“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, నవంబర్ 2011, శనివారం

నిత్యజీవితంలో ప్రశ్నశాస్త్రం -- " పెన్ డ్రైవ్ ఎక్కడుంది?"

అప్పుడప్పుడూ ఏదోఒక వస్తువును మర్చిపోవడం, ఎక్కడ పెట్టామో అని దానికోసం వెదకడం మనకందరికీ అలవాటే. కొన్నిసార్లు ఆ హడావిడిలో ఆ వస్తువు దొరకవచ్చు, లేదా దొరక్కపోవచ్చు. ఇలా జరగటం మనకందరికీ అనుభవమే. ఎంత వెదికినా దొరకని ఇటువంటి సందర్భాలలోనే మనకు ప్రశ్నశాస్త్రం బాగా  ఉపయోగపడుతుంది. కాని సరైన భావంతో ప్రకృతిని సమీపించకపోతే సరైన సమాధానం రాదు.

ప్రశ్నశాస్త్రం అనేది "సామరస్యం" అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. ప్రకృతిలో సామరస్యస్థితి ఉన్నది. సమస్తమూ ప్రకృతిలోనే ఉన్నది. మనకు మరుపు ఉంది గాని ప్రకృతికి మరుపు లేదు. కనుక మనం నిజంగా అవసరంలో ఉన్నపుడు ప్రకృతిమాతను వినయంగా అడిగితే తను జవాబిస్తుంది. ఆ జవాబు ఎప్పుడూ విఫలం కాదు. అయితే ఆమెను అడిగేతీరు మనకు తెలియాలి. అడిగిన ప్రతిసారీ వస్తున్న ఆ జవాబులు నిజం అవుతున్నపుడు, ఈ అద్భుతమైన సైన్స్ ను మనం  తప్పకనమ్మాల్సి వస్తుంది.

ఈరోజు మధ్యాన్నం పెన్ డ్రైవ్ కోసం ఆఫీస్ లో వెతుకుతున్నాను. పని వత్తిడిలో పెన్ డ్రైవ్ ఎక్కడపెట్టానో గుర్తు రావడంలేదు. ఒక వారంరోజులనుంచి పెన్ డ్రైవ్ ను వాడటం లేదు. కనుక ఎక్కడుందో మర్చిపోయాను. అక్కడా ఇక్కడా వెదికాను గాని దొరకలేదు.

సరే అని ప్రశ్నచక్రం గుణించి చూశాను. అప్పుడు సమయం 1.05 అయింది. శీర్షోదయమైన కుంభలగ్నం ఉదయిస్తున్నది. లగ్నాధిపతి అయిన శని అష్టమంలో మిత్రస్థానంలో ఉన్నాడు. కన్యకూడా శీర్షోదయ రాశే. కనుక వస్తువు దొరుకుతుంది. కాని, కుజుడు సప్తమంలో ఉండి లగ్నాన్ని దగ్గరగా వీక్షిస్తున్నాడు. తాజకహోరాశాస్త్రం ప్రకారం కుజుడు సప్తమంలో ఉంటే పోయిన వస్తువు దొరకడం కష్టం. కాని ఇక్కడ కుజునికి లగ్నంతో గాని, షష్ఠస్థానంతోగాని సంబంధం లేదు గనుక ఈ పాయింట్ ను పెద్దగా లెక్కించలేదు. దశమ కేంద్రంలో శుక్రుడూ బుధుడూ డిగ్రీ కంజంక్షన్లో ఉండి చతుర్ధంలోని చంద్రుని చూస్తున్నారు. కనుక వస్తువు అతి త్వరలో దొరకవచ్చు.

చంద్రుని గమనించాను. చంద్రుడు చతుర్దంలో ఉచ్ఛస్తితిలో బలంగా ఉన్నాడు. అయితే కేతువుతో కలిసి ఉండటం వల్ల, కొంత గందరగోళమూ మతిమరుపూ వస్తుంది. అయినప్పటికీ చంద్రుడు స్వనక్షత్రంలో ఉండటం వల్ల బలంగానే ఉన్నాడు. ప్రస్తుత కుండలిలో చంద్రుడే  అందరికంటే బలవద్గ్రహం. కనుక పోయిన వస్తువు చతుర్ధ సూచకమైన ఇంట్లోనే ఉన్నది. చంద్రునికి షష్ఠ ఆధిపత్యం పట్టింది. షష్ఠఅధిపతి చతుర్దంలో ఉండటం అంటే దొంగవచ్చి ఇంట్లోకూచోడం అన్నమాట. ఒకవేళ వస్తువు పోయిందనుకున్నప్పటికీ, దొంగ ఈసమయంలో  ఇంట్లోకూచుని ఉండటానికి వీలు లేదు. కనుక వస్తువు పోలేదు. మర్చిపోబడింది. ఇంటిలోనే ఉండి ఉంటుంది.

అయితే మరి పెన్ డ్రైవ్ ఇంట్లో ఎక్కడుంది? దీనికోసం లగ్నడిగ్రీలను పరిశీలిద్దాం. ఇవి ప్రధమద్రేక్కాణంలో పడ్డాయి. కనుక ఇంట్లోని ముందు గదిలో వస్తువు ఉండాలి. ఇలా ఆలోచించిన మీదట, లంచ్ బ్రేక్ లో ఇంటికెళ్ళినపుడు, ముందు గదిలోని పుస్తకాల అల్మారాలో వెదికాను. పెన్ డ్రైవ్ అక్కడే చక్కగా కూచుని కనిపించింది. బుధ శుక్రులు సూచించినట్లుగా అతిత్వరలోనే, అంటే అరగంట లోపే, పోయిందనుకున్న వస్తువు దొరికింది.

ఈ విధంగా, ఉపయోగించుకోగలిగితే, ప్రశ్నశాస్త్రం నిత్యజీవితంలో అనేకసమయాలలో మనకు అక్కరకు వస్తుంది.