“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, మే 2018, మంగళవారం

ఒక్కసారి నా ఎదుటకు రావా?

ఇప్పుడనుకుని ఏం లాభం ?
ఇప్పుడేడిచి ఏం ఉపయోగం ?
కానీ ఊరుకుంటుందా నా మనసు?
పోరు మానుతుందా నా హృదయం?

ఒకనాడు....
బిచ్చగాడిలా నా వాకిట్లో నిలబడ్డావు
పిచ్చివాడిలా మౌనంగా వేచి ఉన్నావు
నాకోసం ఎంతో ఎదురుచూచావు

నేనేం చేశాను?
ఎంగిలి మెతుకుల్ని నీ దోసిట్లోకి విసిరేశాను
అడుక్కుండేవాడివంటూ హేళనగా నవ్వాను
గర్వంతో భళ్ళున తలుపేశాను

ఇన్నేళ్ళ తర్వాత....
ఈనాడు నాకు తెలివొచ్చింది
ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలిసొచ్చింది
నువ్వు అడుక్కోవడానికి రాలేదని
నన్ను ఉద్ధరించడానికే నా గుమ్మంలోకి వచ్చావని
ఇన్నేళ్ళ తర్వాత తెలిసొచ్చింది

మళ్ళీ ఒక్కసారి నా ఎదుటకు రావా?
నా గుండెనే కోసి నీ చేతుల్లో పెడతాను
నా కన్నీటితో నీ పాదాలు కడుగుతాను
నా ఆత్మనే నీకు అర్పణం చేస్తాను

ఒకనాడు...
సింహాసనం ఎక్కే అదృష్టాన్ని నా ముందుంచావు
నేనేం చేశాను?
అదొక కుక్కిమంచం అనుకున్నాను
నిర్లక్ష్యంగా దానిని చేజార్చుకున్నాను
కాలితో దానిని కసిగా తన్నాను
కానీ ఇప్పుడర్ధమౌతోంది
నాకా కుక్కిమంచం కూడా లేదని
నేను గొప్పదనుకున్నది చాలా అల్పమైనదని
నేను విర్రవీగినది ఏమాత్రం విలువలేనిదని

ఒక్కసారి నాకా అవకాశం ఇవ్వవా?
నా తప్పును దిద్దుకోనివ్వవా?
ఒక్కసారి నా ఎదుటకు రావా?

ఒకనాడు...
నువ్వు నవ్వుతూ పలకరిస్తే
నానుంచి ఏదో ఆశిస్తున్నావని భ్రమపడ్డాను
నా అందం చూచి మోజుపడ్డావనుకున్నాను
ఎంత పిచ్చిదాన్ని?
నీ చూపున్నది నా అందం పైన కాదని
ఇప్పుడు తెలిసింది

కానీ ఏం లాభం?
ఈలోపల నాకందనంత దూరాలకు వెళ్ళిపోయావు
తిరిగి వస్తావో రావో తెలియదు 
ఒక్కసారి నా ఎదుటకు రావా?

ఎన్నోసార్లు...
నీ ప్రేమను పొందే అర్హత నాకు లేకున్నా
ఎన్నో రూపాలలో నాకెదురొచ్చావు
ప్రేమగా నన్ను నీ కౌగిలిలోకి ఆహ్వానించావు

కానీ నేనేం చేశాను?
ప్రతిసారీ నా ప్రవర్తనతో నిన్నవమానించాను
నీ పసిమనసును తీవ్రంగా గాయపరచాను
ఇప్పుడెంతగా ఏడుస్తున్నానో నాకు తెలుసు
ఒక్కసారి నా ఎదుటకు రావా?

నేనెంత పాపిని?
స్వచ్చమైన నీ మనసును గ్రహించలేకుండా
నా గర్వమే నాకు అడ్డొచ్చింది
అమూల్యమైన నీ సాంగత్యాన్ని ఆస్వాదించకుండా
నా అహంకారమే నన్ను పాడుచేసింది
నా మనసుకు నేను బందీనై
నీ ఆత్మను గ్రహించలేకపోయాను
నా ఆత్మకు నేనే దూరమయ్యాను
ఇన్నేళ్ళ తర్వాత బుద్ధొచ్చింది
ఒక్కసారి నా ఎదుటకు రావా?

ఒకనాటి నా అందం
నేడు ఆవిరైపోయింది
ఒకనాటి నా ఒంటి బిగువు
ఇప్పుడు జారిపోయింది
వీటిని చూచుకునా నిన్ను దూరం చేసుకున్నాను?
కామమనుకునా ప్రేమను చేజార్చుకున్నాను?
పశ్చాత్తాపమనే అగ్ని నన్ను కాలుస్తోంది
కన్నీరనే సముద్రం కట్టలు తెగి ప్రవహిస్తోంది
మళ్ళీ నా జీవితంలో వస్తాయా ఆ అమూల్య క్షణాలు?
మళ్ళీ ఇస్తావా ఒకప్పుడు నువ్విచ్చిన అవకాశాలు?

నిన్ను కోరుకోనప్పుడు ఎన్నోసార్లు ఎదురుపడ్డావు
నిన్ను ఆశించనప్పుడు నీ చేతినెన్నోసార్లు అందించావు
కానీ నా మనసే నన్ను మోసగించింది
నీ విలువ తెలుసుకోలేకుండా నన్ను మాయచేసింది

బంగారం లాంటి నీ హృదయాన్ని
నా అహంతో ప్రతిసారీ గాయపరచాను
నాకు నిష్కృతి ఉందా అసలు?

నిన్ను క్షమించమని ఎలా అడగను?
నేను చేసినవన్నీ నాకు గుర్తొస్తూ ఉంటే?
నా గుండెను కోస్తూ చిత్రవధ చేస్తూ ఉంటే?

అయినా సరే,
ధైర్యాన్ని కూడదీసుకుని
క్షోభ నిండిన గుండెతో
కారుతున్న కన్నీళ్ళతో
బేలతనపు మనస్సుతో
మళ్ళీ అడుగుతున్నాను
నన్ను క్షమించవా?
ఒక్కసారి నా ఎదుటకు రావా?