“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

15, ఏప్రిల్ 2015, బుధవారం

హోమియో అద్భుతాలు-పాము విషంతో HIV కి ఔషధం

హోమియోపతి అసలు ఒక వైద్యమే కాదని వాదించే అజ్ఞానులు నేటికీ మన చుట్టూ చాలామంది ఉన్నారు.వారితో వాదించి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం.వారి అదృష్టం బాగుంటే తెలిసిననాటికి వారికే సత్యం తెలుస్తుంది.లేకుంటే వారి ఖర్మ.మనం ఏమీ చెయ్యలేం.లోకం మొత్తాన్నీ బాగుచెయ్యడం మన పని కాదు.వాదన అనవసరం.

కాకుంటే, హోమియోపతి అనేది ఖచ్చితమైన శాస్త్రీయ విజ్ఞానమే అన్న దానికి రుజువులు మనకు రోజురోజుకూ లభిస్తూనే ఉన్నాయి.

రకరకాల పాములు,తేళ్ళు,మండ్రగబ్బలు,విషపూరిత సాలీళ్ళు,తేనెటీగలు ఇలా అనేక ప్రాణుల విషాలతో చేసిన మందులు హోమియోపతిలో ఉన్నాయి. అవి అనేక రోగాలలో అద్భుతంగా పనిచేస్తాయి.

మొన్న ఏప్రియల్ 10 డా||హన్నేమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ హోమియోపతి సదస్సులో ఒక ముఖ్య విషయం వెల్లడైంది.

మానవాళిని వేధిస్తున్న HIV వైరస్ ను ఎదుర్కోవడంలో 'క్రోటేలస్ హారిడస్' అనబడే హోమియోమందు అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తుందని ఆ పరిశోధనా సారాంశం.ఈ మందు 'రక్తపింజరి' అనే పాము విషం నుంచి తయారు చెయ్యబడుతుంది.ఈ పామునే శాస్త్రీయంగా 'క్రోటేలస్ హారిడస్' అని పిలుస్తారు.ఇంగ్లీషులో 'ర్యాటిల్ స్నేక్' అంటారు.

HIV వైరస్ తన డిజైన్ ను శరవేగంగా ఎప్పటికప్పుడు మార్చేసుకుంటూ ఉంటుంది.కనుక దానిని డీకోడ్ చెయ్యడం శాస్త్రవేత్తలకు తలనొప్పిగా మారింది.HIV వైరస్ తన వైరల్ RNA ను వైరల్ DNA గా చాలా స్పీడుగా మార్చుకుంటుంది.ఆ విధంగా అది కొన్ని మిలియన్లుగా పెరిగిపోయి రోగి ప్రాణం తీస్తుంది.

మనకు పురాణాలలో రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు.వాడి ఒక రక్తపుచుక్క నేలమీద పడితే అందులోనుంచి అనేకమంది రక్తబీజులు పుట్టుకొస్తారు.కనుక వాడికి చావులేదు.వాడిని ఒక్క కాళికామాత మాత్రమే సంహరించగలదు.ఇంక ఏ దేవతలవల్లా ఆపని కాదు.

నేటి వైరస్ లకు ఈ రక్తబీజుడు ఒక మార్మికసూచిక కావచ్చు. వైరస్ లన్నీ రక్తం ఆధారంగా పనిచేసేవే.మన శరీరంలో ఉన్న శక్తిని అవి వాటికనుగుణంగా మలచుకొని విపరీతంగా పెరిగిపోయి శక్తిని పుంజుకుంటాయి.ప్రస్తుత హోమియో ఔషధం ఈ కార్యక్రమాన్ని సమర్ధంగా అడ్డుకుంటుంది.కనుక HIV వైరస్ శరీరంలో పెరిగిపోవడం అనే ప్రక్రియ ఆగిపోతుంది.

ఇది ఊహ కాదు.ఇతర సంస్థలతో కలసి హోమియోపతి రీసెర్చి సంస్థలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ మందు వాడిన రోగిలో HIV virus multiplication ఆగిపోవడం టెస్ట్ లలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నది.ఈ విషయాన్నే మొన్నటి హోమియోపతి సదస్సు వెల్లడించింది.

ఇంతకంటే హోమియో ఔషధాల పనితీరుకు వేరే ఋజువు అవసరం లేదనుకుంటాను.

హోమియో ఔషధాలు చాలా బాగా పనిచేస్తాయి.అందులో ఏమీ అనుమానం లేదు.కాకపోతే అవి ఎలా పనిచేస్తున్నాయో హోమియో వైద్యులు చెప్పలేరు. అందుకు కావలసిన నవీన సాంకేతికపరిజ్ఞానం వారివద్ద లేదు.ఆ పరిజ్ఞానం ఉన్న సంస్థలు ఆ విషయాన్ని ఋజువు చెయ్యాలి.పరమాణు స్థాయిలో ఏఏ మార్పులను హోమియో ఔషధాలు తెస్తున్నాయో ఆయా సంస్థలు ప్రాక్టికల్ గా పరిశీలించాలి.అప్పుడు మాత్రమే హోమియో ఔషధాల పనితీరు అర్ధమౌతుంది.

HIV వైరస్ అనేది రాహుకేతువుల చెడుప్రభావం వల్ల మనిషికి వచ్చే వ్యాధి అన్నది నగ్నసత్యం.వైరస్ లన్నీ రాహుకేతువుల ఆధీనంలోనివే.కనీసం వైరల్ ఫీవర్ ఒక మనిషికి రావాలంటే కూడా ఆ మనిషిమీద రాహుకేతువుల చెడుప్రభావం ఉండాలి.అప్పుడే ఆ వైరస్ అతన్ని ఎటాక్ చేస్తుంది.లేకుంటే చెయ్యదు.HIV అనేది విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న మానవజాతికి రాహుకేతువుల శాపమే.కనుకనే మళ్ళీ పామువిషమే దానికి విరుగుడు కూడా అయ్యింది.రాహుకేతువులకు మన జ్యోతిష్యశాస్త్రం పాము ఆకారాన్నే ఇచ్చిందన్నది గమనార్హం.

రోగాలకూ గ్రహాలకూ ఉన్న జ్యోతిశ్శాస్త్రపు మార్మిక సంబంధాన్ని కూడా ఈ పరిశోధన ఋజువు చేసినట్లే అవుతున్నది.