“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, జూన్ 2016, శనివారం

మా అమెరికా యాత్ర -16 (వివేకానందస్వామి పాదాలు సోకిన Freer House)

మేము డెట్రాయిట్ లో అడుగు మోపిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజున ఆనంద్ ఫోన్లో కొచ్చారు.

'వచ్చే సోమవారం మధ్యాన్నం మూడు గంటలకు ఫ్రీర్ హౌస్ లో అపాయింట్ మెంట్ తీసుకున్నాను.మనమందరం అక్కడకు వెళుతున్నాం.' అన్నారు.

'ఏమిటి ఆ హౌస్ ప్రత్యేకత?' - అడిగాను.

'1893 లో వివేకానందస్వామి అక్కడకు వచ్చారు.ఆ ఇంటిని చూడ్డానికి మనం వెళుతున్నాం.' అన్నారు ఆనంద్.

'సరే.మేం ఇటునుంచి వచ్చేస్తాం.మీరు సరాసరి కేంటన్ నుంచి అటు వచ్చేయండి.' అన్నాను.

అనుకున్నట్లుగానే ఆరోజున మధ్యాన్నం మూడుకల్లా డెట్రాయిట్ డౌన్ టౌన్ లో ఉన్న 'ఫ్రీర్ హౌస్' కు అందరం చేరుకున్నాం.

అప్పటికే ఆ సంస్థ నుంచి ఒక అమెరికన్ మాకోసం ఎదురు చూస్తున్నాడు.మమ్మలనందరినీ సాదరంగా ఆహ్వానించి ఆ ఇల్లంతా చూపించాడు.

నన్ను అతనికి పరిచయం చేస్తూ ఆనంద్ - 'ఈయన మా గురువు గారు.వివేకానందస్వామి అంటే ఈయన అన్నీ మర్చిపోతాడు' అని చెప్పాడు.ఆ అమెరికన్ ఒక విధమైన ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వుతో మమ్మల్ని గమనించాడు.

అది చాలా పెద్ద ఇల్లు. అది Charles Lang Freer అనే ఒక బిజినెస్ మ్యాన్ కు చెందినది.1893 ప్రాంతాలలో అతనక్కడ ఒక సక్సెస్ ఫుల్ వ్యాపారస్తుడు.మంచి ధనికుడు కావడంతో బాటు, కళాతృష్ణ కూడా ఉన్నవాడు కావడంతో, అనేక దేశాలనుంచి శిల్పాలు పెయింటింగ్స్ సేకరిస్తూ ఉండేవాడు.తన ఇంటిని ఒక ఆర్ట్ గ్యాలరీగా మార్చాడు.

వివేకానందస్వామి డెట్రాయిట్ కు వచ్చినపుడు ఈయనకు అతిధిగా ఉన్నాడు.ఇదే ఇంట్లోనే ఒక డైనింగ్ హాల్ ఉన్నది. అందులో ఒక పెద్ద డైనింగ్ టేబుల్ వేసి ఉన్నది. అక్కడే వివేకానంద స్వామి భోజనం చేసి ఉండవచ్చునని ఆ అమెరికన్ అన్నాడు.అప్పట్లో ఆయన టీ త్రాగిన పింగాణీ కప్పుల సెట్టు కూడా ఆ ఇంటిలో భద్రపరుచ బడి ఉన్నది.

మనమసలే ఎమోషనల్ కావడంతో - ఆ డైనింగ్ టేబుల్ చూడటంతోనే వివేకానందస్వామితో బాటు ఆయన పడిన కష్టాలూ,ఎవరి సాయమూ లేకుండా ఒక్కడే మనదేశం నుంచి అంత దూరం వచ్చి మన ధర్మాన్ని ప్రచారం చేసిన ఘట్టాలూ అవీ గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.

'నిన్ను గుర్తుంచుకోని దేశం కోసం, ఆ దేశపు ప్రజలకోసం ఎంత చేశావయ్యా మహానుభావా?' అని మనసులో అనుకున్నాను. 

ఎంతో గౌరవంగా ప్రేమగా సుతారంగా ఆ డైనింగ్ టేబుల్ ను తాకాను.స్వామి చేతిని తాకినట్లే అనిపించింది.

స్వామి అక్కడ ఉన్న రోజులలో, ఆ నగరంలో అప్పుడున్న క్రైస్తవ బోధకులనూ ఫాదర్లనూ అందరినీ తన ఇంటికి ఒక పార్టీకి ఆహ్వానించాడు చార్లెస్ ఫ్రీర్. ఆ ఫాదర్లకు వివేకానందస్వామి అంటే పడదు.ఏదో బానిస దేశం నుంచి ఎవరో ఒక విచిత్రమైన వ్యక్తి వచ్చి నాగరికులమైన మనకేంటి మతం గురించి చెప్పేది? అని వాళ్ళు నిర్లక్ష్యంతో అహంకారంతో ఆ పార్టీకి వచ్చారు. స్వామినీ మన మతాన్నీ విమర్శిద్దామని అనుకున్నారు.కానీ స్వామితో కొంచంసేపు మాట్లాడే సరికి స్వామి ఎంతటి మేధావో ఎంతటి జ్ఞాన సంపన్నుడో వారికి అర్ధమైంది.ఆయన దగ్గర నుంచి తాము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని వారికి తేలికగా అర్ధమైంది.ఆయన జ్ఞానసంపద ముందు తామెంత అల్పులమో అర్ధమైంది.ఆ విధంగా తాను కలసిన అందరి అభిమానాన్నీ గౌరవాన్నీ స్వామి 150 ఏళ్ళ క్రితమే పొందాడు.

శ్రీరామకృష్ణుల అనుగ్రహానికి ఎంతగా పాత్రుడయ్యాడో కదా స్వామి? -  అనిపించింది.

మనవాళ్ళతో ఇలా చెప్పాను.

'స్వామి అమెరికాలో ఎక్కడకు వెళ్ళినా అక్కడ సమాజంలో ఉన్న మేధావులూ,విశాల హృదయులూ, మోడరన్ తింకర్సూ ఆయన చుట్టూ చేరేవారు.ఈ విధంగా స్వామికి కలుగుతున్న పేరు ప్రఖ్యాతులు చూచి ఓర్వలేక క్రైస్తవ మిషనరీలు ఆయన్ను చంపాలని ప్లాన్ వేశారు.ఒకరోజున ఒక పార్టీకి ఆయన్ను ఆహ్వానించారు.ఒక కూల్ డ్రింక్ లో విషం కలిపి స్వామికి అందించారు.అది తెలియని స్వామి, ఆ డ్రింకును తాగాలని గ్లాసును చేతిలోకి తీసుకున్నాడు.అదే క్షణంలో తన ఎదురుగా శ్రీరామకృష్ణులు ప్రత్యక్షం అయి నిలుచోవడం స్వామి గమనించి ఆశ్చర్యపోయాడు.నోటి దగ్గరకు వచ్చిన ఆ గ్లాసును రామకృష్ణులు పట్టుకుని ఆపేశారు.ఆ డ్రింకును త్రాగవద్దని అడ్డంగా తలఊపి మాయమయ్యారు.ఆ దృశ్యాన్ని చూచిన స్వామి, నోటి దగ్గర పెట్టుకున్న ఆ గ్లాసును తిరిగి టేబుల్ మీద ఉంచాడు.ఆ పార్టీలో ఏమీ తినకుండా త్రాగకుండా ఉండి తిరిగి వెనక్కు వచ్చేశాడు.ఆ విధంగా స్వామిని చంపాలని మిషనరీలు చేసిన ప్రయత్నం శ్రీరామకృష్ణానుగ్రహంతో విఫలం అయింది.స్వామి జీవితంలో జరిగిన నమ్మలేని నిజాలలో ఇదొకటి." 

వింటున్న మనవాళ్ళు ఆశ్చర్యంగా చూచారు.

చాలాసేపు ఆ ఇల్లంతా తిప్పి అన్నీ చూపించాడు ఆ అమెరికన్. అప్పట్లో ఈ ఇల్లు ఒక ఆర్ట్ గ్యాలరీగా ఉండేది.ఇప్పుడు కూడా ఒక పెద్ద పెయింటింగ్ ఆ ఇంటిలో ఉన్నది.ఒకమ్మాయి ఇద్దరు పిల్లలతో ఒక లాన్లో నడచి వస్తున్నట్లుగా ఆ పెయింటింగ్ ఉంటుంది.ఆ పెయింటింగ్ లో నాలుగు సీజన్స్ వచ్చేలాగ చిత్రించాడు పెయింటర్.ఆ పెయింటింగ్ ను కావాలని దగ్గరుండి చార్లెస్ ఫ్రీర్ వేయించాడని మా గైడ్ అమెరికన్ చెప్పాడు.నిజంగానే ఒకమ్మాయీ,ఇద్దరు పిల్లలూ గోడమీద నిలబడి మనల్ని చూస్తున్నట్లు మంచి జీవకళగా ఆ పెయింటింగ్ ఉన్నది.అదేమాట అతనితో అన్నాను. అవునన్నట్లుగా నవ్వాడతను.

చార్లెస్ లాంగ్ ఫ్రీర్ అనేవాడు తన తర్వాత ఆ ఇంటిని Smithsonian Institution Washington కు దానంగా ఇచ్చేశాడు. ప్రస్తుతం ఆ ఇల్లు వేన్ యూనివర్సిటీ అధ్వర్యంలో Merril Palmer Skillman Institute of Child & Family Development అనే సంస్థగా నడుస్తున్నది.

వివేకానంద స్వామి తనను కలసిన తర్వాత చార్లెస్ ఫ్రీర్ మన దేశంపైన ప్రేమ పెంచుకుని జైపూర్ కు వచ్చి కొన్నాళ్ళు ఉన్నాడు.జైపూర్ గురించి అతను వ్రాస్తూ  ఇలా అంటాడు.

"మొదటి చూపులోనే ఇండియాతో నేను ప్రేమలో పడ్డాను.ఈ నగరం (జైపూర్ సిటీ) చాలా అద్భుతంగా ఉన్నది.ఒక నూరు అద్భుతాలను చూడకుండా ఇక్కడ ఏ పక్కకూ తల తిప్పడం సాధ్యం కావడం లేదు."

ఆ తర్వాత అతను చైనా జపాన్ మొదలైన అనేక ఆసియా దేశాలు తిరిగి అనేక పెయింటింగ్స్, కళా ఖండాలు సేకరించాడు.ముఖ్యంగా జపాన్ సంస్కృతితో బాగా ప్రభావితుడైన ఇతను తన ఇంటిలో కూడా జపాన్ కళాత్మక వస్తువులను వాడేవాడు.ఇప్పుడు కూడా ఈ ఇంటి ఆవరణలో ఉన్న ఒక చెట్టును జపాన్ నుంచి తెచ్చి నాటాడు.ఆ చెట్టును ఇప్పటికీ అక్కడ మనం చూడవచ్చు.

ఆ ఇంటిలో ఉన్న ఆ కాలం నాటి ఫోటోలు చూస్తే - అప్పట్లో ఆ ప్రాంతమంతా ఖాళీగా ఉన్నది.ఎక్కడా ఇళ్ళు లేవు.ఈ ఇల్లు కడుతున్నపుడు తీసిన ఫోటోలు కొన్ని ఉన్నాయి.అప్పుడు ఎడారిలా ఉన్నా,ప్రస్తుతం మాత్రం డెట్రాయిట్ సిటీకి మధ్యభాగంగా మారింది.

వివేకానంద స్వామి అక్కడకు వచ్చిన సందర్భంలోని న్యూస్ కవరేజ్ కూడా వాళ్ళు భద్రంగా ఉంచారు.ఆనాటి ప్రెస్ వాళ్ళు Vive-Kananda అని ఆయన పేరును విడదీసి Kananda అని పేపర్లో సంబోధిస్తూ వ్రాశారు.ఆ విషయాన్ని ఆ అమెరికన్ చెబుతూ -'స్వామి పేరును సరిగ్గా పలకలేక పోయినందుకు మా వారి తరఫున నా క్షమాపణలు' అన్నాడు.వారి మర్యాదకు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.

'ఏం పరవాలేదు.మేమేమీ అనుకోవడం లేదు.మేము మీరు మాట్లాడినట్లుగా అదే యాసతో ఇంగ్లీషు ఎలాగైతే మాట్లాడలేమో, అలాగే మీరూ మా పదాలను సరిగా పలకలేరు.ఇది సహజమే.మీరు దానికి క్షమాపణ చెప్పవలసిన పని లేదు.' అని నేనన్నాను.

అతనితో నేనింకా ఇలా అన్నాను - ' For you this might be a historical house and an art gallery. For us, this is a sacred place, because it was sanctified with the touch of Swami Vivekananda's feet'.

అతనికి ఇదంతా వింతగా ఉన్నట్లుంది.మావైపు అదొక రకంగా చూచాడు.

వివేకానందస్వామి అమెరికాలో ఎక్కడెక్కడ సంచరించారో ఆయా వివరాలు ఎక్కువగా లేవని ఆయనన్నాడు.అలా కాదని, ఈ విషయం పైన రీసెర్చి చాలా జరిగిందనీ నేనంటూ Marie Louis Burke వ్రాసిన Swami Vivekananda's second visit to the west - New discoveries అనే పుస్తకం ఉన్నదనీ దానిని చదవమనీ అతనికి సూచించాను.అతను చాలా ఇంప్రెస్ అయినట్లు కనిపించాడు. గెస్ట్ బుక్ తెచ్చి అందులో మమ్మల్ని సంతకాలు చెయ్యమని అడిగాడు.

చాలాసేపు ఆ ఇల్లంతా తిరిగి చూచి, ఆ తర్వాత ఇంటి ముందు నిలబడి ఫోటోలు దిగి, అక్కడనుంచి బయలుదేరి మళ్ళీ మేముంటున్న ఆబర్న్ హిల్స్ ప్రాంతానికి చేరుకున్నాము.

"వివేకానందస్వామి వచ్చిన ఇంటికి మనం కూడా వచ్చాము. ఆయన భోజనం చేసిన డైనింగ్ టేబుల్ చూచాము.దానిని తాకాము.ఇంతకంటే ఇంకేం కావాలి?" అనుకుంటూ ఆ రోజంతా ఒకవిధమైన ఆనందంలో గడచింది.















 



 
 




   
   
(ఇంకా ఉంది)