“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

23, డిసెంబర్ 2022, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర - 71 (హిందువులకు ఆత్మాభిమానం లేదా?)

మా ఫ్రెండ్ ఒకడు, ఇండియాలో వాళ్ళుంటున్న అపార్ట్ మెంట్ మేనేజింగ్ కమిటీకి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. నలభై ఫ్లాట్స్ ఉన్న వాళ్ళ అపార్ట్ మెంట్లో, కేవలం ఆరుగురు మాత్రమే క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళకోసం, అపార్ట్ మెంట్ సెల్లార్లో క్రిస్మస్ పండుగను చేసి కేకులు కోసి, అందరూ తిని, ఫోటోలు దిగారు. వాళ్ళకోసం, హిందూకుటుంబాలలో ఒకాయనకు క్రిస్మస్ తాత వేషం వేశారు. ఈయన వేయించుకుని ఫొటోకు పోజిచ్చాడు.

కానీ, వినాయకచవితికి మాత్రం, శ్రీరామనవమి, కృష్ణజయంతులకు మాత్రం, నవరాత్రులలో అమ్మవారి పూజకు మాత్రం, ఆ ఆరు కుటుంబాలూ రావు. ప్రసాదాలు పెడితే తినవు. 'మేము తినము' అని స్పష్టంగా చెబుతారు. ఒకవేళ మనం చేతిలో పెడితే ఆ ప్రసాదాన్ని మనం కళ్ళముందే కాలవలో పారేస్తారు కూడా. నిన్నమొన్నటిదాకా వాళ్ళుకూడా హిందువులే. నేటికీ, వారిలో చాలాపేర్లు హిందూపేర్లే ఉంటాయి. రిజర్వేషన్ కావాలి కదా మరి !

మనమేమో పోన్లేపాపం, అందరూ ఒకటేలే, అనుకోవడం, వాళ్లేమో అలా అనుకోకపోవడం. ఏంటిది?

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

ఆఫీసులలో కూడా ఇంతే. ఒకరో ఇద్దరో ఉన్న క్రైస్తవులు క్రిస్మస్ పండుగనో, ప్రీక్రిస్మస్ పండుగనో ఆఫీసులో హడావుడి చేస్తారు. దానికి డెకరేషన్ దగ్గరనుంచి అన్నీ హిందువులే చేస్తారు. వేడుకలలో పాల్గొంటారు. బైబిల్ వాక్యాలు వాళ్ళు చదువుతుంటే వీళ్ళు భక్తితో చేతులుకట్టుకుని వింటారు. వాళ్ళు పెట్టిన కేకులు తింటారు. ఒకటి చాలకపోతే, అడిగి పెట్టించుకుని మరీ రెండు తింటారు.

వారు మాత్రం, హిందువుల పండుగలలో ఏ మాత్రమూ పాలుపంచుకోరు. ప్రసాదాలు తినరు.  దూరంగా ఉంటారు. పైగా ఏ మాత్రం అవకాశం దొరికినా ఎగతాళి చేస్తూ విమర్శిస్తారు. అయినా సరే, మళ్ళీ క్రిస్మస్ కు హిందువులు తయారౌతారు. ఎందుకని? ఆ మాత్రం కేకులు మీకు బయట దొరకవా? అంత కక్కుర్తి అవసరమా?

పోన్లే పాపం. అందరూ ఒకటే. మనం అటెండ్ కాకపోతే వాళ్ళు బాధపడతారు అని వీరనుకుంటారు. మరి వాళ్లకూ ఆ ఫీలింగ్ ఉండాలి కదా ! ఉండదు. వాళ్లకు లేనప్పుడు, మీకు మాత్రమే అంత దిగజారుడుతనం ఎందుకు?

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

హిందూదేవాలయాలలో ఉద్యోగులుగా అన్ని మతాల వారూ ఉండవచ్చు. కానీ ఏ వక్ఫ్ బోర్డులో నైనా, చర్చి కమిటీలోనైనా,  మసీదులోనైనా, చర్చిలోనైనా, ఒక హిందువు ఉద్యోగిగా ఉన్నాడా? ఎందుకని? వాళ్లివ్వకనా? వీళ్ళు చెయ్యకనా? మొదటిదే కరెక్ట్ కదా! వారి ఆరాధనాస్థలాలలో గాని, సంస్థలలో గాని హిందువులను దగ్గరకే రానివ్వరు. హిందువులేమో, పోన్లే పాపం, అందరూ ఒకటేగా. అని అనుకుంటారు. వాళ్ళు మాత్రం అలా అనుకోరు. ఏమిటిది?

హిందువులకు ఆత్మాభిమానం లేదా?
   
షిరిడీ సాయిబాబా ఒక ముస్లిం అనేది అందరికీ తెలుసు. ఆయన హిందూ సెయింట్ కానేకాదు. ఆయనను ఒక దేవుడిగా ప్రచారం చేసినదీ, అక్కడకు తండోపతండాలుగా పోతున్నది హిందువులే అనేది కూడా సత్యమే. ఆయన దత్తాత్రేయుని అవతారం కానేకాదు. అదొక కట్టుకథ. దానిని సృష్టించింది కూడా కొంతమంది హిందువులే. సాయిబాబాను అవతారంగా పుస్తకాలు వ్రాసి ప్రచారం చేసినది కూడా కొందరు హిందువులే. జీసస్ దేవుడని, సాయిబాబా దేవుడని సినిమాలు తీసింది కూడా హిందూ నటులే.

మీ స్వార్ధం కోసం ఇంత దిగజారుడుతనం అవసరమా? సాయి సంస్థాన్ లో ఉన్న లక్షలాది కోట్ల రూపాయలను ఎలా ఖర్చుపెడుతున్నారు? దేనికి ఖర్చు పెడుతున్నారు? భక్తులు అక్కడ హుండీలలో వేసే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? అన్నది ఎవరైనా ఆలోచించారా? హిందువులిచ్చే కోట్లాది రూపాయలలో కనీసం కొంతైనా హిందువులకోసం, హిందూమతం కోసం ఖర్చు చేస్తున్నదా సాయి సంస్థాన్?

సాయిరాం, సాయికృష్ణ, సాయి బాలాజీ, సాయి లక్ష్మి, సాయి పల్లవి, సాయి గీత, సాయివిష్ణు, ఇలాంటి పేర్లను తెలివిలేని అమాయకహిందువులు మాత్రమే పెట్టుకుంటారు. ఒక్క ముస్లిమయినా సరే, రామ, కృష్ణ, హరి, శివ, ఆంజనేయ, దేవి మొదలైన పేర్లు తోకలుగా తగిలించుకుంటాడా? ఎన్నటికీ ఉండదు. ఎందుకిలాంటి దిగజారుడుతనం హిందువులలోనే ఉంది? రేపటినుంచీ యేసురామ్, యేసుక్రిష్ణ, క్రీస్తుశివ, యెహోవా బాలాజీ మొదలైన పేర్లుకూడా పెట్టుకోండి, బాగుంటుంది.

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

సాయిబాబాకు గుళ్ళు కట్టి, రామ, కృష్ణ, శివ, విష్ణు, ఆంజనేయ, దేవీ విగ్రహాలను ఆయన కాళ్లదగ్గర పెట్టి, ద్వారపాలకులుగా పెట్టి, పూజలు చేస్తున్నారు. వేదపండితులు డబ్బుకోసం కక్కుర్తి పడి ఆ గుళ్ళలో పూజారులుగా పనిచేస్తున్నారు. సాయిబాబా విగ్రహానికి ఆకుపూజలు అభిషేకాలు చేస్తున్నారు.  మరి ముస్లిములెవరైనా హిందువుల పూజలు వాళ్ళ ఆరాధనాస్థలాలలో చేస్తున్నారా? చెయ్యరు. మరి హిందువులే ఎందుకు ఇలా దిగజారుతున్నారు? సాయిబాబా విగ్రహానికి హిందూ సాంప్రదాయ పూజలు చెయ్యమని ఏ ఆగమశాస్త్రం చెప్పింది? చెప్పనప్పుడు, మీ ఇష్టప్రకారం ఏదిపడితే అది చేయవచ్చునా ? తప్పుకాదా?

వేదం చదువుకున్న పూజారి, సాయిబాబాకు కాగడా హారతి ఇచ్చి, నమాజ్ లో అరిచినట్లు అరుస్తూ పూజ చెయ్యవలసిన అవసరం ఏంటి? డబ్బుకోసమా? ఆ డబ్బు మీకు బయట రాదా? ఇదేనా ధర్మనిష్ఠ అంటే? ఒకవేళ డబ్బు రాకపోతే ఒక్కపూట తిని, రెండో పూట పస్తులుండండి. బ్రాహ్మణధర్మం ఏం చెబుతున్నది? ఇలా చెయ్యమని చెప్పిందా వేదం? 

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

చాలామంది హిందువుల ఇళ్లలో సాయిబాబా విగ్రహాన్ని పూజామందిరంలో పెట్టుకుంటారు. కొంతమందైతే, జీసస్ ఫోటోలను కూడా పెట్టుకుంటారు. ఆశ్చర్యపోకండి. హిందూ పూజామందిరంలో జీసస్ శిలువ ఫోటోను నా చిన్నప్పుడే నేను చూచాను. అదేంటంటే, జీససంటే నాకిష్టం అని ఆ బ్రాహ్మణస్త్రీ చెప్పింది. మరి ఏ క్రైస్తవుడు గాని, ముస్లిం గాని, హిందూదేవీదేవతల విగ్రహాలను వాళ్ళ ఇళ్లలో పెట్టుకుని పూజిస్తారా? చెయ్యరు. మరి ఒక్క హిందువులే ఎందుకు ఇలా అతిమంచితనంగా ఉంటారు?

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

హిందువులలో చాలామంది దర్గాలకు పోయి మొక్కుకుంటూ, తాయెత్తులు కట్టించుకుంటూ ఉంటారు. కొన్నిచోట్ల అయితే, దర్గా కమిటీలను వాళ్లే నడుపుతూ ఉంటారు. గుంటూరులోని మస్తాన్ దర్గాయే పెద్ద ఉదాహరణ. ఇలాంటి దర్గాలు చాలా ఊర్లలో ఉన్నాయి. నడిపేది హిందువులే. అదేమంటే, పరమతసహనానికి ఇదే తార్కాణం అంటారు. బాగానే ఉంది. మరి హిందూ దేవాలయాలను ఏ క్రైస్తవుడైనా, ముస్లిమయినా ఇదే విధంగా చక్కగా నడుపుతున్నారా? ఉండదు. మరి హిందువులే ఎందుకు ఇలా చేస్తున్నారు?

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

శవాన్ని పాతిపెట్టిన చోటకు సాంప్రదాయ హిందువులు పోరు. అది స్మశానంతో సమానం. మరి దర్గాలకు హిందువులు పోయి మొక్కడం, తాయెత్తులు కట్టించుకోవడం చేస్తూనే ఉంటారు.  ప్రతిదర్గాలోనూ, ఒక ఫకీర్ శవం ఉంటుంది. ఆ ఫకీరేమో, హిందూద్వేషాన్ని తన జీవితమంతా అందరికీ నూరిపోస్తూ బ్రతికినవాడై ఉంటాడు. అక్కడకు హిందువులు పోయి, మొక్కుతారు. వాళ్ళు మాత్రం హిందువుల దేవాలయాల దరిదాపులకు కూడా రారు. వీరి ఆచారాలు పాటించరు. కొన్ని తరాల క్రితం వాళ్ళు కూడా హిందువులే మరి. ఒక్క హిందువులకే ఎందుకింత చవకబారుతనం?

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

ఇతరమతాల పైన ద్వేషాన్ని పెంచుకొమ్మని నేను చెప్పడం లేదు. వాస్తవాలను గ్రహించమంటున్నాను. అతిమంచితనం పనికిరాదంటున్నాను. మీ ధర్మం పైన మీకు నిష్ఠ ఉండాలంటున్నాను. మీ దిగజారుడుతనాన్ని, స్వార్ధాన్ని, అమాయకత్వాన్ని కొంచం తగ్గించుకోమంటున్నాను. మీ కాళ్లక్రింద నేల రోజురోజుకూ జారిపోతున్నది. గుర్తించమంటున్నాను.

ఇతరమతాలను తప్పకుండా గౌరవిద్దాం. అది హిందువులు ప్రత్యేకంగా నేర్చుకోవలసిన అవసరం లేదు. అది వారి రక్తంలోనే సహజంగా ఉంటుంది. కానీ, అంతకంటే ముందు మీ ధర్మాన్ని మీ మతాన్ని గౌరవించడం నేర్చుకోమని అంటున్నాను. 

ఆత్మగౌరవం ఉన్నవాడే ఇంకొకరిని  నిజాయితీగా గౌరవించగలుగుతాడు.

మిమ్మల్ని అనుక్షణం ద్వేషించి, మతాలు మార్చాలని చూచేవారి ఆచారాలను పండుగలను మీరు పాటించడం ఎందుకు? చర్చిలకు, దర్గాలకు పోయి మీరు మొక్కడం ఎందుకు? వాళ్ళ సెయింట్స్ ఫోటోలు మీ పూజామందిరాలలో ఎందుకు? వాళ్ళ ఫకీర్లను, ఫాదర్లను మీరు ఆరాధించడం ఎందుకు? వాళ్ళ పేర్లను మీరు తోకలుగా తగిలించుకోవడమెందుకు?

మీ మతంలో ఏం లేదు? ఏం తక్కువైంది? పోనీ, మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.

ఒకప్రక్క వారు మిమ్మల్ని హేళన చేస్తున్నా సరే, మిమ్మల్ని మీ దేవతలను విమర్శిస్తున్నా సరే, అనుక్షణం మిమ్మల్ని కించపరుస్తున్నా సరే, మీరు మీ ధర్మాన్ని పలుచన చేసుకోని, మీ నిష్ఠను వదిలేసి, వారి ఆచారాలను పాటించడం, వారి ఆరాధనాస్థలాలకు పోయి, టోపీలు, పెట్టుకుని, నెత్తిన ముసుగులేసుకుని ప్రార్ధనలు చేయడం ఎందుకు? అంటున్నాను.

హిందువులకు ఆత్మాభిమానం లేదా?

ఆలోచించండి.

మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారా? లేక మీ దేవతలను మోసం చేస్తున్నారా? లేక మీ తల్లిదండ్రులను, పూర్వీకులను మోసం చేస్తున్నారా? మీ దేశాన్ని, ధర్మాన్ని మోసం చేస్తున్నారా? మీకొక వ్యక్తిత్వమూ, ధర్మనిష్టా ఉన్నాయా లేవా? ఇంతటి దిగజారుడుతనమూ, స్వార్ధమూ, భయమూ అవసరమా?

ఆలోచించండి.

హిందువులకు ఆత్మాభిమానం లేదా?