అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

26, డిసెంబర్ 2025, శుక్రవారం

బాంగ్లాదేశ్ సంక్షోభం - జ్యోతిషశాస్త్రం ఏమంటున్నది?

గతంలో యురేనస్ చారం గురించి వ్రాస్తూ, రాబోయే మూడేళ్లు భారత ఉపఖండానికి అతి గడ్డుకాలమని, సంక్షోభాలు, కుట్రలు, విప్లవాలు, యుద్ధవాతావరణం ఉంటాయని వ్రాశాను. పరిస్థితులు ఏ విధంగా నానాటికీ మారుతున్నాయో గమనిస్తే నేను వ్రాసినది జరుగుతున్నదా లేదా అర్ధమౌతుంది.

బాంగ్లాదేశ్ లో సంక్షోభాన్ని సృష్టించి, ఇస్లామిక్ తీవ్రవాదరాజ్యాన్ని స్థాపించి, ఒకవైపు పాకిస్తాన్ ఒకవైపు బాంగ్లాదేశ్ కలసి ఇండియాను చక్రబంధంలో ఇరికించి దాడిచేయాలని ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి.

సౌదీ అరేబియాతో పాకిస్తాన్ దోస్తీ, ఆసిమ్ మునీర్ ను సర్వసైన్యాధిపతిని చేయడం, కోర్టుపరిధినుండి అతడిని జీవితకాలంపాటు తప్పించడం ఇవన్నీ ఈ ప్లాన్ లోనే భాగాలు. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ను, బాంగ్లాదేశ్ లో హసీనాను దిక్కులేనివాళ్లుగా చేయడం కూడా ఈ కుట్రలో భాగమే. వీరిద్దరూ ఇండియా చెప్పినట్లు వినేవాళ్ళు. అందుకే వీరిద్దరినీ తప్పించారు. ఇమ్రాన్ ఖాన్ దొరికిపోయి జైలుపాలయ్యాడు. హసీనా పారిపోయి ఇండియాకు వచ్చి తలదాచుకున్నది.

పాకిస్తాన్ కేంద్రంగా, ఇండియాపై దాడిచేసే కుట్ర వేగంగా రూపుదిద్దుకుంటున్నది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ఇప్పుడు మరొక భారతద్వేషి తారిక్ రహమాన్ రంగప్రవేశం చేశాడు. ఇతను గత 17 ఏళ్లుగా ఎక్కడెక్కడో ఉండి ఇప్పుడు ఎన్నికల ముందు దేశానికి తిరిగి వచ్చాడు. ఎందుకిదంతా అనేది చిన్నపిల్లలకి కూడా అర్థమౌతుంది.

ఈ నేపథ్యంలో బాంగ్లాదేశ్ జాతకచక్రం ఏమంటున్నదో చూద్దాం.

దీనికి 16-12-1971 న స్వతంత్రం వచ్చింది. సమయం సాయంత్రం 5 గంటలు. ఆ సమయానికి ఢాకాలో వేసిన జాతకచక్రం ఇలా ఉంటుంది.

శనిచంద్రులు నీచస్థితిలో ఉన్నారు. ధనుస్సు మరియు మిధునరాశులు తీవ్రమైన ఆర్గళానికి గురయ్యాయి. సూర్యుడు సున్నాడిగ్రీలలో ఉన్నాడు.

ఈ దేశానికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఏమీ ఉండదని, మిడిల్ ఈస్ట్, అమెరికాల చేతులలో కీలుబొమ్మగా మారి వాటికి తందానతాన అనే విధంగా తయారౌతుందని దీనిని బట్టి అర్ధమౌతుంది. 

ఈ దేశానికి చంద్రమహర్దశ 2023 లో మొదలైంది. అప్పుడే అక్కడ కుట్రలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం చంద్ర-రాహుదశ ఏప్రియల్ 2025 నుండి సెప్టెంబర్ 2026 వరకూ ఉన్నది. ఇది గ్రహణదశ. చంద్రుడు నీచస్థితిలో ఉన్నాడు. రాహువు శపితయోగంలో ఉన్నాడు.  దీనివల్ల ఈ దేశానికి తీవ్రమైన గ్రహణం పడుతుంది. ప్రస్తుతపరిస్థితి సరిగ్గా ఇదే. అయితే, ఇది అసలు డ్రామాకు మొదలు మాత్రమే. అసలైన కధ 2026-29 మధ్యలో ఉంటుంది.

ఆ సమయంలో గోచారయురేనస్ సరిగ్గా రోహిణీనక్షత్రం పైన సంచరిస్తాడు. భారత ఉపఖండానికి తీవ్రమైన గడ్డుకాలం అదే కాబోతున్నది.

ఆ సమయంలో బాంగ్లాదేశ్ జాతకంలో చంద్ర - గురు, చంద్ర - శనిదశలు జరుగుతాయి. ఇవి దృఢకర్మదశలు గనుక, ఆ దేశం ఇంకా తీవ్రమైన సంక్షోభంలో పడుతుంది. దానివెనుక పాకిస్తాన్ హస్తం ఉంటుంది. పాకిస్తాన్ వెనుక టర్కీ, ఖతార్ మొదలైన దేశాలుంటాయి. ఇండియా చక్రబంధంలో ఇరుక్కుపోతుంది. వెరసి మనదేశంలో కూడా తీవ్రమైన గడ్డుపరిస్థితులు ఉంటాయి. మొత్తం భారతఉపఖండంలో యుద్ధవాతావరణం, అల్లర్లు, జననష్టం భారీస్థాయిలో ఉంటాయి. వీటి ప్రభావం షేర్ మార్కెట్లతో సహా అన్ని రంగాలపైనా పడుతుంది. ఇండియా అతలాకుతలమయ్యే ప్రమాదం గట్టిగా ఉన్నది.

తీవ్రవాదఇస్లాం చేతిలో చిక్కుకున్న దేశాలకు సర్వనాశనం తప్ప వేరేదారి అంటూ ఏదీ ఉండదు. అది బాంగ్లాదేశ్, పాకిస్థాన్ల విషయంలో మళ్ళీమళ్ళీ ఋజువౌతున్నది, వాటిప్రక్కనే ఉన్నందుకు ఆ కర్మను మనం కూడా పడవలసి వస్తున్నది.

దీనిని తప్పించడం అసాధ్యం. రాబోయే మూడేళ్లు చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజులుగా మిగలబోతున్నాయి.

మీరే చూడండి ముందుముందు ఏం జరుగనున్నదో !