నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

3, డిసెంబర్ 2022, శనివారం

మూడవ అమెరికా యాత్ర - 64 (మా క్రొత్త పుస్తకం 'ఉత్తర గీత' విడుదల)

నేడు గీతా జయంతి. అందుకని, నా కలం నుండి వెలువడుతున్న 56వ పుస్తకంగా మరియొక ఉత్తమగ్రంధము 'ఉత్తరగీత'ను నేడు అమెరికా నుండి విడుదల చేస్తున్నాను. 

మన హిందూమతంలో ఎటువంటి ఉత్తమమైన  గ్రంధాలున్నాయో మనకే తెలియని పరిస్థితి నేడున్నది. అలాంటివాటిలో ఇంకా ఉత్తమములైన గ్రంధములను ఏర్చి కూర్చి, వాటికి నాదైన వ్యాఖ్యానములను వరుసగా వ్రాస్తూ వస్తున్నాను.

ఇదే హిందూమతమునకు, వేదాంత వాఙ్మయమునకు 'పంచవటి' నుండి మేము చేస్తున్న సేవ...

భగవద్గీతకు అనుచరులుగా ఉండే కృష్ణగీతలు రెండు మనకున్నాయి. ఒకటి అనుగీత, రెండు ఉత్తరగీత. ఈ రెండూకూడా శ్రీకృష్ణుని చేత అర్జునునకు బోధింపబడినవే.

నేపధ్యమేమో, మహాభారతయుద్ధం తదుపరి హస్తినాపురంలో రాజభవనప్రాంగణం. యుద్ధభూమిలో  తనకు చెప్పిన విషయములను మరచిపోయానని, మళ్ళీ చెప్పమని అడిగిన అర్జునునకు శ్రీకృష్ణుడు ఓపికగా మళ్ళీ బోధించినవే ఈ రెండు గ్రంధములలోని విషయములు.

భగవద్గీతలో సూచనాప్రాయముగా చెప్పబడిన కొన్ని విషయములు వీటిలో విస్తారముగా వివరింప బడతాయి.  వీటిలో ప్రస్తుతం ఉత్తరగీతకు నా వ్యాఖ్యానమును ఇప్పుడు విడుదల చేస్తున్నాను. దీనిలో యోగసాధనా క్రమం మిక్కిలి వివరముగా చెప్పబడింది. 

కాలక్రమంలో అనుగీతకూడా మా ప్రచురణగా వస్తుంది.

ఈ పుస్తకమును ఇల్లినాయ్ రాష్ట్రంలోని షాంపేన్ సిటీలో ఉన్నపుడు ఎక్కువగా వ్రాశాను. కానీ మిషిగన్ రాష్ట్రంలోని ట్రాయ్ సిటీ నుండి పూర్తిచేసి విడుదల చేస్తున్నాను.

నేటి సోకాల్డ్ మేధావులకు వచ్చే అనేక సందేహాలు అర్జునునకు కూడా అప్పటిలోనే వచ్చాయి. ఎంతైనా మహారాజు కదా మరి! వాటికి శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానములు ఈ  గ్రంధంలో చెప్పబడినాయి. ఆ సమాధానములలో, వేదాంతము, జ్ఞానము, యోగము, తంత్రశాస్త్రములు వివరింపబడినాయి. జీవన్ముక్తి, విదేహముక్తులు లక్ష్యములుగా చెప్పబడినాయి.

ఈ పుస్తకమును వ్రాయడంలో అనుకూలమైన వాతావరణమును కల్పించి, సహకరించిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు ప్రవీణ్, చావలి శ్రీనివాస్ లు, షాంపేన్ లో మమ్మల్ని ఎంతో ఆప్యాయతతో ఆదరించిన శ్రీనివాస్ నూకల, శకుంతలగార్లకు, డెట్రాయిట్ వాసులైన ఆనంద్ కుమార్, సుమతిలకు నా కృతజ్ఞతలు మరియు ఆశీస్సులను అందిస్తున్నాను.

డెట్రాయిట్ లో నా శిష్యులైన సాయి దంపతుల చేతులమీదుగా ఈ గ్రంధం విడుదల అవుతున్నది.

మా అన్ని గ్రంథముల లాగే, ఈ ఒక్క గ్రంధమును మీ జీవితానికి దిక్సూచిగా పెట్టుకుంటే చాలు, మీ జీవితం ధన్యమౌతుంది.

అసలైన హిందూమతమంటే ఏమిటో చదవండి. అర్ధం చేసుకోండి, ఆచరించండి. మానవజీవితాన్ని ఎంతో ఉన్నతంగా మార్చే అసలైన ఫిలాసఫీ మొత్తం ఈ గ్రంధంలో సంక్షిప్తంగా చెప్పబడింది.

మా గ్రంధాలన్నీ ఒక్క హిందువుల కోసమే కాదు, మొత్తం మానవజాతికి ఇవి ఎంతో పనికివచ్చే గ్రంధములు. ప్రపంచంలోని ఏ మతగ్రంధంలోనూ ఇటువంటి ఉన్నతమైన ఫిలాసఫీ మీకు ఎక్కడా దొరకదు. అలాంటివి మన అమూల్యగ్రంధములు. ఇవి మనిషికి మానవత్వాన్ని నేర్పడమే కాదు, దైవత్వంతో నింపుతాయి.

యధావిధిగా ఈ గ్రంధం కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది. మా మిగతా పుస్తకాల వలె దీనిని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాం.