“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

7, డిసెంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 65 (ఈ పౌర్ణమి ప్రభావం-నార్త్ కెరొలినా లో అంధకారం)

డిసెంబర్ 3 శనివారం సాయంత్రం ఏడు గంటలు. నార్త్ కెరొలినాలోని మూర్ కౌంటీలో కరెంట్ పోయింది. ఈ రోజు బుధవారం. నేటికి అయిదురోజులైంది. కరెంట్ రాలేదు. కనీసం ముప్పై వేలమంది ఈ ఐదురోజులుగా చీకట్లో మగ్గుతున్నారు. చలేమో నాలుగు నుండి ఎనిమిది డిగ్రీలుంది. 

ఈ నాలుగు రోజులుగా కరెంటే కాదు. ఇంటర్నెట్ లేదు. మొబైల్ నెట్వర్క్ లేదు. అమెరికన్స్ నానా బాధలు పడుతున్నారు. ఈ చలిదేశంలో కరెంట్ లేకపోతే ఒక్కరోజైనా బ్రతకడం చాలా కష్టం. అలాంటిది అయిదు రోజులుగా నార్త్ కెరొలినా వాసులు నరకం చూస్తున్నారు.

సరిగ్గా పౌర్ణమి నీడలో ఇది జరిగింది.

అమెరికాను సూచించే మిథునరాశి నుండి చూస్తే, లగ్నాధిపతి బుధుడు సప్తమంలో  కెళ్ళిపోయాడు.  సప్తమానికి అర్గళం పట్టింది. మేషంనుండి రాహు, కుజ, చంద్రుల దృష్టి ధనుస్సు మీదుంది. అందుకే  ఇలా జరిగింది.

అయితే, ఇది ఏదో దానంతట అది జరిగిన విద్యుత్ ఫెయిల్యూర్ కాదు. ఎవరో దుండగులు వచ్చి, సబ్ స్టేషన్లమీద కాల్పులు జరిపి అక్కడి పరికరాలను ధ్వంసం చేశారు. వాళ్ళను ఇంతవరకూ  పట్టుకోలేకపోయారు. 'దాడులకు మన పవర్ లైన్లు ఎంత అందుబాటులో ఉన్నాయో చూడండి; అని ఇక్కడ సోషల్ మీడియాలో అమెరికన్లు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, 'గ్యాస్ లైన్లు, వాటర్ సప్లై లైన్లు కూడా ఇదే విధంగా సరైన రక్షణ లేకుండా ఉన్నాయి. మనకు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు' అని భయపడుతున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.

రాజకీయపార్టీల మధ్య గొడవలతో ఇవి జరుగుతున్నాయని, దుండగులు చేసిన పని కాదని లోకల్ వార్తలు. ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఫెడరల్ ప్రభుత్వం సామాన్యంగా జోక్యం చేసుకోదు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా రంగంలోకి దిగి  నార్త్ కెరొలినాకు సాయం చేస్తున్నారు. రాజకీయగొడవలకు ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇక్కడ కూడా ఉందన్నమాట. అవున్లే ఇండియాలో అయితే మకలహాలు రెచ్చగొట్టొచ్చు, ఇక్కడ అది కుదరదు. కాబట్టి ఇలాగన్నమాట. ఎక్కడైనా మనిషి మనస్తత్వం ఒకలాగే ఉంటుంది మరి. 

ఇదంతా చూస్తుంటే మన ఇండియా ఎంత స్వర్గమో అర్ధమౌతున్నది. ఇక్కడ సమస్యలు చాలా తక్కువ. కానీ ఇక్కడ కూడా ఉన్నాయి. చాలాసార్లు వాటినే మేనేజ్ చేయలేకపోతున్నారు.  అదే మన ఇండియాలో అయితే, అన్నీ సమస్యలే. అడుగడుక్కూ సమస్యలే. అందరూ దేశద్రోహులే. అయినా అక్కడ నడుస్తున్నదంటే అది మనుషుల మంచితనమో ఇంకేదోనో మాత్రం తెలీడం లేదు..

ఏదేమైనా, ఈ పౌర్ణమికి ఇక్కడ ఇలా జరిగింది.