“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

19, జూన్ 2017, సోమవారం

రెండవ అమెరికా యాత్ర -54 (భారత దేశ పతనానికి కారణం బుద్ధుడా?)

తిరుగు ప్రయాణం అనేక ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ సాగింది. వాటిల్లో అన్నీ వ్రాయడం కుదరని పని. ముఖ్యమైన టాపిక్ ను మాత్రం ఇక్కడ ఇస్తున్నాను.

ఇందాక స్వామీజీ మాటాడుతూ 'బుద్ధుడొచ్చి ఇండియాను నాశనం చేశాడని' అన్నారు. మన దశావతారాలలో బుద్ధుడు కూడా ఉన్నాడు కదా? మరి ఇదేంటి? అని సందేహాన్ని వెలిబుచ్చారు నా సహచరులు.

దానిమీద మాట్లాడాను.

'స్వామీజీ చెప్పినది నిజమే. అందులో అబద్దం ఏమీ లేదు. నా దృష్టిలో మన దేశాన్ని నాశనం చేసినవాళ్ళు నలుగురు. తీవ్రవాదం, పేదరికం, ఒక పద్ధతీ పాడూ లేని ప్రజానీకం మొదలైన మన నేటి సమస్యలన్నింటికీ  కారకులు వీళ్ళే. వారెవరంటే బుద్ధుడు, అశోకుడు, గాంధీ, నెహ్రూలు. మన దేశానికి పట్టిన దరిద్రమంతా వీళ్ళతోనే పట్టింది.

ఎలాగో చెప్తా వినండి.

బుద్ధుని కంటే ముందు మన వైదిక మతం ఏనాడూ అహింసను బోధించలేదు. ధర్మాన్ని బోధించింది. ఎవడైనా పరాయి పాలకులు మన మీదకు దండెత్తి వస్తే వాళ్ళను ఊచకోత కొయ్యమనే అది చెప్పింది. వైదిక మతాన్ని పాటించిన మన రాజులు చాలా బలవంతులుగా ఉండేవారు. శత్రురాజులు మనల్ని చూడాలంటేనే భయపడేవాళ్ళు. మన సమాజంలో అందరూ ఎవరి పనులు వృత్తులు వాళ్ళు చేసుకుంటూ ఆనందంగా జీవించేవాళ్ళు. ఇప్పటి వాళ్ళు ప్రచారం చేస్తున్నట్లు తక్కువ కులాలను అణగ దొక్కడం వంటివి అప్పుడు లేనేలేవు. ఇదంతా కొన్ని వర్గాల దుష్ప్రచారం. అప్పట్లో ఎవరి వృత్తులు వారికుండేవి. ఎవరి ఆస్తులు వారికుండేవి. సమాజ వ్యవస్థలో అందరూ భాగస్వాములే. 

సన్యాసం అనే పద్ధతి వేదాలలో లేదు. ఏ పనీ చెయ్యకుండా ఊరకే సమాజం మీద పడి తినేవాళ్ళను వేదం ఒప్పుకోలేదు. 'ప్రతి ఒక్కరికీ పని - ప్రతి ఒక్కరికీ తిండి- ప్రతి ఒక్కరికీ జీవితం' అనే సూత్రం మీదనే వైదిక సంస్కృతి ఆధారపడి ఉన్నది. అది చాలా గొప్ప సంస్కృతి. అది అందర్నీ ఆదరించింది. బ్రతకమని చోటిచ్చింది. అంతేగాని తరిమెయ్యలేదు. అలా తరిమేసి ఉంటే ఆయా కులాలు వర్గాలన్నీ ఇప్పటికీ ఇండియాలో ఎలా ఉన్నాయి? అదేమరి, ఇతర దేశాలలో చూడండి. అక్కడ వేరే జాతులను ఏమాత్రం బ్రతకనివ్వరు. నిర్దాక్షిణ్యంగా చంపి పారేస్తారు.

ఈనాటికీ మిడిల్ ఈస్ట్ లో జరుగుతునందేమిటి? అమెరికాలో జరుగుతున్నదేమిటి? రేసిజం ఏమిటి? అవన్నీ ప్రాచీన భారతంలో లేవు. మనం అందరికీ  మన సమాజంలో చోటిచ్చాం. అందరినీ బ్రతకనిచ్చాం. 'లివ్ అండ్ లెట్ లివ్' అనేది మన విధానం. మనువు వంటి మహారాజుల పాలనలో అంతా శాంతిగా సవ్యంగా ఉంది. రాజ్యాలు సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండేవి. సైన్యాలు బలంగా ఉండేవి. పర్షియా, చైనా, గ్రీస్ మొదలైన దేశాల రాజులకు మన సంపదను చూచి కళ్ళు కుట్టినా, మనమీదకు రావాలంటే భయపడేవారు.

అలాంటి పరిస్థితిలో బుద్దుడొచ్చాడు. 'అహింసా పరమో ధర్మ:' అని బోధనలు మొదలు పెట్టాడు. అనేక మంది రాజులు ఈ కుహనా బోధనలు నమ్మి సైన్యాన్నీ సరిహద్దులనూ నిర్లక్ష్యం చేసి చేతులు ముడుచుకొని కూచోవడం మొదలు పెట్టారు. రాజు బలహీనుడైపోతే ఏమౌతుంది? దొంగలు పెరుగుతారు, విప్లవం మొదలౌతుందని చాణక్యుడు చెప్పాడు. అదే జరిగింది. ప్రతి విదేశీయుడూ మన దేశం వైపు చూడటం మొదలు పెట్టాడు.

అహింస అనేది బుద్ధుడు చెప్పిన పరమ దరిద్రపు బోధ. జీసస్ చెప్పిన పనికిరాని బోధ కూడా అదే. దానిని ఆచరణలో ఎవ్వరూ పాటించరు. పాటించడం లేదు కూడా. 'ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు' అని జీసస్ చెప్పినది నిజానికి ఆయన ఇండియాలో ఉన్నప్పుడు నేర్చుకున బౌద్ధ మత బోధనయే కాని అది క్రిష్టియానిటీ మూలభావన కానేకాదు. ప్రపంచంలో ఏ క్రైస్తవుడూ దానిని పాటించడం లేదు. ఏ క్రైస్తవ దేశమూ క్రీస్తు చెప్పిన ఈ బోధనను పాటించడం లేదు. ఇది రియాలిటీ.

నాకెంతో మంది క్రైస్తవ స్నేహితులున్నారు. కానీ వాళ్ళలో ఒక్కడంటే ఒక్కడు కూడా క్రీస్తు చెప్పిన ఈ బోధను పాటిస్తున్నవాడు లేడు. అలాంటి మనిషిని నేను ఇంకా చూడవలసి ఉన్నది.

ఉదాహరణకు చూడండి. అమెరికానే చూద్దాం. ఇక్కడ క్రిస్టియానిటీ ఉన్నది. యూరప్ చూడండి. రోమూ, ఇటలీ అక్కడే ఉన్నాయి. అది క్రైస్తవానికి మూలస్థంభం లాంటి ప్రాంతం. కానీ అక్కడ ఎవరు దాన్ని పాటిస్తున్నారు? ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ దురాక్రమణ చేసి దోచుకుని సర్వనాశనం చేసింది వాళ్ళే. మళ్ళీ వాళ్ళే క్రీస్తు నీతులు మనకు చెబుతారు. కనుక క్రీస్తు చెప్పిన నీతులు పాటించడం ఎవరికీ సాధ్యం కాదు. కనీసం అలా పాటిస్తున్న మనిషిని గానీ దేశాన్ని గానీ నేనింతవరకూ చూడలేదు. బోధకులని చాలామందిని చూశాను. పాటించేవాళ్ళను చూడవలసి ఉంది. ఎదురుచూస్తున్నాను. కానీ ఎవరూ కనిపించడం లేదు. ఎందుకంటే - అవి ప్రాక్టికల్ నీతులు కావు.

బుద్ధుడు గానీ క్రీస్తు గానీ చెప్పిన బోధనలను పాటించడం ఒక రాజుకు గానీ దేశానికి గానీ ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. శత్రురాజులు ఎటాక్ చేసినప్పుడు వీరిద్దరి బోధలు ఏమాత్రం పనిచెయ్యవు. అప్పుడు మనువు చెప్పిన బోధ ఒక్కటే పనిచేస్తుంది. యూరప్ గానీ అమెరికా గానీ ఇతర ఏ క్రిష్టియన్ దేశం గానీ క్రీస్తు బోధనలను ఏమాత్రమూ పాటించడం లేదు. పాటిస్తే యుద్దాలెందుకు? క్రైస్తవ దేశాలు నిజంగా క్రీస్తు బోధలు పాటిస్తే మొదటి ప్రపంచ యుద్ధమూ రెండో ప్రపంచ యుద్ధమూ ఎందుకొస్తాయి? వాటిల్లో ఎన్ని లక్షలమంది చనిపోయారో తెలుసా? ఈ రక్తపాతానికి కారణం ఏ మతం?

ఏ దేశమైనా నిజానికి పాటిస్తున్నది మనుధర్మాన్నీ, చాణక్య నీతినే గాని క్రీస్తునూ, బుద్దుడినీ కానే కాదు. పైకి మాత్రం ఆ మాటలు చెబుతారు. పాటించేది మాత్రం మనువునూ, చాణక్యుడినే. కానీ ఆ విషయాన్ని చస్తే ఒప్పుకోరు. ఇదే హిపోక్రసీ అంటే.

బుద్దుడు చెప్పిన అహింసా ధర్మాన్ని పాటించడం వల్లనే ఇండియా పరిస్థితి అధోగతి పాలైంది. క్రీ.పూ. నాలుగో శతాబ్దంలో చంద్రగుప్త మౌర్యుని కాలంలో ఇండియా మొత్తం ఒకే పరిపాలన క్రింద ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ కూడా అప్పుడు మనదే.

కానీ క్రీ.పూ 260 లో జరిగిన కళింగ యుద్ధంలో జననష్టంతో ఖిన్నుడైన అశోకుడు శాంతిదూతగా మారి, బౌద్ధమతాన్ని ప్రచారం చెయ్యాలని కంకణం కట్టుకుని అన్ని దేశాలకూ తన భిక్షువులను శాంతి ప్రచారానికి పంపాడు. ఇంకేముంది? చుట్టూ పొంచి ఉన్న శత్రురాజులకు ఒక చక్కని సందేశం అందింది. అదేంటి? భారతదేశం బలహీనం అయిపోయింది. రాజులు బలహీనులై పోయారు. చేతగాక శాంతి కబుర్లు చెబుతున్నారు. ఇక మనం దండెత్తినా వాళ్ళు ఏమీ చెయ్యలేరు. కనుక యధేచ్చగా భారతదేశాన్ని దోచుకుందాం. అనేదే ఆ సందేశం.

బౌద్ధమతాన్ని స్టేట్ రెలిజియన్ గా చేసి అశోకుడు చాలా పెద్ద పొరపాటు చేశాడు. ఆ సమయం నుంచే విదేశీ దండయాత్రలు ముమ్మరం అయ్యాయి. అయితే అంతకు ముందు విదేశీ దండయాత్రలు లేవా? అంటే ఉన్నాయి. క్రీ.పూ ఆరో శతాబ్దంలో ఉన్న కృష్ణుని టైం లోనే గ్రీకులు, చైనీయులు మొదలైన శత్రువులు ఆయన మీదకు దండెత్తి వచ్చారు. దక్షిణ భారతానికి ఈ బెడద తెలియకపోవడానికి కారణం వాళ్ళు బాగా లోపలగా సేఫ్ గా ఉండటమే. వాయవ్యం నుంచి అంటే కాశ్మీర్, పంజాబ్, మొదలైన రాజ్యాల రాజులకే శత్రువులనుంచి మొదటి దెబ్బ తగులుతూ ఉండేది. కృష్ణుని టైములో కూడా ఈ దండయాత్రలు ఉండేవి. ఆ సమయంలోనే యవన (గ్రీకు) రాజులు చాలామంది మనమీదకు దండెత్తి వచ్చారు. తన సమయంలో తనమీదకు దండెత్తి వచ్చిన ఆయా శత్రువులను కృష్ణుడు సమర్ధవంతంగా తిప్పికొట్టాడు.

మన దేశంలోని ప్రాచీన రాజులు వైదిక మతాన్ని పాటించారు. అహింసే అన్నింటికంటే గొప్ప ధర్మం అని వైదిక మతం ఏనాడూ చెప్పలేదు. ఎవడో వచ్చి నిన్ను చితగ్గొట్టి నీ ఇంటిని దోచుకుని నీ ఆడవాళ్ళను ఎత్తుకుపోతుంటే శాంతి వచనాలు వల్లించమని మన వేదాలు చెప్పలేదు. శత్రువు ఒక చెంప మీద కొడితే వాడి రెండు చెంపలూ వాయించమని ప్రాచీన యుద్ధనీతి చెప్పింది. దద్దమ్మలాగా వాడి కాళ్ళు పట్టుకుని నీ రెండో చెంప చూపించమంది బౌద్ధం, క్రైస్తవాలే. ఇవి రెండూ ప్రాక్టికాలిటీకి దూరంగా ఉన్న మతాలు. అందుకే, ఆయా మతానుయాయులు కూడా అవి చెప్పిన సూత్రాలను నిజజీవితంలో ఏమాత్రం పాటించరు.

మన రాజులు బలంగా ఉన్నంతవరకూ ఇరానియన్లు గాని, గ్రీకులు గాని, హూణులు గాని ఇంకా ఇతర ఏ జాతులు గాని మన వైపు కన్నెత్తి చూడటానికి భయపడేవి. కానీ అశోకుడు బౌద్ధం అంటూ శాంతి వచనాలు ఎప్పుడైతే మొదలు పెట్టాడో, వెంటనే దాడులు మొదలయ్యాయి. ముందుగా అలెగ్జాండర్ వచ్చాడు. కానీ లోపలకు రాలేకపోయాడు. ఎప్పుడైతే అలెగ్జాండర్ కొంత సక్సెస్ అయ్యాడో ఇక దండయాత్రల వరద ప్రారంభమైంది. క్రీ. పూ మూడో శతాబ్దంలో మొదలైన ఈ వరద క్రీ.శ. తొమ్మిదో శతాబ్దం దాకా - అంటే - 1200 సంవత్సరాల పాటు సాగుతూనే ఉన్నది. బౌద్ధం మనకు చేసిన మేలు ఇదన్నమాట !!

సమాజ జీవితానికి బౌద్ధం పనికిరాదని మనవాళ్ళు చేదు అనుభవాలతో గ్రహించారు. అందుకే బౌద్ధాన్ని ఆదరించడం మానేశారు. మిగిలిన కొద్దిమంది బౌద్ధులు ముస్లిముల దుర్మార్గాలకు బలైపోయి టిబెట్ కు ఇతర దేశాలకు పారిపోయారు.

అందుకే బౌద్ధం మన దేశంలో నుంచి కనుమరుగై పోయింది. అసలైన కారణం ఇదైతే - కుహనా చరిత్రకారులేమో - దీనికి ఆది శంకరాచార్యులను బాధ్యుడిని చేస్తూ పుస్తకాలు వ్రాశారు. ద్వేషంతో నిండి మన చరిత్రను మార్చి వ్రాసి మనకందించిన వారి వ్రాతలను మనం గుడ్డిగా నమ్ముతున్నాం. ముస్లిం ఓటు బ్యాంకు కోసం చరిత్రను మార్చి వ్రాసిన వ్రాతలివి. అంతేగాని నిజాలు కావు.

'అశోకుడు చెట్లు నాటించెను. బావులు తవ్వించెను' - అంటూ చెత్తకబుర్లను మన పిల్లలు చదువుకునే టెక్స్ట్ బుక్స్ లో వ్రాయించి కొన్ని తరాలపాటు అబద్దాలు ప్రచారం చేశారు మన నాయకులు. చెట్లూ బావులూ అశోకుని కంటే ముందు లేవా? అవేమైనా పెద్ద గొప్ప పనులా? అశోకుడు మన దేశానికి చేసిన దారుణమైన చెడును ఏ పాఠ్య పుస్తకమూ వ్రాయదు. ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ సోకాల్డ్ సెక్యులర్ రైటర్స్ వ్రాసినవి. అవన్నీ అబద్దాలు.

భారతదేశం మొత్తానికీ చక్రవర్తి అయి ఉండి (కేరళ, తమిళనాడు తప్ప), బార్డర్స్ ని నిర్లక్ష్యం చేస్తూ, రాజులనూ రాజకుమారులనూ అడుక్కునే భిక్షువులుగా మారుస్తూ, శాంతి వచనాలు వల్లిస్తూ, దేశదేశాలకు బోధకులని పంపిస్తే ఏమౌతుందో ఆయన గ్రహించలేకపోవడమే మన దేశం ఖర్మ ఇలా కాలడానికి కారణం. అశోకుని దూరదృష్టి లోపమే నేటి మన అన్ని సమస్యలకూ మూలం.

దీని ఫలితంగా - 9 శతాబ్దం నుంచి 19 శతాబ్దం వరకూ వెయ్యి సంవత్సరాల పాటు రకరకాల జాతులకు మనం బానిసలుగా పడున్నాం. తుర్కులు, అరబ్బులు, మొఘల్స్, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీస్, ఇంగ్లీషువారు ఇలా ప్రపంచంలోని ప్రతి జాతీ వచ్చి మనల్ని బానిసలుగా చేసి పరిపాలించారు. ఇష్టం వచ్చినట్లు మనల్ని దోచుకున్నారు. ప్రపంచంలోని ప్రతి జాతి ప్రజలూ ఇండియాకు వచ్చి సెటిలై పోయి ఇప్పుడు హ్యూమన్ రైట్స్ అంటూ మాట్లాడుతున్నారు.ఇదంతా అమెరికా వాళ్ళు హ్యూమన్ రైట్స్ గురించి లెక్చర్లు ఇచ్చినట్లు ఉంటుంది. వాళ్ళేమో లక్షలాది మంది నేటివ్ అమెరికన్స్ ను ఊచకోతకోసి అందర్నీ చంపేసి అమెరికా ఖండాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు వాళ్ళే హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. అలా ఉంటాయి హిపోక్రసీలో హైట్స్ !! అసలు వ్రాయవలసింది ఏమిటో తెలుసా?

'అశోకునికి దూరదృష్టి లోపించెను. బౌద్ధాన్ని జనం పైకి రుద్దెను. దేశాన్ని బలహీనపరచెను. శత్రురాజులు మన దేశంపైకి దండెత్తడానికి అవకాశాలను చక్కగా కల్పించెను.' అని అసలైన వాస్తవాలను మన పాఠ్య పుస్తకాలలో మనం వ్రాసుకోవాలి. అప్పుడే అసలైన చరిత్రను మన పిల్లలకు చెబుతున్నట్లు అవుతుంది.

ఈ ఖర్మకు అంతటికీ ఒకటే మూలకారణం ఉన్నది. అదేమంటే - శత్రువు నిన్ను ఎటాక్ చేస్తే చేతులు ముడుచుకుని కూర్చోకు, వాడిని ఎదుర్కో, మట్టి కరిపించు, వాడిని చంపు - అని చెప్పిన మనుమహారాజు యొక్క బోధనను మనం పూర్తిగా మరచిపోయి - బుద్దుడు చెప్పిన 'అహింసా పరమోధర్మ:' అన్న పనికిరాని బోధనను పాటించడమే.

ఇంతకీ అహింస ఎవరికీ? అది బ్రాహ్మణధర్మం. ప్రపంచం అంటే విరక్తితో నిండి దైవంకోసం మాత్రమే ప్రయత్నం చేసేవాడు పాటించవలసిన ధర్మం అది. భిక్షువు పాటించాల్సిన ధర్మం అది. ఎందుకంటే భిక్షువు అడుక్కునేవాడు. అతనికి కోపం పనికిరాదు. ఎందుకంటే అతనే ఒకరి దయాధర్మం మీద ఆధారపడిన వాడు. అలాంటివాడికి కోపం ఎలా శోభిస్తుంది? కానీ క్షత్రియుడు అలా కాదు. అతనికి పౌరుషం అవసరం. అతను రాజు. రాజ్యాన్ని రక్షించడం అతని ధర్మం. అతనికి యుద్ధవిద్య తెలియాలి. అంతేగాని ముక్కుమూసుకుని శాంతి శాంతి అని అతను చెప్పకూడదు. అలా చెబితే ఎవడు బడితే వాడొచ్చి మనల్ని చావగొట్టి చెవులు మూస్తాడు. అదే మన దేశానికి జరిగింది.

బ్రాహ్మణ ధర్మం దైవధర్మం. దానిని దేశరక్షణకు వాడకూడదు. దేశరక్షణకు రాజ (క్షత్రియ) ధర్మం ఉపయోగించాలి. యుద్ధం వచ్చినపుడు ఆధ్యాత్మికత పనిచెయ్యదు. అప్పుడు శాంతి సూత్రాలు పనిచెయ్యవు. వ్యక్తిగతంగా బౌద్ధం మంచిదే కావచ్చు. కానీ సామాజిక జీవనానికి మాత్రం వేదధర్మం ఒక్కటే పనిచేస్తుంది. రాజ్యపాలనా, సమాజపాలనా వంటి రంగాలలో చూస్తే, ప్రపంచంలో ఏ దేశమైనా సరే, నిజానికి వేదధర్మాన్నే పాటిస్తున్నది. రకరకాల మతాలంటూ ఆయా దేశాలు చెప్పేవి ఉత్త పైపై కబుర్లు మాత్రమే.

నవీనకాలంలో ఇదే తప్పును గాంధీ నెహ్రూలు చేశారు. గాంధీ అనేవాడు గనుక స్వాతంత్ర సమరంలోకి రాకుండా ఉంటె, కనీసం ఏభై ఏళ్ళ ముందే మనకు స్వతంత్రం వచ్చి ఉండేది. మన చరిత్ర చదివిన చిన్నపిల్లాడికి కూడా ఈ విషయం తెలుస్తుంది. గాంధీ ఏం చేసాడు? నానా రకాల పాలిటిక్స్ చేశాడు. ప్రతిసారీ సహాయనిరాకరణం అంటూ పిలుపు నిస్తాడు. ప్రజలు దానిని పట్టుకుని, ఆ మూమెంట్ ఒక పీక్ కు వచ్చినప్పుడల్లా, సడన్ గా మూమెంట్ ని కాలాఫ్ చేసి, 'నేను అన్నం తినను' అని అలిగి కూచునేవాడు. ఈ రకంగా ఆయన చాలాసార్లు చేశాడు. ఆయన లేకుంటే మనకు ఇంకా చాలా ముందే స్వతంత్రం వచ్చి ఉండేది.

నెహ్రూ ఏం చేశాడు? ఇదే శాంతి మంత్రం పఠించి చైనా చేతిలో చావగొట్టించుకున్నాడు. పంచశీల సూత్రాలన్నీ బుద్ధుని బోధనలే. వాటిని చైనాతో కుదుర్చుకుని కుదుర్చుకోక ముందే చైనా మనల్ని ఎటాక్ చేసి లక్షలాది చదరపు మైళ్ళ మన భూభాగాన్ని ఆక్రమించింది. ఆ యుద్ధంలో మనం ఘోరంగా ఓడిపోయాం.

గాంధీ ఏం చేశాడు? దేశవిభజనకు  ఒప్పుకుని ఇంగ్లీషు వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎవర్నడిగి ఈ పని చేశాడు? పీపుల్స్ రిఫరెండం తీసుకున్నారా అలా చెయ్యడానికి? వాళ్ళంతట వాళ్ళు కూచుని డిసైడ్ చేశారు. ఇదెలా కరెక్ట్ అవుతుంది? ముస్లిమ్సేమో పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ స్టేట్ అని డిక్లేర్ చేసుకున్నారు. మనకేగాక ప్రపంచానికే ఒక పెద్ద తలనొప్పిగా తయారై ఉన్నారు. మనమేమో సెక్యులర్ స్టేట్ అని పెట్టుకున్నాం. ఇదీ గాంధీ నెహ్రూల నిర్వాకమే. ఇప్పుడేమైంది. మన ఇంట్లోనే మనకు బోలెడుమంది శత్రువులు తయారయ్యారు. మనం వ్రాసుకున్న రాజ్యాంగాన్నే ఇప్పటికి 101 సార్లు మార్చి పారేశాం మనం. ఎటు పోతున్నామో తెలియకుండా డైరెక్షన్ లెస్ గా తయారయ్యాం.

దేశవిభజన సమయంలో మన దేశాన్ని 'హిందూ స్టేట్' అని ఎందుకు డిక్లేర్ చెయ్యలేదు? అలా చేసి ఉంటే అంతా బాగా ఉండేది. ఎందుకంటే హిందూదేశంలో మాత్రమే ఎవరైనా సరే, ఏ మతమైనా సరే ఆనందంగా ఉండగలుగుతారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో కంటే ఇండియాలోనే ముస్లిములు హాయిగా ఉన్నారు. అన్ని సౌకర్యాలూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే పరమత సహనం అనేది మన రక్తంలోనే ఉన్నది.

మతప్రాతిపదికన దేశం విడిపోతున్నపుడు, వాళ్ళు ఇస్లాం అని ధైర్యంగా చెప్పుకున్నపుడు, మనం హిందూ అని పెట్టుకోవాలి. అలా చెయ్యలేకపోవడమూ, సెక్యులర్, సోషలిస్ట్, సావరిన్, రిపబ్లిక్ అంటూ ప్రపంచంలోని పదాలన్నీ కాపీ కొట్టి మనం తగిలించుకున్నామే - అదే గాంధీ నెహ్రూలు చేసిన అతిపెద్ద తప్పు. దాని ఫలితం ఇప్పుడు చక్కగా అనుభవిస్తున్నాం కదా ! 

శ్రీ అరబిందో అదే అన్నాడు. 'శత్రుదేశాలు ఎటాక్ చేస్తే అప్పుడు గాంధీ చెబుతున్న 'శాంతి' ఎలా పనిచేస్తుంది? సత్యాగ్రహం ఎలా పనిచేస్తుంది?' అని ఆయన ఆనాడే ప్రశ్నించాడు. అవి పని చెయ్యవు. ఇది వాస్తవ దృక్కోణం. ఆయనీ మాటను 1950 లో అన్నాడు. సరిగ్గా పన్నెండేళ్ళ తర్వాత చైనా మనల్ని ఎటాక్ చేసినప్పుడు అదే జరిగింది. అరబిందో అన్నమాట నిజమైంది. గాంధీ శాంతి కబుర్లూ, సత్యాగ్రహ వేషాలూ అప్పుడు ఎందుకూ పనిచెయ్యలేదు.

ఈనాటికీ కాశ్మీర్ సమస్య ఎటూ తేలకుండా ఉన్నది. ఈనాటికీ అక్కడ జనం పిట్టల్లా చస్తున్నారు. బ్రాహ్మణులు కాబట్టి కాశ్మీరీ పండిట్స్ ను అక్కడనుంచి తరిమేశారు. ఎవరూ మాట్లాడరు. అదే ఇంకో కమ్యూనిటీ అయితే ఏం చేసేవారు? ఇలాగే అందరూ సైలెంట్ గా ఉండేవారా? ఈ సమస్య కూడా నెహ్రూ గారి సృష్టే. దానిని సరిగ్గా టాకిల్ చెయ్యడం చేతకాక భ్రష్టు పట్టించి ఇలా చేసి మనకంటించి ఆయన చల్లగా తప్పుకున్నాడు. మనం అనుభవిస్తున్నాం.

మనం బలంగా ఉన్నప్పుడే మనకు ప్రపంచదేశాలలో మర్యాద దక్కింది. శాంతి శాంతి అని పాట పడిన ప్రతిసారీ అందరూ మనల్ని చావగొట్టి హేళన చేశారు. వందలాది ఏళ్ళపాటు మనల్ని దోచుకున్నారు.

నేడు చూడండి ! చైనాను చూసి అమెరికా కూడా భయపడే స్థితిలో ఉంది. నేనిక్కడ చూస్తున్నాను. అమెరికాలో అమ్ముడౌతున్న అన్ని వస్తువులూ, గుండుసూది నుంచి బట్టలనుంచి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వరకూ అన్నీ  'మేడ్ ఇన్ చైనా' అని ఉంటున్నాయి. వాటి క్వాలిటీ కూడా చాలా బాగా ఉంది. కానీ మన దేశంలో దొరికే చైనా ఐటమ్స్ అన్నీ పరమ చీప్ వెరైటీలు.

ఏ దేశమైనా సైన్యం గట్టిగా ఉంటేనే విలువ. అంతేగాని శాంతి శాంతి అని అడుక్కుంటే మనల్ని బెగ్గర్స్ లా చూస్తారు. నేడు చైనా ప్రపంచంలోనే సైనిక బలంలో నెంబర్ టూ పొజిషన్ లో ఉన్నది. ట్రేడ్ పరంగా నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నది. అందుకే అన్ని దేశాలూ ఇప్పుడు చైనాను చూచి గడగడా వణుకుతున్నాయి. అమెరికాతో సహా !!

మళ్ళీ చెప్తున్నాను. నా ఉద్దేశ్యంలో మన దేశాన్ని అధోగతి పట్టించినవారు నలుగురే. బుద్ధుడు, అశోకుడు, గాంధీ, నెహ్రూలు. దీనికి కారణం మన వేదాలను మనం మర్చిపోవడమే. నిజానికి బౌద్ధం జైనం మొదలైన మతాలు వ్యక్తిగత జీవితానికి మాత్రమే గాని సామాజిక జీవనానికి ఏమాత్రం పనికిరావు. అందుకే వాటిని అవైదిక (జ్ఞానంలేని) మతాలన్నారు. ఇది నా భావం మాత్రమే కాదు వాస్తవం కూడా ! ఈనాటికైనా ఏనాటికైనా వేదాలే మనకు శరణ్యం.

వేదాలంటే గిట్టని కొందరు ఈమధ్యన బుద్దుడిని మళ్ళీ బ్రతికించాలని ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరేమో క్రైస్తవాన్ని మనమీద రుద్దాలని చూస్తున్నారు. వాళ్ళే ఆ బోధనలను వాళ్ళ జీవితాలలో పాటించడం లేదు. ఎందుకంటే అవి చెప్పే బోధనలు ప్రాక్టికల్ గా పనికిరావు. ఆయా మతాలు పుట్టిన దేశాలే వాటిని పాటించడం లేదు. ఇదే నా మాటలకు రుజువు. ' అని ముగించాను.

ఈ మాటల్లో పడి, చూస్తుండగానే డెట్రాయిట్ వచ్చేసింది. ఇంటికి చేరి అందరం రెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టాం.