“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

28, ఆగస్టు 2012, మంగళవారం

నిత్యజీవితంలో ప్రశ్నశాస్త్రం - నోట్ బుక్ వస్తుందా?

ఉదయం 9.40 కి 'పంచవటి' సభ్యురాలు ఒకామె ఫోన్లో ప్రశ్నించింది.

'ఎవరిదో నోట్ బుక్ కంప్యూటర్ చెడిపోతే రిపేర్ చేయించమని నాకు ఒప్పచేప్పారు. నాకు తెలిసిన ఒకాయనకు అది ఇచ్చాను. దాన్ని రిపేర్ చేసి ఈరోజు ఉదయం 9.30 కి ఇస్తానని చెప్పాడు. నేను వేచి ఉన్నాను. అతనేమో ఇంకా రాలేదు. అతనికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తున్నది. ఆ ఫోన్ నంబర్ తప్ప అతన్ని కాంటాక్ట్ చెయ్యడానికి ప్రస్తుతం నావద్ద ఏమీ ఆధారం లేదు. అతను వస్తాడా రాడా? అసలు నోట్ బుక్ వస్తుందా రాదా?'

ఆమె గొంతులో ఆందోళన వినిపించింది.

నేనా సమయంలో ఒక మీటింగ్ కి రెడీ అవుతూ బిజీగా ఉన్నాను. అదీగాక, సామాన్యంగా ఇలాంటి ప్రశ్నలు నేనంతగా పట్టించుకోను. కాని ఎవరిదో పని నెత్తిన పెట్టుకుని ఈ అమ్మాయి మధ్యలో ఇరుక్కుంది. పాపం దీనిలో తన స్వలాభం ఏమీ లేదు. సరే చూద్దామని, ఒక్క క్షణం ఆగి ఆ సమయంలో గ్రహస్తితిని గమనించాను. విషయం అర్ధం అయింది.

'పదినిముషాలలో అతను వచ్చి కలుస్తాడు. కంగారుపడకు.' అని చెప్పి ఫోన్ కట్ చేశాను. తర్వాత నా పనిలో పడి ఆ విషయం మర్చిపోయాను.

సరిగ్గా 10.10 కి మళ్లీ ఆ అమ్మాయి దగ్గర నుండి ఫోనొచ్చింది.

'సక్సెస్. మీరు చెప్పినట్లే అతనొచ్చాడు. ధాంక్స్' అంటూ అవతలనుంచి ఆమె గొంతు వినిపించింది. ఇంతకు ముందున్న ఆందోళన ఆమె గొంతులో మాయమై ఆనందం వినిపించింది.

'మంచిది' అంటూ ఫోన్ కట్ చేశాను. ఒకరి ఆనందానికి మనం కారకులమైతే  అంతకంటే మనకు ఇంకేం కావాలి?

ప్రశ్నశాస్త్రం నిజంగా పనిచేస్తుంది. కాని అడిగే మనిషి వెనుక నిజమైన ఆకాంక్ష ఉండాలి. ప్రశ్న పెద్దదా లేక చిన్నదా, లోకం దృష్టిలో అది ముఖ్యమైనదా లేదా అనేది అప్రస్తుతం. అడిగే మనిషి దృష్టిలో అది ముఖ్యమైంది అయితే చాలు. దానివెనుక నిజమైన ఆదుర్దా ఉంటే చాలు. జవాబు కరెక్ట్ గా వస్తుంది. 

ఇంతకీ ఈ ప్రశ్న ఎలా చెప్పగలిగాను? అన్న విషయం చూద్దాం.

ఆ సమయంలో బుధహోర నడుస్తున్నది. బుధుడు చంద్రరాశిలో ఉండి ప్రశ్నలో గల ఆదుర్దాను సూచిస్తున్నాడు. బుధుని వెనుక శుక్రుడు ఉండి బలాన్ని ఇస్తున్నాడు.బుధశుక్రులిద్దరూ శీఘ్రగ్రహాలు.కనుక పని త్వరగా  జరుగుతుంది.

లగ్నం తులా 5 డిగ్రీ అయింది. దీనివెనుక యోగకారకుడైన ఉచ్ఛశని ఉండి సపోర్ట్ చేస్తున్నాడు. కనుక కొంచం ఆలస్యం అయినట్లు అనిపించినా పని జరుగుతుంది. లగ్నాధిపతి శుక్రుడు నవమస్థానంలో ఉండి కోణద్రుష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు.లగ్నానికి తృతీయంలో బలంగా ఉన్న ఆరోహణాచంద్రుడు ఉండి కార్యలాభాన్ని సూచిస్తున్నాడు.లాభాదిపతి సూర్యుడు లాభంలో ఉండి కార్యసాఫల్యతను సూచిస్తున్నాడు. కనుక పని త్వరగా జరుగుతుంది.

నిమిత్తాలను కూడా ప్రశ్నలో గమనించాలి. నేను ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలోనే మీటింగ్ కి కావలసిన సమాచారం తెచ్చి నా అసిస్టెంట్  ఎదురుగా టేబిల్ మీద పెట్టాడు. దానికోసం నేను కొద్దిసేపటినుంచీ ఎదురుచూస్తున్నాను. కనుక ఆమె ఎదురుచూస్తున్న మనిషి కూడా త్వరలో వస్తాడు అని అర్ధమైంది.

'జరుగుతుంది' అన్నవిషయం ఇన్నికోణాల నుంచి గట్టిగా తెలిసింది కనుక, 'ఎప్పుడు జరుగుతుంది?' అన్న విషయం ఇక చూడాలి. 

కంప్యూటర్లకు కుజుడూ రాహువూ కారకులు. లగ్నానికి దగ్గరలోనే కుజుడున్నాడు. లగ్నానికి కుజునికి దాదాపు 5 డిగ్రీలు భేదం ఉన్నది. అంటే లగ్నం ఇంకొక ఇరవై నిముషాలలో కుజుడిని కలుస్తుంది. కనుక దాదాపు  ఇరవై నిముషాలలో అనుకున్న పని జరగాలి. మా మాటల్లో కొంత సమయం గడిచింది. కనుక ఇంకో పది నిముషాలలో అతనొస్తాడు అని చెప్పాను. 

ఈ ఎనాలిసిస్ కరెక్టే. అనుకున్నట్లే అతనా సమయానికే వచ్చాడు. మళ్లీ కొద్ది సేపట్లో వచ్చిన ఆమె ఫోన్ ను బట్టి ఈ విషయం రుజువైంది..

ఎలా వాడుకోవాలో తెలిస్తే, ప్రశ్నశాస్త్రం నిత్యజీవితంలో అనునిత్యమూ ఉపయోగపడి మన ఆదుర్ధాను తగ్గిస్తుంది, అయోమయంగా ఉన్నపుడు  ఆసరాను ఇస్తుంది అనడానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు.