మొన్న మధ్యాన్నం ఒకాయన్నుంచి వాట్సాప్ కాలొచ్చింది.
ఎవరో చూద్దామని ఎత్తాను.
పరిచయాలయ్యాక, 'నేను పిరమిడ్ చేస్తుంటాను' అన్నాడు.
వడ్రంగేమో అనుకుని, 'మాకు ప్రస్తుతం చెక్కపని అవసరం లేదు' అన్నాను.
అవతలనుంచి కాసేపు సైలెన్స్.
'అది కాదు, మెడిటేషన్' అన్నాడు సీరియస్ గా.
'ఓహో అదా? సరే. నాకెందుకు ఫోన్ చేశారు?' అడిగాను.
'మీరు ఫోర్తు లెవల్లో ఉన్నారు. ఫిప్త్ లెవల్ ఇనీషియేషన్ ఇవ్వమని మా గురువుగారు చెప్పారు. అందుకే ఫోన్ చేస్తున్నాము' అన్నాడు గంభీరంగా.
'ఎవరాయన? అడిగాను.
పేరు చెప్పాడు.
'ఆయన పోయాడుగా?' అడిగాను.
'కలలో కనపడి చెప్పారు. మాకు అలాగే చెబుతూ ఉంటారు' అన్నాడు.
'నాక్కూడా కనపడి, ఇదే ముక్క చెప్పి పుణ్యం కట్టుకోమనండి ప్లీజ్' అన్నాను బ్రతిమాలుతూ.
'ఆయన్ని కలలో చూడ్డానికి మీ లెవల్ సరిపోదు' అన్నాడు.
'ఇలా ఉందా నీ సంగతి' అనుకుని, 'మరి ఆయన గురువే కనిపించాడుగా నాకు' అన్నాను.
'ఆయనకు గురువా? ఎవరు?' అడిగాడు.
'మీకు తెలీదా?' ఎదురు ప్రశ్నించాను.
'అవన్నీ మాకు చెప్పరు. అవసరమైనవి మాత్రమే చెప్తారు, ఆయన గురువెవరు?' అన్నాడు.
'లోబ్ సాంగ్ రాంపా' అని ఒకడున్నాడులే. ఫేక్ టిబెటన్ గురువు. 47 ఏళ్ల క్రితం 1978 లో నేను ఇంటర్ చదివే టైములో ఆయన పుస్తకం ఒకటి 'The Third Eye' అనేది చదివాను. ఆ రాత్రే నాక్కనిపించాడు కలలో' అన్నాను.
ఆగంతుకునిలో ఉత్సుకత పెరిగింది.
'అవునా సార్. ఏం చెప్పారాయన?' అన్నాడు.
'47 ఏళ్ల తర్వాత నువ్వు ఫోన్ చేస్తావని చెప్పాడు. ఇంతకీ ఆయన చెప్పింది నీ గురించేనా? నీ వయసెంత?' అన్నాను ఏకవచనంలోకి దిగుతూ.
నేను ఎగతాళి చేస్తున్నానని అతనికి అర్ధమైంది.
'మాస్టర్స్ తో చతుర్లొద్దు సార్' అన్నాడు కోపంగా.
' గ్రాండ్ మాస్టర్ తో అసలే వద్దు. వయసు చెప్పు ముందు ' అన్నాను.
' నలభై ఎనిమిది' అన్నాడు.
'అంటే, నువ్వింకా పాలు తాగుతున్నప్పుడే మీ గురువుగారి గురువును నేను కలలో చూశాను. అర్థమైందా?' అన్నాను.
'నేను నమ్మను' అన్నాడు.
'నీ కలని నేను నమ్ముతున్నాగా. నా కలని నువ్వెందుకు నమ్మలేవు?' అడిగాను.
జవాబు చెప్పకుండా మాటమార్చి, 'పిరమిడ్ లోకి రావాలంటే అదృష్టం ఉండాలి' అన్నాడు.
'ఆ లెక్కన, చచ్చిన మమ్మీలన్నీ లక్కీ ఫెలోసే కదా?' అన్నాను.
'మీ ఆశ్రమంలో కూడా ఒక పిరమిడ్ కట్టించండి, అప్పుడు తెలుస్తుంది దాని మహిమ' అన్నాడు.
'నేను ఫారోనీ కాను, మమ్మీనీ కాదు. మనిషిని. అందులోనూ భారతీయుడిని. ఈజిప్ట్ సమాధులు నాకెందుకు?' అన్నాను.
' మీకు పూర్తిగా జ్ఞానం తెలీదు. అందులో కింగ్స్ చేంబర్, క్వీన్స్ చేంబర్ అని ఉంటాయి. అక్కడ కూచుని మెడిటేషన్ చేసి చూడండి. తెలుస్తుంది' అన్నాడు.
'ఏం? కీప్స్ చేంబర్ ఉండదా?' అడిగాను.
'ఉండదు. ఒకసారి చెయ్యండి. యాస్ట్రల్ ట్రావెల్ లోకి వెళ్లకపోతే అప్పుడు చెప్పండి' అన్నాడు.
' నేను ప్రతిరోజూ చేసేపని అదేగా, నిద్రలో' అన్నాను.
'అది వేరు. ఇది వేరు. మీకు పూర్తి నాలెడ్జి లేదు. అందుకే మీకు ఫిఫ్త్ లెవల్ ఇనీషియేషన్ ఇమ్మని మా గురువుగారి ఆజ్ఞ' అన్నాడు.
'సరే మీరింతగా చెబుతుంటే నాక్కూడా తీసుకుందామనే అనిపిస్తోంది. కాకపోతే ఒక కండిషన్. ఎలా ఇస్తారు? యాస్ట్రల్ బాడీతో ఇస్తారా, ఫిజికల్ బాడీతో ఇస్తారా?' అడిగాను.
'మీరెలా కావాలంటే అలా' అన్నాడు దర్పంగా.
'అబ్బో. అయితే, ఫిజికల్ బాడీతో గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఇవ్వండి. తీసుకుంటాను' అన్నాను.
'ఏంటి సార్. జోకులా?' అన్నాడు.
'కాదు. మేకులు. మూడే కొడతా. డైరెక్టుగా పరలోకమే' అన్నాను.
'అలా ఎవ్వరూ ఎగరలేరు' అన్నాడు.
'గలరు. మాస్టర్స్ అలా ఎగురుతారని మీ గుగ్గురువు రాంపా రాశాడు. కావాలంటే చదువుకో' అన్నాను.
'మరి నన్నేం చెయ్యమంటారిప్పుడు?' సంకటంలో పడ్డాడు అక్కుపక్షి.
'ముందు మీ డాబామీద కెక్కి, అక్కడనుంచి గాల్లోకి ఎగరడం ప్రాక్టీసు చెయ్యి. సక్సెస్ అయితే అలాగే ఎగురుకుంటూ నా దగ్గరికి రా. నేను రెడీగా ఉంటాను. ఒకవేళ కిందపడ్డావనుకో. అప్పుడెలాగూ యాస్ట్రల్ బాడీలోనే వస్తావు. ఐదర్ వే అయామ్ గుడ్. అన్నాను .
అవతల ఫోన్ కట్ అయిపోయింది.
'ఈ పిచ్చోడికి నా నంబర్ ఎవడిచ్చాడో? ఒకవేళ లోబ్ సాంగ్ రాంపా ఇచ్చాడేమో?' అన్న అనుమానం నాలో బలంగా తలెత్తింది.
'ఇవాళ రాత్రికి యాస్ట్రల్ ట్రావెల్లో వాడి పని చెప్తా' అనుకుంటూ ఫోన్ పక్కన పడేశా.