15, డిసెంబర్ 2025, సోమవారం
హైద్రాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ - 2025
9, డిసెంబర్ 2025, మంగళవారం
' వైద్యజ్యోతిషం రెండవభాగం' ప్రింట్ పుస్తకం విడుదల
మొదటిభాగంలో లాగానే దీనిలోకూడా నూరుజాతకాల విశ్లేషణలతో జలుబు నుండి ఎయిడ్స్ దాకా అనేకరకాలైన వ్యాధులను జాతకాలలో ఎలా గుర్తించాలో వివరించాను. 2022 లో మొదటిభాగం విడుదల అయినప్పటినుండి, తెలుగుపుస్తకం కోసం అనేకమంది జ్యోతిషవిద్యార్థులు, తెలుగుయూనివర్సిటీ నుండి M.A.జ్యోతిషం కోర్సు చేసినవారు, చేస్తున్నవారు అడుగుతున్నారు. ఇప్పటికి ఇది విడుదల అవుతున్నది.
2026 లో, ఇంకొక నూరు జాతకాలతో వైద్యజ్యోతిషం మూడవభాగాన్ని విడుదల చేస్తాను. ఈ విధంగా పదిభాగాలను వ్రాయాలన్నది నా సంకల్పం. మానవజాతిని బాధపెడుతున్న సమస్తరోగాలను జాతకపరంగా ఎలా గుర్తించాలో మొత్తం వెయ్యిజాతకాల విశ్లేషణలతో వివరించే ఈ గ్రంధాలు ప్రపంచ జ్యోతిషచరిత్రలోనే అరుదైన రీసెర్చిగా మిగిలిపోతాయి.
ఈ గ్రంధాన్ని ప్రచురించడంలో తోడ్పడిన నా శిష్యులందరికీ ఆశీస్సులందిస్తున్నాను. ఈ పుస్తకంకూడా జ్యోతిషాభిమానులను ఎంతగానో అలరిస్తుందని భావిస్తున్నాను.
ప్రస్తుతానికి ఈ బుక్ ఇక్కడ లభిస్తుంది.
7, డిసెంబర్ 2025, ఆదివారం
భూతశుద్ధి వివాహం
నేను విజయవాడలో సర్వీసులో ఉన్నరోజుల్లో నాతోపాటు పనిచేసిన కొలీగు ఒకడుండేవాడు. మంచివాడు. కాస్త అమాయకుడు కూడా. పాపం ఏదో రోగంతో 2000 లోనే అర్ధాంతరంగా చనిపోయాడు. అప్పటికి సర్వీసు ఇంకా పాతికేళ్ళు మిగిలుంది.
వాళ్ళది విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్. అదలా ఉంచితే, వాడు భూతంగా మారి తిరుగుతున్నాడని ఈ మధ్యనే కొందరు ఫ్రెండ్స్ చెప్పారు. నేనైతే నమ్మలేదు. కానీ మంత్రతంత్రాలపైన బాగా రీసెర్చి చేసిన ఒక ఫ్రెండ్ గాడు చెబితే ఏమోలే అనుకున్నాను. ఆ సంగతి అంతటితో విని వదిలేశాను.
ఈ మధ్యన ఆశ్రమం దగ్గర పొలిమేరచెట్లలో దిగాలుగా కూచుని కనిపించాడు. అప్పుడు నమ్మక తప్పలేదు.
' ఏంటి ఇక్కడ కూచున్నావ్?' అంటూ నేనే పలకరించాను.
' గుర్తుపట్టావన్నమాట ! మర్చిపోయావేమో అనుకున్నా' అన్నాడు
' ఎలా మర్చిపోతాను? ఇన్నేళ్ల తర్వాత ఇలా కనిపించినా నీలో మార్పేమీ లేదు' అన్నాను.
' కనీసం నువ్వైనా హెల్ప్ చేస్తావని నీ దగ్గరకి వచ్చాను' అన్నాడు.
' రా మాట్లాడుకుందాం' అంటూ ఆశ్రమంలోకి దారితీశాను.
టీ త్రాగుతూ, ' ఇప్పుడు చెప్పు నీ కధ' అన్నాను.
'ఏం లేదు. ఈ భూతంజన్మ నుండి విముక్తి కోసం వెతుకుతూ ఒక గురూజీని కలిశాను. ఆయనొక ఉపాయం చెప్పాడు. నాలాంటి భూతాన్నొకదాన్ని తెచ్చుకుంటే మా ఇద్దరికీ భూతశుద్ధివివాహం చేయిస్తానన్నాడు. అప్పుడు మాత్రమే మాకు ఈ జన్మనుండి విముక్తి కలుగుతుందట. నాకు నమ్మకం కలగలేదు. పాత ఫ్రెండ్ వి, అందులోను ఇప్పుడు గురూజీవయ్యావు కదాని సెకండ్ ఒపీనియన్ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చా' అన్నాడు.
' భూతశుద్దా? వివాహంతోనా? దీనికి సెకండ్ ఒపీనియనా?' అన్నాను అయోమయంగా.
భూతం బిక్కముఖం వేశాడు.
'అసలు భూతశుద్ధి అనేది ఉందా? లేదా?' అడిగాడు నిరాశగా.
' ఉంది. కానీ అది వివాహంతో రాదు. వివాహంతో ఉన్నది కాస్తా పోతుంది' అన్నాను.
' మరెలా?' అడిగాడు భూతం.
' ధాతుశుద్ధి ఉంటే భూతశుద్ధి జరుగుతుంది. ఇవి రెండూ ఉంటే చిత్తశుద్ధి వస్తుంది. అప్పుడు శివానుగ్రహం లభిస్తుంది. నీకు విముక్తి దొరుకుతుంది. నాకు తెలిసినంతవరకూ అదీ ప్రాసెస్. అయితే ఇది పెళ్లితో రాదు. సాధనతో వస్తుంది. సరియైన గురువును అనుసరిస్తూ, సరియైన దిశలో సాధనచేస్తే, నీ అదృష్టం బాగుంటే ఈ జన్మలో రావచ్చు. లేకపోతే అనేకజన్మలు పట్టవచ్చు' అన్నాను టీ సిప్ చేస్తూ.
' అబ్బో అంత లాంగ్ ప్రాసెస్ అయితే కష్టమే. అవన్నీ ఎప్పుడు జరగాలి? ఎప్పుడు నాకు మోక్షం సిద్ధించాలి? దీనికంటే భూతశుద్ధివివాహమే బెటర్. అసలిదంతా లేకుండా సింపుల్ గా పని జరగాలంటే ఎలా?' భూతం ఏడ్చినంత పని చేశాడు.
' ఒకమార్గం ఉంది' అన్నాను.
'ఏంటది?' అడిగాడు ఉత్సాహంగా.
'దేహశుద్ధి ప్రయోగం అని ఒకటుంది. దానిని చేస్తే, భూతశుద్ధివివాహంతో పనిలేకుండానే నీకు మోక్షం వచ్చేస్తుంది. చేయమంటావా?' అడిగాను మంత్రదండంపైన చెయ్యివేస్తూ.
'ఒద్దులే. ఇప్పటికే చాలామంది చేతిలో అయింది. కానీ మోక్షం మాత్రం రాలేదు. నీ ఉపాయం కంటే, ఆ గురూజీ చెప్పినదే బాగుంది. నాకు నచ్చిన భూతాన్ని వెతుక్కుంటా. దొరికాక ఆయన్ను కలుస్తా' అన్నాడు.
'సరే. ఆ పనిమీదుండు. మళ్ళీ ఈ ఛాయలకు రాకు' అని ఉచ్చాటనామంత్రాన్ని జపించాను.
ఫ్రెండ్ భూతం కెవ్వున కేకేసి మాయమైపోయింది.
ఆ విధంగా భూతానికి దేహశుద్ధి చేసే బాధ నాకు తప్పింది. ఎంతైనా పాతఫ్రెండ్ కదా ! చూస్తూచూస్తూ నేనుమాత్రం ఎలా చెయ్యగలను ! ఏదో మాటవరసకన్నాను. నిజమనుకుని పారిపోయింది.
పిచ్చిభూతం !
5, డిసెంబర్ 2025, శుక్రవారం
ఫౌండేషన్
ఈ మధ్యన కొంతమంది స్త్రీలు ఒక కారులో ఆశ్రమానికి వచ్చారు. దానిమీద ఏదో గవర్నమెంట్ పేరు, హోదా వ్రాసి ఉన్నాయి. చూస్తూనే అది గవర్నమెంట్ కారని తెలిసిపోతోంది. అది వారిలో ఒకామె మరిదిగారి అఫీషియల్ కారని తెలిసింది.
వాళ్లు చాలాసేపు కూర్చుని అదీఇదీ మాట్లాడారు.
వారిలో ఒకామె ' నేనుకూడా మెడిటేషన్ చేస్తూ ఉంటాను ' అంది.
ఇప్పుడు ప్రతివారూ ఒక గురువే గనుక ఆమె మాటలకు నేనేమీ స్పందించలేదు.
'ఫలానా గురువు దగ్గర యోగా నేర్చుకున్నాను. ఇంకొక గురువు దగ్గర విపస్సానా చేశాను. ఈషా ఫౌండేషన్ కూడా చేశాను ' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
చూడబోతే, తనను తానొక ప్రత్యేకవ్యక్తిగా ఊహించుకుంటూ, గొప్పలు చెప్పుకునే మనిషిలాగా అనిపించింది. ప్రస్తుతం అందరూ అలాగే ఉన్నారు కదా !
వినీ వినీ చివరకు ఇలా అన్నాను, ' మీరు చాలా ఫౌండేషన్స్ తిరిగారు నిజమే. కానీ అసలైన ఫౌండేషన్ మాత్రం మీకు పడలేదు'.
వాళ్ళు స్టన్నయ్యారు.
ఇంకా ఇలా చెప్పాను.
'పర్సనల్ పనిమీద వస్తూ, మీ మరిదిగారి అఫీషియల్ కారులో మీరంతా వచ్చారు. అంటే, అఫీషియల్ రిసోర్సెస్ ను వ్యక్తిగతపనులకు వాడుతున్నారు. మెడిటేషన్ కు యమనియమాలే పునాదులు. వాటిలో అపరిగ్రహం అత్యంతముఖ్యమైనది. వ్యక్తిగతజీవితంలో నీతినియమాలు లేకుండా మీరెన్ని ఫౌండేషన్స్ వెంట తిరిగినా, ఎన్ని కోర్సులు చేసినా, చివరకు మీకేమీ ఒరగదు. అసలైన ఫౌండేషన్ మీకు లోపించింది'.
' అలా ఉంటే జీవితంలో చాలా లాసవుతాం కదండి ' అందామె.
'లాసుకు భయపడేవ్యక్తి, ఎంతసేపూ లాభనష్టాలు మాత్రమే చూసుకునే వ్యక్తి, ఆధ్యాత్మికజీవితంలో ఎక్కువదూరం ప్రయాణించలేడు' అన్నాను.
వాళ్ళు నొచ్చుకున్నట్లు కనిపించారు.
ఆ తరువాత వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేదు. బయలుదేరి వెళ్లిపోయారు.
ఒకళ్ళు నొచ్చుకుంటారని నేను అబద్దాలు చెప్పలేను. ఒకళ్ళను మెప్పించవలసిన పనికూడా నాకు లేదు.
ఆధ్యాత్మికజీవితం అనేది ఒక ఇల్లు కట్టడం లాంటిదే.
ఒక శిష్యుని కజిన్ హైదరాబాద్లో ఇల్లు కట్టించుకున్నాడు. కొత్తింటి ఆనందంలో గృహప్రవేశం చేసుకున్నారు. అయితే, బిల్డర్ యొక్క మెటీరియల్ కక్కుర్తి, క్యూరింగ్ సరిగా చేయకపోవడాల వల్ల కొద్దినెలలలోనే ఫ్లోరింగ్ కృంగిపోయి, మక్రానా మార్బుల్స్ అన్నీ బీటలిచ్చాయి. 15-20 లక్షలు ఖర్చుపెట్టి, మార్బుల్ ఫ్లోరింగ్ అంతా మళ్ళీ చేయించుకున్నారు. ఆధ్యాత్మికజీవితం కూడా ఇంతే.
ఫౌండేషన్స్ సరిగ్గా లేకుండా ఎన్ని ఫౌండేషన్స్ వెంట తిరిగినా చివరకు బిల్డింగ్ కృంగిపోవడం తప్ప ఇంకేమీ ఉండదు.
ఇదెప్పుడు అర్ధం చేసుకుంటారో ఈ మనుషులు !
4, డిసెంబర్ 2025, గురువారం
మనుషులుగా పుట్టే అవకాశం
చాలాకాలం నుంచీ ఈ మనుషులను, ఈ ప్రపంచాన్ని చూస్తుంటే నాకు నవ్వు, జాలి ఈ రెండే కలుగుతూ ఉండేవి . ఇప్పుడు అసహ్యం కూడా అనిపిస్తోంది. కారణం? సివిక్ సెన్సు, కామన్ సెన్సు, అసలు ఏ విధమైన సెన్సూ లేనివాళ్లు కూడా చాలామంది మనిషిజన్మ ఎత్తుతూ ఉండటమే.
కలికాలమంటే ఇదేనేమో?
మొన్నీమధ్యన ఒంగోలునుంచి కొందరువ్యక్తులు ఆశ్రమానికి వచ్చారు. వచ్చినది మధ్యాన్నం రెండుగంటలకు. అదికూడా చెప్పాపెట్టకుండా అత్తగారింటికి వచ్చినట్లు వచ్చారు. అక్కడే ఆ మనుషుల నిర్లక్ష్యధోరణి అర్ధమౌతున్నది.
ఇక్కడ దగ్గరలోని ఏదో గుడికి వచ్చి, దగ్గరేకదా అని మిమ్మల్ని కూడా చూచిపోదామని వచ్చామన్నారు.
ఇంకా నయం, మీకు మోక్షం ఇవ్వడానికి వచ్చామనలేదు. అంతవరకూ సంతోషం కలిగింది.
'ఇది ఆశ్రమమా?' అన్నాడు వారిలో ఒకాయన కూచుంటూ.
అంటే, ఎక్కడికొచ్చారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారన్నమాట !
నేనేమీ మాట్లాడలేదు.
'ఏం చేస్తారిక్కడ?' మరొకామె అడిగింది అనుమానంగా చూస్తూ.
'చెప్పినా మీరర్ధం చేసుకోలేరు ' అన్నాను.
'ఇంతదూరం వచ్చి ఉంటున్నారేంటి?' మళ్ళీ అతని ప్రశ్న.
'మీ స్వగ్రామం ఎక్కడ?' అడిగాను.
' హైద్రాబాద్ ' అన్నాడు.
'నువ్వెందుకు ఇంతదూరం వచ్చి ఒంగోల్లో ఉంటున్నావు?' అడిగాను.
అదేమీ పట్టించుకోకుండా, 'మీ జ్యోతిష్యపుస్తకాలను ఒంగోలు బుక్ ఎగ్జిబిషన్ లో కొన్నాము. మా జాతకాలు చూస్తారా?' అడిగాడు.
అంటే, 'నేను జాతకాలు చూచే కమర్షియల్ జ్యోతిష్కుడిలా కనిపించానా?' అని నాపైన నాకే సందేహం వచ్చింది.
'చూడను. నాకు జ్యోతిషం మీద నమ్మకం లేదు' అన్నాను.
'మరి బుక్స్ రాశారుగా' అన్నాడు.
'రాసింది నమ్మేవాళ్ళకోసం. నాకోసం కాదు' అన్నాను.
'ఒంగోలు వస్తుంటారా అప్పుడప్పుడు?' అడిగింది ఆమె.
'తక్కువ. ఎప్పుడైనా వస్తుంటాను' అన్నాను.
'ఈసారి వచ్చినపుడు నాకు ఫోన్ చేయండి. నేనొచ్చి కలుస్తాను' అన్నాడతగాడు.
'నాకు కుదరదు' అన్నాను.
'అదేంటి సార్? ఊరకే జస్ట్ కలుస్తాము. అంతే' అన్నాడాయన.
'అందుకే కలవనంటున్నాను. ముచ్చట్లకు నాకు టైం ఉండదు ' అన్నాను.
'ఈ ల్యాండ్ అంతా మీదేనా?' అడిగింది ఆమె చుట్టూ చూస్తూ.
'కాదు. వేరేవాళ్లది. కబ్జా చేశాను' అన్నాను సీరియస్ గా.
'ఎంతకి కొన్నారు?' అడిగాడొకడు నేను చెబుతున్నది వినకుండా.
' ఎకరం పదిరూపాయలు ' అన్నాను.
వాళ్ళు ఆమాట కూడా వినిపించుకునే పరిస్థితిలో లేరు.
'మరిక్కడ అన్నీ దొరుకుతాయా?' అడిగిందామె.
'ఏవీ దొరకవు ' అన్నాను.
'మరెలా?' అన్నది.
'ఎందుకు దొరకాలి? దొరక్కపోతే ఏమౌతుంది? ' అన్నాను.
'మీ పుస్తకాలు ఇంకా ఏవైనా ఉంటే చూపిస్తారా?' అడిగాడతను.
' ఇక్కడుండవు' అన్నాను.
' అదేంటి?' అతనికి సందేహం వచ్చింది.
'రాసేది నేను చదువుకోవడానికి కాదు' అన్నాను.
'ఇక్కడ గుడేమీ లేదా? ' అన్నాడు అతనే మళ్ళీ.
'ఇప్పుడే బయటకెళ్ళింది. సాయంత్రం వస్తుంది ' అన్నాను.
'సరేనండి వెళ్లొస్తాం. మీలాంటి పెద్దవాళ్ళని కలవడం మా అదృష్టం' అన్నాడతను లేస్తూ. వాళ్ళకు చెవుడా? లేకపోతే వాళ్ళ ధోరణే అంతేనా? నాకైతే అర్ధం కాలేదు.
'గురువుగారు లేచాక చెప్తాలెండి మీరొచ్చి వెళ్లారని ' అన్నాను నేనూ లేస్తూ.
వాళ్ళది కూడా వినిపించుకోలేదు. వాహనం ఎక్కి వెళ్లిపోయారు. అసలెందుకొచ్చారో ఎందుకు వెళ్లారో వారికన్నా తెలుసా? అనే అనుమానం నాలో తలెత్తింది.
మనం ఎక్కడికొచ్చాం? ఏం మాట్లాడాలి? అన్న స్పృహకూడా చాలామందిలో ఉండటం లేదు.
నాకీసారి దేవుడిపైనే జాలి కలిగింది. అన్నిజీవులకూ మనుషులుగా పుట్టే సమాన అవకాశం ఇస్తున్నందుకు.
16, నవంబర్ 2025, ఆదివారం
మా 75 వ పుస్తకం ' దేవీగీత ' విడుదల
28, అక్టోబర్ 2025, మంగళవారం
భయం భయం
26, అక్టోబర్ 2025, ఆదివారం
పిరమిడ్ పిచ్చోడు
మొన్న మధ్యాన్నం ఒకాయన్నుంచి వాట్సాప్ కాలొచ్చింది.
ఎవరో చూద్దామని ఎత్తాను.
పరిచయాలయ్యాక, 'నేను పిరమిడ్ చేస్తుంటాను' అన్నాడు.
వడ్రంగేమో అనుకుని, 'మాకు ప్రస్తుతం చెక్కపని అవసరం లేదు' అన్నాను.
అవతలనుంచి కాసేపు సైలెన్స్.
'అది కాదు, మెడిటేషన్' అన్నాడు సీరియస్ గా.
'ఓహో అదా? సరే. నాకెందుకు ఫోన్ చేశారు?' అడిగాను.
'మీరు ఫోర్తు లెవల్లో ఉన్నారు. ఫిప్త్ లెవల్ ఇనీషియేషన్ ఇవ్వమని మా గురువుగారు చెప్పారు. అందుకే ఫోన్ చేస్తున్నాము' అన్నాడు గంభీరంగా.
'ఎవరాయన? అడిగాను.
పేరు చెప్పాడు.
'ఆయన పోయాడుగా?' అడిగాను.
'కలలో కనపడి చెప్పారు. మాకు అలాగే చెబుతూ ఉంటారు' అన్నాడు.
'నాక్కూడా కనపడి, ఇదే ముక్క చెప్పి పుణ్యం కట్టుకోమనండి' అన్నాను.
'ఆయన్ని కలలో చూడ్డానికి మీ లెవల్ సరిపోదు' అన్నాడు.
'మరి ఆయన గురువే కనిపించాడుగా నాకు' అన్నాను.
'ఆయనకు గురువా? ఎవరు?' అడిగాడు.
'మీకు తెలీదా?' ఎదురు ప్రశ్నించాను.
'అవన్నీ మాకు చెప్పరు. అవసరమైనవి మాత్రమే చెప్తారు, ఆయన గురువెవరు?' అన్నాడు.
'లోబ్సాంగ్ రాంపా' అని ఒకడున్నాడులే. టిబెటన్ గురువు. 1978 లో నేను ఇంటర్ చదివే టైములో ఆయన పుస్తకం ఒకటి 'The Third Eye' అనేది చదివాను. ఆ రాత్రే నాక్కనిపించాడు కలలో' అన్నాను.
ఆగంతుకునిలో ఉత్సుకత పెరిగింది.
'అవునా సార్. ఏం చెప్పారాయన?' అన్నాడు.
'47 ఏళ్ల తర్వాత నువ్వు ఫోన్ చేస్తావని చెప్పాడు. ఆయన చెప్పింది నీ గురించేనా? నీ వయసెంత?' అన్నాను ఏకవచనంలోకి దిగుతూ.
నేను ఎగతాళి చేస్తున్నానని అతనికి అర్ధమైంది.
'మాస్టర్స్ తో చతుర్లొద్దు సార్' అన్నాడు కోపంగా.
' గ్రాండ్ మాస్టర్ తో అసలే వద్దు. వయసు చెప్పు ముందు ' అన్నాను.
' ముప్పై ఎనిమిది' అన్నాడు.
'అంటే, నువ్వింకా పుట్టకముందే మీ గురువుగారి గురువును నేను కలలో చూశాను. అర్థమైందా?' అన్నాను.
'నేను నమ్మను' అన్నాడు.
'నీ కలని నేను నమ్ముతున్నాగా. నా కలని నువ్వెందుకు నమ్మలేవు?' అడిగాను.
జవాబు చెప్పకుండా మాటమార్చి, 'పిరమిడ్ లోకి రావాలంటే అదృష్టం ఉండాలి' అన్నాడు.
'ఆ లెక్కన, చచ్చిన మమ్మీలన్నీ లక్కీ ఫెలోసేగా?' అన్నాను.
'మీ ఆశ్రమంలో కూడా ఒక పిరమిడ్ కట్టించండి, అప్పుడు తెలుస్తుంది దాని మహిమ' అన్నాడు.
'నేను ఫారోనీ కాను, మమ్మీనీ కాదు. మనిషిని. అందులోనూ భారతీయుడిని. ఈజిప్ట్ సమాధులు నాకెందుకు?' అన్నాను.
' మీకు పూర్తిగా జ్ఞానం తెలీదు. అందులో కింగ్స్ చేంబర్, క్వీన్స్ చేంబర్ అని ఉంటాయి. అక్కడ కూచుని మెడిటేషన్ చేసి చూడండి. తెలుస్తుంది' అన్నాడు.
'ఏం? కీప్స్ చేంబర్ ఉండదా?' అడిగాను.
'ఉండదు. ఒకసారి చెయ్యండి. యాస్ట్రల్ ట్రావెల్ లోకి వెళ్లకపోతే అప్పుడు చెప్పండి' అన్నాడు.
' నేను ప్రతిరోజూ చేసేపని అదేగా, నిద్రలో ' అన్నాను.
'అది వేరు. ఇది వేరు. మీకు పూర్తి నాలెడ్జి లేదు. అందుకే మీకు ఫిఫ్త్ లెవల్ ఇనీషియేషన్ ఇమ్మని మా గురువుగారి ఆజ్ఞ' అన్నాడు.
'సరే మీరింతగా చెబుతుంటే నాక్కూడా తీసుకుందామనే అనిపిస్తోంది. కాకపోతే ఒక కండిషన్. ఎలా ఇస్తారు? యాస్ట్రల్ బాడీతో ఇస్తారా, ఫిజికల్ బాడీతో ఇస్తారా?' అడిగాను.
'మీరెలా కావాలంటే అలా' అన్నాడు దర్పంగా.
'అలా అయితే, ఫిజికల్ బాడీతో గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఇవ్వండి. తీసుకుంటాను' అన్నాను.
'ఏంటి సార్. జోకులా?' అన్నాడు.
'కాదు. మేకులు. మూడే కొడతా. డైరెక్టుగా పరలోకమే' అన్నాను.
'అలా ఎవ్వరూ ఎగరలేరు' అన్నాడు.
'గలరు. మాస్టర్స్ అలా ఎగురుతారని మీ గుగ్గురువు రాంపా రాశాడు. కావాలంటే చదువుకో' అన్నాను.
'మరి నన్నేం చెయ్యమంటారిప్పుడు?' సంకటంలో పడ్డాడు.
'ముందు మీ డాబామీద కెక్కి, అక్కడనుంచి గాల్లోకి ఎగరడం ప్రాక్టీసు చెయ్యి. సక్సెస్ అయితే అలాగే ఎగురుకుంటూ నా దగ్గరికి రా. నేను రెడీగా ఉంటాను. ఒకవేళ కిందపడ్డావనుకో. అప్పుడెలాగూ యాస్ట్రల్ బాడీలోనే వస్తావు. ఐదర్ వే అయామ్ గుడ్' అన్నాను .
అవతల ఫోన్ కట్ అయిపోయింది.
'ఈ పిచ్చోడికి నా నంబర్ ఎవడిచ్చాడో? ఒకవేళ లోబ్సాంగ్ రాంపా ఇచ్చాడేమో?' అన్న అనుమానం నాలో తలెత్తింది.
'ఇవాళ రాత్రికి యాస్ట్రల్ ట్రావెల్లో వాడి పని చెప్తా' అనుకుంటూ ఫోన్ పక్కన పడేశా.
25, అక్టోబర్ 2025, శనివారం
కాపీ కష్టాలు
అసలే మేముండేది పొలిమేరలో.
ఇక్కడ దయ్యాలున్నాయని ఊరిజనం చెప్పుకుంటారు. కానీ నాకెప్పుడూ కనిపించలేదు. కనిపిస్తే వాటికి మోక్షం వస్తుంది కదా ! ఆరేళ్లక్రితం మెట్టుగూడ రైల్వే క్వార్టర్స్ లో ఒక దయ్యానికి అలా మోక్షం వచ్చింది. అంత అదృష్టం ప్రతి గాలిదయ్యానికీ ఎలా పడుతుంది?
రాత్రుళ్ళు చీకట్లో తిరగడం నాకు బాగుంటుంది. అర్ధరాత్రిపూట అయితే ఇంకా బాగుంటుంది. ఒంటరిగా అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. మా సెక్రటరీస్వామి ఇక్కడుంటే అలా చెయ్యనివ్వడు. గురువుగారికి ఏదో ఒక దయ్యం కనిపించి మోక్షం కొట్టేస్తుందని, నా వెంటే తనుకూడా ఒక కర్ర ఒక టార్చి తీసుకుని వస్తాడు. పక్కనెవరైనా ఉంటే అవి కనిపించవు. అందుకని సెక్రటరీస్వామి పనిమీద ఏదైనా ఊరికెళ్ళినపుడు ఇలాంటి సరదాలు తీర్చుకుంటూ ఉంటాను.
మొన్న అమావాస్య ఛాయలో ఒక రాత్రిపూట సరదాగా అలా తిరుగుతున్నా. చుట్టుపక్కల నరసంచారం లేదు. చిమ్మచీకటి, అప్పుడప్పుడూ అరిచే ఊరకుక్కలు తప్ప ఇంకేమీ కనుచూపుమేరలో లేవు. రోడ్డు పక్కన ఉన్న వేపచెట్లు జుట్టు విరబోసుకుని ఉన్న దయ్యాల్లా ఉన్నాయి. వాటిమధ్యలో రోడ్డుమీద నడుస్తూ పోతున్నా.
అప్పుడే, ఒక అనుకోని సంఘటన జరిగింది.
చాలా ఏళ్ల తర్వాత, ఒక చెట్టునీడలో నిలబడి కర్ణపిశాచి కనిపించింది. అది కనిపించి దాదాపు ఐదారేళ్లయి పోయింది.
ముందు ఎవరో పల్లెటూరి మనిషనునుకున్నా. కొంతమంది పొలాల్లో కాపలాగా పడుకుంటారు. 'అలాంటి ఎవరో అక్కడ నిలబడి ఉన్నారు' అనుకుని దాటి ముందుకు పోతున్నా. కానీ తననుండి వచ్చే ఒకవిధమైన వాసన 'తను తనే' అని పట్టించేసింది.
'చూశావని, గుర్తుపట్టావని అర్ధమైంది. నటించకు' అంది కాపీ, చెట్టునీడనుండి బయటకొచ్చి నాతో అడుగులేస్తూ.
మాటమాటకీ 'పిశాచి' అంటే బాగుండదు గనుక, ముద్దుగా 'కాపీ' అని పిలుచుకుందాం.
'ఎప్పుడో ఒకసారి కనిపిస్తే ఎలా గుర్తుపడతాను?' అడిగాను.
'నువ్వేగా, ఎప్పుడుపడితే అప్పుడు రావద్దన్నావు. అందుకే, అవసరమైన పనుంటే తప్ప రావడం లేదు' అంది.
'సరే. ఇంతకంటే మంచిముహూర్తం దొరకలేదా నీకు? అమావాస్య ఛాయలో కనిపించావ్?' అన్నాను.
'మాకిదే మంచిటైము. అందుకే ఈ టైంలో వచ్చా. అయినా, నువ్వేంటి? హాయిగా నిద్రపోకుండా, ఇంత రాత్రిపూట తిరుగుతున్నావ్? అవున్లే మొన్న రాశావుగా 'ఇది నా కర్మ' అని. మళ్ళీ అడగటం నాదే తప్పు' అంది.
'తెలిసీ అవే తప్పులు ఎందుకు చేస్తున్నావ్ మరి?' అందామని నోటిదాకా వచ్చినా, కాపీ కదా అని భయమేసి, 'అబ్బో, బ్లాగులు కూడా చదూతున్నావా?' అడిగా.
'అన్నీ తెలుసు మాకు, ఈ మధ్య రాయట్లేదుగా నువ్వు?' అంది నవ్వుతూ.
'సర్లే దానికేంగాని, సంగతులు విశేషాలు చెప్పు' అన్నా నడుస్తూ.
తను కొంచం ఒళ్ళు చేసింది. స్పీడుగా నడవలేకపోతోంది.
నా ఆలోచనని పట్టేసి, 'ఈ మధ్య యోగా చెయ్యడం లేదు. మళ్ళీ మొదలుపెట్టాలి. అస్సలు టైముండటం లేదు. దేశాలు తిరగటమే సరిపోతోంది' అన్నది.
'జోకు బాగుంది. నాకు పోటీ వస్తున్నావ్. అమెరికా సంగతులు చెప్పు' అన్నా.
'ఏముంది? నీ పాత శిష్యురాళ్ళు ఇద్దరికి కష్టకాలం నడుస్తోంది' అంది.
'ఆహా' అన్నా తెలిసినా తెలీనట్టు.
'పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్ళతో సమస్యలు. చాలా బాధల్లో ఉన్నారు' అంది.
'ఎవరు వాళ్ళు?' అడిగా అర్ధం కానట్టు.
'నటించకు. 12 ఏళ్ళు వెనక్కి వెళ్లి గుర్తుతెచ్చుకో' అంటూ ఇద్దరి పేర్లు చెప్పింది.
'ఓ. వాళ్ళా? ఇలా అవుతుందని అప్పుడే చెప్పా. వినలేదు. నేనేం చెయ్యను?' అన్నాను.
'అయినా ఒకప్పటి నీ శిష్యురాళ్లే కదా ! ఆ మాత్రం బాధ్యత ఉండొద్దా నీకు? వాళ్ళలా కష్టాలు పడుతుంటే పట్టించుకోవా?' అడిగింది కోపంగా.
'వినేవాళ్ళనైతే పట్టించుకోవచ్చు. అన్నీ మాకు తెలుసనుకునేవాళ్ళకి చెప్పడం దేనికి? అయినా, లోకానికి బోధలు చేసేవాళ్ళు, తమ పిల్లల బాగోగులు చూసుకోలేరా?' అడిగాను.
'నీకు పరిచయం ఉన్న రోజుల్లో, వాళ్ళు పిల్లలు. ఇప్పుడు పెద్దలయ్యారు. అది అమెరికా. ఇంకా చెప్పమంటావా అక్కడి కష్టాలు?' అంది.
'ఒద్దులే. అర్ధమైంది. అక్కడి కష్టాలూ తెలుసు, సుఖాలూ తెలుసు. అయినా, ఒకళ్ళకి నేనేం సాయం చెయ్యగలను చెప్పు? ఒక సివిల్ సర్వెంట్ గా రిటైరైన నేనే అర్ధరాత్రిళ్ళు ఇలా తిరుగుతున్నాను. అయినా, చెప్తే వినేరకాలా నా శిష్యురాళ్ళు?' అన్నా.
మాటల్లోనే పక్కఊరు వచ్చేసింది. ఊరు నిద్రలో జోగుతోంది. కుక్కలు అరుస్తున్నాయి.
వెనక్కు తిరిగాం.
' మరి 'సంగతులేంటి?' అని ఎందుకడుగుతావ్? ఏమీ చెయ్యనోడివి?' అంది చనువుగా.
'ఊరకే. న్యూసు తెలుసుకుందామని అడుగుతా. అపాత్రదానం చెయ్యకూడదు కదా. అయినా, అంత వేదాంతం తెలిసినోళ్లకి కష్టాలేముంటాయి? 'బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్' అని పాడుకోమను. సరిపోతుంది' అన్నా.
'అంతేలే. నువ్వడిగావని వాళ్ళ న్యూసు చెప్పా. నాకెందుకు వాళ్ళ గోల? వేరే పనుంది. నా కష్టాలు నావి. ఈ మధ్య ఓటీ కూడా చెయ్యాల్సొస్తోంది' అంది మాయం కావడానికి రెడీ అవుతూ.
'ఏమైంది?' అన్నా.
'రాష్ట్రాలు విడిపోయాక కొంత వర్క్ లోడు తగ్గుతుందని సంబరపడ్డా. తెలంగాణా కాపీ మాటమాటకీ లీవు పెడుతోంది. దాని పని కూడా నేనే చెయ్యాల్సొస్తోంది' అంది విచారంగా.
'అలాగా. ఎక్కువ నటించకు. నమ్మేగలను. నీకూ మంచిరోజులొస్తాయిలే. ఓపికపట్టు' అన్నా.
'నీకేం? ఎన్నైనా చెప్తావ్? మా బాధలు మావి' అంది.
'సర్లే. ఒంటరి ఆడపిల్లవి. ఇండియాలో రాత్రిపూట తిరక్కు. అసలే లోకం బాలేదు' అన్నా నవ్వుతూ.
'నువ్వూ నీ జోకులు. నువ్వేం మారలేదు ఈ ఆరేళ్లలో' అంది.
'నువ్వు మారావా?' అడిగా నవ్వుతూ.
'సర్లే. అవన్నీ మళ్ళీ వచ్చినపుడు మాట్లాడుకుందాం. టాటా' అని నవ్వుతూ మాయమైంది కాపీ.
వెనక్కు నడుస్తున్న నా ఆలోచన పన్నెండేళ్ళు వెనక్కు పోయింది. అప్పటి సంగతులు, నేను వాళ్ళకిచ్చిన సలహాలు, వాళ్ళు వినకపోవడం, విడిపోవడం, చాలా గుర్తొచ్చాయి.
'ఎక్కిన పొగరు దించడానికే కష్టాలొచ్చేది. ఎవరేం చెయ్యగలరు? ఎవరి కష్టాలు వాళ్ళవి. పడండి' అనుకుంటూ ఆశ్రమం వైపు అడుగులేశా.
23, అక్టోబర్ 2025, గురువారం
వాయువును బంధిస్తా
'ఒక పెద్దాయన మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు' శిష్యుడినుంచి ఫోనొచ్చింది.
'ఎవరాయన?' అన్నాను.
' మనకు పరిచయం లేదు. 75 పైనే ఉంటాయి ' అన్నాడు.
' అవసరం లేదు. ముందు మన బుక్స్ చదవమను ' అన్నాను.
' ఆయన గత 20 ఏళ్ళనుంచి ఆధ్యాత్మికమార్గంలోనే ఉన్నాట్ట, ఆ పుస్తకాలూ గట్రా తనకవసరం లేదన్నాడు' అన్నాడు.
' మరెందుకు కలవడం?' అన్నాను.
' పంచవాయువులలో నాలుగింటిని బంధించడం వచ్చేసిందట. ఒక్కదాన్ని మాత్రం బంధించలేకపోతున్నాడట. అది మీ దగ్గర నేర్చుకోవాలని కోరిక ' అన్నాడు.
' అపానవాయువునా?' అడిగాను.
' ఏమో మరి. నాతో చెప్పలేదు ' అన్నాడు శిష్యుడు.
' అదైతే అస్సలు రావద్దని చెప్పు. మనం భరించలేం ' అన్నాను.
' వాయుబంధనం కావాలట' అన్నాడు.
' దానిని ప్రత్యేకంగా నేర్చుకోవడమెందుకు? ఎలాగూ 75 దాటాయంటున్నావు. కొన్నేళ్లు ఓపిక పడితే సహజంగానే అవుతుంది' అన్నాను.
' ప్రకృతిలో కలిసిపోవాలని ఉందిట' అన్నాడు.
' అన్నింటినీ బిగబడితే జరిగేది అదే. అంత తొందరెందుకు?' అన్నాను.
' ఏమో మరి?' అన్నాడు శిష్యుడు
' అదేదో వాళ్ళింట్లోనే కలిసిపొమ్మను. ఇక్కడికొచ్చి ఆశ్రమంలో పోతే మళ్ళీ అదొక కేసవుతుంది. మనకెందుకా గోల? ' అన్నాను.
' ఏం చెప్పమంటారు ఆయనకీ?' అడిగాడు.
' రెండ్రోజుల్నించీ వానలు పడి గురువుగారు జలబంధనంలో ఉన్నారు. అవి తగ్గాక వాయుబంధనం గురించి ఆలోచిస్తానన్నారని చెప్పు' అని ఫోన్ పెట్టేశాను.
ఎన్ని రకాల పిచ్చోళ్ళురా బాబూ ఈ లోకంలో?
22, అక్టోబర్ 2025, బుధవారం
నిమ్మకు నీరెత్తిన సర్వీస్
నిన్న పనుండి ఒక ఫ్రెండ్ కి కి ఫోన్ చేశాను.
మాటల సందర్భంలో, 'ఇవాళంతా చాలా గందరగోళంలో ఉన్నాం' అన్నాడు.
వీడు రిటైరై కూడా ఏదో కంపెనీలో చేరి ఇంకా పని చేస్తున్నాడు. ఎవడిగోల వాడిది !
'ఏం?' అన్నాను.
'AWS గురించి విన్నావా?' అని అడిగాడు.
'తెలుసు' అన్నాను.
'ఏంటో చెప్పు' అడిగాడు నవ్వుతూ.
అంటే, నేనీ మూల ఉన్నాను కాబట్టి, ప్రపంచంలో ఏం జరుగుతున్నదో నాకు తెలీదని వీడి నమ్మకం.
'ఆల్ వర్రీ సర్వీస్' అన్నాను.
'కాదు. అమెజాన్ వెబ్ సర్వీస్' అన్నాడు.
'అయితే ఇప్పుడేమంటావ్?' అడిగాను.
'ఔటేజి వచ్చింది. లక్షలాదిమందికి ఇబ్బంది. మేము కూడా దీనివల్ల ఇబ్బంది పడుతున్నాం' అన్నాడు.
'సరే పడు' అన్నాను.
'నీకీ బాధ లేదేమో హాయిగా ఉన్నావ్' అన్నాడు.
'అవును నా దగ్గర NWS ఉంది' అన్నాను.
'అంటే నో వర్రీ సర్వీసా' అడిగాడు.
తెలివైన బుర్రే.
'అవును. ఆ తర్వాత NNS' అన్నాను.
'అదేంటి?' అడిగాడు.
'చెప్పుకో చూద్దాం' అన్నాను
'అంత టైం లేదు. నువ్వే చెప్పు' అన్నాడు.
'నిమ్మకు నీరెత్తిన సర్వీస్' అన్నాను.
'జోకులాపు. ఇంతకుముందు ఇలాంటివి వస్తే పోస్టులు రాసేవాడివి. ఇప్పుడు రాయడం లేదు. రెమెడీలు చెప్పడం లేదు. ఎందుకు?' అడిగాడు.
'అవసరం అనిపించడం లేదు. చెప్పాల్సినవాళ్ళకి చెబుతున్నాను. అందుకోగలిగిన వాళ్ళు అందుకుంటున్నారు' అన్నాను.
'మాక్కూడా నేర్పవచ్చు కదా NWS?' అడిగాడు.
' ఈ జన్మలో నీ వల్లకాదు. చివరిక్షణం వరకూ ఉద్యోగం చేసుకో' అన్నాను.
'ఎందుక్కాదు? నేర్పడం నీకిష్టం లేదని చెప్పు' అన్నాడు.
'సరే నేర్పిస్తాను, రాత్రికి బయల్దేరి రేప్పొద్దున్నకల్లా ఇక్కడుండు' అన్నాను.
' అంటే... మా బాస్ కి ముందుగా చెప్పాలి. ఇంత సడన్ గా అంటే ఒప్పుకోడు. పైగా ప్రస్తుతం గందరగోళంలో ఉన్నాం' అన్నాడు.
'అందుకే అన్నాను. నీ వల్లకాదని. ఆ ఊబినుంచి నువ్వీ జన్మకి బయటపడలేవు' అన్నాను.
'పోనీ తర్వాత వీలు చూసుకుని రమ్మంటావా?' అడిగాడు.
'నీకు వీలైనప్పుడు నాకు వీలు కావద్దా?' అన్నాను.
'మరెలా?' అన్నాడు.
'ఈ సమస్య తెగేది కాదు. ఫోన్ పెట్టేసి పని చూసుకో' అని ఫోన్ కట్ చేశాను.
20, అక్టోబర్ 2025, సోమవారం
రెమెడీ చెప్పమంటావా?
ఇవాళ మా ఫ్రెండ్ మరొకడు ఫోన్ చేశాడు.
'25 వ తేదీ దగ్గరకొస్తోంది. గుర్తుందిగా?' అడిగాడు.
'గుర్తుంది' అన్నాను.
'మరొస్తున్నావా హైద్రాబాద్?' అడిగాడు.
'రావడం లేదు' అన్నాను.
'మొన్న వస్తానని చెప్పావుగా మన ఫ్రెండ్ తో?' అన్నాడు.
'ఇప్పుడు రానంటున్నాను' అన్నాను.
'అదేంటి రోజుకోమాట చెప్తావ్?' అన్నాడు.
'మాటమీద నిలబడటం నాకలవాటు లేదు. నేలమీద మాత్రమే నిలబడతాను' అన్నాను.
ఇలా కాదనుకున్నాడో ఏమో మాట మార్చి, 'ఖాళీగా ఉండి ఏం చేస్తున్నావు?' అన్నాడు.
'ఖాళీగా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నాను' అన్నాను.
'బోరు కొట్టడం లేదా?' అన్నాడు.
'కొడదామని చూస్తోంది. అది కొట్టేలోపు నేనే కొట్టేస్తున్నాను, మార్షల్ ఆర్ట్స్ ఇలా ఉపయోగపడుతోంది' అన్నాను.
'జ్యోతిషం నేర్చుకున్నావుగా. కనీసం అందరికీ రెమెడీలు చెబుతూ ఉండు. సోషల్ సర్వీసు చేసినట్టు ఉంటుంది' అన్నాడు.
' సర్వీసు పూర్తయింది. ఇక చెయ్యను' అన్నాను.
'పోన్లే నీ ఇష్టంగాని, మా ఫ్రెండ్ ఒకడున్నాడు. ఇంకంటాక్స్ డిపార్ట్ మెంటులో పెద్ద పొజిషన్లో రిటైరయ్యాడు. సంపాదించిందంతా షేర్లలో పెట్టాడు. అంతా పోయింది. మిగిలిన డబ్బుని ఇంకొక ఫ్రెండ్ చేస్తున్న బిజినెస్ లో పెట్టాడు. ఇప్పుడు వాడు వడ్డీ ఇవ్వడంలేదు. అసలుకూడా ఇవ్వడం లేదు. ఏం చెయ్యమంటావో రెమెడీ చెప్పు. ప్లీజ్' అడిగాడు.
'మీ ఫ్రెండ్ ఎక్కడుంటాడు?' అడిగాను.
'కేరళలో' అన్నాడు.
'అక్కడ ముళ్లపెరియార్ డ్యాం అని ఒకటుంటుంది' అన్నాను.
'అయితే?' అన్నాడు అనుమానంగా.
'అందులో దూకి చావమను. భూమికి భారం తగ్గుతుంది' అన్నాను.
'అదేంటి అంత మాటనేశావ్?' అన్నాడు.
'అవినీతి సంపాదన అలాగే పోతుంది. కనీసం కష్టార్జితమైనా తన కుటుంబం కోసం మిగుల్చుకుందామన్న జ్ఞానం లేని దురాశాపరుడికి, ఇదే సరైన రెమెడీ. వెంటనే వెళ్లి దూకమను. లేటైతే వాటర్ లెవల్ తగ్గుతుంది' అన్నాను.
'ఇదా నువ్వు నేర్చుకున్న జ్యోతిషం?' అన్నాడు చనువుగా.
'అవును. దొంగలకు రెమెడీలు చెప్పకూడదని నేర్చుకున్నాను. రిటైరయ్యాక మీ ఫ్రెండ్ గాడికి అంత దురాశ అవసరమా?' అన్నాను.
మాటమార్చి 'నేను ప్రస్తుతం తమిళనాడులో ఉన్నాను. గుళ్ళు తిరుగుతున్నాను' అన్నాడు.
'మంచిదే. నీ ఓపిక' అన్నాను.
'నీకు నాడీజ్యోతిషం వచ్చా?' అడిగాడు.
'వచ్చు' అన్నాను.
'ఈ మధ్యనే నాడీజ్యోతిషం చూపించుకున్నా' అన్నాడు.
'ఎక్కడ? వైదీశ్వరన్ కోయిల్ వెళ్ళావా?' అడిగా.
'కాదు. ఇక్కడే తాంబరంలో. ఇక్కడ వాళ్ళ బ్రాంచి ఉంది. నాకు 80 ఏళ్ళు ఆయుష్షని చెప్పాడు. శివుణ్ణి పూజచేస్తే ఇంకో ఐదేళ్లు ఎక్కువ బ్రతుకుతావన్నాడు. అందుకే తమిళనాడులో శివాలయాలు తిరుగుతున్నా' అన్నాడు.
'అంత కష్టపడి ఇంకో ఐదేళ్లు బ్రతక్కపోతే ఏం?' అన్నాను.
'ట్రై చేస్తే తప్పులేదు కదా?' అన్నాడు.
' అందుకని ఈ ఐదేళ్ళు ఇలా గుళ్ళు తిరుగుతావా?' అడిగాను.
'అంటే?' అన్నాడు.
'అయిదేళ్లకోసం ఐదేళ్ళు గుళ్లు తిరగడం కంటే, ఉన్నచోట ఉండి 80 కి పోవడం బెటరేమో?' అడిగాను.
'నీతో కష్టంరా బాబు' అన్నాడు.
'సరే అదలా ఉంచు. నీక్కూడా ఏదైనా రెమెడీ చెప్పమంటావా?' అడిగాను నవ్వుతూ.
'బాబోయ్. నాకొద్దు నీ రెమెడీలు' అన్నాడు.
'అందుకే ఫోన్ పెట్టెయ్. హైద్రాబాద్ రాను. ఇక ఫోన్లు చెయ్యకండి. మన వాళ్లందరికీ చెప్పు' అని నేనే డిస్కనెక్ట్ చేశాను.
14, అక్టోబర్ 2025, మంగళవారం
కులమా? గుణమా?
ఆశ్రమంలో క్రొత్త బిల్డింగు కడుతున్నాం. పనులు జరుగుతున్నాయి. కట్టుబడికోసం ఇసుకట్రాక్టర్లు వస్తున్నాయి. శిష్యులు ఏవో పనులమీద బయటకెళ్తే నేనే దగ్గరుండి చూస్తున్నాను.
ఒక ట్రాక్టరబ్బాయి ఇలా అడిగాడు.
'ఇదేంటి సార్?'
చూస్తే, పాతికేళ్ళుంటాయి. ముఖంలో నిజాయితీ కనిపిస్తోంది.
'ఆశ్రమం' అన్నాను.
'అంటే?' అన్నాడు
'ఆశ్రమమే' అన్నాను.
'అంటే ముసలోళ్ల ఆశ్రమమా?' అడిగాడు.
'కాదు' అన్నాను.
'అంటే ఇక్కడ ఏం చేస్తారు?' అడిగాడు సంకోచంగా.
'ఏమీ చెయ్యం. ధ్యానమే' అన్నాను.
'అంటే మెడిటేషనా?' ఇంగ్లీషు దొర్లింది.
'అవును. చదువుకున్నావా?' అన్నాను.
'డిగ్రీ చదివాను. అందరికీ నేర్పిస్తారా?' అన్నాడు.
'లేదు. మా వరకే' అన్నాను.
అతను నిరాశపడ్డాడు.
'మాది చిన్నకులం సార్' అన్నాడు నిరాశగా.
జాలేసింది. పల్లెటూళ్ళలో అన్నిటికీ కులం ముందుంటుంది.
'నీకైతే నేర్పిస్తాను. నేర్చుకుంటావా?' అడిగాను.
అనుమానంగా చూశాడు.
'దీనికి కులంతో పనిలేదు నాయనా. దేవుడి దగ్గర కులమేంటి?' అన్నాను.
'అంటే, అందరూ చెప్పరు సార్' అన్నాడు.
'నేను చెప్తాను. నీకు శ్రద్ధ ఉంటే రా, నేర్పిస్తాను' అన్నాను.
'మాది ఫలానా కులం సార్' అన్నాడు.
' దానితో నాకు పని లేదు ' అన్నాను.
'మేం పనులు చేసుకుంటాం సార్. ఆదివారం అయితే రాగలను' అన్నాడు.
'సరే రా' అన్నాను.
'అదేనా మందిరం?' అన్నాడు ధ్యానమందిరం వైపు చూస్తూ.
'అదే. అక్కడే అందరూ. నువ్వూ అక్కడే' అన్నాను.
అతని ముఖంలో సంతోషం కనిపించింది.
'ఎంత కట్టాలి?' అడిగాడు, మళ్ళీ సంశయిస్తూ.
'ఇది బేరాల ఆశ్రమం కాదు. సారాల ఆశ్రమం' అన్నాను.
నమ్మలేనట్లు చూచాడు.
'సరే సార్' అని ట్రాక్టర్ ఎక్కి వెళ్ళిపోయాడు.
నాకు పరిచయస్తులలో ఎంతోమంది పెద్దకులాల వాళ్ళు, బాగా చదువుకున్నవాళ్ళు, బాగా సెటిలైనవాళ్ళు ఉన్నారు. ఎవరూ ఇలా అడగలేదు. వాళ్ళ అహంకారాలు వాళ్లకు అడ్డుగోడలయ్యాయి. వినయానికేమో అదృష్టం పట్టింది.
ఆధ్యాత్మికలోకంలో అహంకారం ఎలా పనిచేస్తుంది? గుంతలోనే నీళ్లు నిలబడతాయి. మిట్టమీదనుండి జారిపోతాయి.
ఇంత చిన్నవిషయం కోట్లాదిమందికి అర్ధం కాదు.
చల్లనిగాలీ, వెన్నెలా, విశాలమైన ప్రకృతీ, ఆరుబయట గుడిసెలో ఉన్నవారికే అందుతాయి గాని, ఆడంబరంగా ఏసీరూముల్లో దాక్కుని ఉండేవారికి ఎలా అందుతాయి?
'ఎవరి అదృష్టానికి ఎవరు కర్తలు?' అనుకున్నాను.
12, అక్టోబర్ 2025, ఆదివారం
గెట్ టుగెదర్
నిన్నమధ్యాన్నం పాతఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు. తనతో మాట్లాడి దాదాపు రెండేళ్లయింది. 2023 లో తిరువన్నామలై వెళ్ళినపుడు చెన్నైలో కలిశాడు. అప్పటికి తనింకా సర్వీసులోనే ఉన్నాడు. ఏడాది క్రితం చెన్నైలోనే రిటైరయ్యాడు. చాలామంది మా కొలీగ్స్ లాగే తనుకూడా హైద్రాబాద్ లో సెటిలయ్యాడు.
'ఏంటి ఉన్నట్టుండి గుర్తొచ్చాను?' అడిగాను.
'ఈ నెల చివరివారంలో మన బ్యాచ్ వాళ్లందరికీ గెట్ టుగెదర్ పెడుతున్నాం. నువ్వూ రావాలి' అన్నాడు.
మా బ్యాచ్ లో అందరికంటే చిన్న కొలీగ్ మొన్న జూలైలో దిగిపోయాడు. దీనితో రైల్వేలో మా బ్యాచ్ అందరూ రిటైరయ్యారు.
ఇలాంటి పార్టీలన్నీ హైదరాబాద్ లోనే పెడుతుంటారు వీళ్ళు. అది మొదటినుంచీ అలవాటు.
'సారీ నేన్రాను' అన్నాను తడుముకోకుండా.
'అదేంటి? ఎందుకలా?' అన్నాడు.
'మీరు మాట్లాడుకునే మాటలు నేను భరించలేను. దానికోసం అంతదూరం రావడం ఎందుకు?' అన్నాను.
'హైదరాబాద్ రావా అసలు?' అడిగాడు.
'నిన్నగాక మొన్న హైదరాబాద్లోనే ఉన్నా' అన్నాను.
'ఏం?' అన్నాడు.
'ఏదో పనిమీద వచ్చాలే' అన్నాను.
'మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా. నేను అత్తాపూర్ లో ఉంటాను. వచ్చి కలిసేవాణ్ని కదా' అన్నాడు.
'మామాపూర్ వద్దన్నాడు' అన్నాను.
'వాడెవడు?' అన్నాడు.
'నేనే. ఎవరికీ చెప్పాలనిపించలేదు. అందుకే ఎవరినీ కలవలేదు. వచ్చిన పనిచూసుకున్నాను. వెనక్కు వచ్చేశాను' అన్నాను.
'మనవాళ్ళని కలవచ్చుగా కనీసం' అన్నాడు.
'నా వాళ్ళని కలిశాను. మనవాళ్లతో నాకెందుకు?' అన్నాను.
పార్టీకి నన్ను ఒప్పించాలని చాలాసేపు ప్రయత్నించాడు. కానీ కుదరలేదు.
'ఆశ్రమం కట్టుకున్నావని విన్నాను' అన్నాడు చివరకు.
'నేను కట్టుకోలేదు. మేస్త్రీలు కట్టారు' అన్నాను.
'అదేలే. ఏం చేస్తుంటావక్కడ?' అడిగాడు కుతూహలంగా.
'నువ్వు మీ ఇంట్లో చేసేదే' అన్నాను.
'దానికోసం అంతదూరం పోవడమెందుకు?' అడిగాడు.
'మనుషులని వెతుక్కుంటూ అడివిలోకి వచ్చాను' అన్నాను.
'ఊరికి దూరమని విన్నాను' అన్నాడు.
'నువ్వు సరిగ్గా వినలేదు. ప్రపంచానికే దూరం' అన్నాను.
'అదికాదు. టైం పాస్ ఎలా అవుతుంది?' అన్నాడు.
చాలామంది అడిగే ప్రశ్న ఇదే.
'మనం పట్టుకోకపోతే, అదే పాసవుతుంది' అన్నాను.
అదేదో పెద్ద జోకులాగ గట్టిగా నవ్వేశాడు.
'పుస్తకాలు చదువుతుంటావేమో?' అడిగాడు.
'రాస్తుంటాను' అన్నాను.
అది వినకుండా, 'నేనొచ్చి నాల్రోజులుంటా మీ ఆశ్రమంలో' అన్నాడు.
'నాలుగు గంటలు కూడా ఉండలేవు' అన్నాను.
'అదేంటి? వస్తానంటే వద్దంటావు?' అన్నాడు నిష్టూరంగా.
'వచ్చాక నువ్వు పడే బాధ చూడలేను కాబట్టి, వద్దంటున్నాను' అన్నాను.
'మనవాళ్లంతా హాయిగా హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీస్ లో సెటిలైతే, నువ్వెందుకు అలా దూరంగా ఉంటున్నావు?' అడిగాడు.
'నా కర్మ' అన్నాను.
'అయితే చూడాల్సిందే మీ ఆశ్రమాన్ని' అన్నాడు.
'నీ కర్మ' అన్నాను.
'గాయత్రిని వదలకు. అప్పట్లో బాగా చేసేవాడివి కదా' అడిగాడు 30 ఏళ్లనాటి సంగతులు గుర్తుచేసుకుంటూ.
'నేను వదల్లేదు. తనే వదిలేసింది' అన్నాను.
'అదేంటి?' అన్నాడు మళ్ళీ.
'సావిత్రి వచ్చిందని గాయత్రి వెళ్ళిపోయింది' అన్నాను.
'ఏంటి అదోలా మాట్లాడుతున్నావ్?' అన్నాడు.
'నిన్న సాయంత్రం నుంచీ పిచ్చెక్కింది' అన్నాను.
'ఇంతకీ పార్టీకి రానంటావ్?' అడిగాడు.
'రానని కాదు. వచ్చి, మిమ్మల్ని బాధపెట్టడం ఎందుకని ఆలోచిస్తున్నాను' అన్నాను.
'ఏంటిరా బాబు. సరిగ్గా చెప్పు' అన్నాడు తల బాదుకుంటూ.
'ఏముందిరా? మీరంతా అక్కడ చేరి ఏం చేస్తారు? తింటారు. తాగుతారు. షేర్లు, కార్లు, ఆస్తులు, ఒక్కొక్కడు ఎన్ని ఇళ్ళు కొన్నాడు, పిల్లలు ఎక్కడ సిటిలయ్యారు, వాళ్లెలా సంపాదిస్తున్నారు, మీమీ గొప్పలు, ఎచ్చులు, ఈగోలు, రంకుపురాణాలు, రాజకీయాలు ఇవేగా మీరు మాట్లాడుకునేవి. ఆ చెత్త నేను వినలేను.
సర్వీసులో ఉన్నపుడు ఒక్కడంటే ఒక్కడు మనుషుల్లాగా బ్రతికార్రా మీరు? సగంమందివి అవినీతి బ్రతుకులు. మిగతా సగంమందివి అర్ధంలేని బ్రతుకులు. ఏముంది మీరు చెప్పేది నేను వినేది? మీ సోది నేను తట్టుకోలేను. నా సోది మీరు తట్టుకోలేరు. ఇంకెందుకు అక్కడకి రావడం?' అడిగాను.
ఫ్రెండ్ గాడు పట్టువదలని విక్రమూర్ఖుడు.
'అయినా సరే ఒకసారి రావచ్చుకదా నా కోసం' అన్నాడు.
'నీకోసమైతే, ఈసారి వచ్చినపుడు చెప్తాను. కలువు. ఎక్కడన్నా డిన్నర్ చేద్దాం. మాట్లాడుకుందాం ' అన్నాను.
'సరే అలాగే. కానీ ఇదికూడా కాదనకు. ప్లీజ్'' అన్నాడు.
పాపం ఇంతగా భంగపోతున్నాడని, చివరికిలా చెప్పాను.
'సరే. వస్తాను. డేటు, వెన్యూ పంపించు. ఆ తర్వాత ఏం జరిగినా నా బాధ్యత లేదు. ముందే చెబుతున్నాను. మళ్ళీ నన్ను అనొద్దు' అన్నాను.
'అమ్మయ్య. ఒప్పుకున్నావ్. నేను మేనేజ్ చేస్తాలే. డోంట్ వర్రీ. నువ్వు రా' అన్నాడు.
'తెలిసి తెలిసి దిగుతున్నావ్. నీ కర్మ' అన్నాను.
ఫ్రెండ్ గాడు ఫోన్ పెట్టేశాడు.
3, అక్టోబర్ 2025, శుక్రవారం
లాభనష్టాలు
పొద్దున్న ఏదో పనిలో ఉండగా, మిత్రుడు రవి ఫోన్ చేశాడు.
అది తన వాకింగ్ టైం.
"నవరాత్రులు బాగా జరిగాయా?" అడిగాడు.
"ఆ. జరిగాయి" అన్నాను.
"పలానా గురువుగారి ఆశ్రమంలో అమ్మవారి పూజలకు, అలంకరణకు బాగా డబ్బులు వసూలు చేశాడు. తెలుసా?" అడిగాడు.
"నాకనవసరం. అలాంటి చెత్త నాకు చెప్పకు" అన్నాను.
నన్ను రెచ్చగొట్టడం రవికి సరదా. నేనేదైతే వద్దంటానో అవే చెబుతూ ఉంటాడు.
"అలాకాదు. అమ్మవారికి అలంకరణ చెయ్యాలి, పూజలు చెయ్యాలి. డబ్బులు పంపండి, పంపండి' అని శిష్యుల వెంటపడి మరీ అడుక్కున్నాడు. బాగానే పోగయ్యాయిట మొత్తంమీద" అన్నాడు.
గతంలో ఆయన దగ్గర ఏదో అమ్మవారి మంత్రాన్ని ఉపదేశం పొందాడు రవి. ప్రస్తుతం ఇద్దరికీ చెడింది. కానీ వదలకుండా వాళ్ళ న్యూసు మాత్రం సేకరిస్తూ ఉంటాడు.
'ఇంతకీ ఏమంటావ్?' అన్నాను.
'నువ్వు కూడా అలా చేస్తే బాగుంటుందేమో?', అన్నాడు.
'అలంకరణ నేనే చేసుకోను, ఇక అమ్మవారికేం చేస్తాను?' అన్నాను.
'ఇంత సమయాన్ని ఇతరులకోసం వెచ్చిస్తున్నందుకు నీకు లాభం ఉండాలి కదా?" అన్నాడు.
' అలాంటిదేమీ ఉండదు. ఇక్కడ ఎవడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు. అంతే ' అన్నాను.
'మరి నీ శిష్యులకైనా ఏదో ఒక లాభం ఉండాలి కదా?' అడిగాడు.
'ఉంటుంది. అది డబ్బుతో కొలవబడేది కాదు' అన్నాను.
' ఇలా అయితే నీ దగ్గరకెవరొస్తారు? ' అన్నాడు.
' రమ్మని ఎవడు దేబిరిస్తున్నాడు?' అన్నాను.
' అదికాదు. లాభం లేకుండా ఎలా? ' మళ్ళీ అడిగాడు.
'లాభనష్టాలను దాటి ఆలోచించలేవా?' అడిగాను.
'ఎలా? జీవితమంతా అవేగా?' అన్నాడు.
'లాభం కోరుకుంటే నష్టం. నష్టం అనుకోకపోతే లాభం' అన్నాను.
' నీ ధోరణి నీదేగాని నా మాటవినవు కదా? ' అన్నాడు.
' నువ్వు వాకింగ్ మానేసి యోగాభ్యాసం చెయ్యమంటే చెయ్యవు కదా?' అన్నాను.
'బై' అంటూ ఫోన్ పెట్టేశాడు రవి.
2, అక్టోబర్ 2025, గురువారం
గర్భగుడి
'అష్టమి నాడు దర్శనానికి 8 గంటలు పట్టిందట?' అన్నాడు శిష్యుడు మొన్న.
'ఎక్కడ?' అడిగాను.
'విజయవాడ కనకదుర్గా అమ్మవారి గుడిలో' అన్నాడు.
'అలాగా' అన్నాను.
'మనకేంటో ఇక్కడ? అసలివాళ ఏ తిథో కూడా తెలీడం లేదు' అన్నాడు.
నవ్వాను.
'గుడిని దాటాకే గర్భగుడి' అన్నాను.
మా 74 వ పుస్తకం 'యోగినీ హృదయము' విడుదల
1, అక్టోబర్ 2025, బుధవారం
పూర్ణాహుతి
చాలారోజులనుంచీ తెలిసిన ఒక పెద్దాయన ఇవాళ ఫోన్ చేశాడు. ఆయనకు 75 పైనే ఉంటాయి.
కుశలప్రశ్నలయ్యాక, విషయంలోకొచ్చాడు.
'రేపు మా ఇంట్లో చండీహోమం పూర్ణాహుతి చేస్తున్నాము. మీరు రావాలి' అన్నాడు.
'అవడానికా?' అడిగాను.
'అదేంటి?' అన్నాడు.
అర్ధం కాలేదని అర్ధమైంది.
'పోయినేడాది కూడా చేసినట్టున్నారు హోమం?' అన్నాను.
'అవునండి. చేశాము' అన్నాడు.
'అప్పుడివ్వలేదా?' అడిగాను.
'ఇచ్చాము' అన్నాడు.
'మరి ఇంకెందుకు?' అన్నాను.
'అంటే?' అన్నాడు.
'ఒకసారి పూర్ణంగా ఆహుతయ్యాక మళ్ళీ అవ్వడానికి ఇవ్వడానికి ఇంకేం మిగిలుంటుంది?' అన్నాను.
ఏదో గొణుక్కుంటూ ఫోన్ పెట్టేశాడు పెద్దాయన.
నవరాత్రులు మళ్ళీ నవ్వుతున్నాయి.
30, సెప్టెంబర్ 2025, మంగళవారం
పదకొండో అవతారం
పొద్దున్నే ఫ్రెండ్ ఫోన్ చేశాడు.
'ఈ వార్త విన్నావా?' అన్నాడు సంభ్రమంగా.
'ఏంటది?' అన్నాను.
'ఈ ఏడాది అమ్మవారికి పదకొండో అవతారం వచ్చింది' అన్నాడు.
'ఏం? పది సరిపోలేదా?' అన్నాను నిరాసక్తంగా.
'అవును. ఈ ఏడాది పదకొండు తిథులొచ్చాయి. అందుకే పదకొండు అవతారాలు' అన్నాడు.
'బాగుంది నీ అవతారం' అన్నాను.
'నువ్విలాంటివేవీ చెయ్యవు కదా. నీకు తెలీదులే' అన్నాడు.
'అసలు అమ్మవారంటే ఏంటో తెలిస్తే ఇన్ని అవతారాలతో పనుండదు' అన్నాను.
'అదేంటి?' అన్నాడు.
'పోనీ నీ అవతారమేంటో తెలుసుకున్నా, ఇన్ని అవతారాలతో పనుండదు' అన్నాను.
'ఇదీ అర్ధం కాలేదు' అన్నాడు.
'ఫోన్ పెట్టేసి నీ వ్యాపారం నువ్వు చేసుకో' అన్నాను.
'నాకేం వ్యాపారం లేదు' అన్నాడు.
'పోనీ ఇంకొకరి వ్యాపారంలో సమిధవై పో' అన్నాను.
ఫ్రెండ్ ఫోన్ పెట్టేశాడు.
నవరాత్రులు మళ్ళీ నవ్వుతున్నాయి.
29, సెప్టెంబర్ 2025, సోమవారం
మైకుకు మోక్షం
నిన్న రాత్రి ఏదో పనుండి ప్రక్క పల్లెకెళ్ళాను
ఆ టైములో కూడా, ఒక గుడిపైన మైకు జోరుగా మ్రోగుతోంది.
ఏవో జానపద భక్తిగీతాలు పెద్ద సౌండుతో వినవస్తున్నాయి
గుడిలో ఒక్క పురుగు లేదు.
అమ్మవారు అయోమయంగా చూస్తోంది.
'నవరాత్రుల మైకు' అన్నది ప్రక్కనున్న శిష్యురాలు
'నాల్రోజుల్లో దానికి మోక్షం గ్యారంటీ' అన్నాను ఏడుస్తున్న ప్రశాంతతను చూస్తూ.
22, సెప్టెంబర్ 2025, సోమవారం
నవ్వుతున్న నవరాత్రులు
ప్రక్కఊరినుండి అప్పుడపుడు కొంతమంది ఏదో పనిమీద ఆశ్రమానికి వస్తూ ఉంటారు. వారిలో ఒకతను ఈ మధ్యన ఇలా అడిగాడు.
'ప్రతి ఏడాది మా గుడిలో నవరాత్రులు చేస్తాము. మీరూ ఆశ్రమంలో చేస్తారా?'
'రాత్రులను మనం చేసేదేముంది? అవే వచ్చిపోతుంటాయి' అన్నాను.
షాకయ్యాడు.
'అంటే, అమ్మవారికి ప్రత్యేకపూజలు ఏవీ చెయ్యరా?' అడిగాడు అనుమానంగా.
'ప్రత్యేకంగా చేసేది పూజ ఎలా అవుతుంది?' అన్నాను.
అయోమయంగా చూచాడు.
'మరి నైవేద్యాలు?' భయంగా అడిగాడు.
'కాలానికి మనం అవుతున్నాంగా ప్రతిరోజూ - నైవేద్యం' అన్నాను.
కాసేపు మాటరాలేదు.
'మరి మైకులు భజనలు ఉండవా?' అన్నాడు.
'అమ్మవారికి చెవుడు లేదు. ఆమెకు భజనపరులు నచ్చరు' అన్నాను.
అతను లేచి వెళ్ళిపోయాడు.
నవరాత్రులు నవ్వుతున్నాయి.
18, సెప్టెంబర్ 2025, గురువారం
కోట్లాదిదేశభక్తుల వేలాది సంవత్సరాల కలల ప్రతిరూపం - నరేంద్రమోదీ గారు
146 కోట్ల ప్రజలు. అంతకంటే ఎక్కువ సమస్యలు.
దేశంనిండా దేశద్రోహులు. నల్లడబ్బు, అవినీతికంపు. సొంతదేశాన్ని బలహీనపరచి విదేశాలకు అమ్మేయాలని ప్రయత్నించే రాజకీయశక్తులు. వాటికి విదేశీసహాయాలు, వీరిని గుడ్డిగా నమ్మే పిచ్చిజనాలు, సరిహద్దు గొడవలు, దేశద్రోహపార్టీలు, వర్గవిభేదాలు, కులవిభేదాలు, అవకాశవాదాలు, మతమార్పిడులు, జిహాద్ లు, కమ్యూనిష్టు విషప్రచారాలు, టెర్రరిస్టుల దాడులు, కుట్రలు, కుతంత్రాలతో రకరకాలుగా చీల్చబడుతూ సర్వనాశనం దిశగా శరవేగంగా పోతున్న దేశం.
ఇలాంటిస్థితిలో దేశపగ్గాలు చేపట్టారు మోదీగారు.
ఆయనకు కుటుంబం లేదు.
ఒకప్పుడు ఉండేది, దేశంకోసం కుటుంబాన్ని వదులుకున్నారు.
ఆయనకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు.
కోట్లకు కోట్లు నల్లధనం లేదు.
ఆయన తినేది చాలా తక్కువ. అదికూడా పూర్తి శాకాహారం.
నిద్రపోయేది రోజుకు 3 గంటలు.
దేశంకోసం కష్టపడేది 21 గంటలు.
ఏడాదిలో ఎక్కువరోజులు ఉపవాసదీక్షలు. నేలమీద నిద్రిస్తారు.
విలాసాలు లేవు. సరదాలు లేవు. ఇతర వ్యాపకాలు లేవు.
క్రమశిక్షణతో కూడిన జీవితం.
ఉన్నతమైన ఆదర్శాలతో కూడిన ఆలోచనావిధానం.
75 ఏళ్ల వయసులో కూడా అలసిపోని దేహం.
చెరిగిపోని చిరునవ్వు.
తను ఏ దేశంకోసం పాటుపడుతున్నాడో, అదేదేశంలో దాదాపు సగంమంది తనను వ్యతిరేకించినా, ఆ వ్యతిరేకతకు మతపిచ్చి తప్ప ఏ ఇతరకారణమూ లేకపోయినా, చెదరని సంకల్పశక్తి.
వారికి కూడా అభివృద్ధి ఫలాలను, ఫలితాలను సమానంగా అందించే ఉదారత్వం.
అదీ నరేంద్రమోదీగారు !
పదేళ్లు తిరిగాయి.
ఒకప్పుడు అన్నిదేశాల దగ్గరా అప్పులు చేసిన దేశం, ఈనాడు అన్ని అప్పులూ తీర్చేసింది. చిన్నదేశాలను ఆదుకునే స్థితికి ఎదిగింది.
నేడు మనదేశం అన్ని రంగాలలో ముందుకు పోతూ, అగ్రరాజ్యాల బెదిరింపులకు లొంగకుండా, వాటికే షరతులు విధిస్తూ, వాటితో సమానంగా అంతర్జాతీయ వేదికలపైన నిలబడిందంటే - నరేంద్రమోదీ గారు మాత్రమే కారణం !
'సన్యాసి రాజ్యపాలన చేస్తాడు' అని వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాసింది ఈయన గురించే.
మోదీగారు కాషాయవస్త్రాలు కట్టుకోనక్కరలేదు. కానీ, ఆయన ఏ పీఠాధిపతికీ, ఏ స్వామీజీకి తక్కువ కాదు. నిజానికి వాళ్లలో చాలామంది ఈయన కాలిగోటికి కూడా ఏమాత్రమూ సరిపోరు.
కారణం?
వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు హాయిగా చేసుకుంటున్నారు.
ఈయన దేశంకోసం పాటుపడుతున్నాడు.
ఎవరు ఎక్కువ?
దేశం బాగుంటే కదా మతం, ధర్మం బాగుండేది?
చట్టం సరిగ్గా ఉంటేకదా మఠాధిపతులైనా, మతాధిపతులైనా, నిర్భయంగా తిరగగలిగేది?
మోదీగారు ఒక రాజర్షి.
జనకమహారాజు గురించి మనం చదివాము. శివాజీ మహారాజు గురించి చదివాము. గురు గోవింద్ సింగ్ గురించి చదివాము. ఇప్ప్పుడు మోదీగారిలో వారందరినీ చూస్తున్నాము.
ఇటువంటి రాజర్షి, ఇటువంటి కర్మయోగి మన ప్రధానమంత్రిగా ఉండటం కోట్లాది భారతీయుల పుణ్యఫలం.
ఎంతమంది దేశభక్తుల ఎన్నివేల ఏళ్ల ప్రార్ధనల ఫలితమో ఈనాడు ఈ రాజర్షి మన దేశసారధి అయ్యాడు.
ఈయనకు నిన్న 75 ఏళ్ళు నిండాయి.
ఇంకా 25 ఏళ్ళు, నిండునూరేళ్ళు, ఈయన ఇదేవిధంగా జీవించాలని, దేశాన్ని మున్ముందుకు నడిపించాలని, మన దేశపు పూర్వవైభవాన్ని మళ్ళీ ఆవిష్కరించాలని, పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను.
మనదేశంలో వేలాదిసంవత్సరాలుగా పుట్టిన అందరు మహనీయుల ఆశీస్సులూ ఈయనపైన ఉండుగాక !
పరమేశ్వరుని కటాక్షం ఈయనపైన పరిపూర్ణంగా ఉండుగాక !
జై మోదీజీ ! జై భరతమాత ! జై హింద్ !
15, సెప్టెంబర్ 2025, సోమవారం
దీపపు కుదురు
అయితే,
ఎర్రజెండా మొండి మనుషులు
లేకపోతే,
తురకబాబా మూఢభక్తులు
కాకపోతే,
కొలుపులు, బలుపులు, బలులు
ఇంకా చాలకపోతే,
కోరికల భజనలు, దీక్షలు, పూజలు
అదీకాదంటే,
పిరమిడ్లు, సమాధుల దొడ్లు, సూక్ష్మలోక ప్రయాణాలు
ఇదీ ఒంగోలు చుట్టుప్రక్కల గోల . . .
మనుషుల అజ్ఞానం ఎంత దట్టంగా ఉందంటే
చిమ్మచీకటి కూడా దీనిని చూచి సిగ్గుపడుతోంది
చెవిటివాడికి శంఖం ఊదటం ఎలాగో
వీరికి అసలైన ఆధ్యాత్మికత నేర్పడం అలాగ
అందుకే,
ఒంగోలు బుక్ ఎగ్జిబిషన్లో మా బుక్ స్టాల్
ఇదే మొదటిసారి,
ఇదే చివరిసారి కూడా
ఎడారిలో చిరుదీపం వెలుగుతోంది
దాని వెలుగు చాలా దూరానికి ప్రసరిస్తోంది
కానీ కుదురుదగ్గర మాత్రం
చీకటిగానే ఉంది.
ఏ దీపమైనా ఇంతేనేమో?
8, సెప్టెంబర్ 2025, సోమవారం
ఏడవ రిట్రీట్ విశేషాలు
ఏడవ ఆధ్యాత్మిక సాధనాసమ్మేళనం ఈనెల 5 వ తేదీ నుండి 7 వ తేదీ వరకు పంచవటి ఆశ్రమప్రాంగణంలో జరిగింది.
ఊకదంపుడు ఉపన్యాసాలకు, సోదికబుర్లకు పూర్తివ్యతిరేకదిశలో సాగుతున్న మా నడక, ఉత్త థియరీని వదలిపెట్టి, ఆచరణాత్మకమైన ఆధ్యాత్మికమార్గంలో శరవేగంతో ముందుకు పోతోంది.
సాధనామార్గంలో పురోగమిస్తున్న శిష్యులకు ఆశీస్సులనందిస్తూ, ఉన్నతస్థాయికి చెందిన ఒక ధ్యానవిధానంలో వీరికి దీక్షనిచ్చాను. అందుకున్నవారు అదృష్టవంతులు. వీరిలో ఒక 13 ఏళ్ల చిన్నపిల్ల కూడా ఉన్నది. ఇంత చిన్నవయసులో ఇటువంటి దీక్షను పొందటం ఈమె అదృష్టం. ఏమంటే, అసలైన హిందూమతం ఇదే. అసలైన సనాతన ధర్మమార్గం ఇదే. కోట్లాదిమందికి 83 వచ్చినా ఇది దొరకదు. అలాంటిది 13 ఏళ్ల వయసులో ఇది లభించడం అదృష్టం కాకపోతే మరేమిటి?
నిజానికి, సాధన మొదలుపెట్టవలసింది ఈ వయసులోనే. దైవకటాక్షంతో లభించిన ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోమని వారికి గుర్తుచేస్తున్నాను.
మూడురోజులపాటు బయటప్రపంచాన్ని మర్చిపోయి ఆశ్రమంలోని ప్రశాంతవాతావరణంలో సాధనలో సమయాన్ని గడిపిన శిష్యులందరూ తిరిగి వారివారి ఇళ్లకు ఈ రోజు ఉదయానికి చేరుకున్నారు.
తిరిగి డిసెంబర్ లో జరుగబోయే సాధనాసమ్మేళనంలో కలుసుకుందామనిన సంకల్పంతో ఈ రిట్రీట్ విజయవంతంగా ముగిసింది.
మనుషులనేవారు కనిపించడం అరుదైపోయిన ఈ రొచ్చుప్రపంచంలో, కనీసం కొంతమందినైనా నిజమైన మనుషులను తయారు చేయగలుగుతున్నానన్న సంతృప్తిని నాకు మిగిల్చింది.
15, ఆగస్టు 2025, శుక్రవారం
ఒంగోలు పుస్తక మహోత్సవం - 2025 లో మా స్టాల్
పంచవటి ఆశ్రమాన్ని గురించి, మా భావజాలాన్ని గురించి, అసలైన హిందూమతాన్ని గురించి తెలుసుకోవడానికి ఒంగోలు చుట్టుప్రక్కల ఉన్నవారికి ఇది సువర్ణావకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.







.jpeg)


