“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, జూన్ 2017, శుక్రవారం

రెండవ అమెరికా యాత్ర -43 (ఋష్యాశ్రమం)























మనం సక్రమమైన పద్ధతిలో ఉంటే అమెరికాలో ఉన్నా కూడా హిమాలయాలలోని ఋష్యాశ్రమంలో ఉన్నట్లు ఉండవచ్చు అనడానికి శ్రీనివాస్ గారి ఇల్లే ఒక ఉదాహరణ. వారి ఇంట్లో అడుగు పెడుతూనే ఇల్లంతా పరమ సాత్విక తరంగాలతో నిండి ఉన్నట్లు గమనించాను. దానికి కారణం వారి జీవన విధానం.

అమెరికాలో ఇరవై ఏళ్ళ నుంచీ ఉంటున్నా కూడా క్రమం తప్పకుండా నిత్యం సంధ్యావందనమూ గాయత్రీ జపమూ చేస్తున్న నిష్ఠాపరులలో శ్రీనివాస్ ఒకరు. శుద్ధ శాకాహారం, సాంప్రదాయ జీవనం వారి జీవన శైలులుగా తోచాయి. అందుకే వారి ఇంటిలో అడుగుపెడితే సొంత ఇల్లులాగా చాలా హాయిగా అనిపించింది. ఇక్కడుంటున్న చాలా మందికి ఉన్న అలవాట్లు - ఆల్కహాలు తీసుకోవడం, మాంసాహారం తినడం, ఒక తీరూ తెన్నూ లేని జీవితం గడపడం - మొదలైన చేష్టలు వారిలో మచ్చుకైనా లేవు. అందుకే వారి ఇంటిలోని తరంగాలు పరమ సాత్వికంగా అనిపించాయి. వారింటిలో ప్రతి గదీ ఒక పూజామందిరం లాగా ఉంది. కనుక వారి ఇంటికి "ఋష్యాశ్రమం" అని పేరు పెట్టాను. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఆ విధమైన సాత్విక ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న వారిని చూస్తే చాలా ముచ్చట అనిపించింది. చాలామంది ఊరకే మాటలు చెబుతారు గాని ఆచరణలో ఆ మాటలు ఎక్కడా కనిపించవు. కానీ వీరి దగ్గర మాటలు తక్కువ ఆచరణ ఎక్కువగా కనిపించింది. అనవసరమైన మాటలు గాని, సాంప్రదాయ విరుద్ధమైన నడవడిక గాని వీరి దగ్గర మచ్చుకైనా కనిపించలేదు.

వీరి ఇల్లు ఒక సరస్సు ముందు ఉన్నది. అంటే మధ్యలో ఒక పెద్ద కృత్రిమ సరస్సు నిర్మించి దాని చుట్టూ కాలనీ లాగా ఇళ్ళు కట్టారన్నమాట. ఆ సరస్సు సరిగ్గా వీరి బ్యాక్ యార్డ్ లో ఉంటుంది. అక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ప్రశాంతంగా, ధ్యానానుకూలంగా ఉన్నది. ఎవరి ఇంటికి వెనుకగా వారు వుడెన్ డెక్ నిర్మించుకున్నారు. దానిమీద కూచుని సరస్సును వీక్షించవచ్చు. లేదా ఇంటి వెనుక ఉన్న పెద్ద లాన్ లో కూర్చుని ధ్యానంలోకి జారిపోవచ్చు. సరస్సులో బోటింగ్ చెయ్యడానికి వీలుగా కొంతమంది పడవలను పెట్టుకున్నారు. వింటర్ లో అయితే ఆ నీరంతా గడ్డ కట్టినప్పుడు దానిమీద స్కేటింగ్ కూడా చేస్తారని శ్రీనివాస్ చెప్పారు.

ఈ సారి అమెరికాకు వచ్చిన ప్రతిసారీ మీ ఇంట్లో ఒక వారం ఉంటానని వారితో చెప్పాను. దారీ తెన్నూ లేని జీవన విధానాలతో ఎటు పోతున్నామో తెలియని నేటి అమెరికా సొసైటీలో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే ఇదికదా మన భారతీయ సాంప్రదాయ జీవన విధానం అనిపించింది.