“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, ఫిబ్రవరి 2019, గురువారం

రాహుకేతువుల రాశి మార్పు - 2019 - ఫలితాలు

మార్చి 7 వ తేదీన రాహుకేతువులు రాశులు మారుతున్నారు. ఇప్పటివరకూ కర్కాటకం - మకరంలో ఉన్న వీరు మిథునం - ధనుస్సులలోకి మారుతూ 18 ఏళ్ళ తర్వాత ఉచ్చస్థితిలోకి వస్తున్నారు. ఈ స్థితిలో వీరు ఏడాదిన్నర పాటు ఉంటారు.

రాశుల మధ్య ఉన్న Twilight zone ప్రభావం వల్ల గతవారం నుంచే వీరి ప్రభావం అనేకమంది జీవితాలలో, అనేక రంగాలలో కనిపించడం మొదలైపోయింది. జాగ్రత్తగా గమనించుకుంటే ఆయా మార్పులను మీమీ జీవితాలలో మీరే చూచుకోవచ్చు. ద్వాదశ రాశుల వారికి ఈ మార్పు ఏయే ఫలితాలను ఇస్తుందో క్రింద చదవండి.

మేషరాశి 

ఆత్మవిశ్వాసం అమితంగా పెరిగిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగు పడతాయి. మంచివార్తలు వింటారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులలో కదలిక వస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది. తండ్రికి మంచికాలం మొదలౌతుంది. దూరపు సంబంధాలు కుదురుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. విదేశాలకు వెళతారు.

వృషభరాశి

మాట దూకుడు ఎక్కువౌతుంది. కుటుంబంలో మంచి జరుగుతుంది. ఆస్తి కలసి వస్తుంది. విందులు వినోదాలు ఎక్కువౌతాయి. మాటల్లో ఆధ్యాత్మికం ఎక్కువగా కనిపిస్తుంది. ఉపన్యాసాలు ఇస్తారు. సంతానానికి మంచి సమయం మొదలౌతుంది. కొందరికి దీర్ఘవ్యాధులు ఉద్రేకిస్తాయి. కొందరి పెద్దలకు ప్రాణగండం ఉంటుంది.

మిధునరాశి

మనసుకు సంతోషం కలుగుతుంది. ఎంతోకాలం నుంచీ ఎదురుచూస్తున్న వ్యక్తులు ఎదురౌతారు. కుటుంబంలో సంతోషం నిండుతుంది. జీవితభాగస్వామికి ఒక చెడు, ఒక మంచి జరుగుతాయి. కొన్ని విషయాలలో కుటుంబంలో మనస్పర్ధలు వస్తాయి. కానీ త్వరలోనే సర్దుకుంటాయి.

కర్కాటక రాశి

విదేశీప్రయాణం జరుగుతుంది. విదేశీ సంబంధాలు కుదురుతాయి. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టుకేసులు గెలుస్తారు. శత్రువులపైన విజయం సాధిస్తారు. హోదాలు బాధ్యతలు పెరుగుతాయి. రహస్యసంబంధాలు సమాలోచనలు ఎక్కువౌతాయి. తెలివితేటలను ప్రక్కదారిలో వాడతారు.

సింహరాశి

కుటుంబం మరియు సంతానం దూరమౌతుంది. అయితే అదొక మంచిపనికోసమే జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చెడుస్నేహితులు ఎక్కువౌతారు. అక్రమసంపాదన ఎక్కువౌతుంది. దానితోబాటే దీర్ఘరోగాలు కూడా ఎక్కువౌతాయి. అన్నయ్యలకు అక్కయ్యలకు మంచి జరుగుతుంది. దైవభక్తి, ఇతరులకు సహాయపడే తత్త్వం ఉన్నవారికి మేలు జరుగుతుంది.

కన్యారాశి

ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. హోదా పెరుగుతుంది. అధికారం వృద్ధి అవుతుంది. అయితే, దానికి సమాంతరంగా ఇంటిలో మాత్రం సంతోషం ఉండదు. ఇంటివిషయాలలో మనశ్శాంతి లోపిస్తుంది. ఈ రెంటి మధ్యన మనస్సు సంఘర్షణకు గురౌతుంది.

తులారాశి

దూరప్రాంతాలకు వెళతారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. విదేశీయానం సఫలం అవుతుంది. ధైర్యం పెరుగుతుంది. కాలం కలసి వస్తుంది. అయితే, తొందరపాటుతో మాట జారడం వల్ల గొడవలు వస్తాయి. ఎదురుదెబ్బలు తగులుతాయి. తండ్రికి గురువులకు మంచి సమయం. తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు కూడా మంచి జరుగుతుంది. కానీ వారికి జరిగే మంచిలో కొంత చెడు కలసి ఉంటుంది.

వృశ్చిక రాశి

సాంప్రదాయపరమైన దైవచింతన పెరుగుతుంది. కుటుంబంలో ఎడబాట్లు ఉంటాయి. మాట తడబడుతుంది. మాటదూకుడు వల్ల సేవకులు దూరమౌతారు. సరదాలు విలాసాలు ఎక్కువౌతాయి. రహస్యవిద్యల మీద ఆసక్తి పెరుగుతుంది. దీర్ఘవ్యాదులు ఉద్రేకిస్తాయి. కొందరికి ప్రాణగండం కూడా ఉన్నది.

ధనూరాశి

కాలం కలసి వస్తుంది. అయితే, మొదట్లో అంతా బాగున్నట్లు అనిపించినప్పటికీ, క్రమేణా జీవితభాగస్వామి నుంచీ, వ్యాపార భాగస్తులనుంచీ గొడవలు ఎదురౌతాయి. కొంతమందికి కుటుంబంలో దౌర్జన్యపూరిత సంఘటనలు చోటు చేసుకుంటాయి. దీర్ఘవ్యాదులు తలెత్తుతాయి. యాక్సిడెంట్లు  అవుతాయి. ఆస్పత్రిని సందర్శిస్తారు.

మకరరాశి

ఉన్నట్టుండి కాలం కలసివస్తుంది. కుటుంబంలో మంచి జరుగుతుంది. శత్రువులను జయిస్తారు. చాలాకాలం నుంచీ ఇబ్బంది పెడుతున్న సంఘటనలు మాయమౌతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూరప్రదేశాలలో మిత్రులు ఏర్పడతారు. విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేస్తారు. నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది.

కుంభరాశి

ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువౌతుంది. అలౌకిక అనుభవాలను పొందుతారు. సంతానానికి మంచి సమయం మొదలౌతుంది. అన్నయ్యలకు, అక్కయ్యలకు మంచీ చెడూ రెండూ ఎక్కువౌతాయి. ఉద్యోగంలో రాణింపు ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే తత్త్వం ఎక్కువౌతుంది. అలాగే, తనకు సహాయపడేవారు కూడా ఎదురుపడతారు.

మీనరాశి

కుటుంబసౌఖ్యం వృద్ధి అవుతుంది. సంతోషకరమైన మార్పులను చూస్తారు. సంబంధాలు కుదురుతాయి. బిజినెస్ వృద్ధి అవుతుంది. ఉద్యోగంలో ప్రొమోషన్ వస్తుంది. ఆదాయం వృద్ధి అవుతుంది. అయితే, దీనితో బాటు స్థానచలనం కూడా ఉంటుంది. చాలాకాలం నుంచీ ఉన్న మిత్రులు సేవకులు దూరమౌతారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది.

ఈ ఫలితాలను, లగ్నం నుంచి, చంద్రుని నుంచి కూడా కలుపుకుని చూడాలి. అప్పుడు ఫలితాలలో ఎక్కువగా స్పష్టత వస్తుంది. ఒక్కసారి 18 ఏళ్ళ వెనుకకు చూచుకుంటే చిన్నచిన్న తేడాలతో దాదాపుగా ఇవే ఫలితాలు మీమీ జీవితాలలో వచ్చినట్లుగా గమనించవచ్చు.