ఈ మధ్యన కొంతమంది స్త్రీలు ఒక కారులో ఆశ్రమానికి వచ్చారు. దానిమీద ఏదో గవర్నమెంట్ పేరు, హోదా వ్రాసి ఉన్నాయి. చూస్తూనే అది గవర్నమెంట్ కారని తెలిసిపోతోంది. అది వారిలో ఒకామె మరిదిగారి అఫీషియల్ కారని తెలిసింది.
వాళ్లు చాలాసేపు కూర్చుని అదీఇదీ మాట్లాడారు.
వారిలో ఒకామె ' నేనుకూడా మెడిటేషన్ చేస్తూ ఉంటాను ' అంది.
ఇప్పుడు ప్రతివారూ ఒక గురువే గనుక ఆమె మాటలకు నేనేమీ స్పందించలేదు.
'ఫలానా గురువు దగ్గర యోగా నేర్చుకున్నాను. ఇంకొక గురువు దగ్గర విపస్సానా చేశాను. ఈషా ఫౌండేషన్ కూడా చేశాను ' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
చూడబోతే, తనను తానొక ప్రత్యేకవ్యక్తిగా ఊహించుకుంటూ, గొప్పలు చెప్పుకునే మనిషిలాగా అనిపించింది. ప్రస్తుతం అందరూ అలాగే ఉన్నారు కదా !
వినీ వినీ చివరకు ఇలా అన్నాను, ' మీరు చాలా ఫౌండేషన్స్ తిరిగారు నిజమే. కానీ అసలైన ఫౌండేషన్ మాత్రం మీకు పడలేదు'.
వాళ్ళు స్టన్నయ్యారు.
ఇంకా ఇలా చెప్పాను.
'పర్సనల్ పనిమీద వస్తూ, మీ మరిదిగారి అఫీషియల్ కారులో మీరంతా వచ్చారు. అంటే, అఫీషియల్ రిసోర్సెస్ ను వ్యక్తిగతపనులకు వాడుతున్నారు. మెడిటేషన్ కు యమనియమాలే పునాదులు. వాటిలో అపరిగ్రహం అత్యంతముఖ్యమైనది. వ్యక్తిగతజీవితంలో నీతినియమాలు లేకుండా మీరెన్ని ఫౌండేషన్స్ వెంట తిరిగినా, ఎన్ని కోర్సులు చేసినా, చివరకు మీకేమీ ఒరగదు. అసలైన ఫౌండేషన్ మీకు లోపించింది'.
' అలా ఉంటే జీవితంలో చాలా లాసవుతాం కదండి ' అందామె.
'లాసుకు భయపడేవ్యక్తి, ఎంతసేపూ లాభనష్టాలు మాత్రమే చూసుకునే వ్యక్తి, ఆధ్యాత్మికజీవితంలో ఎక్కువదూరం ప్రయాణించలేడు' అన్నాను.
వాళ్ళు నొచ్చుకున్నట్లు కనిపించారు.
ఆ తరువాత వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేదు. బయలుదేరి వెళ్లిపోయారు.
ఒకళ్ళు నొచ్చుకుంటారని నేను అబద్దాలు చెప్పలేను. ఒకళ్ళను మెప్పించవలసిన పనికూడా నాకు లేదు.
ఒక శిష్యుని కజిన్ ఈ మధ్యనే హైదరాబాద్లో ఇల్లు కట్టించుకున్నాడు. కొత్తింటి ఆనందంలో గృహప్రవేశం చేసుకున్నారు. అయితే, బిల్డర్ యొక్క మెటీరియల్ కక్కుర్తి, క్యూరింగ్ సరిగా చేయకపోవడాల వల్ల కొద్దినెలలలోనే ఫ్లోరింగ్ కృంగిపోయి, మక్రానా మార్బుల్స్ అన్నీ బీటలిచ్చాయి. 15-20 లక్షలు మళ్ళీ ఖర్చుపెట్టి, మార్బుల్ ఫ్లోరింగ్ అంతా మళ్ళీ చేయించుకున్నారు. ఆధ్యాత్మికజీవితం కూడా ఇంతే.
ఫౌండేషన్స్ లేకుండా ఎన్ని ఫౌండేషన్స్ వెంట తిరిగినా చివరకు బిల్డింగ్ కృంగిపోవడం తప్ప ఇంకేమీ ఉండదు.
ఇదెప్పుడు అర్ధం చేసుకుంటారో ఈ మనుషులు !