“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, జూన్ 2016, బుధవారం

సూక్ష్మంలో మోక్షం

చాలామంది ఏమనుకుంటారంటే మోక్షం అనేది చాలా తేలికగా వస్తుందని భావిస్తారు.అదేదో విలువ లేని పదార్ధమని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రావడానికి సిద్ధంగా వేచి చూస్తోందని అనుకుంటారు.మనం అన్ని పనులూ చేసుకుని జీవితంలో అనుభవించవలసినవి అన్నీ అనుభవించేసి ఆ తర్వాత దానివైపు తిరిగి -'సరే.ఇప్పుడు నువ్వు రా' అని పిలిస్తే వెంటనే వచ్చి మన ఒళ్లో కూచుంటుందని భ్రమ పడుతూ ఉంటారు.

మోక్షం అంత తేలికగా ఏమీ రాదు.

ప్రపంచంలోని అన్ని గోల్స్ కంటే అదే అతి కష్టమైన గోల్.దానిముందు ఇంక ఏదైనా తేలికే. మోక్షం అనేది అంత కష్టమైనది.

ఇంకొంతమంది ఊరకే ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టడమే మోక్షం అనుకుంటారు.ఇదొక పెద్ద భ్రమ. మాటలవల్లా, ప్రశ్నలు అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవడం వల్లా మోక్షం ఎన్నటికీ రాదు.

అదొక రహస్యమైన నడక ద్వారా మాత్రమే వస్తుంది.అదొక అంతరిక సాధన ద్వారా మాత్రమే వస్తుంది.తనను తాను ఎంతో మార్చుకుంటూ నిరంతరం మున్ముందుకు నడవడం వల్లనే ఎప్పటికో అది వస్తుంది.అంతేగాని - ఊరకే కబుర్లు చెప్పుకుంటూ కాకరకాయలు తరుక్కుంటూ కూచుంటే ఎప్పటికీ ఏమీ కాదు. ఏమీ రాదు.

నువ్వు నువ్వుగానే ఉంటావు.అది అదిగానే ఉంటుంది.ఈలోపల చావు వచ్చి నిన్ను ఎత్తుకుపోతుంది. ఇదే జరిగేది.

ఈ విధంగా ఊరకే ప్రశ్నలమీద ప్రశ్నలు అడిగేవాళ్ళు నా శిష్యులలో కూడా చాలామంది ఉన్నారు. అడిగి ఎంతో తెలుసుకుంటారు.కానీ, తెలుసుకున్న దానిలో ఆవగింజంత కూడా సాధనలో పెట్టరు.

అలాంటి హరికధా కాలక్షేప శిష్యుల లాంటి వారే నా పరిచయస్తులలో ఫ్రెండ్స్ లో కూడా చాలామంది ఉన్నారు. అలాంటి ఒక ఫ్రెండ్ ఇంటికి ఈ మధ్యనే ఏదో పనిమీద వెళ్లాను.

అక్కడ కూచుని ఉండగా ఈ సంభాషణ నడిచింది.

'చాలా సంతోషంరా ! గురువువై పోయావు. శిష్యులు పోగౌతున్నారు. అంతా బాగుంది గాని, నాదొక్క చిన్న సందేహం. తీరుస్తావా? ' అడిగాడు ఎగతాళిగా.

'ఓహో ! ఇదేదో పౌర్ణమి ఎఫెక్ట్ లా ఉందే?' అనుకుంటూ ' సరే అడుగు' అన్నా వాడి శ్రీమతి అందించిన టీ త్రాగుతూ.

'మోక్షానికి ఈజీ మెథడ్ ఏమన్నా ఉన్నదా?' అడిగాడు నవ్వుతూ.

ఇదొక దౌర్భాగ్యం ! 

ప్రతిదాన్నీ కష్టపడకుండా తేలికగా తేరగా చేజిక్కించుకోవడం అలవాటైపోయి, చివరకు మోక్షాన్ని కూడా తేలికగా ఎలా పొందాలా అని వక్రబుద్ధితో ఆలోచన చేస్తుంటారు ఇలాంటి సోమరిపోతులు.

'ఉంది.ఇంట్లోంచి బయటకు పారిపోవడమే' అన్నాను వంటింట్లోంచి వాళ్ళ శ్రీమతి విన్నదేమోనని భయంగా లోపలి చూస్తూ.

గొల్లుమని నవ్వేశాడు వాడు.

'అది కుదరకేగా ఈ జంఝాటం అంతా? ఇరుక్కుపోయాం. ఇంకెక్కడికి పొయ్యేది? సరేగాని జోకులాపి సమాధానం కరెక్ట్ గా చెప్పు' అడిగాడు.

'ఉందిరా.దానినే 'సూక్ష్మంలో మోక్షం' అంటారు.' అన్నాను నేనూ సీరియస్ గా.

'అదెలా?' అడిగాడు.

'చాలా తేలిక.నీకెదురైన ప్రతిదానినీ సూక్ష్మంగా చూడు.మోక్షం అదే వస్తుంది' అన్నాను.

'సూక్ష్మంగా చూడడం అంటే ఏమిటి?' అన్నాడు.

'నువ్వు పెట్టుకున్న కల్లద్దాలు తీసేసి చూడు' అన్నా,

'కల్లద్దాలా కళ్ళద్డాలా? నేను సరిగ్గా విన్నానా? లేక నువ్వు కావాలని అలా పలికావా?' అడిగాడు.

'రెండూ ఒకటే.కళ్ళద్దాలే కల్లద్దాలు' అన్నాను నవ్వుతూ.

కాసేపు ఆలోచించి -' చాలా కష్టం ' అన్నాడు.

'తేలికని నేను చెప్పలేదుగా? పైగా - కష్టానికి భయపడేవాడికి మోక్షం ఎన్నటికీ రాదు.వాడు ఇలా రకరకాల యోనులలో జన్మలెత్తుతూ ఉండవలసిందే.' అన్నాను.

'అసలెందుకిదంతా? ఈ జన్మలు ఈ బాధలు ఏమీ లేకుండా హాయిగా ఉండవచ్చుగా?'- అడిగాడు.

'గోడపెట్టు చెంపదెబ్బ' అన్నాను.

'అదేంటి?' అన్నాడు.

'నువ్వేగా 'సూక్ష్మంలో మోక్షం' కావాలన్నావు? అందుకే సామెతల రూపంలో సూక్ష్మంగా చెబుతున్నాను.' అన్నాను.

'అర్ధం కాలేదు.కొంచం వివరించి చెప్పండి సార్' బ్రతిమాలుతున్నట్లుగా ఎగతాళిగా అడిగాడు.

'నువ్వు చేసిన కర్మ గోడపెట్టు,నీ కర్మకు వచ్చే ప్రతికర్మ చెంపదెబ్బ.మనిషి జీవితం ఇంతే.ఇంతకంటే ఏమీ లేదు.' చెప్పాను.

కాసేపు ఆలోచించాడు.

'అర్ధం కాలేదు.కాస్త వివరించు.' అడిగాడు.

'మీ భార్యాభర్తలకు ఎప్పుడైనా గొడవలు అవుతాయా?' అడిగాను.

'భలే అడిగావ్. అసలయ్యేవే గొడవలు.ఈ మధ్యలో సక్రమంగా మాట్లాడుకుని కొన్ని ఏళ్ళయ్యాయి.ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఒకటి రెండేళ్ళు మామూలుగా ఉన్నాం.ఇప్పుడు ఇద్దరం శత్రువులం ఒకే ఇంట్లో ఉంటున్నాం.అంతే! సరేగాని నువ్వు చెప్పు' అన్నాడు టీ సిప్ చేస్తూ.

'సరే చెప్తా విను. మీ ఇద్దరికీ గొడవౌతుంది.నువ్వు కోపం వచ్చి గ్లాస్ విసిరేస్తావు.మీ ఆవిడేమో కంచం విసిరేస్తుంది.నువ్వు కోపంగా బయటకు వెళ్లి సినిమాకు పోతావు.మీ ఆవిడ ఇంటికి తాళం వేసుకుని షాపింగ్ కు వెళ్లి ఒక ఏభై వేలు తగలేసి అవసరం లేని వస్తువులన్నీ తెచ్చి ఇంట్లో కుప్ప పోస్తుంది.నీకు కోపం నషాళానికి అంటి చెయ్యెత్తుతావు.మీ ఆవిడ నీమీద డొమెస్టిక్ వయొలెన్స్ కేసు పెడుతుంది.నువ్వు జైలుకెళతావు. మళ్ళీ మీ ఆవిడే నీకు బెయిల్ ఇచ్చి విడిపిస్తుంది.ఈ లోపల పోలీసులకు బాగా వదుల్తుంది.కర్మ సిద్ధాంతం అన్నా, గోడపెట్టు చెంపదెబ్బ అన్నా ఇంతే.' అన్నాను నవ్వుతూ.

టీ త్రాగుతూ చాలాసేపు ఆలోచించాడు.

నేనూ మౌనంగానే ఉన్నాను.

'అసలు మనం చేస్తున్నదేమిటి జీవితంలో?' అడిగాడు.

'రామాయణంలో పిడకలవేట' చెప్పాను.

'మళ్ళీ అర్ధం కాలేదు.కొంచం వివరంగా చెప్పు' అన్నాడు.

'నువ్వు రామాయణం చదువుతున్నావు.అసలు కధను మానేసి దాంట్లో 'పిడకలవేట' అనే పిట్టకధ మీదే ఎక్కువగా దృష్టి సారిస్తున్నావు. అలాగే - ఈ ప్రపంచంలోకి నువ్వెందుకు వచ్చావు? అన్న విషయం పట్టించుకోకుండా - "ఎంజాయ్ మెంట్" అని ఒక ఎండమావి వెంట పరిగెట్టుతున్నావు.అదే పిడకలవేట. ఆ పిడకల వేటలో నువ్వు ఉన్నంతవరకూ నీకు పీడకలలు తప్పవు. రాముడూ నీకు దక్కడు' చెప్పాను.

'లేదు బాస్. నాకు ఎంజాయ్ మెంట్ మీద పెద్దగా మోజు లేదు. ఏదో నేను నా సంసారం, నా పెళ్ళాం పిల్లలు,నా ఆస్తిపాస్తులు, నా బేంక్ బేలెన్స్,నా ఫ్రెండ్స్, నా గొడవ, ఇంతే నా జీవితం' అన్నాడు.

'అబ్బా.ఎంత తేలిగ్గా చెప్పావు నాయనా. ఇవి కాక ఇంకేం కావాలి నీకు? ఏ రాయైతేనేం తలకాయ పగలడానికి?" అన్నాను నవ్వుతూ

'అదేంటి మళ్ళీ?' అన్నాడు.

'అవును.ఒకడు గర్భగుడిలో కాలుజారి శివలింగం మీద పడ్డాడు.తల లింగానికి కొట్టుకుంది.తల పగిలి చచ్చాడు.పాపం కొట్టుకుంది శివలింగం కదా పోనీలే అని చావు దయ తలచదు.ఇంకొకడు రోడ్డు మీద పోతూ యాక్సిడెంట్ అయి, ఏదో ఒక రాయికి తల కొట్టుకుని చనిపోయాడు.

తగిలింది శివలింగమైనా, లేక బండరాయైనా, ఫలితం మాత్రం ఒకటే.అలాగే, నువ్వు ఏ విధంగా సంసారంలో ఇరుక్కున్నా ఇరుక్కునేది నువ్వే.ఇందులో ఏమీ తేడా ఉండదు.' అన్నాను.

'మరి ఇందులోనుంచి మార్గం ఏమీ లేదా? అడిగాడు.

'ఉంది.లేకేం? అడగందే అమ్మైనా పెట్టదు' అన్నాను.

'ఇదేంటి? ఇందులో ఇదొకటా మళ్ళీ?' అడిగాడు.

'అవును.ఈ లోకంలో నీకు తెలుసు కదా.అడగందే ఎవరూ ఏదీ ఇవ్వరు.కొంతమందైతే ఎన్నిసార్లు అడిగినా ఇవ్వరు.ఆధ్యాత్మిక మార్గంలో అయితే ఇది మరీ ఘోరంగా ఉంటుంది.అక్కడ అరిచి 'గీ' పెట్టుకుని సోష వచ్చి పడిపోతేగాని అమ్మ పలకదు. ఊరకే పైపైన వేషాలు వేస్తుంటే అక్కడ నీ ముఖం ఎవరు చూస్తారు?' చెప్పాను.

'మరిప్పుడేం చెయ్యాలి నేను?' అడిగాడు.

'గురువులేని విద్య గుడ్డివిద్య' అన్నాను.

'ఇదొక్కటి మాత్రం బాగా అర్ధమైంది.నువ్వు వివరించ నక్కరలేదు.నీ గురువును నువ్వు వెదుక్కో అని చెబుతున్నావు. అంతేగా?' అన్నాడు.

నేను జవాబివ్వలేదు.మౌనంగా నవ్వాను.

'ఆ గురువును గుర్తించడం ఎలా? అతను ఎక్కడ దొరుకుతాడు' అడిగాడు.

'గురువు దొరకడు.కొనుక్కోవాలి.' చెప్పాను.

'కొనుక్కోవాలా? అదేంటి?' అడిగాడు అయోమయంగా.

'అవును.నీ ఆస్తి అంతా అమ్మి,నువ్వొక బికారిగా మారి,ఆ డబ్బుతో అతన్ని కొనుక్కోవాలి.' చెప్పాను.

కాస్త విచిత్రంగా నావైపు చూచాడు.

'ఆస్తంతా అమ్మి కొనుక్కోవాలా? అదేంటి?' అన్నాడు.

'అదంతే.అప్పటికైనా అతను అమ్ముడు పోతాడో పోడో చెప్పడం కష్టమే.' అన్నాను.

ఏమనుకున్నాడో ఏమో ఇక ఆ ప్రశ్నను పొడిగించలేదు.

కాసేపాగి - 'అసలు అతనే సద్గురువని ఎలా గ్రహించడం?' అడిగాడు.

'దీనికి మాత్రం సూటిగా జవాబిస్తాను.విను.

సద్గురువు అనేవాడు అసలు మాట్లాడడు.మౌనంగా బోధించేవాడు సద్గురువు.

ఒకటే ధోరణిగా మాట్లాడేవాడు నాసిరకపు గురువు.

నాలాగా కాసేపు మాట్లాడి, కాసేపు మాట్లాడకుండా, కాసేపు పిచ్చిపిచ్చిగా ఏదేదో వాగుతూ నానా హింసా పెట్టేవాడు అసలు గురువే కాడు.' అన్నాను.

'మళ్ళీ అర్ధం కాలేదు' అన్నాడు.

'ఇప్పటికే చాలా చెప్పానుగాని చివరగా ఒక్కటి చెప్పి ముగిస్తా' అన్నా.

'చెప్పు' అన్నాడు.

'అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.ఈ సామెత తేలిగ్గానే నీకు అర్ధమౌతుంది.నువ్వు అడుగుతున్నావు.నేను చెబుతున్నాను. నీకు నేను లోకువ.అందుకని - నీకు చెప్పడం నావల్లకాదు.నీ సందేహాలకు అంతూపొంతూ ఉండదు.ఎన్ని ఏళ్ళైనా ఇలా అడుగుతూనే ఉంటావుగాని ఏమీ సాధన చెయ్యవు. సాధనామార్గంలోకి అసలు అడుగు పెట్టవు.నీకు చెప్పడం నాకు టైం వేస్ట్.అందుకని,నన్నొదిలేసి నీకు తోచిన నకిలీగాడిని నువ్వే గురువుగా ఎంచుకుని అఘోరించు' అన్నా.

'చివరగా ఒక్కమాటలో చెప్పు సూక్ష్మంలో మోక్షం ఎలా వస్తుందో?' అడిగాడు.

'మూసుకోని నీ పని నువ్వు చూసుకో' - అన్నా.

'అదేంటి?' అన్నాడు మళ్ళీ అయోమయం మొహం పెట్టి.

'దీన్ని వివరించి చెప్పడం నా వల్లకాదు గాని, నాకు వేరే పనులు చాలా ఉన్నై. వస్తా.' అంటూ లేచి వచ్చేశాను.