“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

19, ఏప్రిల్ 2011, మంగళవారం

శని కుజుల ప్రభావం - తప్పిన దేశాల అంచనా- పునరాలోచన

ఏప్రిల్ ఏడవ తేదీన వ్రాసిన పోస్ట్ ప్రకారం,15 నుంచి 18 తేదీల లోపు ప్రకృతి విలయాలు, దుర్ఘటనలు జరగాలి. గత మూడు రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు చూస్తె ఇది నిజమైందని తేలుతుంది. కాని ప్రదేశాల గురించి చేసిన ఊహ మాత్రం ఘోరంగా గురి తప్పింది. అమెరికాలో తోర్నడోలు ( సుడిగాలులు) సృష్టించిన విలయం, ప్రస్తుతం టెక్సాస్ లో లక్షల ఎకరాలు అగ్నిలో తగలబడుతున్న వైనం, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలూ చూస్తే, "టైం విండో" వరకూ జోస్యం నిజమైన విధానం తెలుస్తుంది. ఇవే కాక మన దేశంలో చూద్దామంటే, గుంటూరులో కోల్డ్ స్టోరేజి తగలబడి కూలిపోయిన ఘటనా, ముంబై-ధిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ లో అగ్నిరగిలి మూడు బోగీలు కాలిపోవటం, భీమ్లీలో అగ్ని ప్రమాదం ఇలాటి చిన్న చిన్న సంఘటనలు ( అంటే నా ఉద్దేశం ఇవి చిన్న సంఘటనలు అని కాదు, అంతర్జాతీయంగా ప్రభావం చూపనివి అని మాత్రమె నా భావన) చాలా జరిగాయి. ఘటనలన్నింటి లోనూ వాయువు, అగ్ను పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. జ్యోతిష్య పరంగా శని కుజుల సమసప్తక స్థితివల్ల ఎంత విధ్వంసం జరుగవచ్చో, గ్రహస్థితుల వల్ల భూమ్మీద ఎలాంటి విలయాలు జరుగవచ్చో, సంఘటనలు అద్దం పడుతున్నాయి.

మేదినీ జ్యోతిష్యం లో స్థూలంగా రెండు అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఒకటి - ఆయా సంఘటనలు ఎప్పుడు జరుగుతాయో ఊహించటం. రెండు- అవి ఎక్కడ జరుగవచ్చో ఊహించడం. ఒకటి టైం విండో. రెండవది లొకేషన్ విండో. రెంటిలో, సమయాన్ని చాలా సార్లు ఖచ్చితంగా ఊహించగలిగినా, ప్రదేశాన్ని ఊహించడంలో మాత్రం చాలాసార్లు నాకు గురి తప్పింది. అయినా పరవాలేదు. ఎడిసన్ బల్బును కనుక్కోవడానికి వేలసార్లు ప్రయత్నించి చివరికి విజయం సాధించాడు. అలాగే ప్రయత్నంలో కూడా చివరకు గెలుపు దక్కక మానదు. ఏ రీసెర్చి అయినా ఇలాగే సాగుతుంది. ఓడిపోయిన ప్రతిసారీ ఓటమికి కారణాలను విశ్లేషించడం, వాటి సాయంతో తిరిగి ముందుకు పురోగమించడమే ఎందులోనైనా విజయం సాధించడానికి మార్గం. అప్పుడే విజయంలోని తీపి, అనుభవం లోకి వస్తుంది.

దేశాలను, ప్రదేశాలను ఊహించడంలో, మన జోస్యంలో ఎక్కడ పొరపాటు జరిగిందో విశ్లేషిద్దాం.

శని కుజులున్న కన్యా మీన రాశులను ప్రాతిపదికగా తీసుకుని అవి సూచిస్తున్న దేశాలలో దుర్ఘటనలు జరుగవచ్చు అనుకున్న ఊహ తప్పు అని తేలింది. రెండు సమానమైన, విధ్వంసకర శక్తి గల గ్రహాలు ( ప్రస్తుత స్థితిలో శని కుజులు) పరస్పరం ఎదురెదురుగా ఉన్నపుడు వాటి ప్రభావం రెండు రాశులు సూచిస్తున్న ప్రదేశాల పైన ఉండదు, కారణం ఏమంటే శక్తి పరస్పరం వెనక్కు తిప్పికొట్ట బడుతుంది. మరి విధ్వంశకరశక్తి ఎక్కడికి పోతుంది అని చూస్తే ఒక కొత్త సూత్రం కనిపిస్తున్నది. శని యొక్క దశమ దృష్టీ, కుజుని చతుర్ధ దృష్టీ కలిసి ఒకేసారి మిధున రాశి పైన పడుతున్నది. మిధున రాశి అమెరికాకు సూచిక అని జ్యోతిష్కులకు తెలిసిన విషయమే. కనుకనే దారి మళ్ళించబడిన శక్తివల్ల కన్యా రాశికి చెందిన దేశాలూ, మీన రాశికి చెందిన దేశాలూ రక్షించబడి, దాని ప్రభావం వల్ల మిధున రాశికి సూచికలైన నార్త్ అమెరికాలో సుడిగాలులు, టెక్సాస్ లో భీకర అగ్ని ప్రమాదం జరిగాయి అన్న కొత్త విషయం వెలుగు చూస్తున్నది. సూత్రాన్ని ముందుముందు చెప్పబోయే మేదినీజోస్యాలలో ఉపయోగించుకోవడం జరుగుతుంది.

ఇకపోతే ఇదే సమయంలో, మన దేశంలో మతాచార్యులకు సంబంధించి ఒక దుర్ఘటన జరుగవచ్చు, దానివల్ల ప్రజల మనస్సులకు బాధ కలుగవచ్చు అనుకున్నాం. అలాగే, పదిహేనోతెదీన వచ్చిన ఒక పత్రికాకధనం వల్ల సత్య సాయి భక్తులందరూ తీవ్ర మనోవేదనకు గురవడం జరిగింది. దాని ఫలితంగా గందరగోళం ఏర్పడి ప్రభుత్వ చర్యలూ, స్వచ్చంద సంస్థల వ్యాజ్యాలూ మొదలు కావడం అయిదు రోజులుగా గమనిస్తున్నాం. ఈ సంఘటనలు కూడా ముందే మనం ఊహించిన సమయంలోనే జరగడం గమనార్హం.

ఇకపోతే, కొన్ని వివరాల ప్రకారం 4 -10 -1929 అనేది బుక్కపట్నం స్కూల్ రికార్డ్ ప్రకారం బాబాగారి పుట్టిన తేదీ. ఈ తేదీకి ఆయన లగ్నం కన్య అవుతుంది. సమయానికి ఆయన జాతకంలో రవి 17 , బుధుడు 26 డిగ్రీలలో ఉన్నారు. దీని ప్రకారం , తేదీ గనక ఆయన నిజమైన జనన తేదీ అయితే, ఏప్రియల్ 22 -26 మధ్య ఆయనకు ప్రమాద కాలం అని కనిపిస్తున్నది. సమయంలో ఆయన ఆరోగ్య పరిస్తితి దిగజారే అవకాశాలున్నాయి.