నా పుస్తకాలు చదివిన చాలామంది నన్ను ఆధ్యాత్మిక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మొన్నొకాయన ఫోన్లో అలాంటిదే ఒక ప్రశ్న అడిగాడు. ఆయన నాకు పరిచయస్తుడే. అందుకే కొంచం చనువుగా మాట్లాడాడు.
'పూజ గొప్పదా? స్తోత్రం గొప్పదా?'
నేనేదో జవాబు చెప్పేలోపే ఆయనిలా అన్నాడు ' స్తోత్రంతో కలిపి చేసే పూజ గొప్పదని మీరు చెప్పబోతున్నారు. నాకు తెలుసు.'
నేను నవ్వి ఇలా చెప్పాను.
'నువ్వీ మాట అనకపోతే అలాగే చెప్పేవాడినేమో తెలీదు. కానీ ఇప్పుడలా చెప్పను.'
'మరెలా చెప్తారు?'
'రెండూ వేస్టే' అన్నాను.
'అదేంటి మీరు ఆస్తికులై ఉండి అలా అంటున్నారు?'
'నేను ఆస్తికుడినని నువ్వు అనుకుంటున్నావా? లేక అది నిజమేనా?' అన్నాను నవ్వుతూ.
'అదేంటి? మీరు ఆధ్యాత్మిక పుస్తకాలు వ్రాశారు కదా? మరి ఆస్తికులేగా'
'ఆస్తికుడంటే నా నిర్వచనం వేరు' అన్నా నవ్వుతూ.
'ఓ అవును కదా ! మీరు మీ నిర్వచనాలు ఫాలో అవుతారుగాని లోకం నిర్వచనాలు ఫాలో అవ్వరు కదా. మర్చిపోయాను. సారీ ! పోనీ మీ నిర్వచనం ఏంటో చెప్పండి?' అడిగాడు.
'ఆస్తి ఉన్నవాడే ఆస్తికుడు. నాదగ్గరేమీ కోట్లకు కోట్లు లేవు. కనుక నేను ఆస్తికుడిని కాను. ప్రస్తుతానికి నాస్తికుడినే. భవిష్యత్తులో ఆస్తికుడిని అవుతానేమో చెప్పలేను.' అన్నా ఈసారి సీరియస్ గా.
అతనూ నవ్వుతూ - 'పోనీలెండి ఏదో ఒకటి అనుకుందాం. ఇంతకీ చెప్పండి ఎందుకలా 'వేస్ట్' అన్నారు' అన్నాడు.
'చెప్తా. నువ్వు పూజైనా స్తోత్రమైనా ఎందుకు చదువుతున్నావు?' అడిగాను.
'అదేంటి అందరూ ఎందుకు చదూతున్నారో అందుకే' అన్నాడు.
'అందరి సంగతి ఒదిలెయ్. నీ సంగతి చెప్పు' అన్నా.
'మంచి జరగాలని' అన్నాడు.
'ఏం మీరు పూజా స్తోత్రం చెయ్యకపోతే మంచి జరగదా?' అడిగాను.
'ఏమో తెలీదు' అన్నాడు.
'కొన్నేళ్ళు ఏ పూజలూ చెయ్యకుండా మానేసి చూడు. నీ లైఫ్ లో ఎటువంటి తేడా రాదు. నువ్వు చెబుతున్న లాజిక్ నిజమైతే, సో కాల్డ్ నాస్తికులూ కమ్యూనిస్టులూ దరిద్రంలో ఉండాలి. బాధలతో ఉండాలి, కానీ అలా లేరు. కనుక మీ లాజిక్ నిజం కాదు' అన్నాను.
'మరెందుకు చేస్తున్నాం?' అన్నాడు.
'చేస్తున్నాం అంటూ నన్ను కలపద్దు. నీ సంగతి చెప్పు. ఎందుకు చేస్తున్నావో తెలీకుండానే నువ్వు చేస్తున్నావా?' అడిగాను.
కాసేపు ఆలోచించాడు.
'ప్రస్తుతానికి నాకేం తట్టట్లా. ఇంకా ఆలోచించి సాయంత్రం ఫోన్ చేస్తా.' అన్నాడు.
'సరే' అని ఫోన్ పెట్టేశాను.
సాయంత్రం మళ్ళీ ఫోనొచ్చింది.
'ఏంటి? బాగా చించావా ఆలోచనల్ని?' అడిగా నవ్వుతూ.
'ఆ ! చించాను. ఒక విషయం అర్ధమైంది' అన్నాడు.
'ఏంటి?' అడిగాను.
'భయంతో పూజలు చేస్తున్నాను. నేను చేసిన తప్పుల చిట్టా మొత్తం గిల్టీ ఫీలింగ్ గా మారి నాలోలోపల ఉంది. దానిని కౌంటర్ చెయ్యడానికి ఈ పూజలు చేస్తున్నాను' అన్నాడు.
'ఓకే ! కొంచం అర్ధం చేసుకున్నావ్ ! అంటే, నీ పూజల వెనుకా స్తోత్రాల వెనుకా ఉన్నది 'భయం' అన్నమాట' అంతేనా'? అడిగాను.
'అంతే అనిపిస్తోంది'
'మరి 'అవి కావాలి' 'ఇవి కావాలి' అని దేవుడిని నువ్వేమీ కోరుకోవా?' అడిగాను.
'ఎందుకు కోరుకోను? అసలు అందుకేగా పూజలు చేసేది?' అన్నాడు.
'ఇప్పుడు ఇంకా దగ్గరకు వస్తున్నావు. అంటే, 'స్వార్ధపు కోరికలు కోరుతూ పూజలు చేస్తున్నావు.' అవునా?' అడిగాను.
'అలాగే అనిపిస్తోంది' అన్నాడు.
'అంటే, నిన్ను నడిపిస్తున్నది 'భయం', 'స్వార్ధం' ఇవి రెండే. భక్తిమాత్రం కాదు. అంతేగా?' అన్నాను.
'అవును' అన్నాడు అయిష్టంగా.
'మరి ఈ రెంటి పట్టులో నువ్వున్నంతవరకూ నీ పూజలుగాని స్తోత్రాలుగాని వేస్ట్ గాక మరేమౌతాయి?' అడిగాను.
'చేసేవాళ్ళంతా ఇంకెందుకు చేస్తున్నట్లు?' అడిగాడు.
'ఏమో నాకు తెలీదు. ఈ రెండూ కాకుండా ఇంకేవో వాళ్ళ మనస్సులలో ఉన్నాయని నేననుకోను. అందరూ ఈ రెండు పడవలలో ఉన్నవాళ్ళే' అన్నాను.
'మరి ఈ రెండు పడవలలో కాకుండా మరెలా ఉండాలి?' అడిగాడు.
'రెండు పడవల ప్రయాణం మంచిది కాదని సామెత నీకు తెలీదా?' అడిగాను నవ్వుతూ.
'అబ్బా ! చంపకుండా విషయం సూటిగా చెప్పండి. ప్లీజ్' బ్రతిమాలాడు.
'విషయం ఏమీ లేదు. పడవలు రెంటినీ ఒదిలేసి నీళ్ళలోకి దూకు.' చెప్పా ఇంకా నవ్వుతూ.
'అంటే ఏం చెయ్యమంటారు?' అడిగాడు అనుమానంగా.
'ఏం లేదు. సింపుల్. భయాన్నీ స్వార్దాన్నీ వదలిపెట్టి మామూలుగా బ్రతకడం నేర్చుకో. అప్పుడు ఏ పూజలూ చెయ్యనక్కరలేదు. ఏ స్తోత్రాలూ చదవనక్కరలేదు.' అన్నాను.
'అదేంటి? ఆధ్యాత్మికం మీద పుస్తకాలు వ్రాసిన మీరేనా ఇలా మాట్లాడుతున్నది?' అన్నాడు.
'అవును. ఇదే అసలైన ఆధ్యాత్మికత' చెప్పాను.
'మీకేం తేలికగా చెప్తారు. ఎలా ఆ రెంటినీ వదలడం?' అడిగాడు.
'దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి' చెప్పాను నవ్వుతూ.
'ఏంటో అవి చెప్పచ్చు కదా?' అన్నాడు ఆత్రుతగా.
'అబ్బా. అంత తేలికగా చెప్తారేంటి? ముందు నీ బ్లాక్ మనీలోనుంచి ఒక పది లక్షలు నా ఎకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యి. అప్పుడాలోచిస్తా' అన్నా మళ్ళీ నవ్వుతూ.
'ఓహో. ఈ విధంగా ఆస్తికుడిగా మారిపోదామని ప్లానేస్తున్నారన్నమాట' అన్నాడు తనూ నవ్వుతూ.
'ఎగ్జాక్ట్ లీ' అన్నా చాలా సీరియస్ గా.
'అంత డబ్బులు నా దగ్గర లేవు. ఉన్నా తేరగా మీకెందుకిస్తాను? అలా ఇచ్చుకుంటూ పోతే రేపేదైనా అవసరం వస్తే నాకెవరిస్తారు?' అన్నాడు.
'ఇప్పుడు కరెక్ట్ గా పాయింటుకొచ్చావు. దీన్నే స్వార్ధం, భయం అంటారు. నేను ఇప్పటిదాకా చెప్పినవి ఈ రెండే.' అన్నాను.
'వీటిని వదలడం నా వల్ల కాదు' అన్నాడు చివరికి ఓటమిని ఒప్పుకుంటూ.
'కనుకనే పూజలని స్తోత్రాలని వదలడం కూడా నీ వల్లకాదు. కనుక, నీకు తోచిన పూజలు చేసుకుంటూ స్తోత్రాలు చదువుకుంటూ కాలక్షేపం చెయ్యి. నీలాంటి వాళ్ళు అంతకంటే ఇంకేమీ చెయ్యలేరులేగాని ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు అడిగి నా టైం వేస్ట్ చెయ్యకు' అన్నాను.
'ప్రస్తుతం మెడికల్ లీవ్ లోనే ఉన్నారు కదా? అంత రాచకార్యాలేమున్నాయి మీకు?' అన్నాడు చనువుగా.
'ఎందుకు లేవు? చాలారోజులనుంచీ అనుకుంటున్న చాలా స్తోత్రాలను కంఠతా పట్టాలి. రోజూ నాలుగు పూటలా పూజ చేసుకోవాలి. టైం సరిపోవడం లేదు' అన్నాను నవ్వుతూ.
'అదేంటి? నన్ను వద్దని మీరు చేస్తోంది ఇదా?' అన్నాడు అనుమానంగా.
'నిన్ను చెయ్యొద్దన్నాను గాని నేను చెయ్యనని చెప్పలేదు కదా?' అన్నాను.
'అదేంటి? గొప్పగొప్ప వాళ్ళందరూ తాము చేసేదే ఇతరులకు చెబుతారని విన్నాను. మరి మీరేంటి ఇలా చేస్తున్నారు?' అడిగాడు అయోమయంగా.
'వెరీ సింపుల్. నేను గొప్పవాణ్ణి కాను. మామూలు మనిషిని. కాబట్టే నీకేది అవసరమో అది చెబుతాను గాని నేను చేసేది నిన్ను చెయ్యమని చెప్పను. ఎందుకంటే నేను చేసేవి నువ్వు ఒక్కరోజు కూడా చెయ్యలేవు. తట్టుకోలేవు. కనుక నన్ను చూచి నువ్వు వాత పెట్టుకోకు. నేను చెప్పినవి నీకు చేతనైతే చెయ్యి. లేకుంటే ఫోన్ పెట్టెయ్యి. మళ్ళీ చెబుతున్నా నా టైం వేస్ట్ చెయ్యకు. అవతల పూజకు టైమౌతోంది' అన్నాను.
తను ఇంకేదో చెప్పబోతున్నాడు.
సైలెంట్ గా ఫోన్ కట్ చేసి పూజ మొదలు పెట్టాను.