నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

17, జూన్ 2017, శనివారం

రెండవ అమెరికా యాత్ర -52 (చికాగో - స్వామి ఈశాత్మానంద గారితో సంభాషణ)


శ్రీనివాస్ దంపతులను ఆశీర్వదిస్తూ


శ్రీనివాస్ గారి ఇంటినుంచి బయలుదేరుతూ

చికాగో వేదాంత సెంటర్ లో 




సెంటర్ గురించి మాకు వివరిస్తున్న అరూప్



స్వామి ఈశాత్మానంద గారితో 




బుక్ స్టాల్లో



చికాగో వేదాంత సెంటర్ నుంచి బయలుదేరుతూ 


పొద్దున్నే లేచి కాలకృత్యాలు ముగించుకుని శ్రీనివాస్ దంపతుల దగ్గర సెలవు తీసుకుని తిరిగి వెనక్కు డెట్రాయిట్ వైపు బయలుదేరాం. దారిలో చికాగోలోని వేదాంత సెంటర్లో ఆగి అక్కడ ఇంచార్జ్ స్వామి ఈశాత్మానందగారిని కలవాలని ప్లాన్.

అనుకున్నట్లుగా పదిన్నర కల్లా చికాగో చేరుకున్నాం. వేదాంత సెంటర్ కు మేము చేరేసరికి వాకిట్లోనే ' అరూప్' అనే ఒకాయన నిలబడి మమ్మల్ని ఆహ్వానించాడు. మొదట్లో అతనొక నార్త్ ఇండియన్ అని అనుకున్నాం కానీ అతను మన హైదరాబాదీ అని తర్వాత తెలిసింది. పూర్వీకులు బెంగాలీలు అయినప్పటికీ హైదరాబాద్ లో స్థిరపడటం వల్ల తెలుగువాడిగానే పెరిగాడు. ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నానని చెప్పాడు.

స్వామీజీ ఎక్కడికో బయటకు వెళ్ళడం వల్ల ఆయనొచ్చే లోపు ఆశ్రమం అంతా తిప్పి చూపించాడు. ఫోటో గ్యాలరీ చాలా బాగుంది. అందులో స్వామి వివేకానంద అమెరికాలో అడుగు పెట్టిన సమయంలో ఆయనెన్ని బాధలు పడ్డారు? అన్న విషయాలు కళ్ళకు కట్టినట్లుగా ఉన్నాయి. అవన్నీ చూచి మా కళ్ళు చెమర్చాయి. ఈనాడు మనకు ఇంత సులభంగా మన హిందూధర్మం అంతా అర్ధం కావడానికి ఆ మహనీయుడు ఆరోజులలో పడిన కష్టమే కదా కారణం అని ఎంతో బాధ కలిగింది.

ఆ తర్వాత ఆలయంలో కాసేపు కూర్చోమని ఈలోపల స్వామీజీ వచ్చేస్తారని అతను అన్నాడు. మేం అక్కడ కాసేపు కూర్చునేసరికి స్వామీజీ వచ్చారు. ఆయన్ను చూస్తూనే ఆయనొక బెంగాలీ అని తెలిసిపోతున్నది. మధ్యవయస్సు దాటిన మనిషి, గంభీరంగా హుందాగా ఉన్నప్పటికీ నవ్వు ముఖంతో ఉన్నారు.

ఆయన సరాసరి దేవాలయానికి వచ్చి శ్రీరామకృష్ణులు, శారదామాత, స్వామి వివేకానందుల వద్ద ధూపం వెలిగించి తన రూమ్ వైపు దారి తీశారు. ఆయన రూమ్ లో అందరం సమావేశం అయ్యాం. నా గురించి నా వెంట ఉన్నవారి గురించి పరిచయాలయ్యాక స్వామీజీ మాట్లాడటం ప్రారంభించారు.

'మీరు చేస్తున్నది చాలా బాగుంది. మీ వ్రాతలద్వారా ఇంతమందిని మీరు ఉత్తేజపరుస్తున్నారు. నిజానికి మన హిందూ ధర్మం గురించి మీలా చెప్పేవాళ్ళు ఇంకా చాలామంది రావాలి. అప్పుడే మన అసలైన మతం ఏమిటో జనాలకు అర్ధమౌతుంది.

మన అసలైన మతం ఏమిటి? నిజమైన హిందూ ధర్మం ఏమిటి? వినండి. దేవుడు మనిషిని సృష్టించాడు. ఆ తర్వాత, ప్రతి యుగంలోనూ ఆయన మనం అనుసరించడానికి ధర్మాన్ని ఇచ్చాడు. అంతేగాక ప్రతికాలంలోనూ ఆయన మనకు కొన్ని ప్రలోభాలను కూడా కల్పించాడు. భగవద్గీతలో ఆయన చెప్పాడు. నేను రెండు ప్రకృతులను సృష్టించాను. ఒకటి పరా ప్రకృతి రెండవది అపరా ప్రకృతి. పరా ప్రకృతి అంటే దైవత్వం. మనకు కనిపించేదంతా అపరా ప్రకృతి. ఇది అశాశ్వతమైనది. అందంగా కనిపిస్తుంది ఆకర్షిస్తుందిగాని ఇది శాశ్వతం కాదు. 'పరా' శాశ్వతమైనది. కనుక మనం 'అపరా' నుంచి 'పరా' కు ప్రయాణం చెయ్యాలి. చాయిస్ మనది. మనం దేనివైపు వెళతామో మనమే నిర్ణయించుకోవాలి. ఇప్పుడొక సమస్య ఎదురౌతుంది. ఏది మంచి ఏది చెడు అని మనం ఎలా నిర్ణయించుకోవాలి? దానికీ ఆయనే పరిష్కారం సూచించాడు. ఆయనిలా చెప్పాడు. దానికోసం నేనే కొంతమందిని మీకు పంపిస్తాను. వాళ్ళు మీకు దారి చూపిస్తారు. అలా వచ్చిన వారిలో అవతార పురుషులున్నారు. అవతారం అంటే భగవంతుడే రూపం దాల్చి దిగివస్తాడు. ఆ తర్వాత తరగతిలోకి మహాపురుషులనే వాళ్ళు వస్తారు. వీరందరూ దైవశక్తి చేత తాము నింపబడి మనుషులకు దారి చూపిస్తారు. వాళ్ళేం చేస్తారు? ఇది మంచి దారి దీనిలో నడవండి అని చెబుతూ ఉంటారు. ఆ దారిలో నడిస్తే మనం ఆనందంగా ఉంటాం. కానీ ఆ దారిలో ఎలా నడవడం? మన కర్మను పెంచుకోకుండా తగ్గించుకోవడం ద్వారా మనమా గమ్యాన్ని చేరగలం? మనిషి జీవితానికి గమ్యం ఏమిటి? భగవంతుని దర్శించి ఆయనలో నిరంతరం మునిగి ఉండటమే మనిషి జీవితానికి అంతిమగమ్యం. కనుక దేవుడు రకరకాల కాలాలలో రకరకాల దేశాలలో అవతారంగా పుడుతూ ఉంటాడు. అందుకే మనం జీసస్ నీ బుద్దుడినీ అవతారాలని ఒప్పుకుంటాం. బుద్దుడు నిజానికి హిందువే. మహావీరుడు కూడా హిందువే. వారు బోధించిన సిద్ధాంతాలలో కొన్నికొన్ని తేడాలున్నాయి గాని వాళ్ళు ప్రాధమికంగా హిందువులే. హిందూ మతానికి భిన్నంగా వాళ్ళేమీ దాటి పోలేదు.

శ్రీరాముడు ఒక కాలంలో వచ్చాడు. ఆయనెక్కడా మతం గురించి మాట్లాడలేదు.మీరు రామాయణం పూర్తిగా చదివారా? ఇప్పుడు మనం ఆయన్ను దేవుడని అంటున్నాం. తులసీదాసు మొదలైన భక్తులు తర్వాత్తర్వాత కాలంలో ఆయన్ను దేవుడిగా కొలిచారుగాని ఆయన ఉన్నపుడు ఏ విధమైన మతాన్నీ ఆయన మనకు బోధించలేదు. అప్పటికే ఉన్న వైదిక మతాన్ని ఆయన పాటించాడు. అప్పట్లో మతం అవసరం మనిషికి లేదు. ధర్మం యొక్క అవసరం ఉన్నది. కనుక అప్పటి సొసైటీకి ఒక రూపం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. మనుషుల మధ్యన సంబంధాలు ఎలా ఉండాలో ఆయన చెప్పాడు. తండ్రి కొడుకుల మధ్యన, భార్యాభర్తల మధ్యన, సోదరుల మధ్యన, రాజు ప్రజల మధ్యన సంబంధాలు ఎలా ఉండాలో ఆయన ఆచరణాత్మకంగా చేసి చూపించాడు. ఆ విధంగా తన ఆచరణ ద్వారా ఆయన బోధించాడు.

ఇక కృష్ణుడో?  మతాన్ని గురించి ఆయన చాలా బోధించాడు. భగవద్గీత మొత్తం వేదాంతసారమే. అప్పట్లో ఉన్న అనేక ధర్మాలను మార్గాలను ఆయన క్రోడీకరించి భగవద్గీతలో చెప్పాడు. అందుకే భగవద్గీత సరిగ్గా అర్ధం అయితే వేదాలు వాటి సారం అంతా మనకు చక్కగా అర్ధమై పోతుంది. ఆ తర్వాత చాలా కాలం గడిచాక మళ్ళీ ధర్మం క్షీణించింది. మన మతం ఏమిటో మనకే తెలియని పరిస్థితులు వచ్చి పడ్డాయి. వెయ్యేళ్ళ ముస్లిం దుష్ట పరిపాలన, ఆ తర్వాత రెండు వందల ఏళ్ళ ఇంగ్లీషువాడి దోపిడీ పరిపాలనల తర్వాత అంతా అయోమయం అయిపోయి మన ధర్మం ఏమిటో మనకే తెలియని పరిస్థితులలో మనం పడిపోయినప్పుడు శ్రీరామకృష్ణులు అవతారంగా వచ్చారు.  మన అసలైన వేదధర్మాన్ని మనకాయన మళ్ళీ బోధించారు. ఈ లోపల కూడా ఎందఱో మహానుభావులు వచ్చారు. హిందూమతం చచ్చిపోకుండా వాళ్ళు కాపాడుతూ వచ్చారు. పన్నెండు వందల సంవత్సరాల బానిసత్వం తర్వాత కూడా హిందువులు నిలబడే ఉన్నారు. హిందూ మతం బ్రతికే ఉన్నది. ఇలాంటి అద్భుతం ప్రపంచవ్యాప్తంగా ఇంకే దేశంలో కూడా జరగలేదు. కానీ ఈ బానిసత్వం వల్ల మన అసలైన ధర్మం మరుగున పడిపోయింది.

ఏంటి మన అసలు మతం? వేదం ఏం చెబుతున్నది? వేదం ప్రకారం ప్రతి ఆత్మా దివ్యమే. ఆ దివ్యత్వాన్ని నువ్వు బయటకు ప్రకటించాలి.' దాని సారం ఇదే. దీనినే శ్రీరామకృష్ణులు తన జీవితంలో బోధించారు. దానినే వివేకానందస్వామి నవీన భాషలో Each soul is potentially divine అని చెప్పారు.

పాత కాలంలో ఏముండేది? నువ్వు పాపివి. నువ్వు నన్ను తాకకు. నువ్విది చెయ్యకూడదు అది చెయ్యకూడదు అని ఎక్కడా మన గ్రంధాలలో లేదు. ఇలాంటి అనేక అనవసరమైన రూల్స్ ఆ తర్వాత వచ్చాయి. 'నన్ను తాకకు నేను మైల పడిపోతాను' మొదలైన అనేక పద్దతులు కాలక్రమేణా మనలోకి వచ్చేశాయి. ఇవన్నీ విదేశీయులతో మన దేశంలోకి వచ్చిన ఇతర జాతులను మన సమాజంలోకి ఇంటిగ్రేట్ చేసుకునే క్రమంలో పుట్టుకొచ్చాయి. మొదట్లో ఇవన్నీ లేవు. ఈ దురాచారాలు ఇంకా మన దేశంలో బ్రతికే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడనుంచి వచ్చాయి? మొదట్లో మన వేదాలలో భగవద్గీతలో ఇవేవీ లేవు. మధ్యలో ఈ విదేశీ పరిపాలన వల్లా, బానిసత్వం వల్లా అవి వచ్చాయి.

దేవుడేం చెప్పాడు? ఈ సృష్టంతా నేనే చేశానని ఆయన అన్నాడు. ఆయనే ఇదంతా సృష్టించి ఉంటే ఇక సమస్య ఎక్కడున్నది? ఉపనిషత్తులు చెబుతున్నాయి - 'ఈశావాస్య మిదం సర్వం' - అంతా ఆయన యొక్క శక్తి ప్రకటనమే. గడ్డి పరక నుంచీ బ్రహ్మ వరకూ అన్నీ దైవప్రకటనమే. అయితే శక్తిలో డిగ్రీలు తేడా ఉంటుంది అంతే.

మీరు శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర చదివారా? ఆయన సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. కానీ ఆయనేమన్నారు? ఉపనయనం తర్వాత నా మొదటి భిక్షను నేను ఒక శూద్ర వనిత చేతిమీదుగా తీసుకుంటానని ఆయనన్నారు. ఆయన మాటల్లోని లాజిక్ ఏమిటి? నేను మాటిచ్చాను. కనుక మాట తప్పలేను. మాట తప్పడం బ్రాహ్మణలక్షణం కాదు. ఇచ్చిన మాట తప్పితే నేను బ్రాహ్మణున్ని కాను. కనుక నాకు ఉపనయనం అవసరం లేదు. కనుక నేను నా మొదటి భిక్షను శూద్ర స్త్రీ నుంచి స్వీకరించవలసిందే అని పట్టుబట్టారు. ఆయనెందుకలా చేశారు? ఆడవారికి, సమాజంలో తక్కువ కులాలవారికి గౌరవం ఇవ్వడమే ఆయన చర్య వెనుక ఉన్న ఉద్దేశ్యం.

'చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మ విభాగశ:'- అని భగవద్గీతలో ఉన్నది. నాలుగు వర్ణాలనూ నేనే సృష్టించానని దేవుడే స్వయంగా అన్నాడు. ఈ నాలుగు వర్ణాలు సృష్టిలో ఎప్పుడూ ఉంటాయి. కొంతమంది ఎప్పుడూ పని చేస్తూ ఉంటారు. పని చెయ్యకపోతే వాళ్ళు ఉండలేరు. వాళ్ళు శూద్రులు. ఇంకొంతమంది బిజినెస్ లో ఘటికులు. వాళ్ళు వైశ్యులు. ఇంకొందరు స్వతహాగా నాయకులు. వాళ్ళు క్షత్రియులు. మరి కొంతమంది ఇంటలెక్చువల్స్ ఉంటారు. వాళ్ళు బ్రాహ్మణులు.  కదలికకు కాళ్ళు, తినడానికి పొట్ట, పనికీ రక్షణకూ చేతులు, ఆలోచనకు మెదడు ప్రతి ప్రాణికీ అవసరం. ఇవే నాలుగు వర్ణాలు. ప్రతి సొసైటీలోనూ ఈ నాలుగూ తప్పనిసరిగా ఉంటాయి. మనం వద్దనుకున్నా ఇవి ఉంటాయి. అదే దేవుడు భగవద్గీతలో చెప్పాడు. హిందూ సొసైటీలో కూడా అదే జరిగింది. వారివారి శక్తిని తెలివిని గుణాన్ని బట్టి వర్ణ విభజన చెయ్యబడింది.

మరి అంతా బాగా ఉన్నప్పుడు తేడా ఎక్కడ నుంచి వచ్చింది? నేను బ్రాహ్మణుడిని కాబట్టి నా కొడుకు కూడా బ్రాహ్మణుడే అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే సమాజంలో వచ్చిందో అప్పుడే పతనం ప్రారంభం అయింది. వర్ణం నుంచి కులం వచ్చినప్పుడు ఇదంతా జరిగింది. గుణాన్ని కర్మనూ అందరూ మర్చిపోయారు. మన ధర్మం మన మతం యొక్క మౌలిక లక్షణాలను బోధనలను అందరూ మర్చిపోయారు. దీనికి తోడు పరాయి పాలన, వాళ్ళ విషప్రచారాలు తోడయ్యాయి. ఇదే ధర్మం క్షీణించడం అంటే. దీన్నంతా శ్రీరామకృష్ణులు వచ్చి సరిచేశారు.

కొందరంటారు ఓంకారాన్ని స్త్రీలు చెప్పకూడదు, స్త్రీలు కర్మకాండ చెయ్యకూడదు, పూజా సమయంలో వాళ్ళు పక్కన ఉండకూడదు అని అంటారు. మీకొక విషయం తెలుసా? వేదాలలో చాలాభాగం స్త్రీలు చెప్పినవే. అది నిజమైతే మనం స్త్రీలను ఎలా తక్కువగా చూడగలం? ఇది రామకృష్ణుల అతిగొప్ప ఉపదేశాలలో ఒకటి.  ఆయన మొదటి భిక్షను స్త్రీ నుంచి స్వీకరించారు. గురువుగా ఒక స్త్రీని ఆయన స్వీకరించారు. ఒకప్పుడు మోక్షానికి కొందరికే అర్హత ఉండేది. కానీ ఇప్పుడో? ఎవరైనా దానిని చేరుకోవచ్చు. ఈ విధంగా వేదాలను వాటి నిజమైన ఉపదేశాలను ఆయన పునప్రతిష్టించారు.

ఆయన చనిపోయే ముందు 1886 సంవత్సరంలో జనవరి ఒకటో తేదీన ఆయన వారూ వీరూ అనక అందరినీ అనుగ్రహించారు. 'మీరందరూ చైతన్యవంతులు కండి. దైవాన్ని చేరుకోండి.' - అని ఆయన దీవించారు.

కొద్దిరోజుల ముందు ఇక్కడే అమెరికాలో ఒక సంఘటన జరిగింది. ఇక్కడ ఒక గుడిలో ఒక పూజారి ఉన్నాడు.కొంతమంది శ్రీరామకృష్ణుల పటాన్ని ఆ గుడిలో పెడతామన్నారు. ఆ పూజారి వద్దన్నాడు. ఈయన దేవుడు కాదు. ఈయన పటాన్ని గుడిలో ఉంచడం కుదరదు అని అతనన్నాడు. వాళ్ళు అయోమయంలో పడ్డారు. అందుకని శ్రీరామకృష్ణుల పటాన్ని లైబ్రరీలో పెట్టారు. అక్కడ కూచుని గాస్పెల్ చదవడం మొదలు పెట్టారు.

ఇదంతా ఎంత వింతగా ఉన్నదో చూచారా? ఇదే అజ్ఞానం అంటే. ఒక వ్యక్తిని దేవుడా కాదా అని ఎలా చెప్తారు? కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడు కనుక ఆయన దేవుడు. అదీ దేవుడంటే? అని అంటారు. అదే నిజమైతే ఒక పెద్ద మిషన్ వచ్చి కొండను ఎత్తితే అది దేవుడైతుందా? కొండలు బండలు ఎత్తడమే దైవత్వం అయితే క్రేన్లన్నీ దేవుళ్లేనా?

రాముడు రాక్షసులను చంపాడు గనుక దేవుడని కొంతమంది అంటారు. లోకంలో ఎంతోమంది వీరులున్నారు. మహాభారతంలో ఎంతోమందిని యుద్ధంలో చంపిన వీరులు ఎందఱో ఉన్నారు. వాళ్ళందరూ దేవుళ్లు కారు. ఎక్కువ తలలు చేతులు ఉంటే దేవుళ్ళా? ఏమిటి ఈ కొలబద్ద?

అసలైన దైవలక్షణాలు ఇవేవీ కావు. భాగవతంలో మనకు కొన్ని లక్షణాలు ఇవ్వబడ్డాయి. ఏమిటవి? జరిగిపోయినదాన్ని, జరుగుతున్నదాన్ని, జరగబోయేదాన్ని - ఈ మూడు కాలాలనూ ఎవడైతే స్పష్టంగా క్షుణ్ణంగా తెలుసుకోగలడో వాడిలో దైవత్వం ఉన్నట్లు లెక్క.

ఇంకా చూస్తే, భగవద్గీత 16 వ  అధ్యాయంలో మొదటి మూడు శ్లోకాలలో కొన్ని లక్షణాలివ్వబడ్డాయి. ఏంటవి?

శ్లో|| అభయం సత్వసంశుద్ధి: జ్ఞానయోగ వ్యవస్థితి:
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం (1)

అహింసా సత్య క్రోధస్త్యాగ: శాంతి రపైశునం
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం (2)

తేజ: క్షమా ధృతి: శౌచమద్రోహో నాతిమానితి
భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత (3)


(భగవద్గీత 16 వ అధ్యాయం: 1,2,3 శ్లోకములు)

అర్ధం:--
దైవాంశతో పుట్టినవారికి ఈ లక్షణాలుంటాయి:

అభయం :-- భయం లేకుండటం
సత్వసంశుద్ధి:--శుద్ధమైన మనస్సును కలిగి ఉండటం
జ్ఞానయోగ వ్యవస్థితి:-- ఆత్మపరమాత్మ సంయోగం వల్ల వచ్చిన జ్ఞానసంపద
దానం:--దానగుణం
దమశ్చ:-- ఇంద్రియ నిగ్రహం
యజ్ఞశ్చ:-- త్యాగం
స్వాధ్యాయం:--శాస్త్ర పరిజ్ఞానం
తపం:-- తపశ్శక్తి
ఆర్జవం:--నిజాయితీతో కూడిన ప్రవర్తన
అహింసా:--హింసా గుణం లేకపోవడం
సత్యం:-- సత్యమైన నడవడిక
క్రోధస్త్యాగ:-- కోపం లేకపోవడం
శాంతి:-- శాంతస్వభావం
అపైశునం:-- లోభితనం లేకపోవడం
దయా:-- దయాస్వభావం
భూతేష్వలోలుప్త్వం:--జీవుల పట్ల మోహం లేకపోవడం
మార్దవం:-- మెత్తని మనస్సు
హ్రీ:--మానమర్యాదలు ఉండటం
అచాపలం:-- చపలత్వం లేకపోవడం
తేజ:--తేజస్సు
క్షమా:--క్షమాగుణం
ధృతి:--శక్తిని కలిగి ఉండటం
శౌచమ్:--శుచిగా ఉండటం
అద్రోహో:--ద్రోహచింతన లేకపోవడం
నాతిమానితి:--గర్వం లేకపోవడం

ఈ లక్షణాలు దైవాంశతో పుట్టినవారిలో ఉంటాయి.

ఇవీ అసలైన దైవలక్షణాలు. రాక్షసులను చంపడం వల్లా, కొండలు ఎత్తడం వంటి అద్భుతాలు చెయ్యడం వల్లా రాముడు కృష్ణుడు దేవుళ్ళు కాలేదు. ఈ లక్షణాలు వారిలో ఉన్నాయి గనుక వారు దైవం యొక్క అవతారాలయ్యారు. శ్రీరామకృష్ణులలో ఈ లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కనుక ఆయనా దైవం యొక్క అవతారమే. కానీ కొంతమంది దీనిని గ్రహించలేకపోతున్నారు. మాయాప్రభావం అంటే ఇదే.

కొంతమంది పాత బూజును త్వరగా వదల్చుకోలేరు. అసలైన సత్యాన్ని గ్రహించలేరు ఒప్పుకోలేరు. ఈ అసత్యపు భావాలనుంచి మనం బయటకు రావాలి. సత్యాన్ని గ్రహించాలి.

దేవుడి లక్షణాలేవి? ప్రేమ, కరుణ, నిస్వార్ధత ఇవే.

దైవత్వానికి వివేకానందస్వామి ఒక నిర్వచనం ఇచ్చారు. నిస్వార్ధతే దైవలక్షణం. అదీ అసలైన నిర్వచనం. ఒకరిలో నిస్వార్ధత ఉంటే అది దైవలక్షణమే. ఊరకే చెప్పడం కాదు అలా మనం ఉండగలగాలి. అదీ దైవత్వానికి అసలైన నిర్వచనం. ఊరకే గుళ్ళలో గోపురాలలో మనం చేసే రిచువల్స్ ఎంతమాత్రం చాలవు. అవి మనల్ని ఏమాత్రం దైవత్వం వైపు తీసుకెళ్లలేవు. నిజమైన దైవత్వం అనేది పైన చెప్పిన లక్షణాలలో ఉన్నది. అవి మన నిత్యజీవితంలో ప్రతిబింబించాలి. అప్పుడే మనం దైవం వైపు అడుగులు వేస్తున్నట్లు. అవి మనలో లేకపోతే మనం ఎన్ని పూజలు చేసినా రాక్షసులతో సమానమే.

మన గురించి మన మతం గురించి ఏమీ తెలియని వాళ్ళు వెయ్యి సంవత్సరాలపాటు మనల్ని పరిపాలించారు. మనల్ని బానిసలుగా చూశారు. మన మతం పదివేల ఏళ్ళ క్రితం నుంచీ ఉన్నది. ప్రపంచానికి మతం గురించి ఏమీ తెలియని రోజుల్లోనే మనం దానిలో ఎంతో ముందున్నాం. మన మతం ప్రపంచం గురించీ చెప్పింది. దైవం గురించీ చెప్పింది. ప్రపంచాన్ని వదలిపెట్టమనీ నీ బాధ్యతలను వదిలెయ్యమనీ అదెక్కడా చెప్పలేదు.

ఋగ్వేదం లో రెండు రకాల బోధనలున్నాయి. ఒకటి ప్రపంచం గురించి రెండు దైవం గురించి. మొన్న మేము ఋగ్వేదాన్ని అధ్యయనం చేస్తున్నాం. అందులో ఒక అమ్మాయికి ఇలా చెబుతున్నది ఋగ్వేదం.

"నీకు చదువు పూర్తి అయింది. పెళ్లి చేసుకోబోతున్నావు. ఇకపైన నువ్వు ఇలా ఉండాలి. ఇలా నడుచుకోవాలి - అని వేదం చెప్పిన మంత్రాలు అక్కడ ఉన్నాయి. పాతకాలంలో గురుకులాలున్నాయి. అన్ని ధర్మాలనూ అవి చెప్పేవి. అబ్బాయిలకు కూడా అవి ధర్మాలను చెప్పాయి. ఒక విద్యార్ధి ఎలా ఉండాలి? ఒక భర్త ఎలా ఉండాలి? ఒక తండ్రి ఎలా నడుచుకోవాలి? మిత్రధర్మం ఏమిటి? గురుశిష్యులు ఎలా ఉండాలి? మొదలైనవన్నీ అవి చెప్పాయి. ఆ విధంగా సొసైటీని వాళ్ళు ప్రతిదానిలోనూ గైడ్ చేశారు. వ్యవసాయం పశుపోషణ రాజ్యపాలన ఆయుధనిర్మాణం - ఇదంతా వేదాలలో ఉన్నది. లౌకిక జీవితానికి అవసరమైన విషయాలన్నీ వేదాలు చెప్పాయి. చాలామంది అనుకుంటారు వేదాలు అంతా ఆధ్యాత్మికం అని. అది తప్పు భావన. అదే సమయంలో 'నీవు ఆత్మవు' 'లౌకిక జీవితం ఒక్కటే నీ పరమావధి కాదు. దైవాన్ని చేరడం నీ అసలైన ధర్మం దానిని మరచిపోకు.' అని కూడా వేదాలు చెప్పాయి.

ఈ విధంగా లౌకికం ఆధ్యాత్మికం రెండూ వేదాలు బోధించాయి. ప్రపంచాన్ని మరచిపోయి బెగ్గర్ కమ్మని ఎక్కడా అవి చెప్పలేదు. కనుకనే వేల సంవత్సరాల నాడే మనం అన్నింట్లో ముందున్నాం. మరి ఇదంతా ఎలా పోయింది? ఎలా నాశనమైంది. మధ్యలో బుద్ధుడొచ్చి  అంతా పాడు చేశాడు. జైనులు బుద్ధుడు వీరిద్దరే భారతదేశ నాశనానికి కారకులు. బుద్దుడేమి చెప్పాడు? అహింసా పరమో ధర్మ: అహింసే ఉత్తమ ధర్మం అని చెప్పాడు. అహింస ఎవరికీ? అది బ్రాహ్మణులకు మాత్రమే. క్షత్రియులకు కాదు. మనువు తన ధర్మశాస్త్రంలో ఇలా చెప్పాడు. ఎవరైనా ఆకతాయి వచ్చి నిన్ను ఇన్సల్ట్ చేస్తే వాణ్ని చంపినా తప్పు లేదని ఆయనన్నాడు. అదీ నిజమైన హిందూమతం. ఎవడో వచ్చి మనల్ని చంపి దోచుకుంటుంటే అహింసా మంత్రం జపించమని మన మతం ఎక్కడా చెప్పలేదు. బుద్ధుడే అలా చెప్పాడు. మనం బలహీనులం కాము. కానీ మన వేదధర్మాన్ని మరచిపోవడం వల్ల వెయ్యి సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు రామకృష్ణ వివేకానందుల వల్ల తెలివి తెచ్చుకుని మన ధర్మాన్ని మనం గ్రహించి బలవంతులమై బ్రతుకుతున్నాం.

ఒక స్త్రీ (శారదామాత) శ్రీరామకృష్ణ సంఘానికి జనని. ఇది మనం ఊహించగలమా? పైగా ఆమె ఒక విడో. పాతకాలంలో విడోలకు మనం ఇచ్చిన స్థానం ఏమిటి? ఇప్పుడు మనం ఇస్తున్నదేమిటి? స్త్రీలకు మనం ఇచ్చే అత్యంత అరుదైన గౌరవం ఏమిటో ఈ విధంగా ప్రాక్టికల్ గా మనం నిరూపిస్తున్నాం. 

స్వామీ వివేకానంద అమెరికానుంచి ఇండియాకు వచ్చి రామకృష్ణా మిషన్ స్థాపించినప్పుడు ఒకడొచ్చి స్వామీజీని డొనేషన్ అడిగాడు. ఆయన ఒక భిక్షువుగా దేశమంతా తిరుగుతున్నపుడు ఎవరూ ఆయనకు ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టలేదు. అదే స్వామీజీ అమెరికాలో సక్సెస్ అయ్యి వెనక్కు వస్తే ఆయన్నే డొనేషన్లు అడిగారు మనవాళ్ళు. అలా ఉంటుంది మనవాళ్ళ హీన ప్రవర్తన !

'ఎందుకు' అని ఆయన ప్రశ్నించారు.

'ఆవులను రక్షించాలి. అందుకోసం.' అని తను చెప్పాడు.

'ఒకవైపున కరువొచ్చి మనుషులు చస్తున్నారు. ఆ ప్రాంతానికి మా సాధువులను బ్రహ్మచారులను సేవకోసం నేను పంపిస్తున్నాను. దానికి చాలా డబ్బు కావాలి. మీరు చెప్పిన పనికి నేను డబ్బు ఇవ్వలేను' - అని స్వామీజీ అన్నారు.

'కరువు వచ్చి మనుషులు చావడం వారి కర్మ.' అని అతనన్నాడు.

దానికి స్వామీజీ ఇలా అన్నారు.

'మరి ఆవులేంటి? అవి అలా చావడం వాటి కర్మ అని అనుకోవచ్చుగా?'

'అదెలా అవుతుంది స్వామీజీ? ఆవు మన తల్లి. తల్లిని మనం కాపాడుకోవాలి.' అని అతనన్నాడు.

స్వామీజీ నవ్వుతూ చమత్కారంగా ఇలాగన్నారు.

'నిజమే, ఆవులకు తప్ప ఇంత తెలివైన సంతానం ఎలా కలుగుతుంది? ఆవు మీ తల్లే అని నేనిప్పుడు నమ్ముతున్నాను.'

మన ధర్మాన్ని సక్రమంగా అర్ధం చేసుకోలేక పోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు మన హిందూమతంలో ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు.

ఇప్పుడు కూడా మళ్ళీ హిందూమతం పేరుతో తప్పులు చాలా జరుగుతున్నాయి. మన ధర్మంలో మత మార్పిడి లేదు. భావౌన్నత్యం ఉన్నది. మనం ఎవరినీ మతం మార్చము. కానీ వారి భావాలను ఉన్నతంగా మారుస్తాము. మొదట్నించీ ఇదే మన మార్గం. మన మతం చాలా విశాలమైనది. ఇతరుల మతాలను మనం మార్చడం కాదు. మనుషుల యాటిట్యూడ్ లను మనం మార్చాలి. అదీ అసలైన మతమంటే. అందుకే ఠాకూర్ స్వామీజీలను మనం చదవాలి. అర్ధం చేసుకోవాలి.

అమెరికాకు వచ్చిన మన యువతరానికి ప్రత్యెకమైన బాధ్యత ఉన్నది.మీరు ఎంతో కొంత మెరిట్ ఉండబట్టే ఇక్కడకు వస్తున్నారు. ఇక్కడ మంచిని మీరు నేర్చుకోవాలి. కానీ మన ధర్మాన్ని మతాన్ని మీరు మర్చిపోకూడదు. ఇక్కడ అంతా నీట్ గా, క్లీన్ గా, ఆర్జనైజుడుగా ఉన్నది. దానిని మనం నేర్చుకోవాలి. ఉత్త పూజలు చెయ్యడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. మొదట్లో కర్మ చెయ్యాలి. కర్మను సక్రమంగా ఎలా చెయ్యాలో మొదట్లో నేర్చుకోవాలి. ధ్యానం ఆ తర్వాత వస్తుంది.

మన గుళ్ళు చూడండి. ఎంత దరిద్రంగా మురికిగా ఉంటాయో? 'మేం దేవుడిని చాలా ప్రేమిస్తాం' అని మనమంతా అంటాం. కానీ దేవాలయాలను ఎలా ఉంచుతున్నాం మనం? అక్కడే అసలైన గోలంతా ఉంటుంది? శుచీ శుభ్రతా ఏమాత్రం అక్కడ ఉండదు. ఇదేనా మన దైవప్రేమ?

మనం నిజంగా దైవాన్ని ఆరాధిస్తే ఆలయాలను అలా ఉంచగలమా? ఉదాహరణకు పూరీ జగన్నాధ ఆలయం తీసుకోండి. జగన్నాధుడంటే ఎవరు? సమస్త జగత్తుకూ నాధుడు. మరి మనమేం చేస్తున్నాం? నువ్వు హిందువ్వి కాదు నువ్వు లోపలకు రాకూడదు. అంటున్నాం. జగన్నాధ ఆలయం తలుపులు వేసేసి జగన్నాథస్వామిని పూజిస్తున్నాం మనం. ఎంత తప్పు అది? పూరీలో జగన్నాధ స్వామి విగ్రహాన్ని మీరు చూచారా? ఆయనకు చేతులు కాళ్ళు ఉండవు. రెండు పెద్ద పెద్ద కళ్ళు మాత్రం ఉంటాయి. బంగారు చేతులు తయారు చేసి ఆయనకు పెడతారు. మళ్ళీ వాటిని లాకర్లో దాచి పెడతారు. అదంతా అనవసరం. నిజానికి ఆ విగ్రహం ఒక సింబల్ మాత్రమే. ఉపనిషత్తులలో ఉన్న ఒక అద్భుతమైన భావానికి ఆ విగ్రహం ఒక సూచిక మాత్రమే. ఉపనిషత్తులలో ఇలా ఉన్నది.

"తదేజతి తన్నైజతి తద్దూరే తదన్తికే తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత:"

(ఈశావాస్య ఉపనిషద్ : శ్లో 5)

ఈ మంత్రానికి అర్ధం ఏమిటో తెలుసా?

"అది కదులుతుంది. అది కదలదు. అది దూరంగా ఉంది. దగ్గరలోనూ ఉంది.అది అన్నింటి లోపలా ఉన్నది. అన్నిటికీ బయటా ఉన్నది."

ఉపనిషత్తులలో దైవాన్ని 'అది' అన్నారు. ఎందుకు? అది పురుషుడూ కాదు స్త్రీనూ కాదు. ఒక 'శక్తి' అంతే. ఎనర్జీకి జెండర్ ఎలా ఉంటుంది? అందుకే 'అది' అన్నారు.

దానికి కాళ్ళు లేవు. చేతులు లేవు. అది ఎక్కడైనా ఉండగలదు. ఎక్కడికైనా పోగలదు. అది ఊరకే చూస్తుంది. కానీ అన్నీ చెయ్యగలదు. అనే ఒక అద్భుతమైన భావానికి జగన్నాథస్వామి విగ్రహం ఒక ప్రతిబింబం అంతే. అందుకే ఆయనకు కాళ్ళు చేతులు ఉండవు. కదలడానికి మనకు కాళ్ళు అవసరం. పని చెయ్యడానికి చేతులు అవసరం. దైవానికి అవసరం లేదు. సంకల్పమాత్రంతోనే ఆయన ఏమైనా చెయ్యగలడు. ఆయనకు ఇవన్నీ అవసరం లేదు. ఇదంతా సింబాలిజం. మన దేవాలయాలు విగ్రహాలు ఇవన్నీ సింబాలిజం.

కానీ ఇదంతా ఎవరు నమ్ముతారు? చెప్పినా ఎవరు వింటారు? ఇదే మన అవగాహనా రాహిత్యం. ఇవన్నీ సక్రమంగా అర్ధం చేసుకున్నపుడు మాత్రమే మనం హిందూమతాన్ని అర్ధం చేసుకోగలం. అప్పుడు తెలుస్తుంది మన మతం ఎంత గొప్పదో?

దుర్గాదేవికి పదిచేతులు ఎందుకుంటాయి? అవి దశదిశలకు సూచికలు. అన్ని దిశలలోనూ అమ్మ ఏకకాలంలో పనిచెయ్యగలదని చెప్పడమే వాటి ఉద్దేశ్యం.  అమ్మ దగ్గర ఎలుక,ఏనుగు,సింహం, మొదలైన అన్ని జంతువులూ ఉంటాయి. అంటే ఏమిటి? గుడ్లగూబ నెమలి మొదలైన పక్షులూ ఉంటాయి. సర్పం ఉంటుంది. మొక్కలు ఓషధులు ఉంటాయి. అంటే ఏమిటి? శక్తి అనేది ప్రకృతిలో అంతటా నిండి ఉన్నది. అన్ని జీవులలోనూ ఉన్నది' - అని చెప్పడమే వీటి ఉద్దేశ్యం. ఇదంతా సింబాలిజం. కంప్యూటర్ భాష లాంటిది. ఆ భాష వచ్చినవారికి అది అర్ధమౌతుంది. మనకు అర్ధం కాదు.

ఇక్కడ రోడ్డు మీద చూడండి. అనేక గుర్తులుంటాయి. మీరు డ్రైవింగ్ చేస్తుంటే ఒక యారో కనబడుతుంది. దానర్ధం ఏమిటి? ఈ లేన్ నెక్స్ట్ లేన్ లో కలుస్తుంది అని ఆ సింబల్ చెబుతుంది. అక్కడ రోడ్డుమీద నిలబడి ఎవరూ మనకు ఆ విషయాన్ని చెప్పరు. ఆ గుర్తులను మనం అర్ధం చేసుకుని కారును నడపాలి. హిందూమతం కూడా అంతే. అదంతా సింబాలిక్ రెలిజియన్.

మనకున్న సింబల్స్ లో ఓంకారం చాలా గొప్పది. అది అకార ఉకార మకార సమ్మిళితం. దీనిని ఉచ్చరించడానికి నాలుకా పెదవులూ అవసరం లేదు. ఓంకారం తప్ప మిగతా అన్నింటికీ ధ్వని పుట్టించాలంటే నీకు రెండు వస్తువులు కావాలి కాని ఓంకారానికి అవసరం లేదు. అందుకే దానిని అనాహతం (ఆహతం కానిది, కొట్టబడనిది) అన్నారు."

ఇదంతా చెప్పిన తర్వాత స్వామీ ఈశాత్మానంద ఇలా అన్నారు.

"మీరు మీ వ్రాతల ద్వారా ఎందరినో ఇన్స్పైర్ చేస్తున్నారు. అసలైన హిందూమతాన్ని మీద్వారా ఎందఱో తెలుసుకుంటున్నారు. చాలా బాగుంది. మీ ద్వారా ఠాకూర్ (శ్రీరామకృష్ణులు) తానే ఈ పనిచేస్తున్నారు. భావపరివర్తనమే శ్రీ రామకృష్ణ ఉద్యమం. రామకృష్ణుల భావాలన్నీ పాజిటివ్ భావాలు. వీరిలో నెగటివ్  భావాలు లేనేలేవు. వీరి వద్దకు ఎవరొస్తారో వారు తప్పకుండా దివ్యాత్ములౌతారు."

"మనం మామూలుగా వాడే హిందూమతం అనే పదం కరెక్ట్ కాదు. హిందూ అనే పదం మనది కాదు. మన మతానికి ఒక పేరంటూ ఎప్పుడూ లేదు. సింధు నదికి అవతల ఉండే ప్రాంతాన్ని పలకడం చేతకాక 'సింధు'ని 'హిందు' అంటూ పిలిచేవాళ్ళు ఆఫ్ఘన్లు పార్శీలు మొదలైన వాళ్ళు. ఇంగ్లీషు వాళ్ళు దానినే లీగలైజ్  చేశారు. అదే హిందూమతం అని మనమూ అనడం మొదలుపెట్టాము. కానీ మన మతం పేరు హిందూ మతం కాదు. అలా మన గ్రంధాలలో ఎక్కడా లేదు. మనది Eternal Religion, సనాతన మతం లేదా సనాతన ధర్మం. ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్రిన్సిపుల్స్ మీద ఆధారపడిన మతం.

మన మతంలో అన్ని ప్రశ్నలకూ జవాబులున్నాయి. కానీ రెండు ప్రశ్నలకు మాత్రం మనం సమాధానం చెప్పలేము.

ఒకటి - మన మతం ఎప్పుడు పుట్టింది? దీనికి జవాబు లేదు. ఇది ఎంతో ప్రాచీనమైనది. భూమి పుట్టిననాటినుండే ఇది ఉన్నది. ఇతర మతాలు తర్వాత వచ్చినవి.

రెండు - దీనిని మొదలు పెట్టినవాళ్ళు ఎవరు? దీనికీ మన వద్ద జవాబు లేదు. ఇతర మతాలను ఎవడో ఒక ప్రవక్త మొదలు పెట్టాడు. మన మతాన్ని దేవుడే మొదలు పెట్టాడు. ఇది ఎప్పుడు జరిగిందో తెలీదు. సృష్టి మొదలు అయినప్పటినుంచీ మన మతం ఉన్నది. కనుక దీనికి ఆద్యుడెవరు అంటే మనం ఒక మనిషిని చూపించలేము.

మన మతం అతిప్రాచీనమైనదే కాక యూనివర్సల్ సూత్రాల మీద ఆధారపడినది. అందుకే ఇది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మిగతా మతాలు వస్తాయి పోతాయి కానీ మన మతం ఎప్పటికీ నిలిచి ఉంటుంది."

ఇలా చెప్పి స్వామీజీ మావైపు చూచి చిరునవ్వు నవ్వారు. ఆ తర్వాత కొంత ప్రసాదాన్ని మాకిచ్చారు.

మేము ఆయనకు ప్రణామం చేసి కిందకొచ్చి ఆశ్రమం బుక్ స్టాల్లో కొన్ని పుస్తకాలు సీడీలు ఫోటోలు కొనుక్కుని మా కార్లెక్కి 'హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో' వైపు బయలుదేరాం.