“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

7, మే 2018, సోమవారం

లలితా సహస్ర నామములపై బుద్ధమత ప్రభావం

ఈ మధ్యలో మంచి చిక్కటి ఆధ్యాత్మిక పోస్టులు వ్రాసి చాలా రోజులైందని అనిపించింది. అలాంటి పోస్టులు ఈ మధ్యన నేను వ్రాయడం లేదని కొందరు ఆధ్యాత్మిక వీరాభిమానులు నాకప్పుడప్పుడు  మెయిల్స్ ఇస్తున్నారు. అందుకే ఈ పోస్టు !

పైగా దీనికి ఇంకో కారణం కూడా ఉంది. నా బ్లాగులోనుంచి కాపీకొట్టిన భావాలను కొన్ని దినపత్రికలలో ఆధ్యాత్మిక శీర్షికల క్రింద కొందరు రచయితలు వ్రాసుకుంటున్నారని ఈ మధ్యనే రుజువులతో సహా నాకు తెలిసింది. ఆ పేపర్ కటింగ్స్ ను చూచిన మీదట నాకు చాలా జాలేసింది. ఇంకొంతమంది బ్లాగుచోరులు నా పోస్టులను వాట్సప్ లొ వాళ్ళ పోస్టులుగా ప్రచారం చేసుకుంటున్నారు. మొన్నొకరోజున నా పోస్టు ఒకటి ఎక్కడెక్కడో తిరిగితిరిగి వాట్సప్ లో నాకే వచ్చింది. దానిని చూచి నాకు భలే నవ్వొచ్చింది. పోనీలే అలాగే వ్రాసుకోనీ అనుకుంటూ, వాళ్లకు ఇంకా కొంత సబ్జెక్ట్ ఇద్దామని కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాను.

నా మాట నమ్మలేక పోతున్నారా? త్వరలో ఇదే కంటెంట్ ను కొంచం మార్చి, కొన్ని న్యూస్ పేపర్లలో రెలిజియస్ కాలమ్స్ వస్తాయి చూచుకోండి మరి !

బుద్ధమతం ప్రాచీన మతాలలో ఒకటి. సనాతన ధర్మం లేదా హిందూమతం అనేది అతి ప్రాచీనమైనదని, అది బుద్ధమతం కంటే ఇంకా ప్రాచీనమైనదని మన విశ్వాసం. అది నిజం కూడా. కానీ బుద్ధుని తర్వాత వచ్చిన అనేక స్తోత్రాలు, మంత్రాలు, తంత్రగ్రంధాలలో బుద్ధుని ప్రభావం అతి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంత వద్దనుకున్నా కొన్నికొన్ని పదాల దగ్గర ఈ విషయం మనకు తెలిసిపోతూ ఉంటుంది. బుద్ధమతం అంటే పడని కొందరు సాంప్రదాయ వాదులకు ఈ పదాలు నచ్చవు. వారికవి కొరుకుడు పడవు. కానీ ఆయా స్తోత్రాలలో అవి కన్పిస్తూ ఉంటాయి గనుక వాటికి హిందూ సాంప్రదాయ పరమైన అర్ధాలను వారు ఇస్తూ ఉంటారు. కానీ ఆ అర్ధాలు అతికినట్లుగానే ఉంటాయి గాని సహజమైన సువాసనను ఇవ్వవు.

అయినా, బలరాముడిని తొలగించి, ఆయన స్థానంలో బుద్ధుడిని దశావతారాలలో ఒకడుగా స్వీకరించిన మనం, ఆయన వాడిన పదాలను ఉన్నవి ఉన్నట్టుగా తీసుకోవడంలో మాత్రం అంగీకరించలేక పోతూ ఉంటాం. దీనికి మన కుహనా సాంప్రదాయం అడ్డుగా వస్తూ ఉంటుంది. కానీ ఆయా పదాలు మనవి కావు కాబట్టీ, అవి బుద్ధమతంలో విరివిగా వాడబడిన పదాలు కాబట్టీ వాటిని వాటిగానే ఒప్పుకోక తప్పదు మరి !

నేను సనాతనవాదినే గాని, నాకు బుద్ధమతం అంటే ద్వేషమూ లేదు, అసహ్యమూ లేదు. నేను బుద్ధుని ఎంతగానో ఆరాధిస్తానని చెప్పడానికి గర్విస్తాను. అంతమాత్రం చేత నా వైదిక మూలాలకేమీ నష్టం వాటిల్లదు. సరిగ్గా అర్ధం చేసుకుంటే వేదాలూ, బుద్ధుడూ ఇద్దరూ చెప్పినది ఒకటే అని అర్ధమౌతుంది. విషయం అంతాకూడా, మనం స్వచ్చమైన దృష్టితో చూడటంలోనూ, ఆ చూచినదానిని సరిగ్గా అర్ధం చేసుకోవడం లోనే ఉంది.

బౌద్ధమూ, జైనమూ అనే మతాలు నిజానికి సనాతనధర్మం అనే ప్రాచీన వృక్షానికి వచ్చిన కొత్త కొమ్మలనీ, వాటిని అవైదిక మతాలని పిలవడం పొరపాటనీ, వివేకానంద స్వామి వంటి మహనీయులు అభిప్రాయ పడ్డారు.

నేడు అనేకులు రోజూ పారాయణం చేస్తున్న లలితా సహస్రనామాలలో బుద్ధమతం ఛాయలున్నాయని నేనంటే చాలామందికి రుచించక పోవచ్చు. కానీ ఇది సత్యం. లలితా సహస్ర నామాలపైన ఎంతో రీసెర్చి చెయ్యడమే గాక, ఆ మార్గంలో నా చిన్నప్పటి నుంచీ సాధన చేసి, దానిమీద పుస్తకం కూడా వ్రాశాను కాబట్టి ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను.

ఉదాహరణకు కొన్ని నామాలను చూద్దాం.

'మైత్రాది వాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణీ' అనేది లలితానామాలలో గల ఒక నామం. దీనిలోని రెండవ భాగమైన 'మహాప్రళయ సాక్షిణీ' ని కాసేపు పక్కన ఉంచుదాం. మొదటి భాగాన్ని గమనిద్దాం.

'మైత్రాది వాసనా లభ్యా' అంటే - 'మైత్రి మొదలైన వాసనల (ఆలోచనల) వల్ల లభించేదానవు' అని అర్ధం. ఇక్కడ, 'మైత్రాది' అనే పదంలో 'మైత్రి మొదలైన' అనే అర్ధం కనిపిస్తున్నది గాని, 'మైత్రి'కి తోడు ఇంకేమేం ఉన్నాయో స్పష్టమైన వివరణ లేదు. స్తోత్రాలనేవి అతి తక్కువ మాటల్లో అతి ఎక్కువ అర్ధాలను పొదిగి ఉంటాయి గనుక ఇంతకంటే ఎక్కువ వివరంగా అక్కడ చెప్పడం కుదరని పని. అలా ప్రతిదానినీ వివరించుకుంటూ పోతే అది వ్యాఖ్యానం అవుతుంది గాని స్తోత్రం అవదు. కనుక అక్కడ అలా క్లుప్తంగా చెప్పబడిందనుకుందాం కాసేపు.

బౌద్ధంలో బ్రహ్మవిహార ధారణ అనే సాధన ఒకటుంది. దానిలో - మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే నాలుగు భావాల మీద ధ్యానం చేసే ప్రక్రియ ఉంటుంది. లలితా సహస్ర నామాలలో చెప్పబడిన 'మైత్రి మొదలైన ఆలోచనలు' అనేవి, ఇవే అని నా ఉద్దేశ్యం. ఎందుకంటే, సనాతన వైదిక సాంప్రదాయంలో 'మైత్రి' మొదలైన భావాల పైన ధ్యానం అనేది ఎక్కడా చెప్పబడలేదు. కొందరు ఈ పదాన్ని వేదాలలో చెప్పబడిన ' మైత్రా వరుణులు' అనే దేవతలతో ముడి పెట్టి వ్యాఖ్యానించాలని ప్రయత్నించారు. ముఖ్యంగా, 'మైత్రాది' అనే పదానికి 'మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, అగ్ని మొదలైన' అనే వైదికార్ధాన్ని చెప్పాలని వారు ఎంతగానో ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం కృతకంగానే ముగిసింది గాని సహజత్వాన్ని సంతరించుకోలేదు.

ఎందుకంటే - 'మైత్రాది వాసనాలభ్యా' అనే పదంలో మైత్రి మొదలైనవి వాసనలుగా (సంస్కారాలుగా) చెప్పబడ్డాయి గాని, దేవతలుగా చెప్పబడలేదు. మిత్రావరుణులు, ఇంద్రుడు మొదలైనవారు వైదిక దేవతలే గాని - ఆలోచనలు, సంస్కారములు, వాసనలు కారు. కనుక ఈ పదాలద్వారా ఉటంకించబడినది వైదిక దేవతలు కారన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది.

వైదికార్ధాన్ని సమర్ధించేవారు భగవద్గీత పన్నెండో అధ్యాయం (భక్తియోగం) నుంచి

'అద్వేష్టస్సర్వ భూతానాం మైత్ర కరుణ ఏవచ
నిర్మమో నిరహంకార: సమదుఃఖ సుఖ క్షమీ
సంతుష్ట స్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయ:
మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్తస్సమే ప్రియ:'

అనే శ్లోకాలను ఉటంకిస్తూ ఉంటారు.

కానీ ఈ శ్లోకాల వల్ల ఇందులో ఉటంకించబడిన 'మైత్రి, కరుణ మొదలైన' అనే పదానికి గల బుద్ధమత సంబంధం నిరాకరించబడటం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుతున్న భగవద్గీత అనేది బుద్ధుని తర్వాత వచ్చినదేనన్నది చరిత్రకారుల ఉద్దేశ్యం. మహాభారతకాలం బుద్ధుని కంటే ఇంకా 2500 సంవత్సరాల పూర్వం అయినప్పటికీ, భగవద్గీత అనేది క్రీ. శ. తొమ్మిది, పదో శతాబ్దాల ప్రాంతంలో గ్రంధస్తం చెయ్యబడిందని పలువురు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. కనుక అసలైన ప్రాచీన భగవద్గీతలో ఏ శ్లోకాలున్నాయో, ఆ తర్వాత ఏయే శ్లోకాలు అందులో చేర్చబడ్డాయో ఎవరికీ తెలీదు.

ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు భగవద్గీత అనేదే మహాభారతంలో తర్వాతి కాలంలో చొప్పించబడిన ప్రక్రిప్తఘట్టం అని కొందరు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే, మహాయుద్ధ మధ్యంలో అంత ఫిలాసఫీని గంటలు గంటలు చర్చించుకునే సమయం ఉండదు గనుక ! అర్జునుడూ కృష్ణుడూ అలా గంటలు గంటలు ఫిలాసఫీ మాట్లాడుకుంటూ ఉంటే, మిగతా పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం ఏం చేస్తోంది? గోళ్ళు గిల్లుకుంటున్నదా? లేకపోతే, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు లే, ఈ లోపల ఒక కునుకు తీద్దాం అని అందరూ నిద్ర పోతున్నారా?

'నేను యుద్ధం చెయ్యను' అని అడ్డం తిరిగిన అర్జునుడిని శ్రీకృష్ణుడు ఒప్పించి, అతనికి కొన్ని మంచి మాటలు చెప్పి, తిరిగి యుద్ధానికి అతన్ని సిద్ధం చేసి ఉండవచ్చు. అంతేగాని పద్దెనిమిది అద్యాయాలతో కూడిన భగవద్గీతను అతనికి ఆ యుద్ధం మధ్యలో ఉపదేశం చేశాడంటే లాజిక్ ఒప్పుకోదు. కనుక భగవద్గీత అనేదాన్ని మహాభారతం మధ్యలో ఎవరో తర్వాతి వారు ప్రక్షిప్తం చేశారనే కాస్త లాజిక్ ఉన్న ఎవరికైనా అనిపిస్తుంది.

అసలు చెప్పాలంటే, 'జయం' అనే పేరుతో పదివేల శ్లోకాలతో వ్యాసమహర్షి చేత వ్రాయబడిన గ్రంధం నేడు లక్ష శ్లోకాలతో 'మహాభారతం' అన్న పేరుతో మనకు లభిస్తోంది. దానినే మనం చదువుకుంటున్నాం. మరి ఈ తొంభై వేల శ్లోకాలు ఎక్కడనుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? వీటిల్లో ఒరిజినల్ శ్లోకాలు ఏవి? తర్వాత ప్రక్షిప్తాలుగా చేర్చబడినవి ఏవి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడా లేవు. ఏ పండితుడూ వీటికి జవాబులు చెప్పలేడు.

దీనికి కారణమేమంటే - మనకు ప్రస్తుతం లభిస్తున్న ఏ గ్రంధమూ ఒరిజినల్ కాదు. అనేక మార్పులు చేర్పులు చెయ్యబడిన రూపాలే నేడు మనకు కనిపిస్తున్నాయి. భగవద్గీత కూడా దీనికి మినహాయింపు కాదు. అసలైన భగవద్గీతలో ఇంకా చాలా శ్లోకాలున్నాయంటూ అనేకమంది ఉత్తరాదిలో పరిశోధనలు చేసి పుస్తకాలు వ్రాసిన వారున్నారు. అంతెందుకు? ఎక్కిరాల వేదవ్యాస్ గారు కూడా 'ప్రాచీన భగవద్గీత' అనే పేరుతో 1990 ప్రాంతాలలోనే ఒక పుస్తకం వేశారు. అందులో, మామూలుగా మనకు లభించే భగవద్గీతలో లేని అనేక శ్లోకాలను ఆయన ఉటంకించారు.

కనుక 'అద్వేష్టస్సర్వ భూతానాం మైత్ర కరుణ ఏవచ' అనే ఈ శ్లోకంలో చెప్పబడిన 'మైత్రి కరుణ మొదలైన గుణాలు' అనే పదం మీద బుద్ధమత ప్రభావం లేదు అని చెప్పే ఆధారాలు మనకెక్కడా కన్పించవు. ఎందుకంటే ఈ పదాలు సనాతనధర్మం కంటే కూడా బుద్ధమతంలోనే విరివిగా వాడబడ్డాయి.

లలితా సహస్ర నామాలపైన గల బుద్ధమత ప్రభావాన్ని చూపించే ఇంకొక నామం - 'నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయినీ'. ఇందులోని 'నిర్వాణ సుఖదాయినీ' అనే పదాన్ని గనుక మనం గమనిస్తే నేను చెబుతున్న విషయంలోని నిజం అర్ధమౌతుంది.

'నిర్వాణం' అనే పదం బౌద్ధంలో వాడబడిన పదమే గాని హిందూమతపు పదం కాదు. ఈ పదాన్ని కొంచం గమనిద్దాం.

'వాణం' అనే సంస్కృత పదానికి శరీరం, ఆధారం అని అర్ధాలు. నిర్వాణం అంటే 'శరీరం లేని స్థితి', 'ఒక ఆధారమంటూ లేని స్థితి' అని అర్ధాలున్నాయి. ఇది బౌద్ధంలో ఎక్కువగా సూచించబడే శూన్యత్వ స్థితికి సంకేతమే గాని, హిందూమతంలో వచ్చే 'సచ్చిదానందస్థితి' కి సంకేతం కాదు. లలితా సహస్ర నామాలకు అధికారిక భాష్యంగా కొనియాడబడే 'సౌభాగ్య భాస్కరం' వ్రాసిన భాస్కరరాయలవారు కూడా ఈ పదానికి సనాతన పరమైన అర్ధాన్ని సంతృప్తికరంగా చెప్పలేక పోయారు.

కనుక, లలితా సహస్ర నామాలలో మనకు కనిపించే 'మైత్రాది వాసనాలభ్యా' మరియు 'నిర్వాణ సుఖదాయినీ' అనే పదములవల్ల ఈ నామాలు వ్రాసిన వారిమీద బుద్ధమతపు ప్రభావం ఉన్నదన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది. ఎందుకంటే ఇవి సనాతన ధర్మపు (హిందూమతం) ఆత్మతో ముడిపడిన భావాలు, పదాలు కావు.

ఒకవేళ 'మైత్రి కరుణ' అనేవి హిందూమతంలో కూడా ఉన్నాయి కదా అనే వాదన వచ్చినప్పటికీ, 'నిర్వాణం' అనే పదం మాత్రం హిందూమతంది కాదు. అలాంటి పదం శాక్తేయ స్తోత్రం అయిన లలితా సహస్ర నామాలలో కనిపించడం అనేది - తంత్రయుగంలో విలసిల్లిన ఒక విచిత్రమైన పరిస్థితికి అద్దం పడుతోంది. తంత్రయుగంలో, అంటే క్రీ.శ 3-10 శతాబ్దాల మధ్యన హిందూ తంత్రాలూ బౌద్ధతంత్రాలూ విరివిగా పుట్టుకొచ్చాయి. వాటిలోని భావాలు కూడా పడుగుపేకలలా కలిసిమెలసి పోయాయి. వీటికి మూలాలు బెంగాల్ ఒరిస్సా రాష్ట్రాలలో ఉన్నాయి. ఆ కాలంలో వచ్చిన బౌద్ధతంత్ర గ్రంధాలనూ, హిందూ తంత్ర గ్రంధాలనూ వ్రాసినది ఆయా రాష్ట్రాలకు చెందిన పండితులూ, బౌద్ధ భిక్షువులే. దీనికి ఆధారాలు మనకు చాలా లభిస్తున్నాయి. వారే అక్కడనుండి టిబెట్ కు వెళ్లి అక్కడ వజ్రయాన బౌద్ధాన్ని ప్రచారం చేశారు.

వజ్రయాన బౌద్ధంలో కూడా దేవీ ఆరాధన ఉన్నది. దేవిని అందరు బుద్ధులకూ తల్లిగా అక్కడ ఆరాధిస్తారు. తారాదేవి, లలితాదేవి. కాళికాదేవి మొదలైన దేవతలు ఆయా టిబెటన్ పేర్లతో, బౌద్ధసాంప్రదాయపు పేర్లతో అక్కడ మనకు దర్శనమిస్తారు. వారి ఆరాధనా విధానాలు వజ్రయానబౌద్ధంలోని తంత్ర సాంప్రదాయంలో కూడా ఉన్నాయి.

కనుక బౌద్ధ తంత్రాలలోనూ, హిందూ తంత్రాలలోనూ మనకు దేవీ ప్రస్తావన కనిపిస్తుంది. అలాగే బౌద్ధ సాంప్రదాయపు పదాలు కూడా హిందూ స్తోత్రాలలో, మంత్రాలలో కనిపిస్తాయి. శ్రీచక్ర ఆరాధనలోని ఆవరణ పూజలో మనకు కన్పించే 'ఓం బుం బుద్ధాయ నమ:' అనే మంత్రమే దీనికి గల తిరుగులేని రుజువని నా విశ్వాసం. నిష్టగా ఉపాసన చేసే శ్రీవిద్యోపాసకులకు నేను చెప్పేదానిలోని నిజం అర్ధమౌతుంది, వాళ్లకు ఓపన్ మైండ్ అనేది ఉంటే !

కనుక, లలితా సహస్ర నామాలపైన బుద్ధమత ప్రభావం ఉంది అనేది నిర్వివాదాంశం. అంతేకాదు, పాతంజల యోగసూత్రాల చిక్కటి సంస్కృతాన్ని మనం అర్ధం చేసుకుంటే అందులో కూడా 'అస్మిత', 'క్లేశ' వంటి బుద్ధమతపు పదాలు ఎన్నో మనకు కన్పిస్తాయి. ఇవి మన హిందూమతపు పదాలు కావు. అంతేకాదు, బుద్ధమతపు భావాలు కూడా యోగసూత్రాలలో ఎన్నో ఉన్నాయి. క్రీ.పూ. ఒకటో శతాబ్దానికి చెందిన యోగసూత్రాల మీద అంతకు ముందర ఐదొందల ఏళ్ళ క్రితపు బుద్ధుని ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది? బుద్ధుని అసలైన కాలం క్రీ.పూ ఆరో శతాబ్దం కాదనుకోండి. ఒకవేళ అదే అని మనం ప్రస్తుతానికి అనుకున్నప్పటికీ అప్పటి సమాజాన్ని అన్ని రంగాలలోనూ ఎంతో ప్రభావితం చేసిన బుద్ధుని ప్రభావం యోగసూత్రాలమీద తప్పకుండా ఉంటుందనడం తార్కికం.

స్పష్టమైన తీరుతెన్నులతో నిర్దుష్టంగా ఉన్నట్టి బుద్ధుని సాధనా విధానానికి పోటీగానే పతంజలి మహర్షిచేత 'యోగసూత్రాలు' వ్రాయబడ్డాయని నా దృఢవిశ్వాసం. నా చిన్నప్పటినుంచీ యోగసూత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీదట నేనీ విషయాన్ని చెబుతున్నాను. పతంజలి మహర్షి కంటే చాలా ప్రాచీనుడైన బుద్ధుడు తన విధానాన్ని అష్టాంగమార్గం అన్నాడు. పతంజలి మహర్షి తన యోగాన్ని అష్టాంగయోగం అన్నాడు. ఇందులో కూడా పోలికలున్నాయి మరి !

అయినా మన పిచ్చి కాకపోతే, బుద్ధుడిని దశావతారాలలో ఒకడుగా ఒప్పుకున్న మనం ఆయన వాడిన పదాలనూ, ఆయన భావాలనూ, ఆయన సాధనా విధానాన్నీ ఒప్పుకోలేక పోవడం ఎంత విచిత్రం?

మాయాప్రభావమూ, అజ్ఞానపు పట్టూ, మనుషుల మీద ఎంత గట్టిగా ఉంటాయో దీనిని బట్టి ఇంకోసారి బాగా అర్ధం కావడం లేదూ?