“Self service is the best service”

4, సెప్టెంబర్ 2017, సోమవారం

నిజం

తను లేకుంటే వెలుగే లేదని
రాత్రిపూట ఎగురుతూ అనుకుంటుంది
మిణుగురు పురుగు
కానీ...అది ఎగరకపోయినా
సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు

తను అరవకపోతే వర్షం కురవదని
గుంటలో కూచుని అనుకుంటుంది
సణుగుడు కప్ప
కానీ...అది అరవకపోయినా
కుంభవృష్టి కురుస్తూనే ఉంది

తను కుయ్యకపోతే తెల్లవారదని

బుట్టలో కూచుని అనుకుంటుంది
తెలివిలేని కోడి
కానీ...అది కుయ్యకపోయినా
తెల్లవారి వెలుగొస్తూనే ఉంది

తను లేకపోతే ప్రపంచం నడవదని

అహంతో అనుకుంటాడు
మిడిసిపాటు మనిషి
కానీ...అతను పోయినా
ప్రపంచం నడుస్తూనే ఉంది

అన్నీ తనకు తెలుసని విర్రవీగే మనిషికి

ఏ క్షణం తను పోతాడో తెలియదు
అన్నీ తన చేతిలో ఉన్నాయనుకునే వాడికి
తన చావు తన చేతిలో లేదని తెలియదు

ఇదంతా నాదే అనుకునే అజ్ఞానికి

తనకు ముందూ తనకు తర్వాతా
ఇది వేరెవరిదో అవుతుందన్న నిజం
ఎంతమాత్రమూ గురుతు రాదు

ఈ క్షణమే సత్యమని భ్రమించేవాడికి

మంచీ చెడూ ఎంత మాత్రమూ కనిపించదు
కళ్ళు తెరిచి చూస్తే అంతా తేటతెల్లం
ఒళ్ళు మరిచి ప్రవర్తిస్తే అంతా శూన్యం

అనంత కాలగమనంలో

ఈ ఒక్క జీవితం ఎంత?
అనేక కోట్ల జన్మల్లో
ఈ ఒక్క జన్మ ఎంత?

నిజానికి తానెవరు?

నిజంగా తనవారెవరు?
ఈ రెండూ తెలిస్తే చాలదా మనిషికి?
అలా జీవిస్తే చాలదా నిజానికి?