“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, డిసెంబర్ 2022, శనివారం

మూడవ అమెరికా యాత్ర - 72 (భయంకర మంచుతుపాన్ తో అమెరికా గజగజ)



అమెరికా మొత్తం మంచుదుప్పటి పరుచుకుంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. డెట్రాయిట్లో  నేనుంటున్న చోట మైనస్ 16 సెంటీగ్రేడ్ ఉంది. 50 మైళ్ళ స్పీడుతో వీస్తున్న గాలి ఉధృతం వల్ల మైనస్ 26 సెంటీగ్రేడ్ అనిపిస్తోంది. Actual is minus 16 but feels like minus 26 due to high cold winds.

కెనడా దగ్గరలో ఉన్న మోంటానాలో అయితే మైనస్ 51 సెంటీగ్రేడ్ కు ఒక్కరాత్రిలో పడిపోయింది. జస్ట్ పదినిముషాలు ఈ చలిలో బయట నిలబడితే మనిషి గడ్డకట్టుకుపోయి చనిపోతాడు.

రెండ్రోజులక్రితం ఆర్క్టిక్ ప్రాంతం నుంచి బయల్దేరిన ఈ బాంబ్ సైక్లోన్ (మంచు తుపాను) ఒక మంచుదుప్పటిలాగా అమెరికా మొత్తాన్నీ ఉత్తరం నుంచి దక్షిణానికి కప్పుకుంటూ పోయింది. కెనడా వైపు నుండి వచ్చిన ఈ మంచు తుపాన్ టెక్సాస్ వరకూ పాకుతూ పోయింది.

జనజీవనం అతలాకుతలమైంది. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్లలోనుంచి బయటకు రావడం లేదు. రావద్దని అమెరికా ప్రభుత్వమే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇదాహో, వ్యోమింగ్, డకోటా రాష్ట్రాలలో అయితే, స్మశానాలలోని సమాధులు కూడా మంచుతో కూరుకుపోయి కన్పించకుండా అయిపోయాయి.

7700 పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్ పోర్టులో జనం నిల్చిపోయారు. మొత్తం మీద గందరగోళంగా ఉంది. ఈ పరిస్థితి ఇంకా ఒకటి రెండ్రోజులపాటు ఉంటుందని అంటున్నారు.

ఇంతాచేస్తే, క్రిస్మస్ సెలవులు. రెండ్రోజుల్లో క్రిస్మస్ ఉంది. ఉన్నట్టుండి ప్రకృతి కన్నెర్ర చేసింది.

ప్రభువుకు కోపం వచ్చిందా? ప్రార్ధనలతోనే రోగాలు తగ్గించి, మిరకిల్స్ చేసే ఫాదర్లు, పాస్టర్లు  ఎంతమంది అమెరికాలో లేరు? వాళ్ళందరూ ఎందుకు దీనిని నివారించలేకపోతున్నారు? వాళ్ళ ప్రార్ధనలు ఎందుకు పనిచేయడం లేదు? కోట్లాదిమంది క్రైస్తవజనం ఎందుకింత ఇబ్బంది పడుతున్నారు? దేవుడెందుకు వారి మొరను ఆలకించడం లేదు? క్రిస్మస్ కు తన భక్తులందరూ రెడీ అవుతున్నారని ప్రభువుకు తెలీదా? తెలిసే కావాలని ఇదంతా చేస్తున్నాడా? లేదా అమెరికాలో కూడా పాపం ఎక్కువైపోయిందా? అయినా నా పిచ్చిగాని, ఇక్కడ పాపం అనే మాటకు అర్థమేముంది? ఇష్టమైతే, ప్రక్కవాడికి ఇబ్బంది లేకపోతే అంతా పుణ్యమే, ఏదీ పాపం కాదు.

క్రీస్తుకే క్రైస్తవులంటే కోపం వచ్చిందా? లేక ఆయనకూడా ఈ మంచు తుపాన్ దెబ్బకు ఎక్కడో దాక్కున్నాడా?

ఏంటో ఏమీ అర్ధం కావడం లేదు.