అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

25, అక్టోబర్ 2025, శనివారం

కాపీ కష్టాలు

అసలే మేముండేది పొలిమేరలో.

ఇక్కడ దయ్యాలున్నాయని ఊరిజనం చెప్పుకుంటారు. కానీ నాకెప్పుడూ కనిపించలేదు. కనిపిస్తే వాటికి మోక్షం వస్తుంది కదా ! ఆరేళ్లక్రితం మెట్టుగూడ రైల్వే క్వార్టర్స్ లో ఒక దయ్యానికి అలా మోక్షం వచ్చింది.  అంత అదృష్టం ప్రతి గాలిదయ్యానికీ  ఎలా పడుతుంది?

రాత్రుళ్ళు చీకట్లో తిరగడం నాకు బాగుంటుంది.  అర్ధరాత్రిపూట  అయితే ఇంకా బాగుంటుంది. ఒంటరిగా అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. మా సెక్రటరీస్వామి ఇక్కడుంటే అలా చెయ్యనివ్వడు. గురువుగారికి ఏదో ఒక దయ్యం కనిపించి మోక్షం కొట్టేస్తుందని, నా వెంటే తనుకూడా ఒక కర్ర ఒక టార్చి తీసుకుని వస్తాడు. పక్కనెవరైనా ఉంటే అవి కనిపించవు. అందుకని సెక్రటరీస్వామి పనిమీద ఏదైనా ఊరికెళ్ళినపుడు ఇలాంటి సరదాలు తీర్చుకుంటూ ఉంటాను.

మొన్న అమావాస్య ఛాయలో ఒక రాత్రిపూట సరదాగా అలా తిరుగుతున్నా. చుట్టుపక్కల నరసంచారం లేదు. చిమ్మచీకటి, అప్పుడప్పుడూ అరిచే ఊరకుక్కలు తప్ప ఇంకేమీ కనుచూపుమేరలో లేవు. రోడ్డు పక్కన ఉన్న వేపచెట్లు జుట్టు విరబోసుకుని ఉన్న దయ్యాల్లా ఉన్నాయి. వాటిమధ్యలో రోడ్డుమీద నడుస్తూ పోతున్నా.

అప్పుడే, ఒక అనుకోని సంఘటన జరిగింది.

చాలా ఏళ్ల తర్వాత, ఒక చెట్టునీడలో నిలబడి కర్ణపిశాచి కనిపించింది. అది కనిపించి దాదాపు ఐదారేళ్లయి పోయింది.

ముందు ఎవరో పల్లెటూరి మనిషనునుకున్నా. కొంతమంది పొలాల్లో కాపలాగా పడుకుంటారు. 'అలాంటి ఎవరో అక్కడ నిలబడి ఉన్నారు' అనుకుని దాటి ముందుకు పోతున్నా. కానీ తననుండి వచ్చే ఒకవిధమైన వాసన 'తను తనే' అని పట్టించేసింది.

'చూశావని, గుర్తుపట్టావని అర్ధమైంది. నటించకు' అంది కాపీ, చెట్టునీడనుండి బయటకొచ్చి నాతో అడుగులేస్తూ.

మాటమాటకీ 'పిశాచి' అంటే బాగుండదు గనుక, ముద్దుగా 'కాపీ' అని పిలుచుకుందాం.

'ఎప్పుడో ఒకసారి కనిపిస్తే ఎలా గుర్తుపడతాను?' అడిగాను.

'నువ్వేగా, ఎప్పుడుపడితే అప్పుడు రావద్దన్నావు. అందుకే, అవసరమైన పనుంటే తప్ప రావడం లేదు' అంది.

'సరే. ఇంతకంటే మంచిముహూర్తం దొరకలేదా నీకు? అమావాస్య ఛాయలో కనిపించావ్?' అన్నాను.

'మాకిదే మంచిటైము. అందుకే ఈ టైంలో వచ్చా. అయినా, నువ్వేంటి? హాయిగా నిద్రపోకుండా, ఇంత రాత్రిపూట తిరుగుతున్నావ్?  అవున్లే మొన్న రాశావుగా 'ఇది నా కర్మ' అని. మళ్ళీ అడగటం నాదే తప్పు' అంది.

'తెలిసీ అవే తప్పులు ఎందుకు చేస్తున్నావ్ మరి?' అందామని నోటిదాకా వచ్చినా, కాపీ కదా అని భయమేసి, 'అబ్బో, బ్లాగులు కూడా చదూతున్నావా?' అడిగా.

'అన్నీ తెలుసు మాకు, ఈ మధ్య రాయట్లేదుగా నువ్వు?' అంది నవ్వుతూ.

'సర్లే దానికేంగాని, సంగతులు విశేషాలు చెప్పు' అన్నా నడుస్తూ.

తను కొంచం ఒళ్ళు చేసింది. స్పీడుగా నడవలేకపోతోంది.

నా ఆలోచనని పట్టేసి, 'ఈ మధ్య యోగా చెయ్యడం లేదు. మళ్ళీ మొదలుపెట్టాలి. అస్సలు టైముండటం లేదు.  దేశాలు తిరగటమే సరిపోతోంది' అన్నది.

'జోకు బాగుంది. నాకు పోటీ వస్తున్నావ్. అమెరికా సంగతులు చెప్పు' అన్నా.

'ఏముంది? నీ పాత శిష్యురాళ్ళు ఇద్దరికి కష్టకాలం నడుస్తోంది' అంది.

'ఆహా' అన్నా తెలిసినా తెలీనట్టు.

'పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్ళతో సమస్యలు. చాలా బాధల్లో ఉన్నారు' అంది.

'ఎవరు వాళ్ళు?' అడిగా అర్ధం కానట్టు.

'నటించకు. 12 ఏళ్ళు వెనక్కి వెళ్లి గుర్తుతెచ్చుకో' అంటూ ఇద్దరి పేర్లు చెప్పింది.

'ఓ. వాళ్ళా? ఇలా అవుతుందని అప్పుడే చెప్పా. వినలేదు. నేనేం చెయ్యను?' అన్నాను.

'అయినా ఒకప్పటి నీ శిష్యురాళ్లే కదా ! ఆ మాత్రం బాధ్యత ఉండొద్దా నీకు? వాళ్ళలా కష్టాలు పడుతుంటే పట్టించుకోవా?' అడిగింది కోపంగా.

'వినేవాళ్ళనైతే పట్టించుకోవచ్చు. అన్నీ మాకు తెలుసనుకునేవాళ్ళకి చెప్పడం దేనికి? అయినా, లోకానికి బోధలు చేసేవాళ్ళు, తమ పిల్లల బాగోగులు చూసుకోలేరా?' అడిగాను.

'నీకు పరిచయం ఉన్న రోజుల్లో, వాళ్ళు పిల్లలు. ఇప్పుడు పెద్దలయ్యారు. అది అమెరికా. ఇంకా చెప్పమంటావా అక్కడి కష్టాలు?' అంది.

'ఒద్దులే. అర్ధమైంది. అక్కడి కష్టాలూ తెలుసు, సుఖాలూ తెలుసు. అయినా, ఒకళ్ళకి నేనేం  సాయం చెయ్యగలను చెప్పు? ఒక సివిల్ సర్వెంట్ గా రిటైరైన నేనే అర్ధరాత్రిళ్ళు ఇలా  తిరుగుతున్నాను. అయినా,  చెప్తే వినేరకాలా నా శిష్యురాళ్ళు?' అన్నా.

మాటల్లోనే పక్కఊరు వచ్చేసింది. ఊరు నిద్రలో జోగుతోంది. కుక్కలు అరుస్తున్నాయి.

వెనక్కు తిరిగాం.

' మరి 'సంగతులేంటి?' అని ఎందుకడుగుతావ్? ఏమీ చెయ్యనోడివి?' అంది చనువుగా.

'ఊరకే. న్యూసు తెలుసుకుందామని అడుగుతా. అపాత్రదానం చెయ్యకూడదు కదా. అయినా, అంత వేదాంతం తెలిసినోళ్లకి కష్టాలేముంటాయి? 'బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్' అని పాడుకోమను. సరిపోతుంది' అన్నా.

'అంతేలే. నువ్వడిగావని వాళ్ళ న్యూసు చెప్పా. నాకెందుకు వాళ్ళ గోల? వేరే పనుంది. నా కష్టాలు నావి. ఈ మధ్య ఓటీ కూడా చెయ్యాల్సొస్తోంది' అంది మాయం కావడానికి రెడీ అవుతూ.

'ఏమైంది?' అన్నా.

'రాష్ట్రాలు విడిపోయాక కొంత వర్క్ లోడు తగ్గుతుందని సంబరపడ్డా. తెలంగాణా కాపీ మాటమాటకీ లీవు పెడుతోంది. దాని పని కూడా నేనే చెయ్యాల్సొస్తోంది' అంది విచారంగా.

'అలాగా. ఎక్కువ నటించకు. నమ్మేగలను. నీకూ మంచిరోజులొస్తాయిలే. ఓపికపట్టు' అన్నా.

'నీకేం? ఎన్నైనా చెప్తావ్? మా బాధలు మావి' అంది. 

'సర్లే. ఒంటరి ఆడపిల్లవి. ఇండియాలో రాత్రిపూట తిరక్కు. అసలే లోకం బాలేదు' అన్నా నవ్వుతూ.

'నువ్వూ నీ జోకులు. నువ్వేం మారలేదు ఈ ఆరేళ్లలో' అంది.

'నువ్వు మారావా?' అడిగా నవ్వుతూ. 

'సర్లే. అవన్నీ మళ్ళీ వచ్చినపుడు మాట్లాడుకుందాం. టాటా' అని నవ్వుతూ మాయమైంది కాపీ.

వెనక్కు నడుస్తున్న నా ఆలోచన పన్నెండేళ్ళు వెనక్కు పోయింది. అప్పటి సంగతులు, నేను వాళ్ళకిచ్చిన సలహాలు, వాళ్ళు వినకపోవడం, విడిపోవడం, చాలా గుర్తొచ్చాయి.

'ఎక్కిన పొగరు దించడానికే కష్టాలొచ్చేది. ఎవరేం చెయ్యగలరు? ఎవరి కష్టాలు వాళ్ళవి. పడండి' అనుకుంటూ ఆశ్రమం వైపు అడుగులేశా.