“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

3, జనవరి 2021, ఆదివారం

మధ్యప్రదేశ్ అడవులలో గడచిన 2020 చివరిరోజులు (చండీమందిర్ - శివనాధ్ నది - ముక్తిక్షేత్రం)

 దుర్గ్ లో ఎక్కడ చూచినా శివాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి.  అవి పెద్దపెద్దవేమీ కావు, కానీ సందుసందుకీ ఉన్నాయి.  అక్కడి మనుషులలో కూడా భక్తి ఎక్కువగా కనిపిస్తున్నది. VHP, RSS  ప్రభావం బాగా ఎక్కువగా ఉన్నట్లు, ఊర్లో  ఉన్న బ్యానర్స్,  పోస్టర్స్ ని  బట్టి కనిపించింది. మన ఆంధ్రాలో ఉన్నట్లు ప్రతిసందుకీ నాలుగు చర్చిలు, తెలంగాణలో ఉన్నట్లు ఊరూరికీ నాలుగు మసీదులు ఇక్కడ కనిపించలేదు. మన తెలుగురాష్ట్రాలలో ఉన్నట్లు మాంసంకొట్లు, బారుషాపులు విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ లేవు. అందుకేనేమో ఊరంతా పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లు ఫీలయ్యాను. ఈ రెండు మతాలు మన దేశంలో అడుగుపెట్టి ఎక్కడలేని దరిద్రాన్ని కొనితెచ్చాయి.  కొన్నివేల సంవత్సరాల నుంచీ ఒక పద్ధతిగా ఉంటున్న మన సమాజానికి ఇవి చేసిన కీడు ఊహించడం చాలాకష్టం. శాంతి శాంతి అని పైకి చెప్పే ఈ మతాలు నిజానికి పెంచింది అశాంతిని మాత్రమే. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూచినా కనిపిస్తుంది.

ఉత్తరాదిన శుచి శుభ్రం, పద్ధతీ పాడూ ఉండవని, దక్షిణాదిలో సాంప్రదాయం ఎక్కువని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది నిజం కాదు. అక్కడి మనుషులు పల్లెటూరి వాళ్ళలాగా ఉండవచ్చు. వాళ్లలో కొంచం శుభ్రత తక్కువే ఉండవచ్చు. కానీ భక్తి ఎక్కువ. మంచితనం, మర్యాదలు కూడా ఎక్కువే. మనం డబ్బుకు అమ్ముడుపోయి, మన తాతముత్తాతల మతాలను అమ్ముకున్నంతగా వాళ్లింకా అమ్ముడుపోలేదని నాకనిపించింది. 

ఈ ఊర్లో చండీమందిర్ అనేది  ప్రసిద్ధి అని చెప్పారు. కాలినడకన అక్కడికి బయల్దేరాం. దారి తెలీదు.  గూగుల్ మాప్ లో ఉజ్జాయింపుగా చూసుకుని ఇక నడక మొదలుపెట్టాం. దారిలో అక్కడక్కడా అడుగుతూ మొత్తం మీద మూడ్నాలుగు కిలోమీటర్లు నడిచి గుడికి  చేరుకున్నాం.

దారిలో ఒక ఆంజనేయస్వామి గుడి కనిపిస్తే అక్కడున్న పూజారిని చండీమందిర్ కి దారి అడిగాం. అతనప్పుడే గుడిబయటున్న బంకులో గుట్కా కొనుక్కుంటున్నాడు. చిన్నకుర్రాడే కానీ గుట్కాకు బానిసయ్యాడు లాగుంది. మమ్మల్ని చూచి కొంచం షాకయ్యాడు. కానీ చాలా మర్యాదగా దారి వివరించి చెప్పాడు. అతనికా పాడు అలవాటు పోవాలని ఒక తాంత్రికక్రియను అక్కడికక్కడే చేశాను. కానీ పక్కనున్నవాళ్ళు కూడా గ్రహించలేనట్లుగా దానిని చేశాను. అతను చూపించిన దారిలో ఒక రెండువందల గజాలు నడిచి చండీమందిర్ చేరుకున్నాం. 

ఊరికి దాదాపుగా ఒకవైపున ఉన్నప్పటికీ మంచి సెంటర్లోనే ఉంది గుడి. జనం అస్సలు లేరు. పూజారి ఒక పక్కగా  వసారాలో కూచుని ఫోన్లో ఏదో చూసుకుంటూ తన లోకంలో తనున్నాడు. గుడిలో ముందుగా దుర్గాదేవి, వెనుకగా కాళికాదేవి విగ్రహాలున్నాయి. ఉదయం సాయంత్రం ఇచ్చే హారతికి చాలామంది వస్తారని తెలిసింది. గ్రహపీడలు, దయ్యాలు, భూతాలు పట్టినవాళ్లకు ఇక్కడ చేసే చండీపూజ బాగా పనిచేస్తుందని చెప్పారు. కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాను. 

సహచరులు పూజారితో ఏదో మాట్లాడారు. పూజారి వాలకం నాకు నచ్చింది. మన ఆంధ్రా తెలంగాణాలలో ఉన్నట్లు అనవసరమైన పోజు లేదు అతనిలో. మనవైపు పూజారులలో రెండు రకాలుంటారు. అయితే, దీనంగా డబ్బుల్లేకుండా ఉంటారు.  లేకపోతే, మహా దురహంకారంగా ధనమదంతో కూడి, 'నన్ను ముట్టుకోకు' అన్నట్లుగా ఉంటారు. మధ్యస్థంగా మాత్రం ఉండరు. ఇటువైపు పూజారులు అలా లేరు. నేలబారుగా మామూలుగా ఉన్నారు. వాళ్లలో పాండిత్యపు పోజు లేదు. జనంతో కలసిపోయి ఉన్నారు. అది నాకు నచ్చింది.

అక్కడనుంచి బయటకొచ్చి శివనాధ్ నదివైపు బయలుదేరాం. అదెక్కడుందో తెలీదు. ఒకవైపు పోతే నది వస్తుంది అనిపించింది. అటువైపు నడక ప్రారంభించాం. నాతోపెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసు గనుక నోర్మూసుకుని నా వెనుకగా నడుస్తున్నారు సహచరులు. దారిలో ఒకచోట గంగరేగుకాయలు నేలమీద గుట్టగా పోసి  అమ్ముతున్నారు. కొన్ని కొనుక్కుని తింటూ నడవసాగాను.

'సార్ ! అలా తినకండి. అవి నేలమీద బురదనీళ్ళ పక్కన పోసి ఉన్నాయి. కనీసం కడుక్కొని తినండి. అసలే కరోనా ఉంది' అని సహచరులతో  ఒకాయన అన్నాడు. 

అతనివైపు ఒకసారి చూసి, అప్పటిదాకా ఒక్క కాయ తింటున్నవాడిని, రెండుకాయలు ఒకేసారి నోట్లో పెట్టుకుని నమలడం మొదలుపెట్టాను. అతను తలకొట్టుకుని ఇక మారు మాట్లాడలేదు.

అలా కొద్దిదూరం నడిచాం. ఎంతదూరం నడిచినా బజార్లు వస్తూనే ఉన్నాయిగాని నది రావడం లేదు. నా సహచరులకు కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి. నేను మాత్రం వెనక్కు చూడకుండా ఏదో ధ్యాసలో నడుస్తూనే ఉన్నాను. సహచరులు ఎప్పుడు ఆటో మాట్లాడారో తెలీదుగానీ దాంట్లో ఎక్కికూచుని నా పక్కనే వచ్చి  ఆగారు. ఏంటా ప్రక్కనే ఆటో ఆగింది? అని చూస్తే దాంట్లో వాళ్ళున్నారు. నేనూ ఆటో ఎక్కాను.

ఆటో పోతోంది. దారిలో ఇళ్లమధ్యనే పెద్దపెద్ద చెరువులు కనిపించాయి. బెంగాల్ లో ఉన్నట్లుగా. కానీ ఎవరూ వాటిని శుభ్రంగా ఉంచడం లేదు. అవి మురుగు గుంటల్లాగా ఉన్నాయి. స్నానాలు, బట్టలు ఉతకడాలు, గిన్నెలు తోమడాలు అన్నీ అందులోనే చేస్తున్నారు. ఏదైనా ఎపిడెమిక్ వచ్చిందంటే వేలాదిగా జనం లేచిపోతారు. అలా ఉంది ఆ లొకాలిటీ. మున్సిపల్ అధికారులు, నాయకులు ఏం చేస్తున్నారా? అని సందేహం కలిగింది. ఉన్నంతలో శుభ్రంగానే ఉన్నారు. కానీ వాళ్లకున్న వాటర్ సోర్స్ ను అలా పాడు చేసుకుంటున్నారు. అలా కొద్దిసేపు ప్రయాణం తర్వాత శివనాధ్ నది పక్కనే ఉన్న శివాలయం దగ్గర ఆటో ఆగింది.

నది పెద్దదే. రెండుప్రక్కలా శివాలయాలున్నాయి. వీటిలో ఏది ప్రాచీనమైనది? అని అక్కడివారిని అడిగాం. నది అవతలప్రక్కన ఉన్నదానిని చూపించారు. ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డువరకూ ఒక సిమెంట్ దారిలాంటిది ఉన్నది. దానిమీద నడుస్తూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాం.

ఆ రోజున మార్గశిర పౌర్ణమి కావడంతో చాలామంది నదిలో  స్నానాలు చేస్తూ కనిపించారు. ఆడవాళ్లకూ, మగవాళ్లకూ స్నానఘట్టాలు విడివిడిగా ఉన్నాయి. వాళ్లలో చాలామంది సబ్బు రాసుకుని నదిలో స్నానాలు చేస్తున్నారు. మరికొందరేమో అక్కడే బట్టలు ఉతుకుతున్నారు. ప్లాస్టిక్ కవర్లు దానిలోనే పారేస్తున్నారు. మొత్తం మీద నదంతా చాలా మురికిగా ఉంది. బాధేసింది. ఎలాంటి సాంప్రదాయం మనది? వెయ్యి సంవత్సరాల ముస్లిం, క్రైస్తవ పాలనలవల్ల చివరకు ఎలా దరిద్రంగా తయారైంది? ఇప్పుడేమో చెప్పేవాడూ లేడు, చెప్పినా వినేవాడూ లేడు. మన జనాలలో నిజమైన సాంప్రదాయం ఎప్పుడు వస్తుంది? ప్రకృతిలో దైవాన్ని చూడటం ఈ మూర్ఖపు మనుషులు ఎప్పుడు నేర్చుకుంటారో అని చాలా జాలి కలిగింది.

నదికి అవతలి ఒడ్డున పాతకాలంనాటి ఒక చిన్న శివాలయం ఉంది. పూజారి లేడు. పూజలు జరుగుతున్న సూచనలు కూడా అక్కడ లేవు. కానీ, రోజూ గుడిని శుభ్రం చేస్తున్నట్లు మాత్రం కనిపించింది. చుట్టూ మామిడితోటలు, చెట్లతో అడవిలాగా ఉంది. దానిపేరు ముక్తిక్షేత్రం అని చెప్పారు. ఎప్పుడో పాతకాలంలో అక్కడ ఋషులు తపస్సు చేశారట. అక్కడకూడా కాసేపు మౌనంగా కూచున్నాను.  శివానుగ్రహం వల్ల ఈ స్థలంలో నాకొక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. ఎప్పటినుంచో నన్ను బాధపెడుతున్న ఒక సమస్య ఆ ప్రదేశంలో క్షణంలో మాయమైంది.

పరమేశ్వరుడు యోగులకు ఆరాధ్యదైవం. పరమవైరాగ్యమూర్తిగా ధ్యానసమాధిలో ఉండే శివుడే వారికి ఇష్టం. ఆయన భోళాశంకరుడు. తేలికగా ప్రసన్నమౌతాడు. కానీ మనలో హృదయశుద్ధి ఉండాలి. విష్ణువూ శివుడూ వేర్వేరు కాదు. తెలిసినవారికి ఇద్దరూ ఒకటే. తెలియకపోతే భేదం. తెలిస్తే ఏకం.

పెద్దపెద్ద ప్రఖ్యాత ఆలయాలలో హంగూ ఆర్భాటమూ తప్ప ఏమీ ఉండదు. ప్రకృతి ఒడిలో జనసంచారానికి దూరంగా మౌనంగా ఉండే ఆలయాలలోనే ఆధ్యాత్మికశక్తి ఎక్కువగా ఉంటుంది. చవకబారు వెకిలిజనానికి ఎంత దూరంగా ఉంటె అంత అసలైన ఆధ్యాత్మికత అనుభవంలోకి వస్తుంది. ఈ విషయాన్ని నేను కొన్ని వందలసార్లు గమనించాను. ఆలయాలకు తండోపతండాలుగా వెళ్లి అక్కడి ప్రశాంతతను పాడుచేస్తున్నది మనమే.

An ancient disease
A medieval medicine
A modern cure
Along with me, the river also
saw a flash of light !

ఒక ప్రాచీన రోగం
మధ్యకాలపు మందు
రోగం ఇప్పుడు నయమైంది
నాతోపాటు ఈ నదికూడా 
ఒక కాంతిపుంజాన్ని చూచిందిఅక్కడనుంచి లేచి చూస్తే, సహచరులు కనిపించలేదు. ఎక్కడున్నారా అని చూస్తే, కొద్దిదూరంలో ఉన్న పాకా హోటల్లో కూచుని హోటలువాడితో మాట్లాడుతూ కనిపించారు. మాకోసం వేడివేడి సమోసాలు, టీ రెడీ చేయిస్తున్నారు. అక్కడికెళ్లి కూచోగానే ఎక్కడనుంచో ఒక కుక్కపిల్ల వచ్చి  నా కాళ్లదగ్గర కూచుంది. సహచరులు అప్పటికే సమోసాలు తింటున్నారు. కానీ వాళ్ళదగ్గరకు అది పోలేదు. నా దగ్గర తినే పదార్ధాలు ఏమీ లేవు. అప్పుడే వచ్చి అక్కడ కూచుంటున్నాను. 
కానీ అది సరాసరి వచ్చి నా కాళ్లదగ్గర కూచుని  ముఖంలోకి చూస్తోంది. ముందు దానికొక సమోసా ఇవ్వమని షాపువాడికి చెప్పాను. అది ఆ సమోసాను తీసుకుని చెట్లలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ కనిపించలేదు.

శివాలయంలో నాకు కలిగిన అనుభవం దృష్ట్యా శివనాధ్ నది, ముక్తిక్షేత్రం నా మనస్సులో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.

అలా కాసేపు అక్కడ ఉండి, మళ్ళీ చప్టా మీదుగా నడుస్తూ నది ఇవతలిఒడ్డుకు వచ్చి, ఆటో మాట్లాడుకుని హోటల్ కు చేరుకున్నాం.

(ఇంకా ఉంది)