“There are many who just talk, but very very few who really realize" - Self Quote

12, మార్చి 2013, మంగళవారం

శ్రీపాద పినాకపాణి -నందన మాఘ అమావాస్య కుండలి

నందన మాఘ అమావాస్య కుండలిని పరిశీలిద్దాం. పాశ్చాత్య జ్యోతిష్యంలో దేశజాతకం చూచేటప్పుడు సన్ ఇంగ్రెస్ చార్టులకు తోడు న్యూమూన్, ఫుల్ మూన్ చార్టులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

ఆరోజున 10-3-2013 ఆదివారం అమావాస్య శతభిష నక్షత్రం అయింది. కనుక ఒక ప్రముఖుని మరణం సూచింపబడుతున్నది.

లగ్నం దేశలగ్నం నుంచి అష్టమంలో ఉంటూ నష్టాన్ని సూచిస్తున్నది. ఇకపోతే అమావాస్య రాశి దేశలగ్నానికి దశమంలో పడి, ఒక ప్రసిద్ధ వ్యక్తికి కీడు మూడిందని సూచిస్తున్నది.ఇదే సమయంలో ఆకాశంలో "పాన్-స్టార్స్" తోకచుక్క దర్శనం ఇచ్చింది. తోకచుక్కలు కనిపించినప్పుడు దేశాదినేతలో ప్రసిద్ధవ్యక్తులో నేలరాలి పోతారన్నది అతి ప్రాచీనకాలం నుంచి రుజువౌతూ వస్తున్న సత్యం.

ఈసారి ఈ గ్రహగతులవల్ల 'సంగీత కళానిధి' శ్రీపాద పినాకపాణి పరలోక ప్రయాణం కట్టారు. డబ్బుకూ అధికారానికీ మాత్రమె విలువిచ్చే ఈలోకం దృష్టిలో ఈయన గొప్పవాడు కాకపోవచ్చు.కాని కర్నాటక సంగీత ప్రియులకు ఆయన విలువ తెలుసు.శాస్త్రీయసంగీతపు విలువ తెలియని ఆంధ్రదేశంలో ఉంటూ దాని విలువను అందరికీ తెలియచెయ్యాలని తపించిన సంగీతతపస్వి ఆయన.

నిండు నూరేళ్ళు బ్రతికిన పినాకపాణిగారు అమావాస్య పరిధిలోనే పరలోకానికి పయనించారు."అన్నీ తెలిసినవాడు అమావాస్యనాడు పోతాడు"-- అనే సామెత మళ్ళీ రుజువైంది.

ఇదిలా ఉంటె, సరిగ్గా సోమవారం అంటే నిన్న ఉదయం గుంటూరు నుంచి వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీకి విద్యార్ధులను ఎక్కించుకొని వెళుతున్న ఒక ఆటో దానికంటే ముందు వెళుతున్న ఇంకో వాహనాన్ని ఓవర్ టేక్  చెయ్యబోయి తిరగబడి అందులో ఉన్న బీటెక్ విద్యార్ధులు అందరూ తీవ్రగాయాల పాలయ్యారు.ఇద్దరికి కాళ్ళు విరిగాయి.అందులో ఒకరికి కాలు తొలగించవలసిన పరిస్తితి వచ్చింది.ఇద్దరికేమో తలకు బలమైన దెబ్బలు తగిలాయి.వాళ్ళ పరిస్తితి ఇంకా ప్రమాదకరంగానే ఉన్నది.ఇంకో ఇద్దరికి మాత్రం ముఖానికీ కాళ్ళూ చేతులకూ బాగా దెబ్బలు తగిలి కొట్టుకుపోయాయి గాని ఎముకలు విరగలేదు.ఆ ఇద్దరిలో ఒకడు నా స్నేహితుని కొడుకు కావడమూ, సమయానికి స్నేహితుడు నల్లగొండలో ఉండటంతో నాకు ఫోన్ చేశాడు.వెంటనే బయల్దేరి అప్పటికే 108 లో ఆస్పత్రికి చేరిన అబ్బాయి దగ్గరకెళ్ళి ఎక్స్ రేలూ స్కానింగ్ లూ తీయించి బెడ్ లో చేర్పించి మధ్యాన్నం దాకా ఉండి వచ్చాను.అదృష్టవశాత్తూ పైపైన దెబ్బలే తగిలాయి గనుక ఒకరోజు పరిశీలనలో ఉంచి పంపిస్తామన్నారు.

అమావాస్యా పౌర్ణములు,మానవ జీవితం మీద ఖచ్చితమైన ప్రభావం చూపిస్తాయి.ఇందులో ఏ మాత్రం సందేహం ఉండే అవసరం లేదు.ఆయా ప్రభావాలు, ఒక్కొక్కరి జాతకాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఖర్మ చాలక,చెడు దశలు జరుగుతుంటే చావే మూడుతుంది.ఇది ఎంతోమంది జాతకాలలో గమనించడం జరిగింది.అందుకే పాతకాలంలో పెద్దవాళ్ళు 'అమావాస్య పౌర్ణములలో ప్రయాణాలు వద్దని,దుడుకుపనులు చెయ్యొద్దని' అనేవారు.దీనికి రుజువులు జీవితంలో అనునిత్యమూ కనిపిస్తూనే ఉంటాయి.గమనించే చూపు మనకు ఉంటే చాలు.

మొత్తం మీద ఈ అమావాస్య "సంగీతకళానిధి"ని తీసుకుపోయింది. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.