“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, మే 2018, శుక్రవారం

రెమెడీ చెప్తా రండి !!

నేను వ్రాసే జ్యోతిష్య పోస్టులు చదివేవారు కొందరు నాకు మెయిల్స్ ఇస్తూ ఉంటారు. వాటిలో సాధారణంగా ఇలా ఉంటుంది.

'మీరు బాగానే చెబుతున్నారు. గత పదేళ్ళ నుంచీ మీరు చెప్పినవి చాలా జరిగాయి. జరుగుతున్నాయి. కానీ మీరు రెమెడీలు ఏమీ చెప్పడం లేదు. అవి కూడా చెబితే బాగుంటుంది కదా '.

నిన్న ఒక ఫోన్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి ఇదే టాపిక్ లేవనెత్తాడు. అతను నా స్నేహితుడే. అందుకని చనువుగా అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు.

'ఊరకే ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పడం కాదు. రెమెడీలు ఏమేం చెయ్యాలో కూడా చెబితే కదా ఉపయోగం? అది చెప్పకుండా, ఊరకే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి జనాన్ని భయపెడితే ఉపయోగం ఏముంది?' అన్నాడు.

నాకు నవ్వొచ్చింది.

'చూడు. ఒకరిని భయపెట్టడం నా అభిమతం కాదు. హెచ్చరించడం మాత్రమే నేను చేస్తాను. అయినా ఇలాంటి పోస్టులు చదివి భయానికి గురయ్యేవారు ఇంకా మన సొసైటీలో ఉన్నారంటే నాకు నవ్వొస్తోంది. నా పోస్టులు ఎవరూ అంత సీరియస్ గా తీసుకోరని నాకు బాగా తెలుసు.' అన్నాను.

'మరి తెలిసినప్పుడు ఎందుకు వ్రాయడం?' అన్నాడు.

'అదొక దురద. చాలా ఏళ్ళ నుంచీ ఉంది. ఎన్నో మందులు వాడాను. తగ్గలేదు. బ్లాగులో పోస్టు వ్రాస్తే వెంటనే దురద కొంచం తగ్గినట్లు అనిపిస్తుంది. అందుకే వ్రాస్తున్నాను.' చెప్పాను నవ్వుతూ.

'నీ జోకులు సరేలే గాని, అప్పుడప్పుడు కొన్ని రెమేడీలు కూడా చెప్తూ ఉండు. బోలెడు మంది జ్యోతిష్కులు అలా చెబుతూ వ్రాస్తూ ఉంటారు. నువ్వూ ఆ దారిలో వెళ్ళు.' అన్నాడు.

' ఆ దారీ వద్దు, గోదారీ వద్దు గాని, నేను రెమెడీలు చెప్పను.' అన్నాను.

'అదేంటి? అంటే, ఆ ప్రమాదాలు తప్పిపోవడం నీకిష్టం లేదా?' అన్నాడు ఆశ్చర్యంగా.

'అవును. నాకిష్టం లేదు. ప్రస్తుత సమాజంలో నేను చూస్తున్న మనుషులు ఎవరూ నాకు నచ్చడం లేదు. అందుకే వీళ్ళందరూ ప్రమాదాల బారిన పడాలనే నేను ఆశిస్తున్నాను. ఇప్పుడున్న సమాజం మొత్తం నాశనం అయిపోయి నిజమైన మానవత్వంతో నిండిన కొత్త సమాజం రావాలని కలలు కంటున్నాను. అందుకే ప్రమాదాలు ఇంకా ఇంకా పెరగాలి, మనుషులు గుట్టలు గుట్టలుగా చావాలనేదే నా కోరిక. ఎటూ చివరకు జరిగేది అదేలే. ఈ దేశంలో ఎవడికీ ఏదీ పట్టదు. ఎవడికీ సివిక్ సెన్స్ లేదు. ఏదీ స్వచ్చం కాదు. దేనిమీదా కంట్రోల్ లేదు. అంతా హిపోక్రిట్స్. నేను కోరుకోవడం ఎందుకు? నేను కోరుకున్నా కోరుకోక పోయినా ప్రకృతి ఎజెండా అదే , త్వరలో జరిగేది కూడా అదే.' చెప్పాను.

'ఇదేనా ఆధ్యాత్మికత అంటే?' అన్నాడు.

'అవును. అసలైన ఆధ్యాత్మికత అంటే ఇదే. ఇక రోగం నయం కాదు అనుకున్న స్టేజిలో ఆపరేషన్ చెయ్యడం ఒక్కటే మార్గం.' అన్నాను.

'ఆపరేషన్ జరిగితే పేషంట్ బ్రతకాలి కదా?' అన్నాడు లాజిక్ ఉపయోగిస్తూ.

'పేషంట్ ఉంటాడు. చెడిపోయిన అవయవాన్ని కోసి అవతల పారేస్తుంది ప్రకృతి. అంతే.' అన్నాను.

'అంటే మనుషులు చస్తుంటే నీకు బాగుంటుందా?' అన్నాడు నన్ను వెర్రెక్కిస్తూ.

'అవును. చాలా బాగుంటుంది. అందుకేగా పేపర్లో ప్రతిరోజూ అవే వార్తలు వస్తున్నాయి? కానీ నాకింకా చాలడం లేదు. ప్రస్తుతం మన జనాభా 125 కోట్లు అనుకుంటాను. అందులోనుంచి వంద కోట్ల మంది తుడిచిపెట్టబడి ఒక పాతిక కోట్లు మిగిల్తే చూడాలని నా చిరకాల వాంఛ. నిజమైన యోగులు సిద్ధపురుషులు ప్రస్తుతం కోరుకుంటున్నది జననష్టమే గాని జనకల్యాణం కాదు.' అన్నాను.

' ఆ వందకోట్లలో నువ్వూ ఉంటే?' అన్నాడు చనువుగా.

'అది మరీ మంచిది. ఈ ఛండాలపు మనుషులను రోజూ చూచే బాధ తప్పుతుంది. నాకు కావలసింది కూడా అదే.' అన్నాను.

'ఏంటో నీ గోల? ఎంతకూ అర్ధం కావు.' అన్నాడు విసుగ్గా.

'నేనింతేలే గాని, నీకేదైనా రెమెడీ చెప్పమంటావా?' అడిగా నవ్వుతూ.

'అదేంటి నీ అంతట నువ్వే చెబుతానంటున్నావ్? ఇదేదో విచిత్రంగా ఉందే?' అన్నాడు.

'బాగుపడే రెమెడీ చెప్పను. పాడైపోయే రెమెడీ చెబుతాను. ఇంకాఇంకా త్వరగా నాశనం అవ్వడానికి రెమెడీ చెబుతాను. కావాలనే రెమెడీని మార్చి రివర్స్ లో అలా చెబుతానన్నమాట.' అన్నాను సీరియస్ గా.

'అదేంటి? అలా చెబితే అడిగినవారిని నువ్వు మోసం చేసినట్లు కాదా?' అన్నాడు అనుమానంగా.

'మోసమా? వాళ్ళు నిత్యజీవితంలో నిత్యమూ చేస్తున్నది మోసం కాదా? అన్యాయం కాదా? వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటున్నాయో కాస్త చూడు. అందరూ దొంగలే. అలాంటప్పుడు నేనెందుకు వారికి మంచి రెమెడీ చెప్పాలి? పైగా వారిని నాశనం చెయ్యడం ద్వారా నేను ప్రకృతికి సహాయం చేస్తున్నాను. అంతం వైపు దానిని ఇంకా త్వరగా తీసుకెళుతున్నాను. అంటే, దైవకార్యంలో నా పాత్ర చక్కగా పోషిస్తున్నానన్న మాట. ఇది చాలా మంచి పనే నా దృష్టిలో.

ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ ఇష్టం వచ్చినట్లు వెయ్యండి అని రాజకీయ నాయకులే బాహాటంగా చెబుతున్నారు. నేనూ అదే పాటిస్తున్నాను. పైగా నేను డబ్బులు తీసుకోవడం లేదు. కనుక నా ఇష్టంవచ్చిన రెమెడీ, నిన్ను ఖచ్చితంగా నాశనం చేసే రెమెడీనే నేను చెబుతాను. ఎందుకంటే నాక్కావలసింది నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడమే గాని లౌకికంగా ఎదగడం కాదు.' అన్నాను.

'నాకు భయమేస్తోందిరా నీ మాటలు వింటుంటే' అన్నాడు.

'నటించకు. అంత భయం నీకు లేదని నాకు తెలుసులే గాని, వెంటనే పనిచేసే మాంచి రెమెడీ చెప్తా చేస్తావా?' అడిగా నవ్వుతూ.

'వద్దు బాబోయ్! నాకింకా కొన్నాళ్ళు బ్రతకాలనుంది' అంటూ వాడు ఫోన్ పెట్టేశాడు.

నవ్వుకుంటూ నా పని నేను మొదలుపెట్టాను.