనీయులు అంత ప్రగతి సాధించగలిగారు. కొందరికి ఇది బాలహక్కుల హననంగా కనిపించవచ్చు.అదంతా ఒక ఆదర్శం అంటూ లేని జాతి మాట్లాడే మాటలు మాత్రమె అని నా భావన. ఉన్నతమైన ఆదర్శాలున్నపుడు కష్టం తప్పదు. చిన్నప్పటి నుంచే సుఖపడటం నేర్పితే తర్వాత కష్టమూ తప్పదు.

చైనీయులు వారి వీరవిద్య అయిన కుంగ్ ఫూ ను ఆదరిస్తున్న తీరు మనకూ ఆదర్శం కావాలి. మన స్కూళ్ళలో కష్టమైన వీరవిద్యలను నేర్పకుంటే నేర్పకపోయారు కాని, కనీసం యోగాను తప్పనిసరిగా ఒక పీరియడ్ గా పెట్టి,అందరికీ తప్పనిసరిగా నేర్పించాలి. ముఖ్యంగా బాలికలకు దీనిని కంపల్సరీ పీరియడ్ చెయ్యాలి. తద్వారా ఆ బంగారుతల్లులు మంచి ఆరోగ్య వంతులుగా మారి, వారినుంచి మంచి ఆరోగ్యవంతమైన తరువాతి తరం తయారు కాగలుగుతుంది.ఎవరికైనా తల్లే ప్రధమగురువు అన్నది సత్యం.తల్లి ఆదర్శమాత అయితే సంతానం ఆదర్శవంతంగా ఉంటుంది.లేకుంటే అది అసాధ్యం. 

అబ్బాయిలకు బ్రహ్మచర్యపాలన, యోగాభ్యాసాల వల్ల కలిగే అధ్బుత ఉపయోగాలను, వీటికి వ్యతిరేకమైన చెడుఅలవాట్ల వల్ల కలిగే భయంకర నష్టాలను పెద్దలు సిగ్గుపడకుండా వివరించాలి.ఋషి సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలి.అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్ళివరకూ తప్పని సరిగా బ్రహ్మచర్యపాలన చెయ్యాలి.మంచి ఆహారం తీసుకుంటూ, యోగాభ్యాసం చెయ్యాలి.అప్పుడు తరువాత పుట్టే తరం పిల్లలు అద్భుతమైన తెలివితేటలు,మంచి ఆరోగ్యం,మంచి ప్రవర్తన,సహజంగానే కలిగిన వారౌతారు. వారికి నీతి నియమాలను తల్లితండ్రులు ప్రత్యేకంగా చెప్పవలసిన పని, నేర్పవలసిన పని ఉండదు. అలాంటి పిల్లలు తల్లిదండ్రులకు సూచనలిచ్చే స్థాయిలో ఉంటారుగాని నేటి యువత లాగా చవకబారు పోకడలతో ఉండరు. ముందుగా మనం సక్రమమైన రీతిలో ఉంటే మన పిల్లలు కూడా సక్రమంగానే ఉంటారని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి.

ఈ మధ్యకాలంలో తిరిగి మన ప్రాచీనవిద్యలైన ఆయుర్వేదం,యోగాభ్యాసాలు పూర్వ వైభవం సంతరించుకునే దిశగా ముందడుగు వెయ్యటం శ్లాఘనీయం.బీ.కే.ఎస్ అయ్యంగార్,బాబా రాందేవ్ మొదలైన యోగా గురువులు ఈ దిశగా చక్కని కృషి చేశారు. ప్రతి ఇంటిలోనూ యోగాభ్యాసం ఒక విప్లవంలా వస్తే తిరిగి ఆరోగ్య,ఆదర్శ భారతదేశాన్ని మనం ఒక పదేళ్లలో చూడవచ్చు.అలా కాకుండా సమాజం ప్రస్తుత ధోరణిలోనే పోతే మాత్రం వినాశనం తప్పదు.