అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

22, డిసెంబర్ 2025, సోమవారం

బుద్ధుడంటే మీకు పడదా?

నిన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.

' బుక్ ఫెయిర్ లో ఎవరో అడిగితే మీ నంబర్ ఇచ్చాము' అని శిష్యులన్నారు.

' అలా ఎందుకిచ్చారు?' అడిగాను ఏదో జరిగిపోయినట్టు బాధపడిపోతూ.

'మీతో అర్జెంట్ గా ఏదో చర్చించాలట. అందుకిచ్చాము. కాకపోయినా, మీ నంబర్ పాత పుస్తకాలలో ఉందిగా' అని మావాళ్లు జవాబిచ్చారు.

' సర్లే' అని ఆ సంగతిని అంతటితో వదిలేశాను.

సాయంత్రానికి ఎవరో ఫోన్ చేశారు.

'హలో మీరేనా ?' అన్నది ఒక గొంతు. 

' ఆ నేనే' అన్నాను.

' మీ బుక్స్ కొన్ని చదివాము ' అన్నది గొంతు సూటిగా టాపిక్ లోకి వస్తూ.

' అలాగా ' అన్నాను.

'మేముకూడా కొన్నిబుక్స్ ప్రింట్ చేయించాము. వాటిని మీకు పంపిద్దామనుకుంటున్నాము' అన్నది.

' ఎందుకు?' అడిగాను.

' చదువుతారని. క్రొత్త విషయాలు తెలుస్తాయి కదా మీక్కూడా ' అన్నది గొంతు.

' ఏ టాపిక్ మీద మీ పుస్తకాలు?' అడిగాను.

' బుద్ధుడి మీద ' అన్నది స్వరం.

' మీ దగ్గరే ఉంచుకోండి. ఉపయోగపడతాయి' అన్నాను.

బుద్ధుడి గురించి గత ఏభైఏళ్లుగా చదువుతూనే ఉన్నాను. ఆయనగురించి క్రొత్తగా తెలుసుకునేది ఏమీలేదు.

' ఏం? బుద్ధుడంటే మీకు పడదా?' అడిగింది స్వరం కించిత్ హేళనగా.

'ఓహో అలా అర్థమైందా నా మాట?' అనుకుని, ' అవును. గతంలో మా మధ్య విభేదాలేమీ లేవు. ఈ మధ్యనే కాస్త చెడింది' అన్నాను.

అవతలనుండి కాసేపు నిశ్శబ్దం.

'హలో' అంది మళ్ళీ స్వరం. 

' చెప్పండి లైన్లోనే ఉన్నాను' అన్నాను.

'ఎందుకు తేడాలొచ్చాయి మరి?' అడిగింది స్వరం. పక్కనుంచి ఎవరో నవ్వుతున్నారు.

'నామీద బుద్ధుడికి చాడీలు చెప్పాడు. ఆయన నమ్మేశాడు. అప్పటినుంచీ నాతో మాట్లాడటం లేదు' అన్నాను.

'మీమీద చాడీలా? ఎవరా చెప్పినది?' అన్నది స్వరం.

' ఇంకెవరు? జీసస్' అన్నాను.

మళ్ళీ నిశ్శబ్దం.

ఇద్దరు ముగ్గురు కలసి ఏదో మాట్లాడుకుంటున్నట్లు శబ్దాలు వినవచ్చాయి.

కాసేపలా అయ్యాక, ' మీతో ఒక విషయం చర్చించాలి. టైముందా?' అంది స్వరం.

' లేదు' అన్నాను. 

' పోనీ ఎప్పుడు వీలౌతుందో చెప్పండి. అప్పుడే చేస్తాం' అన్నది. 

' ఎప్పటికీ వీలు కాదు' అన్నాను.

' అదేంటి? అంత బిజీనా? అడిగింది.

' అవును' అన్నాను.

'  మీరు రిటైరయ్యారుగా. ఏం చేస్తుంటారు మరి?' అడిగింది.

' చర్చికెళ్తుంటాను' అన్నాను.

' నిజంగానా? అక్కడేం చేస్తారు?' అడిగింది.

మళ్ళీ పక్కనుంచి నవ్వులు వినిపించాయి.

' చర్చిలో చర్చిస్తూ ఉంటాను' అన్నాను.

' అర్ధం కాలేదు' అన్నది.

' చర్చిల్ అని ఒక పాస్టరున్నాడు. అతను నా ఫ్రెండ్. అతనితో చర్చించడానికి వెళుతూ ఉంటాను' అన్నాను.

మళ్ళీ సైలెన్స్.

'మేం బుద్ధుడి గురించి మాట్లాడదామని ఫోన్ చేశాము' అప్పటికి అసలువిషయంలోకి వచ్చింది స్వరం.

'సారీ. ఈ మధ్య ఆయన కనపడటం లేదు. ఎక్కడున్నాడో నాకు తెలీదు. టీవీలో యాడ్ ఇవ్వండి' అన్నాను.

ఫోన్ కట్ అయిపోయింది.

కాసేపు చూశాను మళ్ళీ ఫోనొస్తుందేమో అని. రాలేదు.

'విషయం లేకుండా ఎందుకు ఫోన్ చేస్తారో నాకు? అవతల చర్చికెళ్ళాలి. లేటయితే మళ్ళీ ప్రభువుకు కోపమొస్తుంది' అని విసుక్కుంటూ దగ్గరలోని ఊరివైపు హడావుడిగా బయల్దేరాను.