“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, జూన్ 2017, గురువారం

రెండవ అమెరికా యాత్ర -58 (టెక్సాస్ ట్రిప్)

టెక్సాస్ లో ఉన్న డా|| పద్మిని గారి కుటుంబంతో కొన్ని రోజులు గడుపుదామని మొత్తం అయిదుగురం కలసి ఆబర్న్ హిల్స్/మిషిగన్ నుంచి ఒక వీకెండ్ లో మెక్ ఆలెన్/ టెక్సాస్ కు బయలుదేరాం. మొత్తం నాలుగు గంటల ప్రయాణంలో మధ్యలో హ్యూస్టన్ లో ఒక బ్రేక్ తీసుకుని మెక్ ఆలెన్ ఎయిర్ పోర్ట్ లో దిగాం.

దారిలో మంచి మంచి మేఘాలలో ప్రయాణం చేశాం. ఆ తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా ప్రయాణం చేస్తూ క్రింద విశాలంగా పరుచుకుని ఉన్న నీటిని, ఒడ్డునే మైళ్ళ కొలది మాతో వస్తున్న బీచ్ ని చూశాం.

టెక్సాస్ అనేది అమెరికా డౌన్ సౌత్ లో ఉన్న రాష్ట్రం, ఆ తర్వాత మెక్సికో వస్తుంది. మిషిగన్ కు పూర్తిగా వ్యతిరేకంగా టెంపరేచర్ ఉండే రాష్ట్రం ఇది. ఇక్కడ ఎండలు మన గుంటూరు విజయవాడ ఎండలలాగా ఉన్నాయి. అమెరికాకు వచ్చాక మొదటి సారిగా ఇక్కడ చెమట పట్టింది.

ఎయిర్ పోర్ట్ కు డాక్టర్ పద్మిని, శ్రీకాంత్ గారు, వాళ్ళ పిల్లలు వచ్చి మమ్మల్ని సాదరంగా రిసీవ్ చేసుకున్నారు.

హ్యూస్టన్ నుంచి మెక్ ఆలెన్ కు వెళ్ళే ఫ్లైట్ లో మా ముందు సీట్లో NBA బాస్కెట్ బాల్ ప్లేయర్ రాబర్ట్ హోరీ కూచున్నాడు. అతని ఎత్తు 6-10. ఫ్లైట్ లోకి రావడమే చాలా వంగిపోయి నడుచుకుంటూ వచ్చాడు. అలా చేస్తేగాని అతను ఫ్లైట్ లో పట్టలేదు. నవ్వు ముఖంతో చాలా మంచివాడిలా కనిపించాడు. అమెరికాలో వైట్స్ చాలా సీరియస్ గా ఉంటారు. ఒకవేళ నవ్వినా ఆ ముఖాలలో కళా కాంతీ ఉండదు. ఏదో పెయింటెడ్ స్మైల్ లా ఉంటుంది. మనల్ని చూసే చూపులో, వీళ్ళు ఇక్కడికెందుకు వచ్చారు? అన్నట్లు ఉంటుంది. బ్లాక్స్ అలా కాదు. వాళ్ళు నిష్కల్మషంగా నవ్వుతారు. మంచిగా మాట్లాడతారు.

ఎయిర్ పోర్ట్ లో దిగీ దిగగానే అతనితో ఒక ఫోటో దిగాం. ఆ తర్వాత కార్లెక్కి డా|| పద్మిని గారింటికి బయలుదేరాం.

మెక్ ఆలెన్ ఊరు చూస్తుంటే మన మద్రాస్ లేక విశాఖపట్నం లాగా ఉంది. ఈత చెట్లు ఎక్కువగా కనిపించాయి. కొన్ని కొబ్బరి చెట్లు కూడా చూశానని అనుకుంటాను.