అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

2, అక్టోబర్ 2025, గురువారం

మా 74 వ పుస్తకం 'యోగినీ హృదయము' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 74 వ పుస్తకంగా 'యోగినీ హృదయము' అనే ప్రాచీన తంత్రగ్రంధమునకు నా వ్యాఖ్యానమును 
ఈ నవరాత్రులలో విడుదల చేస్తున్నాను. ఇది దాదాపు 1000 సంవత్సరాల నాటి ప్రాచీనగ్రంధము. దీనికి నిత్యాహృదయమని, సుందరీహృదయమని పేర్లున్నాయి.

శ్రీయంత్రములో నవావరణలున్నాయి. ఆయా ఆవరణదేవతలను యోగినులంటారు. వారిపేర్లు ఖడ్గమాలాస్తోత్రంలో వస్తాయి. ఆ యోగినుల యొక్క ఉపాసనను ఏ విధముగా చేయాలనిన సారమును వివరిస్తుంది గనుక, ఈ గ్రంధమునకు 'యోగినీ హృదయమని' పేరు పెట్టబడింది.  

ఇది వామాచార శ్రీవిద్యోపాసనకు చెందినది. వామకేశ్వర తంత్రములోని ఒక భాగమని కొందరు పండితుల నమ్మిక కాగా, ఇది ప్రత్యేకమైన గ్రంథమని, వామకేశ్వర తంత్రమునకు దీనికి సంబంధం లేదని మరి కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇది వామాచార శ్రీవిద్యోపాసనా గ్రంధమే. దీనిలో మన్మధోపాసితమైన కాదివిద్య చెప్పబడింది.

ఈ గ్రంధములో మూడు అధ్యాయములున్నాయి. అవి, చక్రసంకేతము, మంత్రసంకేతము, పూజాసంకేతములనిన పేర్లతో ఉన్నాయి. శ్రీచక్రముయొక్క వివిధ ఆవరణలు, వాటి అర్ధములు మొదటి అధ్యాయములో ఉన్నాయి. మంత్రభాగము, చక్రేశ్వరీ దేవతల వివరణ, ఆయా మంత్రార్ధములు రెండవ అధ్యాయంలో ఉన్నాయి.  శ్రీచక్రమును వామాచారపద్ధతిలో ఏ విధముగా పూజించాలనిన వివరము మూడవ అధ్యాయంలో ఇవ్వబడింది.

ఎన్నో తంత్రరహస్యముల సమాహారమైన ఈ గ్రంధాన్ని విజయదశమి నాడు విడుదల చేయడం కాకతాళీయం కాదని నేను భావిస్తున్నాను. ఈ గ్రంధాన్ని వ్రాసి, ప్రచురించే పనిలో సహాయపడిన నా శిష్యులందరికీ ఆశీస్సులు. 

'ఈ - బుక్' ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

శ్రీవిద్యోపాసకులకు, శాక్తతంత్రాభిమానులకు, నా వ్యాఖ్యానం ఆనందాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను.