నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, జూన్ 2017, శుక్రవారం

రెండవ అమెరికా యాత్ర -61 (టెక్సాస్ ట్రిప్ -Our Lady of Guadalupe Church)

మెక్ అల్లెన్ లో ఒక ప్రసిద్ధమైన క్యాథలిక్ చర్చ్ ఉన్నదనీ, అక్కడకు తను తరచుగా వెళుతూ ఉంటాననీ డా|| పద్మిని గారు నాతో అన్నారు. ఆమె మెక్ ఆలెన్ లోని మెడికల్ సర్కిల్స్ లో టాప్ పొజిషన్లో ఉన్నారు. వీరి అన్నగారు డా| శ్రీనివాస్ హ్యూస్టన్లో ఉన్న మంచి డాక్టర్లలో ఒకరు. ఆయన హ్యూస్టన్లో పల్మనాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబంలో డాక్టర్లు ఎక్కువ. డా|| పద్మిని గారికి ఆమె ఎంసెట్ వ్రాసిన రోజులలో స్టేట్ 14 ర్యాంక్ వచ్చిందని నాతో చెప్పారు.

ఈ చర్చిలో ఉన్న ఫాదర్ తనకు బాగా పరిచయమనీ, ఆయనతో కలసి ఒకసారి రోం వెళ్లి పోప్ ను కూడా కలసి వచ్చాననీ ఆమె అన్నారు. తను పక్కా హిందువు అయినప్పటికీ, ఆమెకు మేరీమాత అంటే చాలా భక్తి ఎక్కువ. 'అమ్మ ఎక్కడైనా అమ్మే కదా' అనే సిద్దాంతం ఆమెది.

ఈ చర్చిలోని మేరీమాత విగ్రహం ఒక పెద్ద గోడలో అమర్చబడి ఉంటుంది. అక్కడకు వెళ్ళడానికి లోపలగా మెట్లున్నాయి. అప్పుడప్పుడూ ఆ విగ్రహాన్ని క్రిందకు తెచ్చి బట్టలు మార్చి అలంకరణ చేస్తారని ఆమె అన్నారు. ఆ సమయంలో చర్చి వారు తనను పిలుస్తారనీ, తను వెళ్లి మేరీమాత విగ్రహానికి తల దువ్వి, బట్టలు మార్చడంలో సహాయం చేస్తూ ఉంటాననీ ఆమె నాతో చెప్పారు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఒక్కరోజు కూడా తను హిందువా లేక క్రిస్టియనా అని వాళ్ళు అడగలేదని ఆమె అన్నారు. మేరీమాత అంటే ఆమెకున్న భక్తికి చాలా సంతోషం అనిపించింది.

ఈ చర్చ్ పేరు OLG (our lady of Guadalupe mission). ఇది క్యాతలిక్ మిషన్ లో ఒక భాగం.

మా మధ్య దీనిమీద కొంత చర్చ జరిగింది. ప్రాచీన కాలంలో ఇక్కడంతా నేటివ్ అమెరికన్ తెగలు ఉండేవి. వాళ్ళు దైవాన్ని ప్రకృతి మాతగా ఆరాధించేవారు. యూరోపియన్స్ వచ్చి ఇక్కడంతా ఆక్రమించి నేటివ్ అమెరికన్స్ ను చంపేసి అమెరికా మాది అన్న తర్వాత ఇక్కడ క్రిస్టియానిటీ వచ్చింది. కానీ పాత కాలంలో ఎక్కడైతే ప్రకృతిమాత ఆరాధన జరుగుతూ ఉండేదో అదే ప్రాంతాలలో వీళ్ళకు తెలీకుండా ఇప్పుడు మేరీమాత ఆలయాలు కట్టి ఆమెను పూజిస్తున్నారు. ఒక విధంగా 'కొత్తసీసాలో పాతసారా' అన్నమాట. మూలభావనేమో దైవాన్ని తల్లిగా పూజించడమే. క్రైస్తవభావన సరిగ్గా ఇదే కాకపోయినప్పటికీ జరుగుతున్నది మాత్రం అదే.

1970 ప్రాంతాలలో ఇక్కడ ఒక అద్భుతం జరిగిందని ఆమె నాతో చెప్పారు. ఒకరోజున చర్చిలో మాస్ జరుగుతూ ఉండగా, ఒక విమానం వచ్చి చర్చి మీద పడిందని, ఆ ప్రమాదంలో చర్చి మొత్తం కాలిపోయిందని, కానీ అందులో ఆ సమయంలో ఉన్న వాళ్లకు మాత్రం ఏమీ కాలేదని, ఇది పెద్ద మిరకిల్ అనీ ఆమె అన్నారు. అప్పటినుంచీ ఈ చర్చికి ఆదరణ బాగా పెరిగి ఇప్పుడు మెక్ అలెన్ మొత్తానికీ బాగా జనం వచ్చే చర్చిగా మారిందట.

ఆదివారం సాయంత్రం, నేచర్స్ సెంటర్ నుంచి తిరిగి వచ్చే సమయంలో 'గాడలూపి చర్చి' కి వెళ్లి వచ్చాము. ఆ సమయంలో 'మాస్' జరుగుతూ ఉన్నది. అది చాలా పెద్ద చర్చి. మన సినిమా హాళ్ళు ఒక అయిదారు కలిపితే ఎంత పెద్దగా ఉంటుందో అలా ఉన్నది అక్కడి ఆడిటోరియం. జనంతో క్రిక్కిరిసి ఉన్నది. మేము పక్కనే ఉన్న వరండాలో నుంచి నడుస్తూ వెళ్లి, వెనుకగా ఉన్న మేరీమాత విగ్రహం దగ్గర కాసేపు ప్రార్ధించి, బయట ఉన్న 'హోలీ వాటర్' సేవించి తిరిగి వచ్చాము.

ఆ ఫోటోలు ఇక్కడ.

గోడలో ఉన్నది మేరీమాత విగ్రహం


ప్రార్ధిస్తూ




ప్రార్ధనలో


మేరీమాత విగ్రహం క్లోస్ అప్

చర్చి బయట




హోలీ వాటర్ సేవిస్తూ