“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, జూన్ 2016, శనివారం

మా అమెరికా యాత్ర - 24 (గాంగెస్ ఆశ్రమంలో మరపురాని రోజులు)ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న గాంగెస్ ప్రయాణం రానే వచ్చింది. ఒకరోజు ఉదయాన్నే అందరం కలసి మూడు కార్లలో సామానంతా లోడు చేసుకుని బయలుదేరాం.అంతకు ముందు రోజే,కావలసిన సరుకులు కొనుక్కోవడం, లాజిస్టిక్స్ అంతా ప్లాన్ చెయ్యడం మొదలైన పనులన్నీ జరిగాయి.

ప్రయాణం దాదాపు మూడు గంటలు ఉంటుంది.కొంచం స్పీడుగా వెళితే రెండున్నర గంటల్లో కూడా వెళ్ళవచ్చు. ప్రయాణమంతా జోకులు,నవ్వులతో ఎంతో సరదాగా గడిచింది.

ఆధ్యాత్మికత అంటే సీరియస్ గా మొఖం పెట్టుకుని మాట్లాడకుండా ముచ్చుల్లా ఉండటం అని చాలామంది అనుకుంటారు.అది వారి అజ్ఞానం.నిజమైన ఆధ్యాత్మికతలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. నిజమైన జ్ఞాని అయినా నిజమైన భక్తుడైనా లేదా నిజమైన యోగి అయినా అతని సమక్షంలో ఏదో తెలియని ఆనందం ప్రవహిస్తూ ఉంటుంది.ఆ ప్రవాహం చుట్టూ ఉన్నవాళ్ళ హృదయాలను కుదిపేస్తూ ఉంటుంది. అదేంటో వాళ్ళకూ అర్ధం కాదు.కానీ ఏదో తెలియని ఆనందాన్ని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు.ఆ సమయంలో మిగతావేవీ గుర్తురావు.కొంచం సెన్సిటివ్ గా ఉన్నవారికి ఇది తేలికగా అనుభవంలోకి వస్తుంది.

నాతో ప్రయాణం ఎప్పుడైనా సరే చాలా సరదాగా ఉంటుంది. మాట్లాడకుండా ఊరకే కూచోవడం నాకస్సలు ఇష్టం ఉండదు.జోకుల మీద జోకులు పేలుతూ ఉంటాయి.ఏం వాగుతున్నామో ఎవరికీ గుర్తుండదు.కానీ - ఏం మాట్లాడినా అది అసలైన ఆధ్యాత్మికత చుట్టూతానే పరిభ్రమిస్తూ ఉంటుంది గాని వేరే చౌకబారు టాపిక్స్ లోకి మళ్ళదు.

అలా సరదాగా మాట్లాడుకుంటూ - మధ్యాన్నం ఒకటిన్నరకు గాంగేస్ చేరుకున్నాం.దారిలో ఉండగానే - ముందు బయల్దేరిన మాధవ్ నుంచి ఫోనొచ్చింది.

'నాన్నా.మేము ఇప్పుడే ఆశ్రమం చేరుకున్నాం. స్వామీజీతో మాట్లాడాం.' అన్నాడు.

'మంచిది మేమూ కాసేపట్లో వచ్చేస్తున్నాం.' అని ఫోన్ పెట్టేశాం.

ఇంతలో - ఆశ్రమంలోకి కావలసిన పాలు మొదలైన కొన్ని వస్తువులు కొనాలన్న సంగతి గుర్తొచ్చింది.దగ్గరలోనే ఉన్న సూపర్ మార్కెట్ కు దారితీసి ఆ షాపింగ్ ముగించాం.అప్పటికే కాలాతీతం అయినందువల్ల, మాధవ్ కి ఫోన్ చేసి, అక్కడ దగ్గరలోనే ఉన్న ఒక రెస్టారెంట్ కు రమ్మనీ, అందరం అక్కడే కలసి భోజనం చేద్దామనీ చెప్పేశాము.

మేం ఆ రెస్టారెంట్ కు చేరి, ఆర్డర్ ఇచ్చి కాసేపు కూచుని మాట్లాడుకుంటూ ఉండేసరికి మిగతావాళ్ళు కూడా వచ్చేశారు.

అందరం అక్కడ తినేసి, ఆశ్రమానికి బయల్దేరాం.

లేక్ మిషిగన్ ఒడ్డున ఉన్న అడవిలో ఈ ఆశ్రమం ఉన్నది.కంట్రీ సైడ్ కావడంతో ఎక్కడా జనసంచారం లేదు.ఎటుచూచినా పచ్చదనం,పెద్ద పెద్ద చెట్లు, నిర్మానుష్యమైన రోడ్లు,పచ్చటి లాన్స్, చల్లని వాతావరణంతో స్వర్గంలా అనిపించింది.

చూస్తుండగానే ఆశ్రమానికి చేరుకున్నాం. మాకోసం సిద్ధంగా ఉన్న రిట్రీట్ హోంలో అడుగుపెట్టి,అక్కడ ఉన్న రూమ్స్ లో లగేజి సర్దుకుని పరిసరాలు గమనించాం.

రోడ్డుకు ఒకవైపున పెద్ద లాన్ మధ్యలో రిట్రీట్ హోం ఉన్నది.రోడ్డుకు అటువైపున మళ్ళీ పెద్ద పెద్ద లాన్స్ వాటి మధ్యలో శ్రీరామకృష్ణుల ఆలయం ఉన్నది.

రిట్రీట్ హోం అనేది రెండు అంతస్తులుగా ఉన్నది.అండర్ గ్రౌండ్ ఒకటి, పైన ఫ్లోర్ ఒకటి.పైన మూడు క్రింద మూడు మొత్తం ఆరు రూములున్నాయి. సిట్టింగ్ ఏరియాలు రెండున్నాయి. రెండు కిచెన్ లు, పైన రెండు క్రింద ఒకటి మొత్తం మూడు వాష్ రూమ్స్ ఉన్నాయి.ఒక పదిమంది కూచోడానికి వీలుగా పెద్ద బాల్కనీ ఒకటి ఉన్నది.అక్కడ కూచుంటే చుట్టూ అడవి కనిపిస్తుంది.

రిట్రీట్ హోం వెనుక ఉన్న అడవికి దగ్గరగా ఒక ఫైర్ ప్లేస్ ఉన్నది. చెట్ల మొద్దులను గుండ్రంగా పాతి మధ్యలో ఒక గుంత త్రవ్వి ఉంచారు.కాలి ఆరిపోయిన చితుకులు అందులో ఉన్నాయి.

అక్కడకు వెళ్లి చూచే సరికి మాధవ్, రాజు అక్కడ చెట్లక్రింద ధ్యానంలో కూచుని కనిపించారు.

(ఇంకా ఉంది)