నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

18, ఏప్రిల్ 2010, ఆదివారం

ఆదోని కొండ- ఒక సాయంత్రపు ఏకాంతవాసం







నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఆదోని కొండ పైన ఏకాంత వాసం. ఏకాంతంగా, మౌనంగా, కొండల్లో ధ్యానం చెయ్యటం గొప్ప అనుభూతిని ఇస్తుంది.

దీనికి కొన్ని కారణాలు కనిపిస్తాయి.

ఒకటి:- చుట్టూ మైళ్ళ వరకూ జనసంచారం లేకపోవటం ఒక విధమైన ఏకాకి తనాన్ని ఇస్తుంది. మానసికంగా మనిషి ఎప్పటికైనా ఏకాకే అన్న సత్యం మనస్సుకు హత్తుకున్నట్లు కనిపిస్తుంది.

రెండు:- ఆత్మావలోకనానికి జన సమ్మర్దం ఉన్న ప్రదేశాలు, వాతావరణాలు సరిపోవు. దానికి ఏకాంత ప్రదేశాలు, విశాల ప్రకృతి ఒడిలో ఒంటరిగా ఉండే ప్రదేశాలు బాగా దోహదం చేస్తాయి.

మూడు:- ఎప్పుడూ మనుషుల మధ్య ఉండటం వల్ల ఒక విధమైన ఫాల్స్ సెక్యూరిటీ మనకు అలవాటు అవుతుంది. ఇలాటి ఏకాంత ప్రదేశాలలో ఉండటం వల్ల అది తొలగి పోతుంది.

నాలుగు:- ఇలాటి ప్రదేశాలలో ప్రకృతి యొక్క విశాలత్వం, మానవుని అల్పత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. పైన కప్పులా పరుచుకున్న విశాలాకాశం మరియు చుట్టూ నిర్మానుష్య ప్రదేశాలు మనస్సును సహజంగా అంతర్ముఖం చేస్తాయి.

అయిదు:- ఇటువంటి ప్రదేశాలలో, కొద్దిపాటి ఏకాగ్రత ఉంటే, హమ్మింగ్ ధ్వనిలా వినిపించే ఓంకారనాదాన్ని వినవచ్చు. ముఖ్యంగా ఇది అర్ధరాత్రి దాటిన తర్వాత బాగా స్ఫుటంగా వినిపిస్తుంది.

చుట్టూ మైళ్ళ తరబడి జన సంచారం లేని ఏకాంత ప్రదేశాలలో రాత్రిళ్ళు ఒంటరిగా గడపటం, ప్రకృతిలో వినిపించే సహజ ధ్వనులను వింటూ మౌన ధ్యానంలో ఉండటం నాకు బాగా ఇష్టం. అటువంటి ప్రదేశాలలో, ముఖ్యంగా, అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారే వరకు ఉండే వాతావరణం చాలా బాగుంటుంది. అయితే, దయ్యాల భయం గాని, లేదా దొంగల భయం గాని మనసులో ఉంటే ఇలా ఉండటం చాలా కష్టం అవుతుంది.

నువ్వు ఇలా ఏకాంత వాసం చేస్తున్నపుడు ఎవరైనా దొంగలు నిన్ను ఎటాక్ చేస్తే నీ గతి ఏమిటి అని ఒక మిత్రుడు అడిగాడు.నాకు నవ్వొచ్చింది. వీర విద్యలలో చిన్నప్పటి నుంచి సాధన, ప్రావీణ్యత నాకు ఉన్న విషయం, మరియు మల్టిపుల్ స్పారింగ్ నా స్పెషలైజేషన్ అన్న విషయం అతనికి తెలియదు. "ఎటాక్ చెయ్యటం వరకు ఓకే, కాని తరువాత వాళ్ళ గతి ఏమౌతుందో మాత్రం చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ శవాలను అన్ని అడుగుల ఎత్తు నుంచి కిందకు తరలించటం నిజంగానే సమస్య అవుతుంది" అని జవాబిచ్చాను. కేరళలో మాస్టర్ గోవిందకుట్టి నాయర్ గురుక్కళ్ దగ్గర నేర్చుకున్న "మర్మ అడి" విద్యలోని ఒక చిన్నఆయుధం నా దగ్గిర ఉంటుంది. అది జేబులో ఇమిడి పోతుంది. మర్మ స్థానాలలో (Vital nerve centers) దానితో ఎటాక్ చెయ్యటం ద్వారా అవసరమైతే మనిషి ప్రాణాలు సెకండ్లలో తీయవచ్చు.

సామాన్యంగా ఇలా వెళ్ళేటప్పుడు ఎవరినీ తోడు తీసుకెళ్ళను. ఎందుకంటే చాలామంది మౌనాన్ని భరించలెరు. మౌనంగా ఉండలేరు. అనవసరంగా ఏదేదో మాట్లాడుతుంటారు. అది నాకు విసుగు పుట్టిస్తుంది. పైగా కనీస వసతులు కూడా అటువంటి చోట్ల ఉండవు.వెంట తీసుకెళ్ళకపోతే ఒక్కొక్కసారి మంచినీళ్ళు కూడా దొరకవు. కాని ఈసారి మా అబ్బాయి నాతో వస్తానన్నాడు. సరే అని నాతో పాటు తీసుకెళ్ళాను.తను నా మానసిక స్థితి బాగా అర్థం చేసుకోగలడు. ఇటువంటి సందర్భాలలో అవసరం అయితే తప్ప మాట్లాడడు.

కొండ ఎక్కుతున్నప్పుడు, మధ్య మధ్యలో కూర్చున్నప్పుడు, అక్కడక్కడా ఆధ్యాత్మిక విషయాలు చర్చకు వచ్చాయి. మా వాడికొక ఆలోచన వచ్చింది. దీన్నంతా ఒక వీడియోగా తీస్తానని ఉత్సాహ పడ్డాడు. సరే కానీమన్నాను. ఆ సందర్భంగా తీసిన ఒక చిన్న వీడియోను ఈ పోస్ట్ తో చూడవచ్చు.

దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం ఇదే కొండను నా గురుతుల్యులైన స్వామి నందానందగారితో కలసి ఎక్కాను. కొండ కొమ్మున రణమండల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అది వ్యాస రాయల ప్రతిష్ట అని ఎవరో చెప్పారు. ఆయన విజయనగర రాజుల రాజ గురువు. రాయలసీమలో ఆంజనేయ విగ్రహాలు అన్నీ ఎక్కువగా ఆయనే ప్రతిష్ట చేశారు.

అదలా ఉంచితే, అప్పుడు నాకు ఇరవై ఆరేళ్ళు. స్వామికి దాదాపు అరవై దాటి ఉంటాయి. కొండనెక్కుతుండగా స్వామి అనేక విషయాలు చెప్పారు. ఆయన జన్మత: కన్నడిగుడు. తెలుగు కంటే ఇంగ్లీషు చక్కగా మాట్లాడేవారు. దాదాపుగా అరవై ఏళ్ళ క్రితమే ఆయన గ్రాడ్యుయేట్. కొండ సగానికి ఎక్కిన తర్వాత పైకి చూస్తూ, " కొండ కొమ్ముకు చేరాలంటే ఇంకా చాలా మెట్లు ఎక్కాలి స్వామీజీ" అని రొప్పుతూ అన్నాను నేను. దానికి ఆయన నవ్వుతూ ఒక మాటన్నారు. "ఇంకా ఎన్ని మెట్లెక్కాలో అని ఎప్పుడూ అనుకోకు. తల వంచుకొని మెట్లెక్కుతూ ఉండు. కొంతసేపటికి చూస్తే నీవు కొండ కొమ్మున ఉంటావు." లోతుగా ఆలోచిస్తే ఇది జీవితానికి, ఆధ్యాత్మిక సాధనకు కూడా చక్కగా అన్వయిస్తుందేమో అని నాకెప్పుడూ అనిపిస్తుంది. అదే జ్ఞాపకాన్ని మా అబ్బాయికి చెప్పాను. దాన్ని తను వీడియో తీసాడు.

దాదాపు రాత్రి తొమ్మిది వరకు కొండపైన ధ్యానంలో గడిపాము. నల్లని ఆకాశం క్రింద, నక్షత్రాల వెలుగులో కూర్చుని, క్రియాయోగానికి, కుండలినీ యోగానికి సంబంధించిన లోతైన మూలరహస్యాలు కొన్ని మావాడికి వివరించి చెప్పాను. యుగాలు, వాటి నిడివి, అయనాంశ విలువ, ప్రెసెషన్ ఆఫ్ ఈక్వినాక్సెస్, సాయన నిరయన విధానాల మధ్యన గల భేదాలు, ఇతర జ్యోతిష రహస్యాలు, వీటికీ యోగానికి ఉన్న సంబంధాలు, సూక్ష్మ శరీరం, ఆత్మలు మొదలైన విషయాలు చాలా దొర్లాయి. చిన్నప్పటినుంచి ఇటువంటి విషయాలు వినటం అలవాటు అయినందువల్ల తను కూడా చాలా శ్రద్దగా విన్నాడు. తరువాత నెమ్మదిగా కొండ దిగి నడక ప్రారంభించాము.

చుట్టూ చిమ్మ చీకటి. శుద్ధ తదియ కావటంతో చంద్రుడు సన్నగా కనిపిస్తున్నాడు. సన్నని నెలవంక, నక్షత్రాల వెలుతురులో, ప్రాచీన శిధిల కట్టడాలు, మశీదులు, గుడులు, రాజుల కాలం నాటి కోట బురుజుల మధ్యగా కొండ దిగి క్రిందికి వస్తుంటే, కీచు రాళ్ళ అరుపులు మా అడుగుల చప్పుళ్ళె తప్ప ఎక్కడా శబ్దమనేది లేదు. అప్పుడప్పుడు ఆ శిధిలాల దారుల పక్కగా పాము జరజర పాకుతూ పోతున్న శబ్దం వినిపించేది.

ఒక గంట తర్వాత కొండ దిగి ఊరిలోకి వచ్చాము. మహాయోగిని లక్ష్మమ్మ గారి సమాధి మందిరంలో కొద్దిసేపు ధ్యానంలో గడిపి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి చేరాము. నేటి సామాజిక భాషలో చెప్పాలంటే ఈమె ఒక చదువు రాని దళిత మహిళ. దాదాపు అరవై డెభ్భై ఏళ్ల క్రితం ఆదోని పట్టణంలో ఒక పిచ్చిదానిలాగా తిరుగుతూ ఉండేది. ఈమె అనేక యోగసిద్ధులు కలిగిన ఒక అవధూత అని చెప్తారు.

రాత్రిళ్ళు గస్తీ తిరుగుతున్న పోలీసులకు ఈమె కాళ్ళూ చేతులూ ఒక్కొక్క వీధిలో ఒక్కొక్కటి పడి కనిపించేవిట. తిరి
గి తెల్లవారిన తర్వాత ఈమె మామూలుగా ఊరిలో తిరుగుతూ ఉండేది అని చెబుతారు. దీన్ని ఖండయోగం అంటారు. దీనిని సాయిబాబా గారు కూడా చేసినట్లు చెబుతారు. ఇలాటి మహిమలు ఆమె చాలా చేసింది అని అంటారు. ప్రస్తుతం ఈమె సమాధిమందిరం నగర నడి బొడ్డున ఉంది. భూగర్భంలో ఆమె సమాధి, దాని పైన నేల బారుగా దేవాలయం ఉంటాయి. సమాధి మందిరం ధ్యానానికి బాగా అనుకూలంగా ఉంటుంది. రాయలసీమలో ఇటువంటి యోగులు,సూఫీలు,మహాత్ములు చాలామంది ఉంటారు. నేను ఆదోని పట్టణానికి వస్తే, లక్షమ్మగారి సమాధిని దర్శించకుండా సామాన్యంగా తిరిగి వెళ్లను.

నిన్న సాయంత్రం అలా గడిచింది.