“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

6, సెప్టెంబర్ 2017, బుధవారం

మనసు - మాయ

వాస్తవం కంటే మనసే
నిన్నెక్కువగా బాధిస్తుంది
ఎందుకో తెలుసా?
వాస్తవం చిన్నది
మనసు భూతద్దం

జీవితం కంటే
ఆశే నిన్నెపుడూ అల్లాడిస్తుంది
ఎలాగో చెప్పనా?
జీవితం స్వల్పం
ఆశ అనంతం

భూతం కంటే మనసే
నిన్నెక్కువగా భయపెడుతుంది
ఎలాగంటావా?
భూతం అబద్దం
ఊహ నిజం

వాస్తవం కంటే ఊహే
నిన్నెపుడూ నడిపిస్తుంది
ఎందుకంటావా?
వాస్తవం చేదు
ఊహ మహాతీపి

జరిగిన దానికంటే
నువ్వూహిస్తున్నదే నిన్నెపుడూ
ఏడిపిస్తుంది
జరిగింది నీ చేతిలో లేదు
నీ ఊహ నీలో ఉంది

లోకం ఎలా ఉందనేది ప్రశ్న కాదు
నువ్వు దాన్నెలా చూస్తున్నావనేదే ముఖ్యం
విషయం ఏంటనేది ప్రశ్న కాదు
నువ్వు దాన్నెలా ఊహిస్తున్నావనేదే ముఖ్యం

తిండి ఏమిటన్నది సమస్య కాదు
దాన్ని నువ్వెలా తింటున్నావన్నదే సమస్య
బండ బరువెంతన్నది సమస్య కాదు
దాన్ని నువ్వెత్తగలవా లేదా అన్నదే సమస్య

లోకం నిన్నేమీ చెయ్యలేదు
నీ మనసే నిన్ను తల్లక్రిందులు చేస్తుంది
జీవితం నిన్నేమీ బాధించలేదు
నీ మనసే నిన్ను అల్లకల్లోలం చేస్తుంది

ప్రపంచం నీకు ముఖ్యం కాదు
నీ ఊహే నీకు ముఖ్యం
మనుషులు ఎప్పుడూ శాశ్వతం కాదు
నీ మనసే నీకు శాశ్వతం

మసిబారిన కళ్ళద్దాలతో
అసలైన దృశ్యాన్నెలా చూడగలవు?
మసకేసిన ఆలోచనలతో
సిసలైన సత్యాన్నెలా దర్శించగలవు? 

అద్దం శుభ్రంగా ఉంటే
ప్రతిబింబం చక్కగా కనిపిస్తుంది
మనసు నిర్మలమై నిలిస్తే
ప్రతిక్షణం స్వర్గమే నీకెదురొస్తుంది

అద్దాన్ని శుభ్రం చెయ్యడం నేర్చుకో
అంతా సవ్యంగా ఉంటుంది
మనస్సును మచ్చ లేకుండా ఉంచుకో
జీవితం దివ్యమై భాసిస్తుంది

నీ మనసు నీ చేతిలో ఉంటే
లోకం నిన్నేం చేస్తుంది?
నీ కళ్ళు స్వచ్చంగా ఉంటే
కుళ్ళు నీకెలా కనిపిస్తుంది?

మాయను గెలవడం అంటే
మనస్సును గెలవడమే
మాయ లేదని తెలుసుకోవడమంటే
మనసును లేకుండా చెయ్యడమే

అద్దాన్ని శుభ్రమైనా చెయ్యి
లేదా దాన్ని పూర్తిగా పక్కనైనా పెట్టు
అప్పుడే నీకు తెలుస్తుంది సత్యం
అప్పుడే నీ జీవితం నిజంగా ధన్యం...