“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

8, నవంబర్ 2011, మంగళవారం

ఆధ్యాత్మికత ఆత్మహత్యలకు కారణమౌతుందా?

వరంగల్ NIT విద్యార్ధి ఒకతను హాస్టల్ పైనుంచి దూకి మొన్న ఆత్మహత్య చేసుకున్నాడంటున్నారు. అది హత్యో, ఆత్మహత్యో, ప్రమాదమో ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ విషయం TV లలో చర్చకు వచ్చిందిట. నేను చూడలేదు. ఆ లింక్ ను నా బ్లాగ్ రీడర్ ఒకాయన నాకు పంపించాడు. ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కువగా చదవడంవల్ల అతను డిప్రెషన్లోకి వెళ్ళాడని అందులో కొందరు వ్యక్తులు వాదించారు. మరణం తర్వాత ఏమౌతుందో తెలుసుకోవడానికే ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని కూడా కొందరు అజ్ఞానులు వాదించినట్లు కనిపించింది. పునర్జన్మ ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కూడా ఆ అబ్బాయి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చని కొన్ని TV చానల్స్ లో చర్చలు జరిగినట్లు ఒక కధనం. వెరసి ఆధ్యాత్మికత అనేది యువతను పెడదారి పట్టిస్తుందా అని కొందరికి అనుమానాలు వచ్చాయిట. అలాటి అనుమానాలు మన పుణ్యభూమిలో ప్రజలకు వచ్చాయంటే నేను నమ్మను. మన TV ప్రబుద్ధులే రేటింగ్ కోసం అలాటి ప్రచారాలు చేస్తున్నారంటే నమ్ముతాను. మన దేశంలోని ప్రజలు లౌకికంగా ఎంత భ్రష్టుపట్టినా వారి మౌలికమైన ఆత్మ ఇంకా చావలేదు. అది చావలేదు కాబట్టే మన దేశం ఇంకా బతికి బట్టకడుతున్నది.

ఆధ్యాత్మికత అనేది ఎన్నటికీ నిరాశావాదాన్ని ప్రోత్సహించదు. ఆత్మహత్యను అసలే అంగీకరించదు. ఆధ్యాత్మికపుస్తకాలు చదివినంత మాత్రాన ఎవరూ డిప్రెషన్ లోకి వెళ్ళరు. ఒకవేళ డిప్రెషన్లో ఉంటే దాన్నుంచి బయటికి వస్తారు. వివేకానందస్వామి యొక్క ఉత్తేజపూరితములైన ఉపన్యాసాలు చదివి, డిప్రెషన్ నుంచి తేరుకుని, ఆశావహదృక్పధంతో జీవితం లో ముందడుగు వేసి నిజాయితీగా విజయాలు సాధించినవారు  చాలామంది నాకు తెలుసు. 

"ఆత్మహత్య మహాపాపం" అని మన సర్వశాస్త్రాలూ చెబుతున్నాయి. కారణం ఏమంటే, జీవితం అనేది భగవంతుని బహుమతి. అది మన అర్హత వల్ల మనం సాధించుకున్న ప్రైజు కాదు. మనలో అర్హత లేకున్నా భగవంతుడు మనకిచ్చిన గిఫ్ట్. కనుక దాన్ని అంతం చేసుకునే హక్కు మనకు లేదు. ఏదైనా బ్రతికిసాధించాలి గాని చచ్చిసాధించేది ఏమీలేదు. "బ్రతికియుండిన సుఖములు బడయవచ్చు" మొదలైన సూక్తులు మన ఆధ్యాత్మిక సాహిత్యంలో కోకొల్లలుగా ఉన్నాయి. 

వేదములు కూడా ఆత్మహత్యను ఖండించాయి. " అసూర్యా నామతేలోకా అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనే జనాః" అంటుంది యజుర్వేదాన్తర్గతమైన ఈశావాశ్యోపనిషత్తు. ఆత్మహత్య చేసుకునేవారు సూర్యునివెలుగు ఉండని చీకటిలోకాలలో ప్రేతాత్మలుగా అఘోరిస్తూ  ఉండవలసివస్తుందని ఈ శ్లోకం యొక్క అర్ధం. ఆత్మహత్య చేసుకునే ముందు ఆమనిషి యొక్క మానసికస్తితికూడా చాలా చీకటిమయంగా ఉంటుంది. నిరాశా నిస్పృహలు ఆవరించి అతనికి ఏరకమైన వెలుగూ కనపడదు. కనుక అతని మరణానంతరస్తితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఏ బాధలు తప్పించుకోడానికి అతను ఆత్మహత్య చేసుకుంటాడో ఆ బాధలు తప్పకపోగా ప్రేతాత్మగా ఇంకా దారుణమైన బాధలు పడాల్సివస్తుంది. కనుక మన ఆర్షధర్మం అనేది ఆత్మహత్యను ఎన్నటికీ సమర్ధించదు.

కర్మసిద్ధాంతం కూడా ఆత్మహత్యను సమర్ధించదు. మనం చేసిన పూర్వకర్మవల్ల  ప్రస్తుతం బాధలు పడుతున్నాం. కనుక ఇప్పుడు సరియైన మంచికర్మ చేసుకుని పూర్వం చేసిన పాపాలను కడుక్కోమని కర్మసిద్ధాంతం చెబుతుంది. కర్మసిద్ధాంతం అనేది ఆశావాదాన్ని మనిషికి నేర్పిస్తుంది. మనిషి ఎంత అణగారిపోయినా, అది అంతం కాదనీ, ఇంకా ఆశ ఉందనీ చెబుతుంది. కర్మతో కర్మను జయించమని బోధిస్తుంది. ఎన్నటికీ ఆశను విడవద్దని, నిరాశకు లోను కావద్దని ఉద్బోధిస్తుంది.

అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ -- అసత్యంనుంచి సత్యానికి నన్నునడిపించు, చీకటినుంచి వెలుగులోకి నన్ను నడిపించు, మృత్యువునుంచి అమృతత్వంలోకి నన్ను నడిపించు -- అని వేదం యొక్క ప్రార్ధన సాగుతుంది. అలాటి వేదాలను ప్రామాణికాలుగా భావించే మన ఆధ్యాత్మికసంస్కృతి ఎవరినీ ఆత్మహత్యలు చేసుకోమని ప్రేరేపించదు, సమర్ధించదు. 

ఆధ్యాత్మికపరమైన ఆలోచనలవల్ల యువత ఎన్నటికీ  పాడుకాదు. దురలవాట్లవల్లా, డ్రగ్స్ వల్లా, సినిమాలవల్లా, పాశ్చాత్యసంస్కృతిలోని చెడును అనుకరించటం వల్లా, చెడు సావాసాలవల్లా యువత పాడవుతుందిగాని, మన ఆధ్యాత్మికతను తెలుసుకోవడం వల్లా, దానిని ఆచరించడంవల్లా ఎన్నటికీ పాడవదు. 

మరణం తర్వాత ఏమౌతుందో తెలుసుకోవాలన్నా, పునర్జన్మ ఉందాలేదా అనేది తెలుసుకోవాలన్నా, చనిపోవడమూ ఆత్మహత్య చేసుకోవడమూ దానికి మార్గాలు కావు. అలా చేసినందువల్ల వారాశిస్తున్న విషయాలు ఏమీ తెలుసుకోలేరు. నిజంగా వాటిని తెలుసుకోవాలంటే దానికి మార్గాలున్నాయి. ఒక సద్గురువు పర్యవేక్షణలో ధ్యానాన్నీ, యోగాన్నీ సక్రమంగా అభ్యసించడమే దానికి మార్గం. ధ్యానమార్గంలో పురోగమించడం వల్ల మరణానంతర జీవితం గురించీ పునర్జన్మల గురించీ ప్రత్యక్షానుభూతి ద్వారా తమంతట తామే తెలుసుకోవచ్చు. ఆత్మ అనేది ఉన్నదా లేదా తన స్వంత అనుభూతిద్వారా తానే తెలుసుకోవచ్చు. మన మహర్షులూ, యోగులూ, సిద్ధులూ సమస్త జ్ఞానాన్నీ అలా తెలుసుకున్నవారే.

మన ఆధ్యాత్మికతను లోతుగా తెలుసుకోవడమూ, దానిని ఆచరించడమూ మనిషి ఔన్నత్యానికి దారి తీస్తాయి. ఉన్నతమైన భావాలతో, ఉత్తమ పౌరులుగా జీవించడానికి బాటలు వేస్తాయి. ఇంకా ఎదగగలిగితే, ఋషిత్వాన్నిపొంది మానవజీవితాన్ని ధన్యం చేసుకోవడానికి సాయపడతాయి. అంతేగాని నిరాశావాదాన్ని మన మతంగాని మన సంస్కృతి గాని, మన ఆధ్యాత్మికతగాని ఎన్నటికీ ప్రోత్సహించదు.

నిజానికి విద్యార్ధులు ప్రతిఒక్కరూ మన ఆధ్యాత్మికత గురించి లోతుగా తెలుసుకోవాలి. మన ప్రాచీనగ్రంధాలను అధ్యయనం చెయ్యాలి. ఊరకే తెలుసుకోవడం కాదు, తెలుసుకున్న దానిని ఆచరణలోకి తీసుకురావాలి. అప్పుడే నేటితరం గురౌతున్న రకరకాల విషప్రభావాలనుంచి, ముఖ్యంగా మీడియా విషప్రభావం నుంచి  వారు రక్షింపబడతారు. అత్యుత్తమపౌరులుగా ఎదగగలుగుతారు.

మన ఆధ్యాత్మికత మీద ఈరకమైన దాడి వెనుక పరాయి మతాలపాత్ర ఉందేమో అన్నది కూడా నిజం కావచ్చు.