నేను విజయవాడలో సర్వీసులో ఉన్నరోజుల్లో నాతోపాటు పనిచేసిన కొలీగు ఒకడుండేవాడు. మంచివాడు. కాస్త అమాయకుడు కూడా. పాపం ఏదో రోగంతో 2000 లోనే అర్ధాంతరంగా చనిపోయాడు. అప్పటికి సర్వీసు ఇంకా పాతికేళ్ళు మిగిలుంది.
వాళ్ళది విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్. అదలా ఉంచితే, వాడు భూతంగా మారి తిరుగుతున్నాడని ఈ మధ్యనే కొందరు ఫ్రెండ్స్ చెప్పారు. నేనైతే నమ్మలేదు. కానీ మంత్రతంత్రాలపైన బాగా రీసెర్చి చేసిన ఒక ఫ్రెండ్ గాడు చెబితే ఏమోలే అనుకున్నాను. ఆ సంగతి అంతటితో విని వదిలేశాను.
ఈ మధ్యన ఆశ్రమం దగ్గర పొలిమేరచెట్లలో దిగాలుగా కూచుని కనిపించాడు. అప్పుడు నమ్మక తప్పలేదు.
' ఏంటి ఇక్కడ కూచున్నావ్?' అంటూ నేనే పలకరించాను.
' గుర్తుపట్టావన్నమాట ! మర్చిపోయావేమో అనుకున్నా' అన్నాడు
' ఎలా మర్చిపోతాను? ఇన్నేళ్ల తర్వాత ఇలా కనిపించినా నీలో మార్పేమీ లేదు' అన్నాను.
' కనీసం నువ్వైనా హెల్ప్ చేస్తావని నీ దగ్గరకి వచ్చాను' అన్నాడు.
' రా మాట్లాడుకుందాం' అంటూ ఆశ్రమంలోకి దారితీశాను.
టీ త్రాగుతూ, ' ఇప్పుడు చెప్పు నీ కధ' అన్నాను.
'ఏం లేదు. ఈ భూతంజన్మ నుండి విముక్తి కోసం వెతుకుతూ ఒక గురూజీని కలిశాను. ఆయనొక ఉపాయం చెప్పాడు. నాలాంటి భూతాన్నొకదాన్ని తెచ్చుకుంటే మా ఇద్దరికీ భూతశుద్ధివివాహం చేయిస్తానన్నాడు. అప్పుడు మాత్రమే మాకు ఈ జన్మనుండి విముక్తి కలుగుతుందట. నాకు నమ్మకం కలగలేదు. పాత ఫ్రెండ్ వి, అందులోను ఇప్పుడు గురూజీవయ్యావు కదాని సెకండ్ ఒపీనియన్ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చా' అన్నాడు.
' భూతశుద్దా? వివాహంతోనా? దీనికి సెకండ్ ఒపీనియనా?' అన్నాను అయోమయంగా.
భూతం బిక్కముఖం వేశాడు.
'అసలు భూతశుద్ధి అనేది ఉందా? లేదా?' అడిగాడు నిరాశగా.
' ఉంది. కానీ అది వివాహంతో రాదు. వివాహంతో ఉన్నది కాస్తా పోతుంది' అన్నాను.
' మరెలా?' అడిగాడు భూతం.
' ధాతుశుద్ధి ఉంటే భూతశుద్ధి జరుగుతుంది. ఇవి రెండూ ఉంటే చిత్తశుద్ధి వస్తుంది. అప్పుడు శివానుగ్రహం లభిస్తుంది. నీకు విముక్తి దొరుకుతుంది. నాకు తెలిసినంతవరకూ అదీ ప్రాసెస్. అయితే ఇది పెళ్లితో రాదు. సాధనతో వస్తుంది. సరియైన గురువును అనుసరిస్తూ, సరియైన దిశలో సాధనచేస్తే, నీ అదృష్టం బాగుంటే ఈ జన్మలో రావచ్చు. లేకపోతే అనేకజన్మలు పట్టవచ్చు' అన్నాను టీ సిప్ చేస్తూ.
' అబ్బో అంత లాంగ్ ప్రాసెస్ అయితే కష్టమే. అవన్నీ ఎప్పుడు జరగాలి? ఎప్పుడు నాకు మోక్షం సిద్ధించాలి? దీనికంటే భూతశుద్ధివివాహమే బెటర్. అసలిదంతా లేకుండా సింపుల్ గా పని జరగాలంటే ఎలా?' భూతం ఏడ్చినంత పని చేశాడు.
' ఒకమార్గం ఉంది' అన్నాను.
'ఏంటది?' అడిగాడు ఉత్సాహంగా.
'దేహశుద్ధి ప్రయోగం అని ఒకటుంది. దానిని చేస్తే, భూతశుద్ధివివాహంతో పనిలేకుండానే నీకు మోక్షం వచ్చేస్తుంది. చేయమంటావా?' అడిగాను మంత్రదండంపైన చెయ్యివేస్తూ.
'ఒద్దులే. ఇప్పటికే చాలామంది చేతిలో అయింది. కానీ మోక్షం మాత్రం రాలేదు. నీ ఉపాయం కంటే, ఆ గురూజీ చెప్పినదే బాగుంది. నాకు నచ్చిన భూతాన్ని వెతుక్కుంటా. దొరికాక ఆయన్ను కలుస్తా' అన్నాడు.
'సరే. ఆ పనిమీదుండు. మళ్ళీ ఈ ఛాయలకు రాకు' అని ఉచ్చాటనామంత్రాన్ని జపించాను.
ఫ్రెండ్ భూతం కెవ్వున కేకేసి మాయమైపోయింది.
ఆ విధంగా భూతానికి దేహశుద్ధి చేసే బాధ నాకు తప్పింది. ఎంతైనా పాతఫ్రెండ్ కదా ! చూస్తూచూస్తూ నేనుమాత్రం ఎలా చెయ్యగలను ! ఏదో మాటవరసకన్నాను. నిజమనుకుని పారిపోయింది.
పిచ్చిభూతం !