“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

6, అక్టోబర్ 2019, ఆదివారం

లంబస్తనీం వికృతాక్షీం.....

'లంబస్తనీం వికృతాక్షీం
ఘోరరూపాం మహాబలాం
ప్రేతాసన సమారూడాం
జోగులాంబాం నమామ్యహమ్'

(పెద్ద పాలిండ్లు కలిగి, వికృతమైన కన్నులతో, ఘోరమైన రూపంతో, మహాబలశాలియై, శవంమీద కూర్చొని ఉన్న జోగులాంబను ధ్యానిస్తున్నాను)

ఆలంపురం జోగులాంబ ధ్యానశ్లోకం ఇది.

మొన్న ఒకరోజున కర్నూల్ టౌన్ ఆలంపురం మధ్యలో అర్ధరాత్రి తనిఖీకి వెళ్ళవలసి వచ్చింది. అది కూడా నవరాత్రుల మధ్యలో.

ముప్పై ఏళ్ల క్రితం నేను ఆదోనిలో ఉన్నప్పుడే తంత్రసాధన చేస్తూ ఉండేవాడిని. అక్కణ్ణించి వయా కర్నూల్ రూట్లో వస్తే అలంపురం దగ్గరే గనుక, అలంపురం వెళదామని అనుకున్నాను. కానీ అవలేదు. ఇప్పటికి ఆ అవకాశం వచ్చింది. ఖడ్గమాలలో చెప్పబడిన యోగినుల ఆలయాలు ఇక్కడ ఉండేవని నేను విన్నాను.

కర్నూల్ లో దిగి ఆలంపురం దగ్గరకు చేరేసరికి సరిగ్గా రాత్రి పన్నెండున్నర అయింది. వచ్చిన పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా, 'సార్. గుడికి పోనిమ్మంటారా' అని డ్రైవర్ అడిగాడు.

'ఒద్దు. ఈ టైం లో గుడి మూసేసి ఉంటుంది కదా ! ఇంకోసారి వద్దాం. కానీ ఇక్కడే కాసేపు ఆపు' అన్నాను.

కారాగింది.

బయటకు దిగి, ఆలయం ఉన్న దిక్కుగా చూస్తూ అక్కడే చీకట్లో కాసేపు నిలుచున్నాను. చుట్టూ చీకటి, పొలాలు, వర్షపునీటికి కప్పల బెకబెకలు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. 'సార్ చీకట్లో అలా నిలబడకండి. పాములుంటాయి'. అన్నాడు డ్రైవర్.

నవ్వాను.

కాసేపు అక్కడ ఉన్న తర్వాత కారెక్కి 'పోనీ' అన్నా. కారు కర్నూల్ చేరింది.

నవరాత్రులలో అర్ధరాత్రి పూట అక్కడకు వచ్చిన పని పూర్తయింది.

ఈ ఆలయం ఏడో శతాబ్దం నాటిది. అంటే తంత్రయుగానికి చెందినది. ఇక్కడ అమ్మవారి అసలు విగ్రహం భయంకరంగా ఉంటుంది. జోగులాంబ అంటే యోగుల అమ్మ అని అర్ధం. అంటే జగన్మాత అన్నమాట. ఇది జమదగ్ని మహర్షి, రేణుకాదేవులు నివసించిన ప్రదేశం అని ఒక స్థలపురాణం చెబుతున్నది. శివుని కోసం బ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశం అని ఇంకో పురాణం అంటుంది. ఈ కధలు నిజమైనా కాకపోయినా, దాదాపు పన్నెండు వందల ఏళ్ళ క్రితమే ఇది ప్రసిద్ధి చెందిన తాంత్రికక్షేత్రం అన్నది వాస్తవం. అక్కడ నాకు కలిగిన అనుభవం దీనినే రూడి చేస్తున్నది. తంత్రం పుట్టుక గురించి నా పాత వ్యాసాలు 'ఛిన్నమస్తా సాధన' అనే సీరీస్ లో చదవండి.

బెంగాల్ ప్రాంతంలో ఎనిమిదో శతాబ్దంలో పుట్టిన తంత్రం అక్కణ్ణించి హిందూమతంలోనూ, బౌద్ధంలోనూ ప్రవేశించింది. శైవ, శాక్త, వైష్ణవ సాంప్రదాయాలలో అది వేళ్ళూనుకున్నప్పటికీ, శైవం లోనూ, శాక్తమ్ లోనూ బాగా నిలదొక్కుకున్నది. వజ్రయానంగా టిబెటన్ బౌద్ధంలో ప్రవేశించింది. మహాయానాన్ని ప్రభావితం చేసింది. కాలక్రమేణా అసలు తంత్రం కనుమరుగై, పనులు కావడం కోసం పూజలు చేసే క్షుద్రతంత్రం అక్కడక్కడా మిగిలి పోయింది.  ఆ ఆలయాలన్నీ తమతమ రూపురేఖలు మార్చుకుని, వైదిక సాంప్రదాయం ప్రకారం మార్చబడి, ప్రాంతీయంగా ఉన్న అమ్మతల్లుల పూజలతో కలసిపోయి, నేడు ఈ రూపంలో మనకు కనిపిస్తున్నాయి. ముస్లిం దండయాత్రలలో ఈ ఆలయం పూర్తిగా నేలమట్టం చెయ్యబడింది. ఆ తర్వాత కొన్ని వందల ఏళ్లకు దీనిని మళ్ళీ కట్టారు. ఇప్పుడు ఆలయం ఉన్న స్థలం అసలైన స్థలం కాదు.

జోగులాంబ అమ్మవారి జుట్టులో బల్లి, గుడ్లగూబ, తేలు ఉంటాయి. ధ్యానశ్లోకం ప్రకారం ఆమె మూర్తి చాలా భయంకరం. కాళీమాతకు ఒక రూపం ఈమె. శ్మశానకాళిక అని ఈమెను అనుకోవచ్చు. పిచ్చిలోకులు ఈమెను గృహదోషాలు పోగొట్టే దేవతగా ఆరాధిస్తున్నారు. కానీ, మార్మిక సంకేతాలతో కూడిన ఈమె రూపం అత్యంత ఉన్నతమైన పరిపూర్ణ యోగసిద్ధిని కలిగించే దేవతారూపం అన్న సంగతి తాంత్రికయోగులు మాత్రమే గ్రహించగలరు. లోకులకు భయాన్ని కలిగించే తల్లి రూపం, వారికి అత్యంత ప్రేమను పుట్టిస్తుంది.

'లంబస్తని' అనేది జీవులకు పాలిచ్చి పోషించాలనే అత్యంత ప్రేమకు, మెత్తని హృదయానికి సంకేతపదం. 'వికృతాక్షి' అంటే, ఇంద్రియలోలత పైన అమితమైన కోపానికి, జాగృతమైన మూడవకంటికి సూచన. విరూపాక్ష అనే పదమూ, వికృతాక్షి అనే పదమూ సమానార్థకాలే. వికసించిన ఆజ్ఞాచక్రానికి ఇవి సూచికలు. 'ఘోరరూపా' అంటే, ప్రపంచపు డొల్ల కట్టుబాట్లను లెక్కచెయ్యని విశృంఖలత్వమూ, ఆత్మచైతన్యమూ అని అర్ధాలు. 'మహాబలా' అనేది అమితమైన వీర్యశక్తికి, ప్రాణశక్తికి సూచిక. 'ప్రేతాసన సమారూడా' అనేపదం సమాధిస్థితిలో జాగృతమైజడత్వాన్ని అధిరోహించిన దివ్యచైతన్యశక్తికి మార్మిక సూచన. ఈ మార్మికకోణాలలో దర్శిస్తే ఆమె భయంకరరూపం అత్యంత సౌమ్యంగా, ప్రేమమయంగా కనిపిస్తుంది.  

దేహమే ఆత్మకు గృహం. గృహదోషాలంటే మనం ఉండే ఇంటిదోషాలు కావు. జన్మజన్మాన్తరాలలో దేహాన్ని పట్టుకుని ఉన్న సంస్కార దోషాలు. వాటిని పోగొట్టడం అంటే, సంస్కార నాశనం చేసి కర్మపరంపర అనబడే పొలిమేరను దాటించడం. ఎల్లలను దాటిస్తుంది గనుక ఎల్లమ్మ అయింది. కుండలినీ శక్తికి ఈమె ప్రతిరూపం. పొలిమేరలు దాటించే దేవతను, పొలిమేరల లోపల ఉండే సుఖాల కోసం పూజిస్తున్నారు పిచ్చి లోకులు !

ఛిన్నమస్త, రేణుక, భైరవి, ఎల్లమ్మ - ఇవన్నీ ఈమె పేర్లు. తెలంగాణా ప్రాంతానికి ఈమె అధిష్టానదేవతగా అనేక వేల ఏళ్ళనుంచి కొలువై ఉంది. శ్రీవత్సగోత్రం వారికి ఈమె కులదేవత అవుతుంది. వారిలో ఆమె రక్తమే ప్రవహిస్తున్నది. సరియైన సిద్ధుల వద్ద గ్రహించి ఈమె ఉపాసన గావిస్తే, మహత్తరమైన యోగసిద్ధిని అచిరకాలంలో కలిగించి, మానవజీవితపు పొలిమేరలు దాటిస్తుంది.

ఈ విధంగా, నవరాత్రులలో, అర్ధరాత్రిపూట చీకట్లో, అలంపురం దగ్గర పొలాలలో, ఈ దేవతను దర్శించాను.