“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, జనవరి 2021, ఆదివారం

Master CVV జాతక విశ్లేషణ - 5 (భౌతిక నిత్యత్వం ఎలా రావచ్చు?)

రామలింగయోగి ఏమయ్యేడో మనకు తెలియదు కానీ ఆ తరువాత, సీవీవీగారు, అరవిందులు చాలాకాలం జీవించి ఉన్నారు. వీరిద్దరూ భౌతిక అమరత్వాన్ని సాధించాలని ప్రయత్నించారు. కానీ మధ్యలోనే ఈ లోకంనుంచి నిష్క్రమించారు. అంతవరకే నిజం. ఆ తర్వాత వారి అనుయాయులు చెబుతున్నది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే అవి వారి ఊహలు మాత్రమే.  నిజానిజాలు ఎవరికీ తెలియవు.

భౌతిక అమరత్వాన్ని సాధించే పనిలో వీరిద్దరూ ఎక్కడో విఫలులయ్యారు. అదేమీ అనుకున్నంత తేలికైన పనేమీ కాదు. దీనిలో ఒక్క జన్మలోనే విజయాన్ని సాధించడం ఎవరివల్లా కాదు. అదే వీరికీ జరిగింది. అయితే, భక్తిపిచ్చి బాగా తలకెక్కిన వీరి భక్తులు మాత్రం, ఏవేవో నమ్మకాలతో మునిగితేలుతూ సత్యానికి దూరంగా పోతున్నారు.

సీవీవీగారు సూక్ష్మశరీరంలో హిమాలయాలలో ఉన్నారని, ఇప్పుడు చనిపోతున్న ఆయన భక్తులందరూ అక్కడకు చేరుకొని అక్కడ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని, ఆయన పుట్టేటప్పుడు వీళ్ళుకూడా ఆయనతో బాటుగా మళ్ళీ అవే ఆకారాలతో, అవే శరీరాలతో పుడతారని వీరు నమ్ముతున్నారు. క్రీస్తు మళ్ళీ వస్తాడని రెండువేల ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్రైస్తవుల భ్రమలాంటిదే ఇదికూడా. అది జరిగేపని కాదు.

అదేవిధంగా, సూక్ష్మలోకాలలో అరవిందులు వేచిఉన్నారని భూమి సిద్ధమైనప్పుడు అతిమానసదేహంతో ఆయన భూమిపైన అవతరిస్తారని నమ్ముతున్నారు ఆయన భక్తులు. ఇదికూడా పైన చెప్పిన  నమ్మకం లాంటి ఉత్తనమ్మకమేగాని ఇందులో నిజమెంతో ఎవరూ చెప్పలేరు.

వీరిద్దరూ భౌతికఅమరత్వసాధన చేసినది నిజమే. అర్ధాంతరంగా పోయినది నిజమే. అంతవరకే నిజం. ఆ తరువాతది అంతా  ఊహా, నమ్మకమూ మాత్రమే.

మరి భౌతికఅమరత్వం ఎప్పటికీ రాదా? అంటే  వస్తుందనే నేనంటాను. ఎప్పుడొస్తుంది ఎలా వస్తుంది అనేవి చూద్దాం.

వస్తే గిస్తే ఇది సైన్స్ ద్వారానే రావాలిగాని ఆధ్యాత్మికంగా చూస్తే మాత్రం, రాబోయే 10,000 ఏళ్లలో సాధ్యం కాదని నా విశ్వాసం. ఎలాగో చెప్తా వినండి.

ఈజిప్టు లోనూ చైనా లోను మానవజాతి చరిత్రను క్రీ పూ 8000 ఏళ్ల నుంచీ రికార్డ్ చేసి ఉంచారు. అంటే పదివేల ఏళ్ల చరిత్ర మనకు లభ్యమౌతున్నది. ఇన్నేళ్ల నాగరికత తర్వాత ఇప్పుడు మనమున్న స్థితిలో ఉన్నాం. ఇంకో పదివేల ఏళ్లకు ఇంకా ఎంతో ప్రగతి సాధించవచ్చు. సైన్స్ బాగా ఎక్కువైపోయి అట్లాంటిస్ ద్వీపం లాగా సర్వనాశనం కావచ్చు. మళ్ళీ అడవిమనుషుల స్టేజి నుంచి చరిత్ర మొదలు కావచ్చు. ఈ విధంగా గతంలో చాలాసార్లు జరిగింది. అంతేగాని, భౌతికంగా అమరత్వం మాత్రం అంత తొందరగా వచ్చేపని కాదు.

కొన్నివందల ఏళ్ళక్రితం దూరశ్రవణం దూరదర్శనం అనేవి యోగసిద్ధులకు మాత్రమే ఉండే శక్తులు. ఇప్పుడో, డబ్బులున్న ప్రతివాడికీ ఆ శక్తులున్నాయి. అంతర్జాతీయ ఆడియోకాల్సేమో దూరశ్రవణం. వీడియోకాల్సేమో దూరదర్శనం.  విమానప్రయాణమేమో ఆకాశయానం. ఇంకొన్నాళ్ళు పోతే సూక్ష్మదేహంతో దూరప్రయాణం కూడా వస్తుంది. అంటే ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం కావడం. కాకపోతే, సైన్స్ పరంగా వచ్చే దూరప్రయాణం (టెలి పోర్టేషన్) లో ఇక్కడ మాయం కావడం ఉండదు. ఇక్కడే ఉంటూ ఎక్కడ కావాలంటే అక్కడ 3-D హోలోగ్రాం లాగా ప్రత్యక్షమై మాట్లాడే టెక్నాలజీ త్వరలోనే వస్తుంది. ఇది ఎంతోదూరంలో లేదు.

1900 ప్రాంతంలో మనిషి సగటు ఆయుష్షు 35-40 మధ్యలో ఉండేది. చాలామంది  యవ్వనాన్ని చూడకుండానే కన్నుమూస్తుండేవారు. దానికి ముఖ్యమైన కారణాలు - సరియైన మందులు లేకపోవడం, యూరప్ నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి అనేక రోగాలు మనకు సరఫరా కావడం. 1950 ప్రాంతానికి 50-60 మధ్యలో ఉన్న మనిషియొక్క సగటు ఆయుప్రమాణం 2000 నాటికి 70-75 మధ్యకు పెరిగింది. ఇప్పుడు 80-85 వరకూ చాలామంది జీవిస్తున్నారు. ఇదే విధంగా పోతే 2050 నాటికి మనిషి హాయిగా 100 ఏళ్ళు బ్రతుకుతాడు. ఆఫ్కోర్స్ రోగాలుంటాయి, మందులూ ఉంటాయి. మందులు మింగుతూ బ్రతుకుతూ ఉంటాడు.

జీవరసాయన శాస్త్రంలో, వైద్యశాస్త్రంలో నేడు జరుగుతున్న పరిశోధనలు మీలో చాలామందికి తెలియవు. అవేంటో వింటే మీరు ఆశ్చర్యపోతారు.

హ్యూమన్ సెల్ లెవల్ లో బ్రహ్మాండమైన రీసెర్చి నేడు జరుగుతోంది. హ్యూమన్ సెల్ అనేది కాలంతో అసలెందుకు బలహీనమౌతుంది? ఆయుష్షును నియంత్రించే జీన్ ఏమిటి? వయసుతో బాటు సెల్ అనేది ఎందుకు క్షీణిస్తుంది? సెల్ క్షీణించకుండా, బలహీనపడకుండా, మరణించకుండా ఆపడం ఎలా? జీన్ కోడ్ ను ఎలా మార్చాలి? మొదలైన రంగాలలో సామాన్యుడు ఊహించలేని రీసెర్చి రహస్యంగా జరుగుతోంది. దీనిమీద కోట్లాది డాలర్ల పెట్టుబడి పెట్టబడింది. ఈ రీసెర్చి గనుక సక్సెస్ అయితే, హ్యూమన్ సెల్ జీవితకాలాన్ని ఎంతవరకైనా పొడిగిస్తూ పోవచ్చు.. సెల్ ఫోన్ బ్యాటరీ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నట్లు, సిం కార్డు బాలెన్స్ అయిపోతే మళ్ళీ వేసుకున్నట్లు, హ్యూమన్ సెల్ లెవల్లో రీఛార్జ్ చేసుకునే టెక్నాలజీ ఎంతో దూరంలో లేదు. కనీసం ఇంకో మూడొందల ఏళ్లలో ఇది అందుబాటులోకి రావచ్చు. అదే విధంగా ఆర్టిఫీషియల్ ఆర్గాన్ ఉత్పత్తి, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మొదలైన రంగాలలో మనం ఊహించలేనంత రీసెర్చి జరుగుతోంది.

కొన్నాళ్ళు పోయాక పెట్రోల్ బంకుల్లాగా, రీఛార్జ్ షాపులలాగా, ఆయుష్షు రీచార్జి సెంటర్స్ రావచ్చు. ఒకడి ఆయుస్సు అయిపోతుంటే, సిగ్నల్ వస్తుంది. వెంటనే షాపుకెళ్లి, తనదగ్గరున్న డబ్బులని బట్టి పదేళ్ళో ఇరవై ఏళ్ళో ఆయుష్షు రీచార్జి చేసుకొవచ్చు.

ఏం నమ్మడానికి కష్టంగా ఉందా?

నేడు మనం వాడుతున్న టెక్నాలజీ ఒక నూరేళ్లక్రితం ఊహించడానికి కూడా అసాధ్యమే. అలా ఊహించి పుస్తకాలు వ్రాసినవారిని సైన్స్ ఫిక్షన్ రచయితలన్నారు. ఇప్పుడవన్నీ నిజాలవుతున్నాయి. నేడు మనం మొబైల్ ఫోన్ తో చేస్తున్న అద్భుతాలు, యాప్స్ తో జరుగుతున్న పనులు, ఒక రెండొందల ఏళ్ల క్రితం ఎవరైనా వ్రాసి ఉన్నట్లయితే వాడిని సైతాన్ భక్తుడని ముద్రవేసి సజీవదహనం చేసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడవన్నీ మనం చేస్తున్నాం. అలాగే నేను వ్రాసిన 'సెల్ లెవల్ రీచార్జ్' అనేది కూడా భవిష్యత్తులో నిజం అవుతుంది. అప్పుడు మనిషి ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్ళు ఇదే దేహంతో బ్రతుకుతాడు. సైన్స్ మాత్రమే దీనిని  సామాజికంగా సామూహికంగా సుసాధ్యం చేస్తుందిగాని ఏ యోగమూ చెయ్యలేదు.

యోగమనేది వ్యక్తిగతం. మహా అయితే ఒక గ్రూపు వరకూ పరిమితం. గతంలో వచ్చిన ఏ మహాపురుషుడైనా తాను పొందినదానిని ఒక పదిమంది వరకూ పంచగలిగాడు. అంతే ! మిగతావాళ్ళు ఆయనపోయిన తర్వాత ఆయన ఫోటో పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంతేగాని, మందికందరికీ తాను పొందిన సిద్ధిని ఏ మహాత్ముడూ పంచలేకపోయాడు. అదసలు జరిగే పని కాదు.

కనుక యోగంద్వారా భౌతిక అమరత్వం రావాలంటే చాలా కష్టం. ఇంకో పదివేల ఏళ్లకు కూడా ఇది సాధ్యం కాకపోవచ్చు.. కానీ సైన్స్ ద్వారా ఇంకో 500 ఏళ్లలో ఇది సాధ్యం అవుతుంది.

నేను ఊహించి చెప్పడం లేదు. ప్రాక్టికల్ గా జరుగుతున్న విషయాలు చెబుతున్నా. వినండి !

మొన్నీ మధ్యన నా అమెరికా శిష్యుడొకాయన ఇంటర్నేషనల్ టెక్నాలజీ కాన్ఫరెన్స్  ఒకదానికి ఆహ్వానితునిగా వెళ్ళాడు. అందులో దాదాపు 1200 MNC లు వివిధరంగాలలో తాము చేస్తున్న రీసెర్చిని ఒకరితో ఒకరు పంచుకున్నాయి. అందులో కొన్నింటి గురించి చెబుతాను. నోరెళ్లబెట్టకండి !

మనకు వచ్ఛే అనారోగ్యాలన్నీ మనం  ఊపిరిని పీల్చే విధానాన్ని బట్టి వస్తాయనేది ఒక నమ్మలేని నిజం. ప్రపంచ జనాభాలోని  750 కోట్లమంది 750 కోట్ల విధాలుగా ఊపిరిపీల్చి వదులుతూ ఉంటారు. ఫింగర్ ప్రింట్స్ లాగా ఇందులోకూడా ఎవరి ప్రత్యేకత వారిదే. కనుక ఎవరి రోగం వాడిదే. ఎవరి ఆయుష్షు వాడిదే. ఈ రహస్యాన్ని వేలాది ఏళ్ళనాడే గ్రహించిన యోగులు ప్రాణాయామవిద్యను కనిపెట్టి, దానిలో రీసెర్చి చేసి, కోడిఫై చేసి, మనకు బోధించారు. కానీ దీనిని అందరూ చెయ్యలేరు. సరియైన గురువులు దొరకరు. దొరికినా మన బద్ధకం మనల్ని  వదలదు. సాధనను స్థిరంగా సక్రమంగా చేయనివ్వదు. కనుక ప్రాణాయామమనేది కొన్ని వేల ఏళ్లుగా మనకు తెలిసినా , నేటికీ దానిని శ్రద్ధగా చేస్తున్నది 0.05 శాతం మనుషులు మాత్రమే. కనుక కష్టపడటం, సుఖాలను వదులుకోవడం, సాధన చెయ్యడం, ఎవరికీ ఇష్టం ఉండదు. కడుపులో చల్లకదలకుండా ఎవడైనా మనబదులు ఆ సాధనలో గట్రాలో చేసి ఫలితం మనకు ధారపోస్తే అప్పుడు తీసుకుంటాం ! ఈలోపల వాడి ధార ఆగిపోతుందనుకోండి. అది వేరే విషయం ! అయినా మనకనవసరం ! మనకోసం ఆహుతి కావడానికి కాకపోతే వాడసలు గురువని బోర్డు పెట్టుకున్నది ఎందుకంటా?

ఇప్పుడొక MNC, ఒక యాప్ ను తయారుచేస్తోంది. దానికి మనం కనెక్ట్ అయితే, మనం ఊపిరిని సరిగ్గా పీల్చి వదులుతున్నామా లేదా అది అనుక్షణం కనిపెట్టి చూస్తూ మనకు సలహాలిస్తూ, మన శ్వాసను మానిటర్ చేస్తూ ఉంటుంది.  సరిగ్గా పీల్చకపోతే గదుముతుంది. సరిగా వదలకపోతే హెచ్చరిస్తుంది. ఆ విధంగా మనచేత ప్రాణాయామం చేయించి మన ఆరోగ్యాన్ని మంచి కండిషన్ లో ఉంచుతుంది. మరి ఆ యాప్ కొనుక్కోవాలన్నా, కనెక్ట్ అవ్వాలన్నా డబ్బులు వదుల్తాయి. ఒక్కసారిగా కాదు. జీవితాంతం నెలకింతని ఆ కంపెనీకి మనం డబ్బులు కడుతూ ఉండాలి. నో ఫ్రీ సర్వీస్ ప్లీజ్ !

ఆశ్చర్యపోతున్నారా ! అంత పోకండి ! దీని బాబులాంటిది ఇంకోటుంది దానిసంగతి వినండి !

ఇంకో MNC ఇంకో దిమ్మతిరిగిపోయే రీసెర్చి చేస్తోంది. అది సెంట్రల్ నెర్వస్ సిస్టం, బ్రెయిన్ల గురించి. మన అనుభూతులన్నింటినీ ఈ రెండే నియంత్రిస్తాయన్నది ఏ సైన్స్ స్టూడెంట్ కైనా తెలుస్తుంది. మనకు కోపమొచ్చినా, తాపమొచ్చినా, కామక్రోధాది ఆరింటిలో ఏదొచ్చినా మన బ్రెయిన్ వేవ్స్ మారిపోతాయి. ఒక్కొక్క ఆలోచనా, ఒక్కొక్క ఎమోషనూ ఒక్కొక్క విధమైన బ్రెయిన్ వేవ్ ను సృష్టిస్తాయి. ఏ ఎమోషన్ కలిగినప్పుడు బ్రెయిన్ ఏ తరంగాలను వెదజల్లుతోందో వీళ్ళు ముందుగా రికార్డ్ చేశారు. దీనికోసం కొన్నివేలమందిమీద  పిల్లలు, పెద్దలు, ఆడా, మగా ఇలా రకరకాల గ్రూపులమీద రీసెర్చి చేసి ఇదంతా రికార్డ్ చేసేశారు. ఇప్పుడు బ్రెయిన్ కి సెన్సార్లు అమర్చి, అవే బ్రెయిన్ సెంటర్స్ ని కృత్రిమంగా మైల్డ్ ఎలక్ట్రిక్ సప్లైద్వారా యాక్టివేట్ చేస్తే, అవే అనుభూతులు ఆ మనిషికి కలుగుతాయి.

ఏ అనుభూతిని కావాలంటే ఆ అనుభూతిని అనుకున్న క్షణంలో పొందటం ధ్యానికి సాధ్యమౌతుందని ధమ్మపదంలో బుద్ధుడన్నాడు. అంటే, తన ఎదురుగా ఒక వస్తువుగాని మనిషిగాని లేకపోయినా, అవి బ్రెయిన్లో ఏయే సెంటర్స్ ని కదిలిస్తాయో, వాటిని ధ్యానియైనవాడు తన ధ్యానశక్తితో కదిలిస్తాడు. అప్పుడా అనుభూతులను తన లోలోపల ధ్యానంలో పొందుతాడు. ఇది యోగులకు తెలిసిన విద్యే. అంటే, అనుభూతులపరంగా రివర్స్ ఇంజనీరింగ్ అన్నమాట ! సైన్స్ పరంగా ఇది త్వరలో సక్సెస్ అవబోతోంది. అప్పుడేమౌతుందో తెలుసా ?

ఒకసారి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మానవజీవితం మొత్తం తారుమారై పోతుంది. వెధవ మొబైల్ ఫోన్ వచ్చి మన జీవితాల్ని ఎంత సుఖంగా, ఎంత దరిద్రంగా మార్చిందో మనం చూస్తున్నాము.  ఇక, నేను చెబుతున్న టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తే ఏమౌతుందో చెబుతా వినండి !

ఆకర్షణలు, డేటింగ్ లు, ప్రేమలు, పెళ్లిళ్లు, సహజీవనాలు ఇవన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. అమ్మాయికి అబ్బాయీ అవసరం లేదు. అబ్బాయికి అమ్మాయీ అవసరం లేదు. ఎవరికివారు యాప్ కి కనెక్ట్ అయిపోవడం, సెన్సార్లున్న హెడ్ ఫోన్స్ తగిలించుకోవడం, రిమోట్ చేతులో పట్టుకుని దుప్పటి ముసుగేసుకుంటే చాలు. పార్ట్ నర్ తో సంబంధం లేకుండా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆర్గాజం పొందవచ్చు.. అంతా రిమోట్ చేస్తుంది. ఇక ఒకరితో ఒకరికి పనేముంటుంది? ఎవరి ముఖం ఎవరు చూస్తారు?

అలకలు, తృప్తి లేదంటూ విసుక్కోడాలు, చాలలేదని విడాకులు కోరడాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్లు, స్పెషలిస్టుల చుట్టూ తిరగటాలు, ఇవేవీ ఉండవు.

బ్యూటీ ప్రాడక్ట్స్ అన్నీ మూతపడతాయి. జిమ్ములు మూతపడతాయి. యాఫ్రో డీసియాక్ ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలుతుంది. ఎవరూ యోగా చేయనవసరం లేదు. ఎవరెలా ఉన్నా ఎవరికీ అవసరం ఉండదు. ఎవరి ముఖమూ ఎవరూ చూడరు. లవ్వులూ కొవ్వులూ అన్నీ మాయమౌతాయి. అసలు పెళ్లే అవసరం లేదు. యాప్ ఉంటె చాలు. దానితో కనెక్ట్ అయితే చాలు. కావలసినన్ని డబ్బులుంటే చాలు.  

'పిల్లలకోసమైనా పెళ్లి కావాలికదా' అంటారేమో? అసలు పిల్లలెందుకు? వాళ్ళని  పెంచడం,చదివించడం,పెళ్లిళ్లు చెయ్యడం, వాళ్ళ తిట్లూ చీదరింపులూ భరించడం, చివర్లో ఏడుస్తూ ఓల్డేజి హోములో చేరడం, ఆ గోలలూ గొడవలూ ఎందుకిదంతా? అసలు పెళ్ళెందుకు? 'సోలో లైఫే సో బెటర్' అనే ఫిలాసఫీ ఇప్పటికే మనమధ్యకు వచ్చేసింది. ఈ మాట ఇప్పటికే కొన్ని వేలమంది అంటున్నారు. మొన్నీ మధ్యన ఒక రీసెర్చిలో ఏమ్ తేల్చారంటే, 'మాకసలు పెళ్ళొద్దు' అనే అమ్మాయిలూ అబ్బాయిలూ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షలలో ఉన్నారట ! ఇలాంటి యాప్స్ వచ్చేస్తే ఇక సొసైటీ ఏమౌతుందో ఆలోచించండి ! ఇప్పటివరకూ మనిషికి తెలిసిన వ్యసనాలైన త్రాగుడు, డ్రగ్స్ మొదలైనవి దీనిముందు ఎందుకూ పనికిరావు. అదంత వ్యసనమై కూచుంటుంది. ఆ యాప్ కోసం మనిషి ఏం చెయ్యమన్నా చెయ్యడానికి సిద్ధమౌతాడు. 

ఏంటండీ ఏదో ఆధ్యాత్మికం చెబుతారనుకుంటే ఇంకేదో చెబుతున్నారు?  ఏంటీ బూతుపురాణం? అంటారేమో, కాస్తాగండి. వినండి !

ఇదే రీసెర్చిని ఇంకొంచం ముందుకు తీసుకెళ్తే ఏం జరుగుతుందో చెప్తా వినండి.

ధ్యానంలో, సమాధిస్థితులలో ఉన్నపుడు బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉంటాయో మ్యాపింగ్ చెయ్యడం ఇప్పటికే అయిపొయింది. ధ్యానసమాధి స్థితులలో ఒక యోగి ఉన్నపుడు అతని బ్రెయిన్ వేవ్స్, ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా, గామా స్పెక్ట్రంలో ఎంతెంత ఫ్రీక్వెన్సీ లో ఉంటాయో రికార్డ్ చెయ్యడం ఇప్పటికే అయిపొయింది. ఆయా సమాధిస్థితులలో బ్రెయిన్ లోని ఏయే కేంద్రాలు యాక్టివేట్ అవుతున్నాయో రికార్డ్ చేసి పెట్టడం ఇప్పటికే జరిగిపోయింది. ఆర్టిఫీషియల్ స్టిములేషన్ ద్వారా, అవే బ్రెయిన్ సెంటర్స్ ను యాక్టివేట్ చేస్తే, అవే తరంగాలను పుట్టించేలా బ్రెయిన్ ను ఆజ్ఞాపిస్తే, ఆయా సమాధిస్థితులు ఎవరికైనా వస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడొస్తాయి. కాకపోతే, చేతుల్లో కావలసినంత డబ్బులుంటే చాలు.

అంటే సైన్స్ దెబ్బకు సాధనంతా అరచేతి రిమోట్ లోకి వచ్చి నిలుస్తుందన్న మాట !

అప్పుడేం జరుగుతుంది?

ఆశ్రమాలన్నీ మూతపడతాయి. స్వామీజీలకు పనే ఉండదు. వాళ్ళ స్పీచులు ఎవరూ వినరు. వాళ్ళను ప్రోమోట్ చేస్తున్న టీవీ ఛానల్సన్నీ మూతపడతాయి. ప్రజలు స్వామీజీల చుట్టూ తిరగడం మానేస్తారు. రాజకీయనాయకులు స్వామీజీల చుట్టూ తిరగడం మానేస్తారు. స్వాముల శిష్యులందరూ వాళ్ళనొదిలేసి హాయిగా హెడ్ ఫోన్స్ కొనుక్కుని యాప్ కు కనెక్ట్ అయిపోయి పద్మాసనంలో కూచుని ఏ సమాధి కావాలంటే ఆ సమాధిలోకి తేలికగా వెళ్ళిపోతారు. కొండొకచో, రీఛార్జ్ సెంటర్లో స్వామీజీ ఆయన శిష్యుడూ ఒకే క్యూలో ఒకరికొకరు ఎదురైనా  ఆశ్చర్యపోనవసరం లేదు.

లేదా ఆ కంపెనీకి కాల్ చేస్తే ఒకమ్మాయి గొంతు కులుక్కుంటూ ఇలా వినిపిస్తుంది.

"సవికల్పసమాధి కావాలంటే ఒకటి నొక్కండి. నిర్వికల్పసమాధి కావాలంటే రెండు నొక్కండి. జీవన్ముక్తి కావాలంటే మూడు నొక్కండి. నిర్వాణా కావాలంటే నాలుగు నొక్కండి. లేదా భౌతికఅమరత్వం కావాలంటే మీ శరీరపు సెల్స్  రీఛార్జికోసం మీ దగ్గర్లో ఉన్న రీచార్జి సెంటర్ కు రండి !"

ఇదంతా అతి త్వరలో జరుగబోతోంది. నేను చెబుతున్నది నిజం. మీరే చూస్తారు! ఒకవేళ మీరు కాకపోయినా మీ మనవళ్ళో, మునిమనవళ్ళో ఖచ్చితంగా చూస్తారు !

నేను చెప్పినది ఉత్త రెండు యాప్స్ గురించి మాత్రమే ! ఇలాంటివి 1200 పైన రీసెర్చులు జరుగుతున్నాయి. అవన్నీ వస్తే మనిషి బ్రతుకు ఏమౌతుందో ఒక్కసారి ఆలోచించండి ! తల గిర్రున తిరుగుతుందా? పక్కన దేన్నైనా పట్టుకోండి లేదంటే క్రింద పడతారు !

(ఇంకా ఉంది)