“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

25, ఫిబ్రవరి 2019, సోమవారం

వేలం వెర్రి

మనకు సైన్సు పెరిగింది, తెలివి పెరిగింది అని విర్రవీగుతున్నాం.  కానీ   ఏం   తినాలో తెలీదు.   ఎలా తినాలో తెలీదు. ఎలా బ్రతకాలో తెలీదు. ఏం చెయ్యాలో   తెలీదు. ఏం చెయ్యకూడదో తెలీదు. ప్రతిదీ, టీవీలో  ఎవడో ఒకడు మనకు చెప్పాలి. కొన్నాళ్ళపాటు అదే వేదం. ఆ తర్వాత ఇంకొకడోస్తాడు. అప్పుడు పాతవాడు చెప్పినది నచ్చదు. ఈ క్రమంలో జనాలు మతులు పోయి, ఎవడేది చెబితే అది తినడం. ఎవడేది   చెబితే అది త్రాగడం, ఎవడేది చెబితే అది చెయ్యడం వేలంవెర్రిలా తయారైంది.

పావు లీటర్ డెట్టాల్, అరలీటరు ఫినాయిలు, కొంచెం  ఎలుకల మందు బాగా కలిపి లీటరు టాయిలెట్ క్లీనర్ లో రెండు రోజులు నానబెట్టి ప్రతిరోజూ పొద్దున్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ త్రాగండి మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అని    టీవీలో చెబితే చాలు, పొలోమంటూ ఎగబడేవాళ్ళు వేలల్లో లక్షల్లో కనిపిస్తున్నారు. కలికాలం అంటే ఇదేనేమో ?

మన శరీరం ఏం చెబుతున్నదో మనం గ్రహించగలిగితే బయటనుంచి  ఎవడూ మనకు ఏమీ చెప్పనక్కరలేదు. ఆ తెలివిని కోల్పోయాం గనుకనే ఎవడేది చెబితే దానిని ఫాలో అవుతున్నాం.

అంటుకొర్రలు కేజీ 350 అయినా ఎగబడి కొంటున్నారంటే కొనరూ మరి? మనుషుల్లో ఎంతగా భయభ్రాంతులు పెరిగిపోయాయో తెలియడానికి ఇంతకంటే నిదర్శనం వేరే కావాలా?

ఈ గోల అంతా చూచి వ్రాసిన కొన్ని సరదా పద్యాలు చదవండి !
--------------------------------------------------
ఆ || తిండి మానివేసి తోటకూరల మెక్కి
పండ్ల రసములన్ని పట్టి ద్రావి
బోటు తొక్కుమింక బాగుగా నదియందు
ఊయలొకటి ఎక్కి ఊగుమింక

ఆ || ఎనిమ జేసుకొమ్ము ఏమార బోకుండ
పచ్చి కూరలన్ని బాగ నములు
ఉడకబెట్టినంత ఉన్మాదమే బుట్టు
కాయగూర దినుము కడుగకుండ

ఆ || కాఫి ద్రాగువాడు కాటికే బోయేను
టీలు ద్రాగినంత తిక్క బెరుగు
మానివేయ నాకు మర్యాద కాదన్న
గ్రీను టీలు ద్రాగు గింజుకొనుచు

ఆ || మొలకలన్ని దినుచు మోమాట పడకుండ
తిండి మానివేసి దేబె వోలె
నిమ్మకాయ నీళ్ళు నీటుగా ద్రాగరా
వింత పశువువోలె వెయ్యి ఏళ్ళు

ఆ || నిమ్మకాయ నీళ్ళు నిలువెత్తు గ్లాసులో
పుట్ట తేనె గలిపి పూర్తిగాను
త్రాగుచుండవలయు తేపతేపకు నీవు
ఫ్యాటు దగ్గిపోవు నీటుగాను

ఆ || జంతువేది గాని చక్కగా ఉడికించి
తినగబోదు ఎట్టి తిండినైన
నీవు కూడ అట్లె నీరసంబుగ బ్రదికి
పశువులాగ దిరుగు పట్టి పట్టి

ఆ || ఉప్పు దినెడి పశువు ఉర్విలో లేదింక
ఉప్పు దినుట పెద్ద తప్పు గాదె?
ఉప్పు మానివేసి ఊరగాయలు రోసి
చప్పికూడు దినర చచ్చువెధవ !

ఆ || నూనె దగలనీకు న్యూలైఫు నీకందు
నూనె దినగ బెరుగు బాన పొట్ట
నూనె మానివేసి నూరేళ్ళు బ్రతకరా
నుయ్యి దూక మేలు నూనె కన్న

ఆ || ఉప్పుకారమన్న ఉరిబోసికొనినట్లు
పాలు పెరుగులన్న పాపమౌను
నూనె వాడుటన్న నూతిలో బడినట్లు
నీళ్ళు ద్రాగి బ్రతుకు నీటుగాను

అని ఒకాయన బోధిస్తాడు
-------------------------------------------------------

ఆ || ఇడ్లి పూరి యుప్మ ఇవియన్ని డేంజర్లు
తినిన యంత చచ్చి తిరిగి రావు
మాంసమొకటి బాగ మెక్కరా తిన్నంత
పగలు రాత్రి యనక పాచిపెట్టి

ఆ || ఆవనూనె దెచ్చి ఆబగా లాగించు
పొద్దుపొద్దు గానె పావుకేజి
లంచి టైములోన లిన్సీడు ఆయిల్ను
నిద్రముందు ద్రాగు నిమ్మనూనె

ఆ || నారికేళ నూనె నాటుగా లాగించు
పావుకేజి దెచ్చి పట్టుబట్టి
అర్ధరాత్రి పూట ఆముదం లాగించు
అర్ధకేజి బాగ ఆవురనుచు

ఆ || ఫిష్షు మాంసమేమొ పొద్దుపొద్దున మెక్కి
మద్దియాన్నమేమొ మటను మెక్కి
చీకటైన పిదప చికెనునే లాగించు
అర్ధరాత్రి మెక్కు అండమొకటి

ఆ || మాంసమొకటి దినగ మంచిగా బ్రతికేవు
పశువులన్ని దినును పచ్చికండ
మనిషివన్న మాట మర్చిపో నీవింక
పశువు లాగ బ్రతుకు పట్నమందు

అని ఇంకొకాయన లెక్చరిస్తాడు
--------------------------------------------------
ఆ || బియ్యమన్న మాట బెంబేలు పుట్టించు
బియ్యమన్న పెద్ద దయ్యమౌను
చిన్నగింజలన్న చేయెత్తి జైకొట్టు
చిరుల ధాన్యమందు చేవగలదు

ఆ || ఆదివారమేమొ అరికలే భుజియించి
సోమవారమేమొ సామలనుచు
కుజుని వారమందు కొర్రలే వండించి
బుధుని వారమందు ఊదలనుచు

ఆ || గురుని వారమందు గురిగింజలే వండి
శుక్రవారమేమొ సూపు ద్రాగి
మందవారమందు మోమాటమే వీడి
అంటుకొర్రలనుచు అంటకాగి

ఆ || ఒక్క వారమైన ఓర్పుగా ఇట్లుండ
ప్రక్కవారమందు పిచ్చిబుట్టి
ఆసుపత్రి లోన ఐసీయులో జేరి
శవము వౌదు వీవు చక్కగాను

ఆ || వేపకాయ రసము వేన్నీళ్ళలో వేసి
కొత్తిమీర రసము కొంత గలిపి
బచ్చలాకు రసము బాగుగా దట్టించి
మెంతికూర రసము మరగబెట్టి

ఆ || గడ్డి మోపు దెచ్చి గానుగన్ ఆడించి
దురదగొండి ఆకు దూసిపోసి
అన్ని గలిపి నీవు ఆరార ద్రావంగ
దుక్కలాంటి ఒళ్ళు దక్కు నీకు

అని మూడో ఆయన ముచ్చటగా సెలవిస్తాడు
------------------------------------------------------

ఆ || కొర్రలేమొ కొనగ కొరువులై పోయేను
సామలేమొ జూడ శోష వచ్చు
అంటుకొర్రలన్న ఆకాశమంటేను
వరిగ కొందమన్న వర్రి యౌను

ఆ || తెల్ల బియ్యమేమొ తేరగా దొరికేను
అరికెలేమొ జూడ అరుదులాయె
చిన్నగింజలమ్ము షాపులంబటి జేరి
క్యూల నిల్చి జనులు కుంకలైరి

ఆ || గుడిసెలందు జనులు గుట్టుగా భుజియించు
గింజలన్ని బాగ గీరబట్టి
మోతుబరులు కూడ మోయగా లేనంత
రేటుకెక్కె; ఏమి బూటకమ్మొ ?

ఆ || సందులోన బెట్టి సద్దులే లేకుండ
మాంస మమ్మునట్టి మటను షాపు
రోడ్డు మీద కొచ్చి రోతగా నిలిచింది
వీరబోధ గాచి వెర్రి బుట్టి

ఆ || ఎవడి సోది వాడు ఎట్లైన జెప్పేను
వినెడివాడు పెద్ద వెర్రియైన
ఎంత భయములోన ఉందిరా లోకమ్ము?
ఏమి వెర్రి? ఇంత? ఏమి వింత?

ఆ || ఒళ్ళు జెప్పుమాట ఓర్పుగా వినినంత
ఎవని మాటగాని ఎందుకింక?
నీకు తగిన ఫుడ్డు నిర్ణయించెడివాడు
నీవు తప్ప లేడు నింగినైన

ఆ || ఎవని ఒళ్ళు వాడి కెన్నెన్నొ హింట్లిచ్చు
వాని బాగ వినగ వండ్రఫుల్లు
బాడి లాంగువేజి బాగుగా గానలేక
తిక్కపనుల జనులు తిరుగుచుంద్రు
-------------------------------------------------------
తనకు పడే తిండిని మితంగా తింటూ, మితంగా వ్యాయామం చేస్తూ, అల్లోపతి మందులు వాడకుండా, దురలవాట్లు లేకుండా, దురాశ లేకుండా, వేళకు తిని వేళకు నిద్రపోతూ, సంతోషంగా ఉంటూ, క్షమించడం, నవ్వుతూ బ్రతకడం నేర్చుకుంటే టీవీ బోధకులు చెప్పేవి ఏవీ అవసరం లేదు. ఈ ఆర్ట్ తెలీకనే లోకులు ఇన్ని వేషాలేస్తున్నారు. కానీ ఏమీ ఉపయోగం ఉండటం లేదు.

మనుషుల మనసులు ఉన్నతంగా మారకుండా, ఊరకే తినే తిండి మారితే ఏం ఉపయోగం? కలియుగంలో కనిపించే అనేక మాయలలో ఇదొక మాయ గామోసు !

చూద్దాం ఈ వెర్రి వేషాలు ఎన్నిరోజులో??