“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, మే 2018, బుధవారం

దేవుడు కళ్ళూ చెవులూ ఇచ్చింది మూసుకోడానికా?

నన్ను ప్రశ్నలు అడిగేవారిలో భలేభలే వాళ్ళుంటారు. వాళ్ళ క్రియేటివిటీకి నాకు చాలా సరదాగా ఉంటుంది. వాళ్ళ అజ్ఞానానికి జాలికూడా వేస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నలు అడిగేవారిలో చాలామంది అమ్మాయిలే ఉంటారు. మగవాళ్ళు తక్కువ. ఎందుకంటే, మగవాడికి అహం జాస్తిగా ఉంటుంది. ఇంకొకడిని ఏదైనా అడగాలంటే - 'నేనేంటి ఇంకొకడిని అడిగేదేంటి?' 'ఈయనేంటి నాకు చెప్పేది?' - అంటూ ముందుగా వాడి అహం అడ్డొస్తుంది.

పాపం ఆడవాళ్ళు అలా కాదు. వాళ్లకు తెలుసుకోవాలని జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. అందుకే వెంటనే ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళ సమస్యలు వాళ్ళకూ ఉంటాయి. నాకు కొంచం దగ్గరైతే చాలు, వారిలో పొసేసివ్ నెస్సూ, జెలసీ ఇత్యాది దుర్గుణాలు తలెత్తుతూ ఉంటాయి. ఆ క్రమంలో నానా కంపు చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా అలా చేసిన వాళ్ళ గురించి, వాళ్ళ గోల గురించి మరెప్పుడైనా సీరియల్ గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన టాపిక్ లోకి వద్దాం.

మొన్నామధ్యన ఒకమ్మాయి నాతో ఫోన్లో మాట్లాడుతూ ఇలా అడిగింది.

'నేను మీ బ్లాగ్ కు చాలావరకూ అడిక్ట్ అయిపోయాను. ప్రతిరోజూ నాలుగుసార్లు మీ బ్లాగ్ ఓపన్ చేస్తూ ఉంటాను. కొత్తవి ఏమైనా వ్రాశారేమో అని'

ఈ మాటను చాలాసార్లు చాలామంది నుంచి విని ఉండటంతో నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు.

'అవునా. థాంక్స్' అన్నా సింపుల్ గా.

'నేను మీ పోస్టులు అన్నీ చదువుతాను గాని మీ పాటలు మాత్రం అస్సలు వినను. అవి నాకు నచ్చవు' అంది ఆ అమ్మాయి మళ్ళీ.

నాకు విషయం అర్ధమైనా అర్ధం కానట్లు నవ్వుతూ - 'అవునా? అవేం పాపం చేశాయి? నేనేమీ అసభ్యమైన పాటల్ని పాడటం లేదే?' అన్నాను.

'అది కాదు. ఎందుకో మీ ఆధ్యాత్మిక పోస్టులు మాత్రమే నాకు నచ్చుతాయి. అలాంటి హై లెవల్ పోస్టులు వ్రాసే మీరు, ఒక మామూలు సింగర్ లాగా సినిమా పాటలు పాడటం ఎందుకో నాకు నచ్చదు' అంది.

'అలాగా' అన్నాను మళ్ళీ సింపుల్ గా.

'అవును. నాదొక డౌట్. అడగమంటారా?' అంది తను.

'చెప్పండి' అన్నాను.

'మీరు ధ్యానం గురించి ఎక్కువగా చెబుతారు కదా'

'అవును'

'నా డౌటేంటంటే, దేవుడు మనకు కళ్ళూ ముక్కూ చెవులూ ఇచ్చింది వాటిని తెరిచి లోకాన్ని చూడమని గాని, వాటిని మూసుకుని ధ్యానంలో కూచోమని కాదుగా? మరి ధ్యానం అనేది దేవుడి ప్లాన్ కు వ్యతిరేకం కదా?' అంది అమాయకంగా.

నవ్వుతో నాకు పొలమారింది.

'మీ డౌట్ చాలా బాగుంది. దానికి ఆన్సర్ చెప్పేముందు నాదొక డౌట్ ఉంది. అడగమంటారా?' అన్నాను.

'మీకు డౌటా? సరే ఏంటో చెప్పండి'

'ఏం లేదు? మీరు ఒక్క నిముషం కూడా కాకముందే రెండు మాటలు మాట్లాడుతున్నారేంటి?' అన్నాను.

'నేనా? రెండుమాటలు మాట్లాడానా? ఎప్పుడు" అందా అమ్మాయి.

'ఇప్పుడే. ముందేమో, దేవుడు నోరిచ్చింది మూసుకొని కూచోడానికి కాదన్నారు. మళ్ళీ వెంటనే, నేను మీ పాటలు వినను అంటున్నారు. దేవుడు నోరిచ్చింది పాటలు పాడటానికి కూడా కదా ! మరి నేనదే చేస్తున్నాను. అవి వినడానికి మీకెందుకు అయిష్టం? అంటే, మీరు కూడా దేవుడి ప్లాన్ కు వ్యతిరేకంగా పోతున్నట్లే కదా?' అన్నాను.

ఆమెనుంచి సౌండు ఆగిపోయింది.

'అంటే అంటే అదీ అదీ....' అంటోంది.

'పోనీ ఇంకో డౌటు. దీనికి చెప్పండి. నిద్రలో మీరు కళ్ళు మూసుకుని నిద్రపోతారా తెరుచుకుని నిద్రపోతారా?' అడిగాను.

'అదేంటండి అలా అడుగుతారు? ఎవరైనా కళ్ళు మూసుకునే కదా నిద్రపోతారు?' అడిగింది ఆమె.

'లేదండి. కొంతమంది కళ్ళు తెరుచుకుని కూడా నిద్ర పోగలరు' అన్నాను.

'అలాంటి వారిని నేనింతవరకూ చూడలేదండి' అందామె.

'కరెక్టే. నేనూ ఇంతవరకూ చూడలేదు' అన్నాను.

ఆమె ఇంకా కన్ఫ్యూస్ అయిపొయింది.

'అదేంటి? మరి ఎలా చెప్పగలుగుతున్నారు చూడకుండా?' అంది.

'నన్ను నేను చూడలేను కదా' అన్నాను.

'అదేంటి? మీరు కళ్ళు తెరుచుకుని నిద్రపోతారా?' అడిగింది ఆమె.

'అవును. అప్పుడప్పుడూ అలా చేస్తాను' అన్నాను.

'ఎందుకలా?' అడిగింది.

'ఎందుకంటే, నేను ప్రతిరోజూ చేపల్ని బాగా తింటాను. అవి అలాగే కళ్ళు తెరుచుకునే నిద్రపోతాయి. వాటిని తినీ తినీ అదే అలవాటు నాకూ వచ్చేసింది' అన్నాను సీరియస్ గా.

అవతలనుంచి కాసేపు నిశ్శబ్దం.

'మీరు చేపలు తింటారా? చేపలు తినేవాళ్ళు అలా అవుతారా?' అంది అనుమానంగా.

పాపం ఇప్పటికి సృష్టించిన కన్ఫ్యూజన్ చాల్లే అనిపించి - 'అబ్బే అదేమీ కాదండి. పక్కనున్నవాళ్ళని సరదాగా భయపెట్టాలని అనుకున్నపుడు కొన్నిసార్లలా చేస్తూ ఉంటాను' అన్నాను.

'నిజంగానా?' అడిగింది భయంగా.

'మీమీదొట్టు. ధ్యానం బాగా చేతనైతే ఇలాంటి ట్రిక్స్ చెయ్యచ్చు.' అన్నాను.

'ఇలాంటి ట్రిక్స్ చెయ్యడానికి ధ్యానం చేస్తారా?' అంది.

'కాదనుకోండి. ఆ క్రమంలో ఇలాంటి శక్తులు వస్తూ ఉంటాయి. వాటిని సరదాగా అలా వాడుతూ ఉంటా అప్పుడప్పుడు. సరేగాని నా డౌటు క్లియర్ చెయ్యలేదు మీరు. నిద్రలో మీరు కళ్ళు మూసుకుంటారు కదా?' అన్నాను.

'అవును'

'మరి దేవుడేమో కళ్ళు తెరిచి లోకాన్ని చూడమని చెప్పాడని మీరే అంటుంటిరి. మళ్ళీ నిద్రలో కళ్ళు మూసుకుంటాను అంటుంటిరి? ఒక్క నిముషంలో మీరే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏంటిదంతా?' అడిగాను.

'అంటే, నిద్రకూడా పోకుండా ఎల్లకాలం పత్తికాయల్లా కళ్ళు తెరుచుకునే ఉండాలంటే ఎలా కుదురుతుంది?' అందామె.

'నేను చెప్పేది కూడా అదే. కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యకుండా ఎప్పుడూ కళ్ళు తెరుచుకునే ఉండటం కూడా తప్పే కదూ?' అన్నాను.

'ఏమో. మీ ఆన్సర్ తో నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను' అందామె. 

'అది మీ ఇష్టం. మిమ్మల్ని కన్విన్స్ చెయ్యాల్సిన పని నాకు లేదు' అన్నాను.

'మరి నా డౌటు తీరేదెలా?' అంది.

'సరే. ఇంకో మాట అడుగుతాను చెప్పండి. మీ జీవితంలో మీరెప్పుడూ పాటలు పాడలేదా. కనీసం కూనిరాగాలు తియ్యలేదా? ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి. కనీసం బాత్రూంలో స్నానం చెసేటప్పుడైనా, కూనిరాగాలు తియ్యలేదా? ఏ పాటలూ హమ్ చెయ్యరా?' అడిగాను.

'చేస్తాను. అలా అందరూ చేస్తారు' అందామె.

'మరి నేను పాడుతున్న పాటల్ని వినడానికి మీకెందుకు అభ్యంతరం? దేవుడు చెప్పిన పనే నేను చేస్తున్నాను. నేను బాత్రూంలో దాక్కుని పాటలు హమ్ చెయ్యడం లేదు. బాత్రూం బయటే పాడుతున్నాను. నోరు బార్లా తెరిచి మరీ పాటలు పాడుతున్నాను. మరి మీరెందుకు వినడం లేదు?' అడిగాను.

'ఏమో తెలీదు' అందామె.

'దేవుడు మీకు కూడా నోరిచ్చి పాటలు పాడమన్నాడు. మరి మీరెందుకు పాటలు పాడకుండా దేవుడికి అపచారం చేస్తున్నారు?' అడిగాను.

'అదీ తెలీదు' అందామె.

'ఏమీ తెలీకుండా మరి నాకెందుకు ఫోన్ చేశావమ్మా?' అనుకున్నా లోలోపల.

'సరే. ఒక పని చెయ్యండి. నేనిప్పటిదాకా 350 పైన హిందీ పాటలు పాడాను. తెలుగు, మలయాళం, కన్నడం ఇత్యాది ఇంకొన్ని పాడాను. ముందు అవన్నీ వినండి. ఆ తర్వాత మీ డౌట్లు అడగండి. అప్పుడు వాటిని క్లియర్ చేస్తాను' అని చెప్పాను.

'అలాగే చేస్తాను. ఈలోపల చిన్న క్లూ ఇవ్వండి' అందామె.

'ధ్యానం చెయ్యాలంటే కళ్ళు మూసుకునే చెయ్యనక్కరలేదు. తెరిచి కూడా చెయ్యవచ్చు. నేనలాగే చేస్తూ ఉంటాను' అన్నాను.

'అదేంటి? ఇదింకా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ధ్యానం కూడా కళ్ళు తెరిచే చేస్తారా?' అడిగిందామె.

'అవును. అలా ఎన్నో ఏళ్ళు చేసీ చేసీ, కళ్ళు తెరిచి నిద్రపోయే శక్తి సంపాదించాను' అన్నాను.

'దాన్ని శక్తి అంటారా? ఏంటో అంతా అయోమయంగా ఉంది. కాసేపేమో చేపలు తినీ తినీ అలా అయ్యానంటున్నారు. కాసేపేమో ధ్యానం వల్ల ఈ శక్తి వచ్చిందంటున్నారు. ఒక డౌట్ క్లియర్ చేసుకుందామని ఫోన్ చేస్తే మరిన్ని డౌట్స్ పట్టుకున్నాయి నన్ను.' అందా అమ్మాయి.

'నాతో ఇలాగే ఉంటుంది. నేను మీ డౌట్స్ క్లియర్ చెయ్యను. ఇంకా ఇంకా మీలో లేనిపోని డౌట్స్ క్రియేట్ చేస్తాను. నా మార్గం ఇంతే. ఈ హింసకి ఇష్టపడేవారే నాతో మాట్లాడాలి.' అన్నాను.

'మీరు చెబుతున్నవాటిల్లో ఏది నిజం? ఏదబద్ధం?' అందామె.

'అన్నీ అబద్దాలే. నేనొక్కటే నిజం' అన్నాను సీరియస్ గా గొంతు మార్చి.

'సరే ఫైనల్ గా చెప్పండి. దేవుడు మనకి కళ్ళూ చెవులూ ముక్కూ నోరూ ఇచ్చింది మూసుకోడానికా తెరుచుకోడానికా?' అందా అమ్మాయి విసుగ్గా.

'ఇలాంటి డౌట్స్ కూడా వస్తాయా దేవుడా?' - అని నాకు భలే నవ్వొచ్చింది.

'అప్పుడప్పుడూ మూసుకోడానికి, అప్పుడప్పుడూ తెరుచుకోడానికి. రెండూ చేసే శక్తి వాటికి ఉందిగా. ఆ శక్తికి హద్దులు పెట్టడం ఎందుకు?' అన్నాను.

'సరే. ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు?' అందామె చివరకు.

'ఏదో ఒకటి మీకు చేతనైంది చేసుకోండి' అందామని నోటిదాకా వచ్చింది కానీ బాగుండదని మింగేశాను.

'ముందు నా పాటలన్నీ మొత్తం విని ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చెయ్యండి. వినకుండా ఫోన్ చేస్తే ఊరుకోను. మధ్యమధ్యలో కొన్ని పాటల పేర్లు అడిగి మీకు టెస్ట్ పెడతాను. అందులో మీరు ఫెయిల్ అయితే నాకు చెడ్డ కోపం వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం.' అన్నాను కరుగ్గా.

'సరేనండి ఉంటా' అంటూ ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి.

ఈ ఫోన్ కాల్ అయ్యేసరికి భలే విసుగొచ్చింది.

అంతా నా ఖర్మ ! సింపుల్ గా కళ్ళు తెరుచుకుని నిద్రపోవడం కూడా రానివారితో నేను మాట్లాడాల్సి రావడం నా ఖర్మ కాకుంటే మరేమిటి? ఛీ ! చవకబారు మనుషులు ! అంటూ భలే కోపం వచ్చేసింది.

అసలు నా బ్లాగులో ఫోన్ నంబర్ ను ఇవ్వనేల? ఇచ్చితిని పో, ఇలాంటివారు నాకు ఫోన్ చెయ్యనేల? చేసితిరి పో, నేను వారితో గంటలు గంటలు ఇలా వాగనేల? వాగితిని పో, చివరకు విసుగు పుట్టనేల? పుట్టినది పో, దాన్నంతా ఇలా బ్లాగులో పెట్టనేల?

అసలీ గోలంతా నాకేల?

అంతా కామెడీగా లేదూ?