“Self service is the best service”

25, మార్చి 2013, సోమవారం

గాలి ఇటుకల కలలసౌధం

కళ్ళు తెరిస్తే నేలరాలే సుమమేగా స్వప్నం 
చూపు నిలిపితే కాలిపోయే తీపేగా మోహం 
ఈ మర్మం బాగా తెలుసుకో నేస్తం 
కోర్కెల అలలపై పడవేగా జీవితం 
మార్పుల చేర్పుల నటనేగా జీవితం 

స్వప్న సుగంధానికై జాగ్రత్తులో అన్వేషణ 
నిత్య సుఖోపలబ్దికై తీరని జంఝాటన
నూతనమైన మాటొకటి చెప్పు నేస్తం  
తీరని ఆశల కోసం తపనేగా జీవితం
అందని తీరాల వైపు పరుగేగా జీవితం   

అందిన క్షణంలో జారిపోతుంది అనుభవం 
అంచుల వరకూ వెంటాడుతుంది పాడుగతం  
మనసు పరచి తేటగా చూడు నేస్తం 
ఎండలో నీడకై వెతుకులాటేగా జీవితం 
ఏం కావాలో తెలియని అభ్యర్ధనేగా జీవితం 

ప్రతి మనిషి హృదయమూ ఒక నిప్పుల కొలిమే 
ప్రతి గుండె కోరేదీ ఒక శాశ్వత చెలిమే 
మనసును చల్లబరిచే పాటొకటి పాడు నేస్తం  
తెలియని తపనలో కాలడమేగా జీవితం
వికసించక మునుపే రాలడమేగా జీవితం  

గాలి ఇటుకల కట్టిన కలల సౌధం జీవితం 
డొల్ల ప్రేమల చెదిరిన నీటిచిత్రం జీవితం 
నీవు కాదన్నా నీ కళ్ళు చెబుతాయి నిజం
చిమ్మచీకట్లో గమ్యం తెలియని పరుగేగా జీవితం
గెలుపు సందిట్లో నవ్వే ఓటమి పిలుపేగా జీవితం..