“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, జూన్ 2017, బుధవారం

రెండవ అమెరికా యాత్ర -46 (మాషీ మా)




శ్రీ శారదామాత ఎప్పుడూ ఒక మాటను తరచుగా అనేవారు.

'ఎదుటి వారి గురించి చెడుమాటలు ఎప్పుడూ మాట్లాడకు. అలా మాట్లాడటం, వారికి ఏమీ మేలు చెయ్యకపోగా, నీకే ఎక్కువగా కీడు చేస్తుంది'.

అందుకే మనం అనవసరమైన గాసిప్ ఎప్పుడూ చెయ్యకూడదు. ఎంతసేపూ ఎదుటివారి గురించి చెడుమాటలు మాట్లాడటం వల్ల మన మనస్సులే మురికిగా తయారౌతాయి. దానివల్ల మనమే ఇంకా ఇంకా దరిద్రంగా తయారౌతాం.

వింటున్న నేను ఇలా అన్నాను.

'అవును. ఇది శ్రీ శారదామాత ప్రధాన ఉపదేశాలలో ఒకటి'.

 మాషీమా కొనసాగించారు.

'కలకత్తాలో నేను పుట్టి పెరిగిన చోటును శ్యాంబజార్ అంటారు. అక్కడకు చాలా దగ్గరలోనే, అంటే నడిచి పోయేంత దూరంలోనే, బాగ్ బజార్ అనే చోట శ్రీశారదామాత నివసించిన ఇల్లు ఉన్నది. చిన్నప్పుడు మేం ఆ ఇంటిని 'అమ్మ ఇల్లు' అనేవాళ్ళం. దానిని ఇప్పుడు 'ఉద్బోధన్ ఆఫీస్' అంటున్నారు. ('ఉద్బోధన్' అనేది రామకృష్ణ మిషన్ వారి బెంగాలీ పత్రిక).  దాని అర్ధం నిద్ర లేపడం. మెలకువ తెప్పించడం అని.

'మీ చిన్నప్పుడు శ్రీ శారదామాత నివసించి ఉన్నారా?' అడిగాను నేను.

'లేదు.  నేను పుట్టక ముందే ఆమె వెళ్ళిపోయారు. కానీ మా నాన్నగారు అమ్మను దర్శించారు. అమ్మ దగ్గర ఆయన పెరిగారు.'

'అవునా? శ్రీ శారదామాత, మీ నాన్నగారిని పెంచారా?' ఆశ్చర్యంగా నేను అడిగాను.

'అవును. ఈ విషయాన్ని మీరు ఊహించగలరా అసలు ! ఇది చెబుతుంటే నాకు ఒళ్ళు జల్లుమంటున్నది. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి' అందామె.

'ఆయనెంత అదృష్టవంతుడో?' అని ఒక్కసారిగా నా మనస్సు ఉప్పొంగిపోయింది.

'అవును. మా నాన్నగారి చిన్నప్పుడే మా తాతగారు గతించారు. మా నాన్ననూ మా బాబాయిలనూ మా పెద్ద మేనమామ పెంచారు. ఆ కాలంలో ఇండియా మొత్తంలోకీ బాగా చదువుకున్న వ్యక్తి ఎవరంటే మా మేనమామే. ఆయనకు ఆ కాలంలోనే రంగూన్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉద్యోగం వచ్చింది. అందుకని మా నానమ్మనూ, పిల్లలనూ అందరినీ ఆయనతో బాటు రంగూన్ తీసుకు వెళ్ళాడు. ఒక ఇండియన్ కు రంగూన్ క్రిష్టియన్ కాలేజీలో ప్రిన్సిపాల్ ఉద్యోగం రావడం అంటే అది ఊహించలేని విషయం ఆ రోజుల్లో. కానీ ఆయన బాగా చదువుకున్న వాడు గనుక అది సాధ్యం అయింది.

మా నానమ్మ, మా అమ్మ - వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు. వాళ్ళకు కులాలూ మతాలూ మొదలైన పట్టింపులు పెద్దగా ఉండేవి కావు. నువ్వు ముస్లింవా లేక హిందువువా అనే విషయాన్ని వాళ్ళస్సలు లెక్కించేవారే కారు.

ఆ రోజుల్లో బెంగాల్ ఎలా ఉండేదో తెలుసా? మీకు నేను నిజం చెబుతున్నాను. బెంగాలీలు చాలా మూఢనమ్మకాలు ఉన్న మనుషులు. అంతేగాక వాళ్ళలో చాలామంది తక్కువ బుద్ధులు ఉన్నవాళ్ళు. బెంగాలీలు కానివాళ్ళతో వాళ్ళు కలవరు. గుజరాతీలను గుజ్జూలంటారు. హైదరాబాదీలను ఇడ్లీలంటారు. ఈ రకంగా ప్రతివారినీ ఏదో ఒక పేరుతో హేళనగా పిలుస్తారు. ఇది నాకు నచ్చదు. మీరంతా 'బంగూ' లంటాను నేను. నేనూ బెంగాలీనే. కానీ వాళ్ళలో ఉన్న కొన్నికొన్ని పద్ధతులు నాకు నచ్చవు.

ఎవరెవరి వ్యక్తిత్వాన్ని బట్టి వారివారిని మనం స్వీకరించాలి. ఒప్పుకోవాలి. అంతేగాని ప్రతివారినీ వారిచాటున తిట్టకూడదు. అది చాలా పెద్ద పాపం. నేనెప్పుడూ అలా చెయ్యను. ఒకవేళ శ్రీనివాస్ నన్ను తిడితే ఇక జన్మలో అతనితో నేను మాట్లాడను. కానీ అతను నన్ను తిట్టాడని నేను ఎవరితోనూ అతని వెనుకగా చాడీలు చెప్పను. అది నా మనస్తత్వం.


సరే, నా గోల వదిలేసి మా నాన్నగారి విషయానికి వద్దాం. మా నాన్నకు మొదట్లో శ్రీమా గురించి ఏమీ తెలియదు. కానీ అందరిలాగే మామూలుగా రామకృష్ణా మిషన్ గురించి తెలుసు. 1910 లో రంగూన్ లో ఆయన చదువు ముగించుకుని కలకత్తాకు వచ్చాడు. అప్పుడు మా ఇంకో మేనమామ ఆయన్ను శ్యాంబజార్ దగ్గరలోనే నివస్తిస్తున్న శ్రీమా వద్దకు తీసుకెళ్ళాడు. మొట్టమొదటి దర్శనంలోనే తనకు ఇంకో అమ్మ లభించిందని ఆయనకు అర్ధమైంది. అంతేకాదు, ఈమె తనకు జన్మ నిచ్చిన అమ్మకంటె అసలైన అమ్మ అని అర్ధమైంది. శ్రీమా దగ్గర అంత ప్రేమ ఉండేది. 


శ్రీమా ఎప్పుడూ ఇలా అనేవారు - "నేను అందరికీ తల్లినే. మంచివాళ్ళూ నా బిడ్డలే. చెడ్డవాళ్ళూ నా బిడ్డలే."


ఠాకూర్ జీవించి ఉన్న రోజులలో ఒక సంఘటన జరిగింది. ప్రతిరోజూ ఆయనకు ఆహారాన్ని అమ్మే స్వయంగా తయారు చేసి ఒక పళ్ళెంలో పెట్టి ఆయన గదికి తెచ్చి ఇచ్చేవారు. ఇతరులు ఎవరు వండినా ఆయన సామాన్యంగా తినేవారు కారు. ఒకరోజున అమ్మ వంట ముగించే సమయానికి వారికి తెలిసిన ఒక స్త్రీ అక్కడకు వచ్చి ఉన్నది. ఆరోజున ఆహారాన్ని తను తీసికెళ్ళి ఠాకూర్ కు ఇస్తానని ఆమె అడిగింది. అమ్మ సరేనని ఒప్పుకున్నది. ఆమె తీసుకొచ్చిన ఆహారాన్ని ఏమీ మాట్లాడకుండా ఠాకూర్ ఆరగించారు. ఆ తర్వాత అమ్మను ఇలా అడిగారు.


'ఎందుకు ఆమె చేత ఆహారాన్ని పంపావు? ఆమె మంచి నడవడిక కలిగిన వ్యక్తి కాదని నీకు తెలుసు కదా? అలాంటివాళ్ళు తాకిన ఆహారాన్ని నేను తిననని నీకు తెలుసుకదా? ఎందుకలా చేశావు?'

దానికి అమ్మ ఇలా జవాబు చెప్పారు.

'ఈ విషయంలో నాకు ఆంక్షలు విధించవద్దు. ఎందుకంటే - ఎవరైనా సరే - వారెలాంటి వారైనా సరే - నన్ను అమ్మా అని పిలిస్తే ఆ మనిషి అభ్యర్ధనను నేను కాదనలేను'.

శ్రీ శారదామాత అంతటి ప్రేమమయిగా ఉండేవారు.
  
సరే, ఆ విధంగా మా నాన్నగారు శ్రీమా ను దర్శించారు. ఆయనకు ఆ సమయంలో ఆరోగ్య సమస్యలుండేవి. మానసిక సమస్యలు కూడా ఉండేవి. కానీ అమ్మను చూచిన క్షణంలో ఆయనలో ఏదో తెలియని శక్తి కలిగింది. నాలో ఏ సమస్యలూ లేవు అనిపించింది. తను అమ్మ దగ్గర దీక్షాస్వీకారం చెయ్యాలని అనుకున్నారు. కానీ - నేటి రోజుల లాగే - అప్పటివాళ్ళకూ సమయం చిక్కేది కాదు. ఇప్పుడైనా ఎప్పుడైనా సమయం మనకు చిక్కదు. మనమే వీలు కల్పించుకోవాలి. టైం వస్తుందిలే అప్పుడు చేద్దాంలే అనుకుంటూ ఉంటే ఆ టైం అనేది ఎప్పటికీ రాదు.

అలా కాలం గడుస్తుండగా ఒక సంఘటన జరిగింది.

ఒకరోజున మా నాన్నగారు బాగ్ బజార్లో శ్రీమా ఉన్న ఇంటి దగ్గరగా నడుస్తూ పోతున్నారు. అప్పుడు గోలాప్ మా తనను పిలుస్తూ ఇలా అరవడం ఆయన విన్నారు. మీకు గోలాప్ మా తెలుసుగా?

'తెలుసు. అమ్మ జీవితాన్ని చదివిన వారికి ఆమె పరిచయమే.' అన్నాను నేను.

'ఏయ్ అబ్బాయ్ ! ఒక పైసా ఖరీదున్న మరమరాలు అమ్మకోసం తెచ్చివ్వగలవా?' అంటూ గోలాప్ మా అరవడం మా నాన్న విన్నారు.

శ్రీమా కు ఏదో విధంగా సేవ చెయ్యాలని ఆయన ఎప్పుడూ అనుకుంటూ ఉండేవారు. కానీ ఆయన దగ్గర డబ్బులుండేవి కావు. మేము డబ్బున్న వాళ్ళం కాము. కానీ బాగా పేదవాళ్ళం కూడా కాము. ఆయన ఆరోజుల్లో విద్యార్ధిగా ఉన్నాడు. అప్పట్లో విద్యార్ధుల దగ్గర డబ్బులెలా ఉంటాయి? సరే, ఆ విధంగా, ఒక పైసాతో ఒక చిన్న మరమరాల పేకెట్ కొని అమ్మకు తెచ్చి ఇచ్చాడాయన.

'చూడండి ఈ సంఘటనను మీకు చెబుతుంటే మళ్ళీ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి' అంటూ మాషీమా కొనసాగించింది.

'తను ఈ విధంగా మరమరాలు తెచ్చి అమ్మకు సమర్పించినప్పుడు అమ్మ తన వైపు ఒక చూపు చూచిందని ఆయన మాతో అనేవాడు. ఆయన ఇంకా ఇలా అనేవాడు.

'శ్రీమా ఆ విధంగా నన్ను చూచినప్పుడు ఒక పెద్ద సముద్రపు అల నాపైన దూకి నన్ను ముంచేసినట్లు నాకనిపించింది. నేనెవరో ఎక్కడున్నానో అన్నీ ఆ క్షణంలో మర్చిపోయాను. ఏమైందో నాకేమీ అర్ధం కాలేదు.'

ఆ విధంగా శ్రీమా మా నాన్నకు దీక్షను అనుగ్రహించింది. అమ్మ మిగతా వాళ్లకు ఇచ్చినట్లుగా ఆయనకు మంత్రోపదేశం ఇవ్వలేదు. ఎవరెవరి అర్హతను బట్టి ఆమె ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా అనుగ్రహించేది.

ఆమె అలా మాట్లాడుతుంటే పాతికేళ్ళ క్రితం శ్రీ నందానంద స్వామివారు నాతో అన్న మాటలు నాకు గుర్తొచ్చాయి.

'శ్రీరామకృష్ణులు, శారదామాత ఇచ్చే దీక్షలు చాలా విలక్షణంగా ఉండేవి. మామూలు గురువులలాగా వాళ్ళు ఒక విధానాన్ని (టెక్నిక్ ను) ఎప్పుడూ చెప్పేవారు కారు. వాళ్ళు సరాసరి ఇలా అనేవారు. "ఇదుగో నీ ఇష్టదేవత. చూడు !" 

అంతే ! మన ఇష్టదైవం మన ఎదురుగా తేజోవంతమైన రూపంలో నిలబడి మనకు ప్రత్యక్షమయ్యేది. ఎన్నో జన్మల సాధన వల్ల కూడా కానిది వారి ఒక్క మాటతో జరిగేది. వారి మాటల్లో అంతటి శక్తి ఉండేది.

ఈ మాటను నందానంద స్వామి నాతోనే అన్నారు. గుర్తొచ్చిన ఆ మాటను పక్కన పెట్టి, మళ్ళీ మాషీమా చెబుతున్నదానిపైన మనస్సు ఉంచాను.

'ఆ చిన్న సంఘటన మా నాన్నగారి జీవితాన్నే సమూలంగా మార్చివేసింది. మా నాన్నగారు శ్రీమా అనుగ్రహాన్ని పొందేనాటికి వివేకానందస్వామి గతించారు. కానీ సిస్టర్ నివేదిత జీవించే ఉన్నది. తరచూ అమ్మ దర్శనం కోసం నివేదిత వస్తూ ఉండేది. ఆమెను శ్రీమా ఏమని పిలిచేవారో తెలుసా? 'కుకీ' అని పిలిచేవారు. బెంగాలీలో 'కుకీ' అంటే 'చిన్నపిల్ల (పాప)' అని అర్ధం.

మీకో విచిత్రం తెలుసా? శ్రీమా బెంగాలీలో నివేదితతో మాట్లాడేవారు. నివేదిత ఇంగ్లీష్ లో సమాధానం ఇచ్చేది. నివేదితకు బెంగాలీ రాదు, శ్రీమాకు ఇంగ్లీష్ రాదు. కానీ ఒకరు చెబుతున్నది ఇంకొకరికి అర్ధమయ్యేది. 'ప్రేమ' అనేది రెండు హృదయాల మధ్యన ఉన్నపుడు, జాతి, మతం, రంగు మొదలైనవి ఏవీ అడ్డు రావు.

ఇక్కడ చాలామంది బ్లాక్స్ ఉంటారు. వాళ్ళందరూ నన్ను మాషీ అని ప్రేమగా పిలుస్తారు. నిన్నంటే నిన్న, ఒక బ్లాక్ అమెరికన్, నా ఇంటిని క్లీన్ చెయ్యడానికి వచ్చాడు. అతనిలా అన్నాడు. 'మాషీ! నువ్వు నీ ఇంటిని చాలా డర్టీగా ఉంచుతున్నావు. ఉండు. నేను నీకు సహాయం చేస్తాను. నేను ఇల్లంతా క్లీన్ చేసి పెడతాను.' పనంతా అయ్యాక అతను వెళ్ళిపోతూ నాకు కిస్ ఇచ్చి వెళ్ళాడు. నాకంటే ఎత్తులో గానీ బరువులో గానీ అయిదురెట్లు ఉన్నాడు ఆ అబ్బాయి. అలాంటి వాడు ప్రేమగా నాకు కిస్ ఇచ్చి వెళ్ళాడు. ఇదంతా ఎలా జరుగుతుంది? వాళ్ళు ఎవరైనా సరే, వారి పట్ల మన హృదయంలో ప్రేమ ఉన్నదని వారికి తెలిసేటట్లు మనం ఉండాలి. అదీ అసలు సంగతి !

మదర్ తెరెసా కూడా ఇలాంటి భావాలనే కలిగి ఉండేదని నా ఊహ. నేను మదర్ తెరెసాను చాలాసార్లు కలిశాను. మాట్లాడాను. కానీ నేను కలకత్తాలో ఆమె ఉన్న చోటికి పోయిన ప్రతిసారీ ఆమె అక్కడ ఉండేది కాదు. ఏ బెల్జియంకో, ఫ్రాన్స్ కో, హాలండ్ కో టూర్లో ఉండేది. ఆమె చాలా బిజీ మనిషి.

సరే అదలా ఉంచుదాం. మా నాన్నగారు ఆ విధంగా శ్రీమా దగ్గర దీక్షను స్వీకరించారు.

ఆమెకు అడ్డు వస్తూ - ' అప్పటికి మీ నాన్నగారి వయసు ఎంత ఉంటుంది?' అని నేను అడిగాను.

' అప్పటికాయనకు దాదాపుగా పదహారు లేదా పదిహేడు ఏళ్ళు ఉండవచ్చు' అని ఆమె సాలోచనగా అన్నారు.

'నిజానికి మా నాన్నగారు సన్యాసం స్వీకరించాలని అనుకున్నారు. మీకు స్వామి శివానంద, స్వామి బ్రహ్మానంద గార్లు తెలుసా/' అడిగారు మాషీ.

'తెలుసు' అన్నాను నేను.

'ఎలా? వాళ్ళు ఎప్పుడో నూరేళ్ళ నాడే గతించారు.' అన్నది ఆమె.

'మా గురువుగారైన గంభీరానందస్వామి స్వయానా స్వామి శివానందగారి శిష్యుడు.' అన్నాను నేను.

'ఓ! నువ్వు గంభీరానందగారి శిష్యుడవా? బాగుంది. నేను వీరేశ్వరానందస్వామి వద్ద దీక్షను గ్రహించాను. నీకు ఆయన తెలుసా?' అడిగిందామె.

'తెలుసు' అని నేను చెప్పేలోపే ఆమె ఇలా అంది.

'ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్నంత మంది శిష్యులు శ్రీరామకృష్ణ సాంప్రదాయంలో ఇంకే గురువుకూ లేరు. అసలు నా దీక్ష ఎలా సంభవించిందో మీకు తెలుసా? చెప్తాను వినండి. మీకు భరత్ మహారాజ్ తెలుసా?' అడిగిందామె.

'తెలుసు' అన్నాను.

చిన్నపిల్లలా నవ్విందామె.

(ఇంకా ఉంది)