“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, జూన్ 2016, ఆదివారం

మా అమెరికా యాత్ర - 25 (గాంగెస్ ఆశ్రమంలో మరపురాని రోజులు)




















సరే వాళ్ళను డిస్టర్బ్ చెయ్యడం ఎందుకని, ఈలోపల మేం వెళ్లి శ్రీరామకృష్ణుల ఆలయం ఎలా ఉందొ దర్శించి వద్దామని బయలుదేరాం.

బేలూర్ మఠంలో వలెనే ఆలయం పొడుగ్గా ఉంది.లోపల అడుగు పెడుతూనే మొదట ఒక చిన్న గదిలా వస్తుంది.ఆ గది మొదట్లోనే గోడకు శ్రీచక్రం ఒకటి అమర్చబడి కనిపించింది. ఆశ్చర్యంగా దానిని గమనిస్తూ తర్వాత పెద్ద హాల్ లోకి అడుగు పెట్టాము.ఆ హాల్లోనే బీరువాలలో రకరకాల మతాలవీ,రకరకాల మహానుభావులవీ పుస్తకాలు ఉన్నాయి. అంటే ఆ హాల్ ఒక లైబ్రరీ కం ప్రేయర్ హాల్ కం మీటింగ్ హాల్ గా ఉపయోగపడుతుందన్నమాట.మేం వెళ్ళింది శుక్రవారం నాడు అయితే,ఆదివారం నాడు ఆ హాల్ లోనే నేను 'శ్రీవిద్య' పైన ఉపన్యాసం ఇచ్చాను.

ఇంకా లోపలకు వెళితే అక్కడ దేవాలయం ఉన్నది.అల్టార్ మీద గోడకు బాగా పై ఎత్తులో శ్రీరామకృష్ణుల ఫోటో ఒకటి ఉన్నది.దాని క్రింద శారదామాత నిలువెత్తు ఫోటో ఒకటి అమర్చబడి ఉన్నది.మాత ఫోటోలలో ఇలాంటి ఫోటోను సామాన్యంగా మనం చూడము. సమాధిస్థితిలో ఉండి,తన ముఖంలో ఎంతో దయను వెదజల్లుతూ, అజ్ఞానంలో కొట్టుకుంటున్న ఈ లోకవాసులను ఎంతో కరుణాపూరితంగా చూస్తున్నట్లుగా ఆ ఫోటో ఉంటుంది.

ఇంకా విచిత్రం ఏమంటే, శ్రీ రామకృష్ణుల ఫోటో కంటే ఇంకా పైకి చూస్తే అక్కడ ఒక స్టెయిండ్ గ్లాస్ మీద పెద్ద శ్రీచక్రం ముద్రించబడి ఉన్నది.అన్ని వేలమైళ్ళ దూరంలో అమెరికాలోని మారుమూలలోని ఆ దేవాలయంలో శ్రీచక్రం ఉండటం చాలా విచిత్రం అనిపించింది.

అల్టార్ కు ఇరువైపులా,శారదామఠం మొదటి ప్రెసిడెంట్ మాతాజీ, మరియూ శారదామాతకు పరిచారికా అయిన ప్రవ్రాజిక భారతీప్రాణగారి ఫోటో ఒకటి, శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యురాలైన గౌరీమా ఫోటో ఒకటి, ఇంకా మేరీ మాత/జీసస్, బుద్ధుడు, మొదలైన మహనీయుల ఫోటోలు అమర్చబడి ఉన్నాయి.

ఒక మూలగా రాళ్ళతో ఒక చిన్న కొలను లాగా నిర్మించారు. అందులోకి నీరు పారుతూ వచ్చి బయటకు వెళుతూ గలగల ధ్వనులను చేస్తూ ఉంటుంది.ఆ నిశ్శబ్దంలో ఆ గలగల ధ్వని వినడమే ఒక ధ్యానంగా ఉన్నది.

అందరం అక్కడ కాసేపు కూచుని అమ్మను ప్రార్దించాం. శారదామాత వైపు చూస్తూ ప్రార్ధిస్తూ ఉంటే అందరికీ కళ్ళలోంచి నీళ్ళు ధారలుగా కారిపోయాయి.ఆ ప్రదేశంలో మహత్తరమైన శక్తి తరంగాలు ఉన్నట్లు నాకు వెంటనే అనుభవంలోకి వచ్చింది.

శ్రీ రామకృష్ణులు, శారదామాత, గౌరీమా ల చితాభస్మం అక్కడ నిక్షిప్తమై ఉన్నదని నాకు తెలుసు.ఆ శక్తి తరంగాలు దాని ప్రభావమే అని నాకు అర్ధమైంది.కానీ ఆ తర్వాత గౌరీమా (ప్రస్తుతం ఆ ఆశ్రమానికి ప్రెసిడెంట్ మాతాజీ) కధ విన్నతర్వాత ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకత గురించిన మిగతా విషయాలు చాలా అర్ధమయ్యాయి.

అక్కడ హాల్లోనే శ్రీ రామకృష్ణ మఠం అధ్యక్షుల ఫోటోలు మొదటి వారైన శ్రీమత్ బ్రహ్మానందస్వామి దగ్గరనుంచీ నుంచీ ఇప్పటి శ్రీమత్ ఆత్మస్థానందస్వామి వరకూ ఉన్నాయి.వారిలో అస్మద్గురువర్యులైన శ్రీమత్ గంభీరానందస్వాముల వారిని అందరికీ చూపించాను.

అక్కడ అల్టార్ క్రిందుగా అమృతానందమయీ మా ఫోటో కూడా ఒకటి కనిపించింది.ఆమె ఫోటో అక్కడ ఉండటం ఆశ్చర్యం అనిపించినా దానికి ఏదో కారణం ఉంటుందిలే అని ఊరుకున్నాను.

ఆ తర్వాత, ఆలయం వెనుక ఉన్న ఒక చిన్నకుటీరం వంటి కట్టడం వద్దకు దారి తీశాం.అక్కడ కూడా చితాభస్మం నిక్షిప్తమై ఉన్నదని మాకు చెప్పారు.ఆ కుటీరానికి చైనీస్ బెల్స్ కట్టబడి ఉన్నాయి.ఆ నిశ్శబ్ద వాతావరణంలో గాలికి ఆ బెల్స్ మ్రోగుతూ చాలా అద్భుతమైన స్పందనలను రేకెత్తిస్తున్నాయి.ఆ కుటీరానికి చెక్కతోనో ఏదో మెటల్ తోనో చేసిన "ఓం" అక్షరం తాపడం చెయ్యబడి ఉన్నది.

అక్కడ కాసేపు నిలబడి శ్రీరామకృష్ణులను, శారదామాతను, స్మరించి ప్రార్ధించి తిరిగి రిట్రీట్ హోం కు వచ్చేశాము.

రిట్రీట్ హోం కు వచ్చేసరికి మాధవ్ వాళ్ళు ధ్యానం ముగించి లేచి లోపలకు వచ్చి ఉన్నారు.

'ఏంటి నాన్నా ! అలా చెట్లక్రింద కూచున్నారు ధ్యానానికి?' అని మాధవ్ ను అడిగాను.

'ఇక్కడ వాతావరణంలో ఏదో ఉంది నాన్నా. ఈ ప్లేస్ కు వస్తూనే ఆటోమేటిక్ గా ధ్యాన స్థితి వచ్చేసింది.అలా ఆ చెట్టు క్రింద కూచుని ధ్యానం లోకి వెళ్ళిపోయాను.' అని తను చెప్పాడు.

నాలుగేళ్ల క్రితం తనకు కలకత్తా దక్షిణేశ్వర్ కాళికాలయంలో దీక్షనిచ్చాను.అప్పటినుంచీ తను సాధన చేస్తున్నాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా ఇప్పటికీ మానకుండా తన సాధన చేస్తూనే ఉంటాడు.

ఈ రిట్రీట్ లో ఎక్కువగా ఆధ్యాత్మికలాభాన్ని పొందిన అతి కొద్దిమందిలో మా అబ్బాయి మాధవ్ ఒకడు. తనకు కలిగిన అనుభవాలను ముందు ముందు పోస్ట్ లలో వ్రాస్తాను. 

(ఇంకా ఉంది)