అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

28, అక్టోబర్ 2025, మంగళవారం

భయం భయం

ఒకాయన నుంచి ఈ మధ్యనే మెయిలొచ్చింది.

'నాకు మీ బుక్స్ చాలా నచ్చాయి. మీ బ్లాగు కూడా చదువుతూ ఉంటాను. పాత పుస్తకాలలో మీ ఫోన్ నంబర్ దొరికింది. కానీ మీతో మాట్లాడాలంటే భయం భయంగా ఉంది' అని దాని సారాంశం.

'ఏం భయం లేదు. ఫోన్ చెయ్యండి. మాట్లాడతా' అని రిప్లై ఇచ్చాను.

కాసేపటికి ఫోనొచ్చింది.

గొంతు నిజంగా భయం భయంగానే ఉంది.

పరిచయాలయ్యాక, 'ఎందుకు మీకు భయం?' అడిగాను.

'ఏం లేదు. మీతో ఏది మాట్లాడినా బ్లాగులో రాసేస్తారని కొంతమంది మా ఫ్రెండ్స్ చెప్పారు. మరి, మా పర్సనల్స్ ఏవైనా అడగాలంటే భయంగా ఉంది. నావి రాయరు కదా?' అన్నాడు.

'చూడు బాబు. నాకిప్పటికి కొన్ని వేలమంది ఫోన్లు చేసి ఉంటారు. లేదా మెయిల్స్ లో కాంటాక్ట్ చేసి ఉంటారు. వాళ్ళలో చాలామంది తమ పర్సనల్సు నాతో చెప్పారు. నువ్వు నా బ్లాగు చదువుతున్నానని చెప్పావు కదా? ఎంతమంది పర్సనల్స్ బ్లాగులో వ్రాశానో చెప్పు.' అడిగాను.

'ఏమో. లెక్కపెట్టలేదు. కొంతమందివి వ్రాశారు' అన్నాడు.

'నీకు నిజంగా నాతో అవసరం ఉందనుకో. లేదా మంచిగా మాట్లాడుతున్నావనుకో. అప్పుడెందుకు రాస్తాను? అలాంటప్పుడు  నీక్కావలసినది నా దగ్గర దొరుకుతుంది.  అలాకాకుండా, పెడవాదన పెట్టుకొని, నాకే బోధిస్తూ, కలర్స్ చూపించబోతే అప్పుడు మాత్రమే రాస్తాను. గతంలో నేను వ్రాసినవన్నీ అలా వ్రాసినవే. ఆ తర్వాత, వాటిని తొలగించాను కూడా. అందరి పర్సనల్సూ  పబ్లిగ్గా వ్రాయవలసి అవసరం నాకేంటి? అదేమైనా రామాయణమా మాటమాటకీ రాయడానికి?' అడిగాను.

'అదే, చాలాసార్లు నా డౌట్స్ అడగాలనిపిస్తుంది. మళ్ళీ భయమేసి ఆగిపోతున్నా' అన్నాడు.

తర్వాత చాలాసేపు తన కష్టాలు, ఫేమిలీ విషయాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. తగిన సూచనలిచ్చాను.

చివరిలో ఫోన్ పెట్టేయబోయేముందు ఇలా అన్నాను.

'చూడు. నువ్వు మాట్లాడిన విషయం మాత్రం బ్లాగులో రాస్తాను. నువ్వే చూసుకో. అప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది'.

'అదేంటి? రాయనన్నారుగా?' అన్నాడు.

'రాయకపోతే నీ భయం ఎలా పోతుంది? అందులో నీ పర్సనల్స్ ఏవీ ఉండవు. భయపడకు.' అని ఫోన్ కట్ చేశాను.

జరిగిన విషయాలు ఎక్కడో ఒకచోట రికార్డ్ చేయకపోతే, రేపన్నరోజున ఎవరికి గుర్తుంటాయి మరి?