“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, మే 2018, మంగళవారం

వివేకానందుడూ బుద్ధుడూ జ్యోతిష్యాన్ని నమ్మలేదా? ఎవరా మాటంది?

ఈ మధ్య టీవీలోనూ నెట్లోనూ ఒక విచిత్రమైన వాదన షికార్లు చేస్తోందట. కొందరు నా చెవిని వేశారు. అదేంటంటే - 'వివేకానందస్వామి జ్యోతిష్యాన్ని నమ్మొద్దన్నాడు. బుద్ధుడు కూడా జ్యోతిష్యాన్ని నమ్మద్దని చెప్పాడు. కనుక జ్యోతిష్యశాస్త్రం అబద్దం.' అని కొందరు హేతువాదులు పనికట్టుకుని ప్రచారం సాగిస్తున్నారట. దానికి కొన్ని టీవీ చానల్స్ తమ వంతు సాయం తాము చేస్తూ టీ ఆర్పీ రేటింగులు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాయట. ఇదంతా నాకు కొందరు చెప్పారు.

నాకు నవ్వొచ్చింది.

ఈలోకంలో అసత్యం సత్యంగా సత్యం అసత్యంగా ప్రచారం కాబడటం వింతేమీ కాదు. అలాంటి వింతల్లో ఇదొకటి. పిచ్చిజనం ! పిచ్చిలోకం !!

నిజమేమంటే - వివేకానందస్వామీ బుద్ధుడూ ఇద్దరూ జ్యోతిష్యాన్ని నమ్మారు. ఇది సత్యం. కానీ వాళ్ళు కొన్ని సందర్భాలలో జ్యోతిష్యం మీద అతిగా ఆధారపడవద్దని చెప్పారు. తీవ్రంగా సాధన చేస్తున్న సాధకులకు జోస్యంతో అవసరం లేదని, గ్రహప్రభావాలకు వారు అతీతులు అవుతారని వాళ్ళు చెప్పారు. అంతేగాని మామూలు మనుషులకు అది పనికిరాదని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు.

ఆయా సందర్భాలలో, కొందరు శిష్యులకో, లేదా కొన్ని ఉపన్యాసాలు ఇస్తూనో వాళ్ళు చెప్పిన మాటలను జనరలైజ్ చేసి నేడు కొందరు హేతువాదులూ కమ్యూనిస్టులూ ఈ విధంగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఇది తప్పు ధోరణి.

వివేకానందస్వామి తన మరణానికి కొన్ని వారాల ముందుగా ఒక విచిత్రమైన పని చేశాడు. పంచాంగాన్ని తెచ్చి వరుసగా తిథి వార నక్షత్రాలను చదివి తనకు వినిపించమని తన శిష్యునికి ఆయన చెప్తారు. ఆ శిష్యుడు అలాగే చేశాడు. జూలై నాలుగో తేదీవరకూ పంచాంగాన్ని మౌనంగా విన్న స్వామి, 'ఇక చాలు' అని శిష్యునితో అంటారు. అలా ఎందుకు చేశారో ఆ శిష్యులకు అర్ధం కాలేదు. కానీ సరిగ్గా అదే జూలై నాలుగో తేదీన ఆయన స్వచ్చందంగా దేహత్యాగం చేసిన తర్వాత వారికి అర్ధమౌతుంది - ఆయన ఆ తేదీని కావాలనే ఎంచుకున్నారని. జ్యోతిష్యం మీద నమ్మకం లేకపోతే తన మరణానికి తానే ముహూర్తం ఎందుకు పెట్టుకున్నారు వివేకానందస్వామి? అదికూడా పంచాంగం చదివి మరీ??

ఇదంతా వివరిస్తూ ఇంతకు ముందు నేనొక పోస్ట్ వ్రాశాను. ఇప్పుడు అవసరం వచ్చింది గనుక మళ్ళీ వ్రాస్తున్నాను.

అలాగే, సిద్దార్ధుడు పుట్టినపుడే రాజజ్యోతిష్కులు చెబుతారు, ఇతను అయితే మహాచక్రవర్తి అవుతాడు, లేకపోతే భిక్షువు అవుతాడు అని. వాళ్ళు పదిరకాల చాయిస్ లు ఇవ్వలేదు. అయితే ఇంజనీరు అవుతాడు, లేకపోతే డాక్టరు అవుతాడు. లేకపోతే సైంటిస్టు అవుతాడు, ఉంటే ఇండియాలో ఉంటాడు, లేకపోతే అమెరికా వెళతాడు అని పది రకాలుగా చెప్పలేదు. రెండే చాయిస్ లు ఇచ్చారు. ఆ రకంగా, జరగబోయేదాన్ని వాళ్ళు చాలా కరెక్టుగా నేరోడౌన్ చేసి చెప్పినట్లే లెక్క.

గౌతముడు తన నలభయ్యవ ఏట జ్ఞానాన్ని పొంది బుద్ధుడు అయ్యాడు. అంటే, నలభై ఏళ్ళ ముందే రాజజ్యోతిష్కులు కరెక్టుగా చెప్పగలిగారు భవిష్యత్తులో ఆయన ఏమి అవుతాడో? మరి జ్యోతిష్య శాస్త్రం అబద్దం ఎలా అవుతుంది?

అయితే పిడి హేతువాదులు ఇలా అంటారు - 'అదేంటి? అయితే చక్రవర్తి, లేదా భిక్షువు అవుతాడని ఎవరైనా చెప్తారు. ఒక్కదాన్నే కరెక్ట్ గా చెప్పాలికదా? రెండుగా చెప్పడంలోనే జ్యోతిష్కులు ఫెయిల్ అయ్యారు' - అని.

రెండు చెప్పినందువల్ల వాళ్ళు ఫెయిల్ అవ్వలేదు. వాళ్ళు కరెక్ట్ గానే చెప్పారు. ఎందుకంటే, రాజూ భిక్షువూ ఈ రెండే కాదు. ఎన్నో ఛాయిసెస్ వాళ్ళకున్నాయి. అవన్నీ ఒదిలి అయితే రాజు, లేదా భిక్షువు అవుతాడని ఎలా చెప్పారు? రాజు కొడుకు రాజే అవుతాడు. ఆ రోజుల్లో ఇంకేమీ కాడు. కానీ ఆల్టర్నేటివ్ గా 'భిక్షువు' అనే దాన్నే వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు చాలా కరెక్ట్ గా చెప్పినట్లే !!

ఒక చిన్న ఉదాహరణతో నేటి హేతువాదుల లాజిక్ ఎంత డొల్లగా ఉందో నిరూపిస్తాను.

ఈరోజుల్లో మెడికల్ సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. అపోలోలు, యశోదాలు, నిమ్స్ లు, ఏ ఐ ఎమ్మెస్ లు ఇలా ఎన్నో పేరుగాంచిన ఆస్పత్రులు రీసెర్చి సెంటర్లు ఉన్నాయి. మరి మనిషి ప్రాణం ఎందుకు పోతోంది? వాటిల్లో ఎవరూ చావకూడదు కదా? మోస్ట్ మోడరన్ ఎక్విప్ మెంట్ వాళ్ళ దగ్గర ఉంది కదా? మరి పేషంట్ ఎందుకు చనిపోతున్నాడు?

ఈ పేరుగాంచిన ఆస్పత్రులలో డాక్టర్లు కూడా చివరకు ఇలా అంటారు - 'మేము చెయ్యగలిగింది అంతా చేశాం. కానీ కుదరలేదు. ఓల్డ్ ఏజ్ ప్రాబ్లంస్ కి మేం ఏం చెయ్యలేం. మేం వైద్యం చెయ్యగలం అంతే. ప్రాణం పొయ్యడం మా చేతుల్లో లేదు'. 

మరి ఇదే నిజమైతే, అన్నెన్నెళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడి మెడిసిన్ చదవడం ఎందుకు? ఏ పల్లెటూరి బైతును కదిలించినా ఇంతకంటే గొప్ప వేదాంతం చాలా సులువుగా చెబుతాడు. ఈ మాత్రం మాటలు చెప్పడానికి మెడిసిన్ చదవాలా?క్రిటికల్ కండిషన్ లో ఉన్న పేషంట్ ఎన్ని గంటలు బ్రతుకుతాడో ఈ డాక్టర్లు ఖచ్చితంగా ఎందుకు చెప్పలేరు?

'చెప్పలేమండి ! ఉంటే రెండు రోజులు ఉండవచ్చు. లేదా రెండు నెలలు కూడా బ్రతకొచ్చు. ఎలా చెప్పగలం? మా ప్రయత్నం మేం చేస్తున్నాం' అంటారు. వీళ్ళ మాటలు జ్యోతిష్కుల మాటల్లా ఉన్నాయా లేక డాక్టర్ల మాటల్లా ఉన్నాయా? వీటిల్లో ఒక నిర్దుష్టమైన ఖచ్చితత్వం ఎందుకు ఉండదు? పేషంట్ ఎన్నాళ్ళు బ్రతుకుతాడు? ఏ రోజు, ఎన్ని గంటలా ఎన్ని నిముషాలకు చనిపోతాడు? ఎందుకు చెప్పలేరు? వాళ్ళదగ్గర అన్నిరకాల ఎక్విప్ మెంట్స్ ఉన్నాయిగా?

ఎందుకంటే, ప్రతిదాన్నీ ఖచ్చితంగా చెప్పడం సైన్స్ కి కూడా సాధ్యం కాదు. కొంతవరకూ నేరో డౌన్ చేసి చెప్పగలం అంతేగాని ఇలాగే జరుగుతుంది. ఇంతే జరుగుతుంది అని ఎవరూ చెప్పలేరు. జ్యోతిష్యశాస్త్రం కూడా అదే చెబుతుంది. అదే చెప్పింది.

అయితే, కొన్నికొన్ని రోగాలలో, మెడికల్ సైన్స్ 'ఇది ఇంతే' అంటూ చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. కానీ కొన్ని కొన్ని రోగాలలో అలా చెప్పలేదు. జ్యోతిష్యశాస్త్రం కూడా అంతే. కొన్ని కొన్ని జాతకాలలో చాలా స్పష్టంగా 'ఇది ఇంతే' అంటూ చెప్పే యోగాలుంటాయి. కొన్నింటిలో అలా ఉండవు. వాటిల్లో చాయిస్ కు చాలా స్కోప్ ఉంటుంది. కనుక జాతకంలో రెండు లేదా మూడు రకాల ఆల్టర్నేటివ్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా నిజం అవుతుంది.

బుద్ధుడు పుట్టి ఉయ్యాలలో ఉన్నప్పుడే జ్యోతిష్కులు చెప్పారు, ఇతను ముందుముందు బుద్ధుడు అవుతాడు అని. ఆమాట నలభై ఏళ్ళ తర్వాత నిజం అయింది. ఈ సంగతి బుద్దుడికి కూడా తెలుసు. అలాంటిది, జ్య్తోతిష్యశాస్త్రం అబద్దం అని ఆయనెలా చెబుతాడు? నవ్వులాటగా లేదూ?

అలాగే, వివేకానందస్వామి చిన్నప్పుడు కూడా జ్యోతిష్కులు చెప్పారు, ఇతను సన్యాసి అవుతాడు అని. వారి వంశంలో ప్రతి తరంలోనూ ఒకరు అలా సన్యాసం తీసుకుని ఇంట్లోనుంచి వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. వివేకానందస్వామి తాతగారు అదే పని చేశారు. కనుక ఈ జోస్యం విన్న తల్లిదండ్రులు భయపడ్డారు. ఈ పిల్లవాడు కూడా అలాగే అవుతాడేమో అని. ఖచ్చితంగా అలాగే జరిగింది. ఇరవై మూడేళ్ళ వయస్సులో నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందస్వామి అయ్యాడు. మరి జ్యోతిష్యం నిజమైందా లేదా?

ఈ సంగతి వివేకానంద స్వామికి కూడా తెలుసు. స్వయానా ఆయన మరణతేదీకి ఆయనే ముహూర్తం పెట్టుకున్నారు. మరి జ్యోతిష్యం అబద్దం అని ఆయనెలా చెప్పగలరు?

కొన్ని ఉపన్యాసాలలో ఆయన 'జ్యోతిష్యం మీద ఎక్కువగా ఆధారపడవద్దు. మీ స్వశక్తిని నమ్మండి' అని చెప్పిన మాట నిజమే. అది ఎందుకు చెప్పారో తెలుసా? ఆ రోజుల్లోని సొసైటీని చూచి ఆయనలా చెప్పారు.

అప్పటికి ఇంకా మనం బ్రిటిష్ బానిసత్వంలోనే ఉన్నాం. సమాజంలో ఎక్కడ చూచినా నిరాశా నిస్పృహలు, ఏడుపు, చేతగానితనం, దోపిడీని సహిస్తూ బ్రతకడం వంటి నెగటివ్ పోకడలు ఉండేవి. అలాంటి పరిస్థితిలో జ్యోతిష్యాన్ని నమ్మి ' నా ఖర్మ ఇంతే. ఏం చేసినా నేను బాగుపడను' వంటి నెగటివ్ ధోరణులు పెంచుకోవడం మంచిది కాదన్న ఉద్దేశ్యంతో ఆయనలా చెప్పారుగాని అసలు జ్యోతిష్య శాస్త్రమే అబద్దం అని ఆయన ఎక్కడా చెప్పలేదు. స్వయానా ఆయనొక మహాయోగి అని మహాజ్ఞాని అని గుర్తుంటే ఆయన ఈ మాటలు అనరు అని మనకు తేలికగా అర్ధమై పోతుంది.

'ఏ భిక్షువూ, భిక్షుణీ జోతిష్యవిద్యనూ కానీ, నక్షత్రవిద్యనూ కానీ చెప్పకూడదు' అని బుద్దుడే శాసించినట్లుగా బుద్ధగ్రంధమైన 'దీర్ఘనికాయం' లో ఉన్నది. అంతమాత్రం చేత జ్యోతిష్యశాస్త్రమే లేదనీ, అది తప్పనీ బుద్ధుడు చెప్పలేదు. తాను చూపిన మార్గంలో సాధన చేసే జ్ఞానసాధకులకు దాని అవసరం లేదని మాత్రమే ఆయన చెప్పాడు. దీనిని స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే బుద్దుడు పుట్టేనాటికి అనేక వేల సంవత్సరాల ముందునుంచే జ్యోతిష్యజ్ఞానం ఒక శాస్త్రంగా మారి ఈ దేశంలో వేళ్ళూనుకొని ఉన్నది.

ఒకవేళ భిక్షువులు గనుక జ్యోతిష్య శాస్త్రాన్ని చెప్పడం మొదలు పెడితే, జనులు చూపించే కుహనా గౌరవానికి వాళ్ళు క్రమేణా బానిసలైపోయి, అదొక వ్యాపారంగా మారుతుందనీ, ఆ క్రమంలో వాళ్ళు సాధనలో భ్రష్టులై తామెందుకు భిక్షువులమైనామో ఆ గమ్యాన్ని మరచిపోతారనీ ఆయన భావించాడు. కనుకనే జ్యోతిష్యశాస్త్రాన్ని వారు అభ్యసించకూడదని ఆయన నిబంధన పెట్టాడు. అంతేగాని అసలు జ్యోతిష్య్కులే ఉండకూడదని ఆయన చెప్పలేదు. ఆయన అలా చెప్పినా అప్పటి రాజులు వినేవారు కారు. ఎందుకంటే అదొక శాస్త్రమని వారికి బాగా తెలుసు. వారి ఆస్థానాలలోనే మంచి మంచి రాజజ్యోతిష్కులు ఉండేవారు.

నేటి బౌద్ధభిక్షువులే స్వయానా అనేకమంది జ్యోతిష్యాన్ని నమ్ముతారు. అంతేగాక దానిలో వాళ్ళు మంచి పండితులై ఉంటున్నారు. మరి వాళ్లకు తెలీదా ఏ సందర్భంలో బుద్ధుడు అలా చెప్పాడో?

ఇకపోతే, బుద్ధుడు అలా మాట్లాడటానికి వేరే ఇంకొన్ని కారణాలున్నాయి.

బుద్ధుడూ జైన మహావీరుడూ సమకాలికులు. బుద్దుడికీ మహావీరుడికీ ఎప్పుడూ పడేది కాదు. ద్వేషం పనికిరాదని చెప్పిన బుద్ధుడే మహావీరుడిని తెగ విమర్శించేవాడు. ఆయన మీద జోకులు కూడా వేసేవాడు. వారిద్దరూ బాహాటంగానే ఒకరినొకరు విమర్శించుకునేవారు. ఆయన శిష్యులకూ ఈయన శిష్యులకూ మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. జైనసాధువులు జ్యోతిష్యశాస్త్రానికి చాలా సేవ చేసారు. వారెన్నో జ్యోతిష్య గ్రంధాలు కూడా వ్రాశారు. జైన సాధువులు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రజ్ఞ కలిగిన వారు. కనుక వారంటే తనకు సహజంగా ఉన్న చులకన భావంతో, బుద్దుడు జ్యోతిష్యాన్ని కొన్ని సార్లు విమర్శించిన మాట వాస్తవమే. అయితే, ఆ విమర్శ అనేది తన ప్రత్యర్ధులైన జైనమత సాధువులకు గురిపెట్టబడిందే గాని జ్యోతిష్య శాస్త్రానికి గురిపెట్టినది కాదు.

గ్రహప్రభావాన్ని దాటిపోవాలనే బుద్ధుడు తరచూ చెప్పేవాడు. బుద్ధుడే కాదు, ఏ నిజమైన గురువైనా ఇదే చెబుతాడు. నిజంగా ఆధ్యాత్మిక సాధనలో జరిగేది అదే. సాధకుడైన వాడు గ్రహప్రభావానికి అతీతంగా ఎలా పోవాలో తన సాధనా మార్గంలో క్రమేణా నేర్చుకుంటాడు. అంతమాత్రం చేత, గ్రహప్రభావం అబద్దం అవ్వదు. అది సత్యమే.

అసలు బుద్ధుని జీవితంలోనే గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆయన పుట్టినదీ, జ్ఞానోదయాన్ని పొందినదీ, మరణించినదీ మూడూ కూడా పౌర్ణిమ రోజునే కావడం కాకతాళీయం ఎలా అవుతుంది?

కనుక, బుద్దుడు గాని, వివేకానందుడు గాని, కొన్ని సందర్భాలలో కొంతమందిలో మాట్లాడుతూ అన్న మాటలను జనరలైజ్ చేసి అది వారి భావజాలపు మొత్తం విధానంగా చిత్రీకరించడం చాలా పొరపాటు. ఇలా చెయ్యడం అనేది. ఈ ఇద్దరు మహనీయులనూ సరిగ్గా అర్ధం చేసుకోలేనితనం వల్ల మాత్రమే వస్తుంది. సరిగ్గా అర్ధం చేసుకుంటే వాళ్ళు అలా అనలేదని మనకు తేలికగా అర్ధమౌతుంది.

గ్రహ ప్రభావానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పనా?

ఈరోజున మనం పౌర్ణమిఛాయలో ఉన్నాం. ప్రతి పౌర్ణమికీ ఒకే ప్రభావం ఉండదు. తేడాలుంటాయి. ఈ పౌర్ణమి ప్రభావం ఏంటో చెప్పనా?

చాలామంది ఈ సమయంలో డిప్రెషన్ కు గురౌతారు. ఏదో ఒక విధమైన భయం, చింత వారిని వెంబడిస్తాయి. కావాలంటే మీ జీవితాలలో మీరే పరీక్ష చేసి చూసుకోండి. మీకే అర్ధమౌతుంది. ఇంత చిన్న విషయం మనకే అర్ధమౌతుండగా లేనిది మహామహులైన బుద్ధుడు. వివేకానందులకు అర్ధం కాదా?

కుహనా జ్యోతిష్కులు మన సొసైటీలో ఎక్కడ చూచినా ఉండవచ్చు. మాయగాళ్ళు ఉండవచ్చు. అంతమాత్రం చేత శాస్త్రమే తప్పు ఎలా అవుతుంది? సమాజంలో దొంగ డాక్టర్లున్నారని వైద్య శాస్త్రమే తప్పంటామా?

పిచ్చి జనం ! పిచ్చి సోసైటీ అంతే ! ఈ సొసైటీలో నిజాలెవడిక్కావాలి? ప్రతిదాన్నీ ఒక వివాదంగా మార్చి కాలక్షేపానికి టీవీల్లో అరుచుకోవడం జనాలకు కావాలి. మీరొక తమాషా ఎప్పుడైనా గమనించారా? రోడ్డుమీద ఎవరైనా అరుచుకుంటుంటే, చుట్టూ వందలాది మంది పనులన్నీ మానుకొని నిలబడి చూస్తూ ఉంటారు. ఇప్పుడు రోడ్లమీద తిరిగే ఓపికా సమయమూ ఎవరికీ లేవుగనుక ఇంట్లో కూచుని టీవీల్లో అరుచుకుంటుంటే చూచి ఆనందిస్తున్నారు. అంతే తప్ప ఈ చర్చల్లో తేలేది ఏమీ ఉండదు ! ఇదొక నేలబారు వినోదం అంతే !

అద్భుతమైన ఒక జీవితసత్యం చెప్పనా?

ఈలోకంలో మీకు తగినవే మీకు దొరుకుతాయి. అది తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, సంతానం కావచ్చు, గురువు కావచ్చు, శిష్యుడు కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంతిమంగా మీకు తగినదే మీకు దొరుకుతుంది, ఒకవేళ అత్యుత్తమమైనది మీ ఎదురుగానే ఉన్నా కూడా, దానిని పొందే అర్హత మీకు లేకపోతే దానిని మీరు పొందలేరు, నిలబెట్టుకోలేరు.

అందుకే, అబద్దం ఎక్కినట్లు నిజం ఎక్కదు. నకిలీని నమ్మినట్లు అసలైనదాన్ని ఎవరూ నమ్మరు. అదంతే !